ఏ చిలిపి కళ్లలోన కలవో… ఏ చిగురు గుండెలోన లయవో అంటూ సినిమాను ప్రేమించాడు. రాను రానంటూనే చిన్నదో అంటూ తన పాటలతో పలకరించి చిన్నవయస్సులోనే దివికేగాడు. విధి వైపరీత్యం అతణ్ని తీసుకెళ్లడం మాట పక్కనబెడితే.. కాష్ఠమై విముక్తి పొందిన ఆ బతుకు బతికినప్పటి బాధ ఎవడికి తెలుసు..?
చిన్న వయస్సులోనే తనవాళ్లుండీ.. ఎవ్వరూ లేని అనాథలా రోడ్డుపై కుప్పకూలి.. గాంధీ ఆసుపత్రిలో చికిత్ర పొందుతూ మృతి చెందిన పాటల రచయిత కులశేఖర్ మృతి సినిమాకు, సాహిత్యలోకానికి తీర్చలేనిదంటూ పెద్దపెద్ద మాటలవసరం లేదు కానీ… సంక్రాంతి గాలిపటాల్లాంటి పాటలనందించిన తనే… జీవిత చరమాకంలోని సగభాగం తెగిన గాలిపటమైన తీరు మాత్రం దిగ్భ్రాంతికరం.

ఓ రచయిత దొంగైన తీరు లోకాన్ని నిశ్ఛేష్ఠపర్చింది!
2013 అక్టోబర్ 24న కాకినాడలోని బాలా త్రిపురసుందరీ దేవి శఠగోపాన్ని దొంగిలించడంతో.. ఆర్నెల్లు జైలు శిక్షననుభవించిన కులశేఖర్ కథ ఎందరో రచయితలకు పూర్తి భిన్నమైంది. ఉద్ధేశపూర్వకంగా తానేం దొంగేం కాదు. కానీ, విధి పగబడితే… ఇలాంటివి జరుగుతాయి. తానేం చేస్తున్నాడో తనకే తెలియనంత డెమెన్షియాకు గురై… రచయితగా పీక్ లెవల్ కు చేరుకునే దశలో… ఓ దొంగగా జైల్లో గడపడమడంటే కచ్చితంగా విధి ఆడిన వింత నాటకమే ఇది.
సినిమా పాటల రచయితగా చూసుకున్నా… కులశేఖర్ ఎక్కువలో ఎక్కువ వంద పాటలు రాసి ఉంటారు. చాలామందితో పోలిస్తే ఈ సంఖ్యా పెద్దదేం కాదు. కానీ, కొన్ని హత్తుకునే పాటలూ ఉన్నాయి. రాను రానంటూనే చిన్నదో అంటూ ఒక అర దశాబ్దంపాటు యువతను ఉర్రూతలూగించిన పాట ఉంది. తాను రాసిన ఘర్షణలోని చెలియ చెలియ పాటలో పేర్కొన్నట్టు… కాలమంతా మనది కాదు అని జ్ఞాపకాలే చెలిమి కానుకని వదిలిపోయావు న్యాయమా ప్రియతమా అని ఆయన్నెరిగినవారంతా పాడుకునే పాటయ్యాడు.
తేజ, ఆర్పీ పట్నాయక్ ద్వయానికి… తన పాటలతో ముడి వేసి.. గీత రచయితగా సినీరంగ ప్రత్యక్ష ప్రవేశం చేసిన కులశేఖర్.. అంతకుముందు సిరివెన్నెల వద్దే అసిస్టెంట్ గా చేసేవాడు. ఓ ప్రముఖ సంస్థలో విలేకరిగా కూడా పనిచేసిన కులశేఖర్… చదువుకునే రోజుల్నుంచే సంగీత, సాహిత్యాలపై మక్కువ పెంచుకుని పాటలు రాస్తూ, పాడుతూ ప్రైజులు పొందినవాడు. పైకి పాటల రచయితగానే కనిపించే కులశేఖర్.. రామాయణాన్నీ అలతి పదాలతో కవిత్వీకరించిన తీరునూ ఆయన్నెరిగినవారు గుర్తు చేసుకుంటారు.
బాగా పేరున్న కుటుంబ నేపథ్యం కులశేఖర్ ది!
కులశేఖర్ ది సింహాచల ఆలయంలోని అర్చక కుటుంబం. మహామహోపాధ్యాయగా దేశమే గర్వించదగ్గ సంస్కృత పండితులు శ్రీమాన్ రామచంద్రాచార్యుల చిన్న కుమారుడు. త్రిదండి చిన్న జీయర్ కు అత్యంత ఆప్తులుగా ఉన్న రామచంద్రాచార్యులు కొంత కాలం ఆయన పత్రికకు కూడా సంపాదకులుగా పనిచేసినట్టు చెబుతుంటారు. అలాంటి కులశేఖర్ ఓ ప్రముఖ మీడియా సంస్థలో శిక్షణ పొంది డెస్కులోనూ, ఢిల్లీ, చెన్నైల్లోనూ పనిచేశారు. కానీ, చిత్రం సినిమాతో తనలోని రచయితను లోకానికి విస్తరించే అవకాశం రావడంతో.. సినీరంగంలోకి అడుగుపెట్టాడు. ఇప్పుడు విచలితమైన మానసిక స్థితితో చిత్రంగా మాయమైపోయాడు
అప్పులు, మానసిక స్థితి బాగా లేకపోవడం, భవబంధాలను త్యచించిన ఓ సన్యాసిలా హైదరాబాద్ లో తిరిగిన ఆయన జీవన ప్రయాణమంతా సినిమా కథలను మించిన ఓ విషాదకథ! ప్రేమలేఖ రాశా నీకంది ఉంటది అనే ఓ సినిమాకు దర్శకత్వం చేసినా.. అదీ రిలీజ్ కాకపోవడం కూడా కులశేఖర్ కృంగిపోవడంలో ఓ ప్రధాన కారణమైందంటారు. ఇద్దరు పిల్లల తండ్రి కులశేఖర్. భార్యే… ఆ పిల్లల సంరక్షణ చూసుకుంటుండగా… సింహాద్రిలో పుట్టిన కులశేఖరుడు.. అర్ధాంతరంగా నిర్యాణమై ఆ అప్పన్న చెంతకే చేరడం ఆయన్నెరిగినవారిని బాధించే విషయమే అయినా… ఆయనకు లభించిన విముక్తి.. మోక్షం.. ఆయన మరణం.



