చార్మినార్ బ్రాండ్ మాత్రమే కాదు.. ఓ ఎమోషన్!

చార్మినార్‌!

– యాసీన్‌…✍️

#Hyderabad_is_an_emotion

.

ముచ్చటగా మూడు తరాల వెనక…
కొత్తగా ఆటలు మొదలుపెట్టిన బచ్చాలంతా చార్మినార్‌ సిగరెట్‌ పత్తాలతోనే
బెచ్చాలాడారు… గిల్లికజ్జాలాడారు.
కొత్తగా సిగరెట్‌ అలవాట్లు నేర్చుకున్న యువత…
చార్మినార్‌ తాగారు… విశ్రాంతి పొందారు.
కొత్తగా ఇళ్లు కట్టాలనుకున్న రామయ్యలంతా సుదీర్ఘంగా ఆలోచించాక…
చార్మినార్‌ బ్రాండ్‌ సిమెంట్‌ రేకులతోనైనా కొందరు ఓ ఇంటివాళ్లయ్యారు.


సినిమాలు పుట్టిన కాలం నుంచీ…
మూవీ చూస్తున్న ప్రేక్షకుడికి అది హైదరాబాద్‌ అని స్ఫురించాలి.
అందుకు ఏం చేయాలి?
చార్మినార్‌ చూపిస్తే సరి.
తేలిగ్గా అర్థమైపోతుంది ఆ కథాస్థలం హైదరాబాదని.
దాదాపు నాలుగొందల ఏళ్ల నుంచి హైదరాబాద్‌కు ఓ ఐకన్‌గా ఉంది చార్మినార్‌.
బచ్చాలాడుకునే బచ్చాగాళ్లకు కూడా… సిగరెట్‌ పాకెట్‌ మీద సింబల్‌తో!

కుతుబ్‌షాహీ వంశానికి చెందిన రాజు కులీకుతుబ్‌షా 1591లో దాన్ని నిర్మించాడనీ, ప్లేగు వ్యాధి తగ్గిన తర్వాత దేవుడికి కృతజ్ఞత చెప్పేందుకు నిర్మించిన కట్టడం అని అందరికీ తెలుసు. దీనిపై అనేక వాదనలున్నాయి. ఇంకో విషయం ఏమిటంటే… కుతుబ్‌షాహీల రేవు పట్టణం నుంచి వచ్చే దారి… నగరంలోని ప్రధాన రహదారి రెండూ ఖండించుకోవడంతో ఏర్పడ్డ కూడలే చార్మినార్‌ అన్నది మరోమాట.

ఇక్కడ మరో వాడుకా ఉంది… ‘చార్మినార్‌లో రాయి వాడలేదు… మక్కామసీదులో మట్టి వాడలేదు’ అంటారు. కానీ… పూర్తిగా సున్నంతోనే నిర్మితం కాలేదనీ, కొంత గ్రానైట్‌ ఉందనేది నిపుణుల మాట.

అమృతం తాగిన కట్టడంలా సున్నంతో నిర్మితమైన చార్మినార్‌… అలా నాలుగొందల ఏళ్ల పైచిలుకు కాలమంతా అలా ఠీవిగా నిల్చుని ఉందంటే చిత్రమే కదా. అలాంటి చిత్రాలు చార్మినార్‌ విషయంలో ఎన్నో ఉన్నాయి. ఉదాహరణలు కావాలా… గోల్కొండ సామ్రాజ్యం… కుతుబ్‌షాహీల నుంచి ఆసఫ్‌జాహీల చేతికి వెళ్లే సంధిదశలో ఓసారి నైరుతి (సౌత్‌–వెస్ట్‌) మూలనున్న ఓ మినార్‌ మీద పిడుగు పడి ముక్కముక్కలైపోయిందట. ఆ సమయంలోని పాలకులు ఆ మినార్‌ను మళ్లీ కట్టారట. అంతేనా… 1824లో దాన్ని మరోమారు పూర్తిగా రిపేరు చేశారట.

మూసీ నదికి తూర్పున చార్మినార్‌ ఉంటే… దాని పడమట దిక్కున లాడ్‌ బజార్‌. రెండడుగులేస్తే… మక్కామసీదు. అన్నీ అపురూప స్థలాలే. అసలే నిజాం సంస్థానానికంతా అది కూడలి. అలాగే రాజధానిలోనూ ప్రధాన కూడలి. రహదారులకే గాక…సంస్కృతులకూ కూడలి కావడం, ఆ ప్రాధాన్యంతో శతాబ్దాల తరబడి ఉండటంతో నేటికీ అంతే ప్రాధాన్యంతో నిటారుగా నిలబడి ఉంది.

ఈ నిర్మాణంలో ఎన్నో నడవాలు, గ్యాలరీలు, బాల్కనీలు, నెత్తిన నాలుగు మినారెట్లు… గోడల మీద చిత్రవిచిత్రపూల నగిషీలు… ఇలా ఎన్నెన్నో విచిత్రాలు. వీటన్నింటినీ నిర్మించడానికి కొంత గ్రానైట్‌ రాతిపొడితో పాటు, సున్నం, మోర్టార్, పాలరాతిపొడి… పొడిరూపంలో ఉన్న ఈ మిశ్రమాన్ని నీళ్లుకలిపిన సిమెంట్‌లా ముద్ద చేయడానికి… కోట్లాది కోడిగుడ్ల సొన వాడారట. దానిలో ఉన్న పదార్థమంతా కలిపితే ఉండే బరువెంతో తెలుసా… 14,000 టన్నుల పైమాట!!

నాలుగు శతాబ్దాల కిందట ఇసుక గడియారాలూ, ఇంకేవో గడియారాల్లాంటివి ఏవి ఉండేవో లేదో తెలియదుగానీ… మెకానికల్‌గా నడిచే గడియారాలు వచ్చిననాటి నుంచి టైమ్‌ తెలియాలనే ఉద్దేశంతో నాలుగు పక్కలా నాలుగు గడియారాలు ఏర్పాటు చేశారు… అదీ 1889లో.

నలువైపులా అన్నీ దుకాణాలతో అంతటా సందడి సందడిగా ఉండే పరిసరాలతో… కేవలం చార్మినార్‌ చుట్టూ ఉండే దుకాణాల సంఖ్య ఎంతో తెలుసా? అక్షరాలా 14,000కు పైగానే. 14,000 టన్నుల బరువుతో రూపొందిన కట్టడం చుట్టూ కనీసం 14,000 షాపుల్లేకపోతే ఎలా?

చార్మినార్‌ను సంస్మరించుకుంటూ దాని ఆకృతిలోనే కేక్‌ నిర్మిస్తాడొకడు.
ఆ ఆకృతితో సముద్రపుటొడ్డున సైకత కట్టడం కడతాడు మరొకడు.
చాక్లెట్‌తో నిర్మాణం చేసి, మా కంపెనీ ఉత్పాదనకు అడ్వరై్టజ్‌ కల్పిస్తామంటాడో కార్పొరేటు.
పద్యాలు రాస్తానూ, పాటలు పాడతానంటాడు ఇంకొకడు.
ఇలా ఎందరెందరిలోనో సృజనను రగిలించి, వెలికితీసేలా చేసిన కట్టడం అది.


నాలుగొందలేళ్లదైనప్పటికీ… ఎంత పాతబడుతున్నప్పటికీ…
మూడు తరాల వెనకవారేగాదు… మరో మూడొందల తరాల వరకూ
అదెప్పుడూ కొత్తగానే ఉంటుందంటూ తీర్మానాలు చేస్తున్నారు. చేస్తూనే ఉంటారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles