జపాన్ కు వెళ్లి మీరు అక్కడి రాయబారులతో కలిసి మద్యం పార్టీలో పాల్గొనటం ఏం బాలేదు. ఓ ప్రధాని… ఆ తర్వాత ప్రధానిగా ఎదిగిన మరొకరితో అన్నమాట ఇది. తెలుసుకోవాలంటే ముందుగా నాడు ఇందిరను తీవ్రంగా వ్యతిరేకించిన మొరార్జీ దేశాయ్ కథలోకి మనమోసారి వెళ్లాలి.
ఎమర్జెన్సీ సమయంలో ఏకంగా ఏడాదిన్నర కాలం జైలు జీవతం గడిపారు మొరార్డీ దేశాయ్. జైలు నుంచి బయటకొచ్చిన వెంటనే ఇందిరాగాంధీని ఓ స్పాయిలర్ గర్ల్ గా తూర్పారబట్టాడు. 81 ఏళ్ల ముదిమి వయస్సులో కాంగ్రెసేతర మొట్టమొదటి ప్రధానిగా మొరార్జీ దేశాయ్ పేరు రాజకీయాలున్నంత కాలం సుస్థిరంగా ఉంటుంది.

జైలు నుంచి విడుదలయ్యాక మొరార్జీ దేశాయ్ ప్రజలతో మమేకమయ్యాడు. అధికారం తనకు తప్పకుండా వస్తుందన్న విశ్వాసంతో ఉన్న మొరార్జీ దేశాయ్.. ఇందిరను తల్లిగా అభివర్ణించడంపై మండిపడేవాడు. అది ముమ్మాటికీ తప్పుడు భావన. ఆమెకు ఆ మాత్రం గౌరవం దొరకడానికి ఆమెకున్న అధికారం, పదవి మాత్రమే కారణమనేవాడు. ఇదే విషయాన్ని అప్పట్లో థేమ్స్ అనే బ్రిటీష్ టీవీ ఛానల్ జర్నలిస్ట్ ఎలైన్ గ్రాండ్ తోనూ మొరార్జీ దేశాయ్ తన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.
మొరార్జీ దేశాయ్ 1995, ఏప్రిల్ 10వ తేదీన తన 99 ఏళ్ల వయస్సులో పూర్ణాయుష్కుడిగా కన్నుమూశారు.
మొరార్జీ దేశాయ్ అధికారంలోకి రావడమనేది యాక్సిడెంటల్. నెహ్రూ మరణం తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి, మొరార్జీ దేశాయ్ ఇద్దరూ పోటీదారులు. కానీ, ప్రాథమిక పోటీదారుడిగా.. కాబోయే ప్రధానిగా అప్పటికే ఎల్బీ శాస్త్రి పేరు దాదాపు ఖరారైపోయింది. 1966లో తాష్కెంట్ లో శాస్త్రి ఊహించని మిస్టరీయస్ మరణం తర్వాత.. మళ్లీ ప్రధానెవరనే చర్చకు తెరలేచింది. అప్పుడూ మొరార్జీ దేశాయ్ పేరే వినిపించింది. కానీ, అప్పుడూ దగ్గరదాకా వచ్చినట్టే వచ్చి మొరార్జీ దేశాయ్ పదవికి ఇందిర రూపంలో ఎదురుదెబ్బ తగిలింది. దాంతో అప్పుడు మళ్లీ ఇందిర ప్రధానమంత్రిగా గద్దెనెక్కింది. 1967లో అలా ఇందిరాగాంధీ అధికారంలోకొచ్చినా.. ఆమె మెజార్టీ తక్కువ ఉండటంతో పాటు.. ఆమెకు పార్టీలోనే బలమైన అంతర్గత ప్రత్యర్థిగా మొరార్జీ దేశాయ్ మారాడు. దాంతో మొరార్జీ దేశాయ్ ని కాదని ముందుకు పోలేని పరిస్థితుల్లో ఆయనకు ఉప ప్రధానమంత్రి పదవితో పాటు, ఆర్థిక మంత్రిత్వ శాఖను అప్పజెప్పారు.
మొరార్జీ దేశాయ్ ఓవైపు ఉప ప్రధానిగా, మరోవైపు కీలకమైన ఆర్థికశాఖా మంత్రిగా ఇందిర ప్రభుత్వంలో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తూనే ఉన్నా.. ఆయన్ను ప్రధాని పీఠం మాత్రం ఎప్పుడూ ఊరిస్తూనే ఉండేది. అలా 1969లో, ఇందిర వ్యతిరేకులందరితో జట్టు కట్టి నాయకత్వం వహించాడు. అది కాస్తా పార్టీలో చీలికకు దారి తీసి కాంగ్రెస్ ను ఓ కుదుపు కుదిపింది. అలా గాంధీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వర్గమంటూ మరొక పార్టీ ఏర్పాటైంది. అందులో చేరారు మొరార్జీ దేశాయ్.
అప్పటికే ఐదారుసార్లు ఇందిరతో తీవ్రంగా విభేదించిన దాఖలాలున్న సమయంలోనే… 1974 సమయంలో ఆయన తన సొంత రాష్ట్రమైన గుజరాత్ లో అవినీతి వ్యతిరేక ఉద్యమానికి నాయకత్వం వహించారు మొరార్జీ దేశాయ్. మరోవైపు, తన క్యాంపెయినింగ్ కు తోడు, బీహార్ లో జయప్రకాష్ నారాయణ్ ప్రజా ఉద్యమం అప్పుడే మొదలైంది. నాటి బీహార్ రాష్ట్ర ప్రభుత్వ అవినీతికి వ్యతిరేకంగా మొదలైన జేపీ ఉద్యమం ఆ తర్వాత కాస్త కొత్త టర్న్ తీసుకుని కేంద్రంలోని ఇందిరాగాంధీ ప్రభుత్వ అవినీతికి వ్యతిరేకంగా.. సంపూర్ణ క్రాంతి పేరిట ఉద్యమంగా మారింది. అదే సమయంలో 1975లో ఎన్నికల అక్రమాలకు పాల్పడినట్టు ఇందిరాగాంధీపై వచ్చిన కోర్ట్ తీర్పుతో చివరకు అత్యయిక స్థితి ప్రకటించేవరకూ నాటి రాజకీయాలు కల్లోలంగా సాగాయి. అవే మొరార్జీ దేశాయ్ ప్రధాని కల నెరవేర్చాయి.
అలా మొరార్జీ దేశాయ్ 1977లో ప్రధానిగా పగ్గాలు చేపట్టారు. అనుభవజ్ఞుడైన దేశాయ్ ప్రధాని పదవికి ఆయన పూర్తిగా అర్హుడు కూడాను. ఏనాడూ, ఎవ్వరికీ తలవంచని స్థైర్యం మొరార్జీ దేశాయ్ ది. లాల్ బహదూర్ శాస్త్రి ప్రధాని అయినప్పుడు ఆయన మొరార్జీ దేశాయ్ కంటే కూడా వయస్సు రీత్యా చిన్నవాడే. ఆ తర్వాత అనుభవం లేకున్నా ఇందిరాగాంధీ కూడా ప్రైమ్ మినిస్టర్ అయ్యారు.
నిజమైన గాంధేయవాది దేశాయ్!
బ్రిటీష్ రాజ్ గవర్నమెంట్ లో 12 ఏళ్ల పాటు సివిల్ సర్వెంట్ గా, అహ్మదాబాద్ డిప్యూటీ కలెక్టర్ గా పనిచేసిన మొరార్జీ దేశాయ్.. స్వతంత్ర్యానికి పూర్వం అప్పటి బాంబే రాష్ట్రానికి హోంమంత్రిగాను.. ఆ తర్వాత 1952లో ముఖ్యమంత్రిగానూ పనిచేశారు. అప్పుడే భాషాప్రయుక్త రాష్ట్రాల కోసం ఉద్యమం ప్రారంభమై.. దక్షిణాదిన ఉధృతంగా నడుస్తున్న కాలమది. ఆ సమయంలో బాంబే స్టేట్ అటు గుజరాతీ భాషొకవైపు, ఇటు మరాఠీ ఇంకోవైపు మాట్లాడుతున్నవారితో ద్విభాషా రాష్ట్రంగా కొనసాగుతోంది. సంయుక్త మహారాష్ట్ర సమితితో పాటు.. మరోవైపు ఇందూలాల్ యాజ్ఞిన్ నేతృత్వంలోని మహా గుజరాత్ మూమెంట్స్ ప్రత్యేక మహారాష్ట్ర, ప్రత్యేక గుజరాత్ రాష్ట్రాల కోసం 1956లో భాషా ప్రయుక్త రాష్ట్రాల పేరిట ఉద్యమాన్ని ప్రారంభించాయి. దాన్ని దేశాయ్ తీవ్రంగా వ్యతిరేకించాడు. వివిధ ప్రాంతాల ప్రజలు, జాతులు, విభిన్న సంస్కృతులు, భాషలు కల్గినవారెందరికో ముంబై ఒక ఆవాసమని.. దాన్ని అవసరమైతే యూనియన్ టెర్రిటరీగా ఉంచాలనే డిమాండ్ ను ముందుకు తెచ్చాడు. సంయుక్త్ మహారాష్ట్ర సమితి మూమెంట్ ను పూర్తిగా అణిచివేసేందుకూ పోలీసులకు సర్వాధికారాలిచ్చాడు. ఆ సమయంలో సేనాపతి బాపత్ నేతృత్వంలో కొనసాగిన ఉద్యమంలో సుమారు 105 మంది ఉద్యమకారులు అసువులుబాసారు. దాంతో అటు గుజరాత్, ఇటు మహారాష్ట్ర వేర్వేరు రాష్ట్రాలుగా ఆవిర్భవించాయి. ఆ తర్వాత దేశాయ్ ఢిల్లీ బాట పట్టాడు. నెహ్రూ క్యాబినెట్ లో ఫైనాన్స్ మినిస్టర్ అయ్యారు.
చురుకైన రాజకీయ నాయకుడిగా, సివిల్ సర్వెంట్ గా ఉన్న అనుభవాలతో తన ఇమేజ్ కు భిన్నంగా గాంధేయ సిద్ధాంతాలపై ఎక్కువ ఆసక్తి కనబర్చేవాడు. గాంధీ సూత్రాలతో ప్రభావితుడైన దేశాయ్ లైఫ్ డిసిప్లిన్, సింప్లిసిటీకి కేరాఫ్ లా కనిపించేదంటారు. ఆజన్మ బ్రహ్మచారిగానే ఉన్న మొరార్జీ దేశాయ్.. పూర్తిగా శాఖాహారి.
అందుకే, తన చుట్టూ ఉన్నవారెవ్వరూ మద్యం సేవించినా.. తనపక్కనే నాన్ వెజ్ తిన్నా సహించేవాడు కాదట మొరార్జీ దేశాయ్. ఈ విషయాన్ని ఆర్థికవేత్త, మాజీ న్యాయశాఖా మంత్రి సుబ్రహ్మణ్య స్వామి ఓసారి న్యూఢిల్లీలో చెప్పుకొచ్చారు. అదే సందర్భంలో అటల్ బీహారీ వాజ్ పేయ్ మద్యం సేవించాడని తెలుసుకున్న తర్వాత దేశాయ్ ఎంత కోపానికి గురయ్యాడో కూడా సుబ్రహ్మణ్యస్వామి గుర్తు చేశారు. మీరు జపాన్ రాయబార కార్యాలయానికి వెళ్లి మద్యం సేవించారు కదా అంటూ వాజ్ పేయిని నిలదీశారు మొరార్జీ దేశాయ్.
మొరార్జీ దేశాయ్ చాలా విభిన్నమైన వ్యక్తి. తన ఆరోగ్యానికి తన మూత్రమేనని కుండబద్ధలు కొట్టే మొరార్జీ దేశాయ్.. రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఐదు నుంచి ఎనిమిది ఔన్సుల మూత్రం తాగేవారట. ఈ విషయాన్ని ఆయనే ఓసారి స్వయంగా 1978లో అమెరికా పర్యటనలో జర్నలిస్ట్ డాన్ రాథర్ తో ఇంటర్వ్యూలో వెల్లడించారు. మనిషి దీర్ఘాయుష్షుకు ఆటో యూరిన్ థెరపీని ప్రోత్సహించి.. దానిపై ఏకంగా మిరాకిల్స్ ఆఫ్ యూరిన్ థెరపీ అనే పుస్తకాన్ని కూడా రాశారు మొరార్జీ దేశాయ్. మొరార్జీ మూత్రం తాగుతానన్న వ్యాఖ్యలను అప్పటి విదేశీ మీడియా చిలువలు పలువలు చేస్తూ ఎడాపెడా రాసేసింది.
గాంధీ తరహాలోనే మొరార్జీ దేశాయ్ నూతనంగా, కాస్త సృజనాత్మకంగా ఆలోచించేవాడు. ప్రయోగశీలి. గాంధీ సైద్ధాంతిక నేపథ్యం అటు కేంద్రానికి, ఇటు వామపక్షాలకు మధ్యనుండేది. దాంతో మొరార్జీ దేశాయ్ కూడా గాంధీ బాటలోనే నడిచేవారని ఢిల్లీ విశ్వవిద్యాలయంలో పొల్టికల్ సైన్స్ ప్రొఫెసర్ సంజీవ్ కుమార్ మొరార్జీ దేశాయ్ గురించే ఓసారి మీడియాతో చెప్పుకొచ్చారు.
నిజమైన అలీనత!
చైనా, పాకిస్థాన్ తో భారత్ సంబంధాలు మెరుగుపర్చిన భారత ప్రధానిగా కూడా మొరార్జీ దేశాయ్ పేరు ఎప్పటికీ గుర్తుండిపోయేది. ఆ సమయంలో మొరార్జీ దేశాయ్ క్యాబినెట్ లో అటల్ బీహారీ వాజ్ పేయ్ విదేశాంగ మంత్రిగా పనిచేశారు. ఏ అగ్రరాజ్య కూటమిలో చేరకుండా శాంతి, సౌభాతృత్వం, సమానత్వం, న్యాయం, భద్రత, పరస్పర సహకారం, అభివృద్ధి వంటి నిక్షిప్తమైన భావనలతో ఈ విధానంలోని నిజమైన అలీన స్ఫూర్తిని కనబర్చింది మొరార్జీ ప్రభుత్వం.
చైనా, పాకిస్థాన్ తో సాయుధ పోరాటాన్ని నివారించడంలో.. స్నేహపూర్వక సంబంధాలను పునరుద్ధరించడంలో నాటి దేశాయ్ ప్రభుత్వం చాకచక్యంగా వ్యవహరించింది. అలీన విధానం కోసం ఆయన హయాంలో వేసిన అడుగులు కచ్చితంగా చెప్పుకోదగ్గవి. ఒక దేశంతో ప్రత్యేక సంబంధాలు ఏమీ ఉండవని.. 1977లో టైమ్ మ్యాగజీన్ తో మాట్లాడుతూ చెప్పుకొచ్చారు మొరార్జీ దేశాయ్. పొరుగు దేశాలవారిపై కోపాన్ని ప్రదర్శించాలనిగానీ.. వారి భావాలను దెబ్బ తీయాలనిగానీ భారత్ ఎప్పుడూ కోరుకోదన్నారాయన. తుపాకులతో బెదిరింపులు, బ్లాక్ మెయిలింగ్ కు పాల్పడటం వంటివి భారత్ ఎప్పుడూ చేయదని చెప్పారు. ఆ క్రమంలో శాంతిచర్చల విషయంలో.. దైపాక్షిక సంబంధాల మెరుగుదలకుగాను మొరార్జీ దేశాయ్ నిషాన్- ఏ- పాకిస్థాన్ అనే సత్కారాన్నీ అందుకున్నారు.
నెహ్రూ హయాంలోగానీ, తాను అధికారంలో ఉన్నప్పుడుగానీ ఇండియా-పాక్ మధ్య శాంతి నెలకొల్పే విషయంలో తాము అంత చొరవను ఊహించలేకపోయామని పాక్ విదేశాంగ మంత్రి తనతో అన్నట్టుగా మొరార్జీ దేశాయ్ తన ఆత్మకథ ది స్టోరీ ఆఫ్ మై లైఫ్ లోనూ రాసుకున్నారు.
ఇవాళ బీసీ రిజర్వేషన్లపై ఇంత పెద్ద ఎత్తున చర్చ జరుగుతుందంటే దానికీ తొలి అడుగు మొరార్జీ దేశాయ్ జనతా ప్రభుత్వంలోనే పడింది. 1979లో మండల్ కమిషన్ ను ఏర్పాటు చేసి భారతదేశ రాజకీయ ముఖచిత్రాన్నే మార్చివేసే ఒక నిర్ణయానికి నాంది పలికింది దేశాయ్ సర్కార్.
ఎమర్జెన్సీ సమయంలో జైలులో ఉన్న మొరార్జీ దేశాయ్ ని తనకు మద్దతు ప్రకటిస్తే జైలు నుంచి బయటకు తెస్తానని ఇందిరాగాంధీ చెబితే… సారీ అని చెప్పేశారట మొరార్జీ దేశాయ్. నాకు కేవలం ఇప్పుడు 80 ఏళ్లు మాత్రమే.. కాబట్టి, నేనింకా జైల్లో ఉంటానంటూ.. పరోక్షంగా నీకు మాత్రం మద్దతు పలకనంటూ చెంపపెట్టులాంటి సమాధానమిచ్చాడని గుర్తు చేసుకుంటాడు సుబ్రహ్మణ్యస్వామి.



