భేటీ బచావో.. భేటీ పడావో!
విధి ఎవ్వరిని ఎటువైపు ఎలా తీసుకెళ్తుందో చెప్పలేం. అవకాశాలు తలుపు తట్టినా.. వాటిని సద్వినియోగపర్చుకోకుంటే అవి అదృష్టాలుగా మారవు. సరికదా.. ఆ తర్వాత మనకు మనమే దురదృష్టవంతులమనుకుంటూ మిగిలేది బోలెడు బాధ మాత్రమే. కాబట్టి ఆ అవకాశాలను తమకనుకూలంగా మల్చుకోవడంతో మాత్రమే విజయాన్ని ముద్దాడొచ్చు. అలా అవకాశాలను సద్వినియోగపర్చుకున్న ఓ ట్రైబల్ కథ ఇది.

జార్ఖండ్ లోని చిన్న గ్రామం దహూ. అక్కడ ఆడపిల్లలు అయితే కూలీ చేసుకుంటూ కుటుంబానికి చేదోడువాదోడుగా ఉండాలి. లేదంటే, పెళ్లి చేసుకుని పిల్లల్ని కనే స్టీరియోటైపిక్ సంప్రదాయాలకు కట్టుబడి ఉండాలి. కానీ, దహూకు చెందిన సీమాకుమారి మాత్రం ఆ సంప్రదాయాల గోడల్ని బద్ధలు కొట్టింది. ఎక్కడో మారుమూల పల్లెలో పుట్టిన పిల్ల.. హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో చదివేస్థాయికెదిగింది. అసలా ఊహే ఓ కలలా అనిపించే బతుకుచిత్రంలో… సీమా ఎలా ఎదిగింది మరి…? లింక్డ్ ఇన్ లో శ్వేతా గుర్నానీ షేర్ చేసిన ఈ స్ఫూర్తిదాయక కథనం ఇప్పుడు సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్స్ అన్నింటిలోనూ వైరల్ గా మారి అప్లాజ్ అందుకుంటోంది.
సీమాకుమారి తన 9 ఏళ్ల వయస్సులో 2012లో యువ ఫౌండేషన్ పేరిట ఓ స్వచ్ఛంద సంస్థ నిర్వహిస్తున్న ఫుట్ బాల్ ప్రోగ్రామ్ లో చేరింది. కానీ, ఫౌండేషనే.. తన జీవన గమనాన్ని మార్చే ఫౌండేషన్ అవుతుందని ఆమె ఊహించలేకపోయింది. ఆ ఫౌండేషన్ లో ఫుట్ బాల్ ప్లేయర్ గా ఎదిగేందుకు ఆమె ఇచ్చిన ఎంట్రీ… ఆమె అత్యున్నత స్థాయికెదిగే గేట్ వే అయితుందని కూడా సీమా అనుకోని ఉండకపోవచ్చు.
2015లో ఆ యువ ఫౌండేషన్ స్థాపించిన స్కూల్లోనే తన విద్యాభ్యాసాన్ని ప్రారంభించి.. అంచెలంచెలుగా ఎదిగింది. అదే యువ ఫౌండేషన్ లో తన విద్యాభ్యాసానికి ఆర్థిక భరోసా కల్పించేలా ఫుట్ బాల్ కోచ్ గా పనిచేస్తూ సంపాదించడం మొదలుపెట్టింది.
బాల్యవివాహాలకు కేరాఫ్ గా నిల్చే ఓ గిరిజన గూడెంలో.. అమ్మాయిలంటే వంటింటి కుందేళ్లని భావించే మూఢ సంప్రదాయాల పెద్దరికాలు కొనసాగే గ్రామంలో వాటన్నింటినీ కాదని.. రైట్ టూ ఎడ్యుకేషన్ యాక్ట్ కు తన గ్రామంలో ప్రాణం పోస్తూ క్రీడలు, చదువుల్లోకి ధైర్యంగా అడుగుపెట్టింది.

దహూ అనే ఓ కుగ్రామంలో దుమ్ముతో నిండిన మైదానం నుంచి ఫుట్ బాల్ ప్లేయర్ గా ఎదిగి ఆమె నేషనల్ లెవల్ ప్లేయర్ గా రాణించేతస్థాయికెదిగింది. అలా జాతీయస్థాయిలో కూడా వచ్చిన ప్రతీ అవకాశాన్నీ సద్వినియోగం చేసుకుంటూ.. అవకాశమనే దారాన్ని పట్టుకుని ఏకంగా అంతర్జాతీయస్థాయి పోటీల్లోనూ పాల్గొనేందుకూ అర్హత సాధించింది. అంతర్జాతీయ శిక్షణా శిబిరాల్లోనూ మెరిసిన సీమ ప్రతిభ.. సియాటెల్ హైస్కూల్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్ లో ఆమెకు చదువుకునే అవకాశం కల్పించింది. ఇంకేం కట్ చేస్తే, వచ్చిన ప్రతీ అవకాశాన్నీ తన జీవితాన్ని ఉన్నతంగా మల్చుకునేందుకు ఉపయోగించుకుంది సీమ. 2018లో కేంబ్రిడ్జ్, ఆ తర్వాత 2019లో వాషింగ్టన్ విశ్వవిద్యాలయాల్లో జరిగిన కొన్ని ఈవెంట్స్ లో పాల్గొన్న సీమాకుమారిలో.. అక్కడి పరిస్థితులు ఆమెను మరింత చదువుకునేలా పురిగొల్పాయి.
సీమ ఊహించినదానికంటే ఎక్కువే ఎదిగాక కూడా… హార్వర్డ్ యూనివర్సిటీలో చదువుకోవడమనే ఆలోచన అప్పటివరకూ ఆమె ఊహకు కూడా తట్టలేదు. కానీ, తనను గైడ్ చేసిన ఓ గురువు హార్వర్డ్ పూర్వ విద్యార్థి కావడంతో, ఆయన చొరవతో అప్లై చేసింది. అలా దరఖాస్తు చేసుకున్న సీమ తన ప్రతిభతో హార్వర్డ్ లో కూడా పూర్తి స్కాలర్ షిప్ తో చదువుకునే అవకాశాన్నీ సంపాదించుకుంది. హార్వర్డ్ లో ఎకానమిక్స్ అభ్యసిస్తోంది. కనీసం హార్వర్డ్, కేంబ్రిడ్జ్, వాషింగ్టన్ ఇవన్నీ ఎక్కడుంటాయో తన తల్లిదండ్రులకే కాదు.. తమకు కూడా పూర్తిగా తెలియని ప్రాంతాల్లో తాము పెరిగామంటోంది సీమ. అలాంటిది, తాను ఇంతస్థాయికెదగడం గర్వంగా ఉంటుందంటూనే… తనను ప్రోత్సహించినవారిని పేరుపేరునా గుర్తు చేసుకుంటోంది.
ఒక మారుమూల గ్రామం నుంచి ఎలాంటి గైడెన్స్ లేకుండా తనంతట తాను ఓ ఫౌండేషన్ సహకారంతో ఆకాశమంత ఎదిగిన సీమకు రెండు ప్రధాన లక్ష్యాలిప్పుుడు ముందున్నాయి. అందుకోసం ఆమె తన గ్రామంలో ఓ స్వచ్ఛందసంస్థను ఏర్పాటు చేస్తానంటోంది. ఒకటి మహిళలకు ఆర్థికంగా భరోసా కల్పించేలా చిన్న చిన్న వ్యాపారాలతో వారికి ఆర్థిక స్వావలంబన కల్పించేలా తీర్చిదిద్దడం… రెండు, బాల్య వివాహాలు, గృహహింస, వివక్ష వంటివాటిపై మహిళలకుండే హక్కులపై అవగాహన కల్పించడాన్ని ఓ ఉద్యమంలా చేపడతానంటోంది.
సీమాకుమారి సక్సెస్ స్టోరీ ఇప్పుడు సోషల్ మీడియాలోనూ వైరల్ గా మారడంతో.. బయోకాన్ వ్యవస్థాపకురాలు, ఎగ్జిక్యూటివ్ చైర్ పర్సన్ కిరణ్ మజుందార్ షా, ప్రముఖ నటి ప్రియాకా జోనాస్ వంటివారు తమ మైక్రోబ్లాగ్స్ లోనూ, X వంటి ఖాతాల్లోనూ షేర్ చేస్తున్నారు.
అడ్డంకులను అధిగమించి చిత్తశుద్ధితో ప్రయత్నిస్తే… దానికి దృఢసంకల్పం తోడైతే సీమాకుమారిలాగా ఎదగొచ్చు. అందుకే, ఇప్పుడు సీమాకుమారి తనకు తాను ఓ విజయగాధగానే కాకుండా… తనలాంటి గిరిజన గూడాల అమ్మాయిలెందరికో ఓ దారిదీపమై నిలుస్తోంది.



