రెహమాన్ సంగీతంతో ప్రపంచానికి సుపరిచితుడైన నవీన్ అనే పిల్లనగ్రోవి స్వరం వెనుక… జ్యోతి కుమార్ అనే రిథమ్ ఉందనే విషయం మీకు తెలుసా..?
ఎవరా జ్యోతి కుమార్…? నవీన్ కుమార్ కు ఏమైతాడు…? నవీన్ ఫేమస్ ఫ్లూటిస్టుగా అనూహ్యమైన గుర్తింపు సాధించేకంటే ముందు.. జ్యోతి కుమార్ తో కలిసి ఏం చేసేవాడు..?
సోదరులుగా తోడబుట్టిన రక్త సంబంధమెంత నిజమో… నవీన్ కుమార్, జ్యోతి కుమార్ నడుమ సంగీత బంధమూ అంతే విశేషం.
ఎందుకంటే ఒకరు ఊపిరితో స్వరాల్ని పలికిస్తే… ఇంకొకరు తాళంతో దాని గుండె చప్పుడును వినిపిస్తారు. నవీన్ ఫ్లూటిస్ట్ అయితే… జ్యోతి కుమార్ తబిలిస్ట్.
వీరిద్దరూ కలిసి భగత్, దొంగలున్నారు జాగ్రత్త, నేరం వంటి ఓ ఏడు సినిమాలకు సంగీతం చేశారు. సెలబ్రేషన్ 2010 వంటి క్రిస్టియన్ డివోషనల్ ఆల్బమ్స్ విడుదల చేశారు. వాటి క్రెడిట్స్ లో నవీన్ – జ్యోతి ఇలా ఇద్దరి పేర్లూ కనిపిస్తాయి. జ్యోతి కుమార్ అందులో మ్యూజిక్ ప్రోగ్రామింగ్ చేసే బాధ్యత నిర్వర్తించాడు. ఇప్పటికీ జ్యోతి కుమార్ ప్రోగ్రామింగ్ కండక్టర్ గా పని చేస్తున్నారు. తెలుగు తమిళ ఆల్బమ్స్ చేస్తుంటారు.

ఇంటి నుంచి మొదలై స్టూడియోల వరకూ సాగిన సోదరుల జంట ప్రయాణం!
అన్నదమ్ముల బంధం మొట్టమొదట వెలుగులోకొచ్చేముందు ఆల్బమ్ గా మారింది. సినీ సంగీత ప్రపంచంలో తమ ప్రయాణాలు ఒక్కొక్కరిదీ ఒక్కో స్థాయిలో కొనసాగుతూనే ఉంది. కానీ, బంధం మాత్రం అన్యోన్యంగా అలాగే ఉంది. ఇంట్లో సంగీత సాధనతో మొదలైన ప్రయాణం.. ఇప్పటికీ మద్రాస్ స్టూడియోల వరకూ అలాగే సాగుతోంది. ఈ ఇద్దరు అన్నదమ్ముల బంధం ఓ మ్యూజికల్ ప్రాజెక్టుగా మారిపోయింది.
ఒకరు వేణువును పెదవుల వద్దకు చేర్చి గాలిని స్వరంగా మారిస్తే… ఇంకొకరు తబలాపై తన చేతి వేళ్ల మాయతో ఆ స్వరాలకు నడక నేర్పుతారు. ఇది అన్నదమ్ముల మధ్య సంగీతం పెనవేసిన బంధం.
సంగీతంలో జంట స్వరాల గురించి విన్న మనకు.. సంగీతాన్నే నమ్ముకున్న ఈ జంట సోదరులూ అలాగే కనిపిస్తారు.
ఏడేళ్ల వయస్సులోనే ఆరంభమైన జర్నీ!
ఆంధ్రా కుర్రాళ్లైన ఈ ఇద్దరూ మద్రాస్ లో అడుగుపెట్టగానే తమ వాద్యకళతో ఇళయరాజా వంటి సంగీత దర్శకులనే మెస్మరైజ్ చేశారు. నవీన్ కు ఏడేళ్ల వయస్సులోనే తండ్రి ఓ ఫ్లూట్ కొనిచ్చాడు. ఆ చిన్న వేణువుపై పెంచుకున్న మమకారమే… తనను సంగీత సాగరంవైపు ప్రయాణం చేయించింది. చదువుకుంటూనే ప్లూట్ వాయించేవాడు. 11 ఏళ్ల వయస్సులో స్కూల్ లో వాయించిన పిల్లనగ్రోవి వాద్యానికి మురిసిన టీచర్స్.. మరో రెండు ఫ్లూట్స్ నవీన్ కు గిఫ్ట్ గా అందించారు. ఇంకా ఆసక్తి పెరిగింది. తల్లిదండ్రులూ నవీన్ ను, జ్యోతిని ఇద్దరన్నదమ్ముల్నీ ప్రోత్సహించారు. నవీన్ కు వైజాగ్ లోనే ఫ్లూట్ నేర్పించాలనుకుంటే అక్కడ ప్రత్యేకంగా ఫ్లూట్ నేర్పే గురువులెవ్వరూ లభించలేదు. తాను జానపద గాయకుడు కూడా కావడంతో.. శాస్త్రీయ సంగీతం వోకల్, వాయిలిన్ నేర్పించే ఓ గురువు వద్దకు తీసుకెళ్లారు. నవీన్ ఫ్లూట్ వాద్యం ఇష్టమని తెలిసిన గురువు.. నువ్వు వోకల్ నేర్చుకోవాలంటే మట్టుకు ఫ్లూట్ వాయిస్తే కుదరదు. అలాగైతేనే నేను నీకు నేర్పిస్తానన్నాడు. సరే ముందు శాస్త్రీయ సంగీతంలోకి ప్రవేశం ముఖ్యమనుకున్న నవీన్ ఓవైపు గురువు దగ్గర ఓకల్, వాయిలిన్ నేర్చుకుంటూనే… ఆయనకు తెలియకుండా ఫ్లూట్ ప్రాక్టీస్ చేసేవాడు. తన ఫ్లూట్ వాద్యం విన్న ఆల్ ఇండియా రేడియో నుంచి నవీన్ కు అవకాశం వచ్చింది. ఆ వాద్యం ప్రసారమయ్యే సమయానికి గురువు విన్నాడు. అలా రెండు, మూడుసార్లు విన్నాక అది తనవద్దకు సంగీతం కోసం వస్తున్న నవీనేనని తేల్చుకున్నాడు. తీరా నవీన్ ను ఫ్లూట్ వాయిస్తున్నావా నాకు తెలీకుండా అని అడిగాడు. కాసింత భయం, ఆందోళన, అలాగే ఒకింత చిలిపి నవ్వుతో అవును సార్ అన్నాడు నవీన్. ఇంకేం నువ్వు గెట్ అవుట్ అంటూ ఆ గురువు పంపించేశాడు. చేసేదిలేక బయటకొచ్చిన నవీన్ ఆ తర్వాత ఆంధ్రా యూనివర్సిటీలో చేరి సంగీతంలో డిప్లమా చేసి.. పిల్లనగ్రోవిలో ప్రయోగశాలిగా మారాడు. ప్రొఫెసర్ పి. సాంబమూర్తి అనే సంగీతజ్ఞుడు రాసిన ది ఫ్లూట్ అనే పుస్తకాన్ని తండ్రి నవీన్ చేతిలో పెట్టాక.. పిల్లనగ్రోవి వాద్యాల్లో ఎన్ని సూక్ష్మమైన తేడాలుంటాయి, ఎన్ని భిన్నమైన ధ్వనులను పలికించొచ్చు, ఎన్ని రకాల ఫ్లూట్స్ ఉంటాయనే పలు అంశాలను తెలుసుకోగల్గానంటాడు నవీన్.

నవీన్, జ్యోతి తండ్రికి ప్రముఖ ఉత్తరాంధ్రకు చెందిన డబ్బింగ్ సినిమాల రచయితగా పేరున్న గణేష్ పాత్రోతో మంచి పరిచయముంది. మద్రాస్ లో గణేష్ పాత్రో వద్దకు కొడుకులిద్దర్నీ తీసుకెళ్లితే… గణేష్ పాత్రో సూచన, చొరవతో ఇళయరాజాకు పరిచయమేర్పడింది. అలా ఇళయరాజా వద్ద మౌనమేలనోయి పాట వాయిస్తే… నో నో ఏవైనా కీర్తనలు వాయించడంటే దంచిపారేశాడు నవీన్. మరి మీ చదువు అంటే.. మీ దగ్గర పని కంటే ఆ చదువెక్కువేం కాదన్నాడు. తల్లిదండ్రులూ సరేనన్నారు. తెల్లవారునుంచే ఇళయరాజా దగ్గర చేరిపోయాడు. ఆ తర్వాత నవీన్ కు రమేష్ నాయుడు వద్ద దిలీప్ కుమార్ పరిచయమయ్యాడు. అలా దిలీప్ నుంచి రూపాంతరం చెెందిన రెహమాన్ తో జింగిల్స్ నుంచి మొదలైన తన ప్రయాణం.. ఇవాళ, రెహమాన్ ఆస్కార్ మ్యూజికల్ బృందంలో కీలక వాద్యకారుడిగా ఎదిగేవరకూ సాగింది.
వైజాగ్ లో ఉన్నప్పుడు జ్యోతి మ్యూజికల్ ట్రూప్ పేరిట తన అన్నపేరుతోనే వాద్యకచేరీలు చేసేవారు. ఆ తర్వాత కొన్ని సినిమాలకు ముఖ్యంగా క్రిస్టియన్ సాంగ్స్ ఆల్బమ్స్ వంటివి రూపొందించారు. తన కెరీర్ ఎదుగుదల వరకూ కూడా తన అన్న జ్యోతి కుమార్ సహకారం కూడా మరువలేనిది.
నవీన్ వేణువుతో నాదమైతే… జ్యోతి తబలా పట్టుకుని తాళమయ్యాడు. ఒకరు శృతైతే.. ఇంకొకరు ఆ శృతిని లయలో పెట్టారు. ఇద్దరూ కలిసి ఇంట్లోనే సంగీతాన్ని ప్రాక్టీస్ చేసేవారు. నవీన్ కొన్ని ఇంటర్వ్యూస్ లో ఈ వివరాలను గుర్తు చేసుకున్న సందర్భాలూ ఉన్నాయి.
ఫ్లూట్ ప్రశ్నిస్తే.. తబలా సమాధానం చెప్పేది. తబలా నిలదీస్తే… ఫ్లూట్ జవాబయ్యేది. సరిహద్దుల్లేని వేణువు గాలిని… తన తబలా వాద్యంతో జ్యోతి నేల మీద అడుగుల్లా మార్చేవాడు. ఎగిసిపడుతున్న జలపాతమై నవీన్ ఫ్లూట్ ఎగురుతుంటే… గంతులేస్తున్న ఆ నాదానికి మరింత అందమద్దిన తాళం సోదరుడు జ్యోతి. రాగమెంత అందమైందైనా.. తాళం లేకుంటే, దాని ప్రయాణం పూర్తి కాదు. అలాగే రిథమ్ ఎంత అద్భుతంగా ఉన్నా… స్వరం లేని కథ రాణించదు. అంతుకే జంటస్వరాల్లా ఈ అన్నదమ్ముల జుగల్బందీ సాగింది.
నవీన్ కెరీర్ ఎక్కడ, ఎప్పుడు మొదలైంది..?
1980లలో ఓ కుర్రాడు సినీ సంగీత ప్రపంచం వైపు ఆకర్షించబడ్డాడు. ఇళయరాజాను కలిసి తన మురళీ వాద్యంతో మెప్పించాడు. పని చేశాడు. రమేష్ నాయుడుకూ వాయించాడు. ఆ తర్వాత ఏ. ఆర్. రెహమాన్ తో జత కట్టాడు. హంసలేఖ నుంచి మొదలు శంకర్ మహదేవన్ వరకు ఎందరో సంగీత దర్శకుల వద్ద పనిచేశాడు. కానీ, రెహమాన్ దగ్గర నవీన్ ఫ్లూట్ కు అద్భుతమైన గుర్తింపు వచ్చింది.
ముఖ్యంగా బాంబే థీమ్ మ్యూజిక్ తో పాటు.. ఉరికే చిలుక, కన్నానులేతో పాటే… మాంచి బీట్ సాంగ్ గా ఇప్పటికీ అలరించే హమ్మ హమ్మ పాటలో నవీన్ ఫ్లూట్ బిట్స్ మెస్మరైజ్ చేసేవి. కల్ హో నా హోలో తన సున్నితమైన స్వరాలతో కదిలిస్తే… జరా జరా పాటలో తన మురళీరవంతో అలరించాడు. ఇలాంటి ఎన్నో పాటలు నవీన్ పేరును కోట్లాది మంది సంగీతాభిమానులకు పరిచయం చేశాయి.
ప్రేమ భావనల్ని మాటల్లేకుండా వినిపించాలన్నా… విషాద క్షణాలకు గంభీరత్వాన్ని అద్దాలన్నా… నవీన్ ఫ్లూట్ కొత్త దారుల్లో పయనిస్తుంది. అందుకే రెహమాన్ సంగీతంలో ఫ్లూట్ ప్రత్యేకంగా నిలుస్తోంది.
నవీన్ కు ఫ్లూట్ ఓ వాద్యం మాత్రమే కాదు.. అదో ప్రయోగం. సంప్రదాయ పిల్లనగ్రోవి ధ్వనికి… తీగల వైబ్రేషన్ యాడ్ అయితే ఎలా ఉంటుందన్న ఆలోచనతో… ఏకంగా నవీన్ ఫ్లూట్ పేరుతో ఓ ప్రయోగమే చేశాడు. ప్రపంచంలో ఏ మూలకు వెళ్లినా ముందుగా నవీన్ వెతికేది అక్కడి సంప్రదాయ పిల్లనగ్రోవినే. అలా సేకరించిన దేశ, విదేశాల్లోని ఫ్లూట్స్ ఖజానానే తయారు చేసుకున్నంత ఇష్టం ఫ్లూటంటే.
మొత్తంగా అన్నదమ్ములిద్దరూ కలిసి స్వరాల మధ్య ఖాళీలను ఒకరు ఫిల్ చేస్తే… మరొకరు స్వరాలకు నడక నేర్పారు. అలా ఆరోహణ, అవరోహణ వరుసల్లా ఈ సోదరుల జుగల్బందీ అద్భుతమైన సంగీతకారులను ప్రపంచానికి పరిచయం చేసింది.
సినిమా పోస్టర్లపై హీరో, హీరోయిన్స్ బొమ్మలే కనిపిస్తాయి. పాటలో గాయకుడి గొంతు మాత్రమే వినిపిస్తుంది. సంగీత దర్శకుడెవ్వరో కూడా అంతా తెలుసుకునే యత్నం చేస్తారు. కానీ, ఒక పాటను అద్భుతంగా తీర్చిదిద్దే వందలాది వాద్యకారుల పేర్లు మాత్రం తెరవెనుకకే పరిమితమైతాయి. అలాంటి తెరవెనుక కళాకారుడిగా సినీ సంగీత రంగానికి పరిచయమై.. ఇవాళ ప్రపంచస్థాయి ఫ్టూటిస్టుగా ఎదిగారు నవీన్ కుమార్.
అలాగే జ్యోతి ప్రోగ్రామింగ్ కండక్టర్ గా, మ్యూజిక్ కంపోజర్ గా తన పని చేసుకుంటున్నాడు. ఎదుగుదలలో అవకాశాలు, అదృష్టాలు వేర్వేరుగా కనిపించొచ్చుగానీ… ఈ అన్నదమ్ముల జుగల్బందీ ప్రయాణం మాత్రం ఆసక్తికరం.
రమణ కొంటికర్ల…✍🏻



