నూటా పదిహేడేళ్లు… పలకడానికి సులభమే కానీ… ఒక శతాబ్దాన్ని దాటి మరో శతాబ్దంలోకి అడుగు పెట్టడమెంత కష్టం..? కానీ, ఈ అవ్వది రెండు ప్రపంచ యుద్ధాలు చూసిన సజీవ చరిత్ర.
ఎథెల్ కేటర్ హమ్… 1909 ఆగస్ట్ 21న హాంప్‌షైర్‌లోని షిప్టన్ బెల్లింజర్ అనే గ్రామంలో పుట్టింది. ప్రపంచంలోనే అతి పెద్ద వయస్కురాలు. 2025లో 116 ఏళ్ల వయసులో బ్రెజిల్‌కు చెందిన సన్యాసిని సిస్టర్ ఇనాహ్ కనబారో లూకాస్ మరణించిన తర్వాత… ఎథెల్ కేటర్ హమే అతి పెద్ద వయస్కురాలిగా గుర్తింపు పొందింది. ఇప్పుడీ బామ్మ తన 117వ పుట్టినరోజును తన కుటుంబ సభ్యులు, స్నేహితుల మధ్య ఇంగ్లాండ్ లోని సర్రేలో ఆనందంగా జరుపుకుంది.
ఇది ఎథెల్ కేటర్ హమ్ జీవితం.. ఒక మనిషి లైఫ్ స్టోరీ మాత్రమే కాదు. రెండు ప్రపంచ యుద్ధాలు, రెండు మహమ్మారులు, ఐదుగురు బ్రిటీష్ రాజులు, నూతనంగా వచ్చిన సాంకేతిక విప్లవం.. ఇలా ఎన్నో ఆమె కళ్లు చూసిన చరిత్ర.

ఎథెల్ చేతి పట్టుకు నడిపించిన రాజు!
ఎథెల్ 116వ పుట్టినరోజున బ్రిటన్ రాజు మూడో ఛార్లెస్… శతాధిక వృద్ధురాలైన ఎథెల్ ను కలవడానికి ఆమె ఇంటికొచ్చారు. ఇద్దరూ కలిసినప్పుడు రాజు ఆమె చేయి పట్టుకున్న సందర్భంలో… ఆమె పాత జ్ఞాపకలాను రాజుతో నెమరువేసుకున్నారు. 1969లో చార్లెస్ ప్రిన్స్ ఆఫ్ వేల్స్ గా అధికారిక గుర్తింపు పొందిన సందర్భాన్ని ఆమె యాది చేసుకున్నారు.
రాజుపైన సెటైర్స్!
అలా మాట్లాడుతూనే… మెల్లిగా రాజుపై చిన్న సెటైర్స్ వేసింది ఈ ఎథెల్ అనే బామ్మ. అప్పట్లో అమ్మాయిలంతా మీపై ప్రేమలో పడ్జారు.. పెళ్లి చేసుకోవాలనీ అనుకున్నారంటూ ఆమె చురుకుదనం, చమత్కారాన్ని ఆ సందర్భంలో ఛార్లెస్ కూడా ఎంజాయ్ చేశారు.
శ్రీ శ్రీ అన్నట్టు కొందరు కుర్రవాళ్ళు పుట్టుకతోనే వృద్ధులైతే… ఈ శతాధిక వృద్ధురాలు మాత్రం ఇంకా పడుచు యువతిలా అందరినీ ఆకట్టుకుంటోంది. వయస్సు పెరుగుతున్నకొద్దీ చూపైనా మసకబారడం సహజం. కానీ, ఇఫ్పటికీ ఎథెల్ చూపులే ఆకర్షణీయం.
ఆరో ఎడ్వర్డ్ ను చూసిన సజీవ సాక్షి!
మొదటి ప్రపంచ యుద్ధం ఇంకా మొదలు కాలేదు. ప్రపంచం అప్పటికే విద్యుత్, రేడియో, విమానయానం వంటి కొత్త ఆవిష్కరణలతో ముందడుగు వేస్తోంది. ఆమె పుట్టిన ఐదేళ్ల తర్వాత ఆర్చ్ డ్యూక్ ఫ్రాంజ్ ఫెర్డినాండ్ హత్య మొదటి ప్రపంచ యుద్ధానికి కారణమైంది. 1910లో మరణించిన బ్రిటన్ రాజు ఆరో ఎడ్వర్డ్ ను ప్రత్యక్షంగా చూసినవారిలో.. చివరి జీవించి ఉన్న ఒకే ఒక్క వ్యక్తి ఎథెల్.
మన జ్ఞాపకాలను నెమరు వేసుకునే ఆల్బమ్స్ మన కుటుంబాలను పూర్వపు రోజుల్లోకి తీసుకెళ్లి అనుభూతినిస్తాయి. కానీ, ఎథెల్ జీవితం ఒక కుటుంబానికి చెందిన ఆల్బమ్ కాదు… ఒక శతాబ్దపు ప్రపంచ చరిత్రకు చెందిన ఓ లైవ్లీ ఆల్బమ్.
బ్రిటీష్ ఇండియాలోనూ ఆమె అడుగులు!
18 ఏళ్ల వయస్సులోనే ఎథెల్ జీవితం మరో మలుపు తిరిగింది. 1927లో బ్రిటీష్ ఇండియాకూ వచ్చారు. ఇక్కడ ఓ సైనికాధికారి ఇంట్లో పిల్లల సంరక్షకురాలిగా పనిచేశారు. తన యుక్తవయస్సులో 21 ఏళ్ల వరకూ భారత్ లోనే ఉంది నేటి ఈ బామ్మ. అలా పూర్తిగా బ్రిటీషర్స్ పాలనలో ఉన్న.. నాటి స్వాతంత్రం రాని కాలాన్ని ఆమె భారత్ లో గడిపారు.
బాంబుల మోత నుంచి ఆర్టీఫిషియల్ ఇంటలిజెన్స్ ఎలా వరకు!
రెండో ప్రపంచ యుద్ధకాలంలో బ్రిటన్ లో జనం రేషన్ కోసం కట్టిన క్యూలు, ఆహార కొరత, రాత్రివేళల్లో బాంబు దాడుల నుంచి… కృత్రిమ మేథ, స్మార్ట్ ఫోన్స్, అంతరిక్ష పరిశోధనలు, డిజిటల్ జీవితం వైపు పరిగెత్తుతున్న మనుషులు.. ఇలా విప్లవాత్మకమైన మార్పులను చూసిన ఓ సజీవ వృద్ద సాక్ష్యం ఈ అవ్వ ఎథెల్.
కరెంట్ లేని కారుచీకట్ల నుంచి రంగురంగుల ఆకాశహర్మ్యాలను చూసిన చరిత్ర ఈ 117 ఏళ్ల తాతమ్మది.
20వ శతాబ్దపు ప్రపంచ మార్పులకు ప్రత్యక్ష సాక్షి!
శతాధిక జీవన ప్రయాణానికి ఓ సజీవ సాక్షిగా ఈమె సుదీర్ఘ జీవితం వెనుక అసలు రహస్యమేంటి..?
జన్యువులా, జీవనశైలా, పరిసరాల ప్రభావమా, ఆశావాదమా… వృద్ధాప్య శాస్త్ర నిపుణులు ఏథెల్ వంటి సూపర్ సెంటనేరియన్లను ఇంకా అధ్యయనం చేస్తూనే ఉన్నారు. కానీ, ఎథెల్ మాత్రం తన జీవనచిత్రం వెనుక పెద్ద రహస్యాలేమీ లేవంటోంది.
గతాన్ని తల్చుకుని రీఛార్జ్ అయితే పర్లేదుగానీ… గతాన్ని తల్చుకుని అవే గోల్డెన్ డేస్ అనుకుంటూ వర్తమానాన్ని నిరాశాజనకంగా మార్చుకునేవారికి… ఎథెల్ జీవితం ఓ ఆశావాద దృక్పథాన్ని ముందుంచుతోంది. గతాన్ని లెక్కలు వేసుకోవడం కంటే భవిష్యత్ గురించి ఆలోచించాలన్న ఒక మెసేజ్ ఎథెల్ జీవితమందిస్తోంది.
ఈ 117వ పుట్టినరోజున తన కుటుంబం, స్నేహితులతో కలసి ఎంతో అందమైన రోజును గడిపానన్న ఎథెల్.. వచ్చే 118 పుట్టినరోజు ఇంకా ఏం మోసుకొస్తుందో చూడాలంటోంది.
ప్రపంచంలో వృద్ధాప్యం విషయంలో కనిపిస్తున్న అసమానతలేంటి..?
అయితే, ఎథెల్ కేటర్ హమ్ 117వ పుట్టినరోజున ప్రపంచవ్యాప్తంగా ఉన్న జనాభా.. వారి ఆరోగ్య పరిస్థితుల మధ్య వ్యత్యాసాలపై కూడా చర్చ ఊపందుకుంది.
బ్రిటన్ వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో మెరుగైన వైద్యం, పారిశుధ్యం, వృద్ధాప్య వైద్య సేవల కారణంగా.. వృద్ధుల సంఖ్య, శతాధిక వయస్కుల సంఖ్యా పెరుగుతోంది. అదే సమయంలో.. ఆఫ్రికాలోని అనేక దేశాల్లో ఇందుకు భిన్నమైన పరిస్థితులూ కనిపిస్తున్నాయి. కెన్యా నేషనల్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ ప్రకారం అక్కడి జనాభా మధ్యస్థ వయస్సు సుమారు 20 ఏళ్లైతే… మహిళల సగటు ఆయుర్దాయం కేవలం 66 ఏళ్లే కావడం తీవ్రమైన వ్యత్యాసాన్ని పట్టి చూపిస్తోంది.
యూరప్ లో ఓ వ్యక్తి 117 ఏళ్లు బతకడం వైద్యపరంగా అద్భుతంగా భావిస్తే.. ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో అందరికీ నిరంతర, నాణ్యమైన వైద్యసాయం అందకపోవడం ఆరోగ్య అసమానతలను తేటతెల్లం చేసేది.
ఇలాంటి చర్చల మధ్య ఒక ఆశాదీపం ఎథెల్.
గతాన్ని చూసి ఆగిపోకుండా… రేపటి ఉదయానికై నిరీక్షణ ఎథెల్ లైఫ్ స్టోరీ. ఇదే ఎథెల్ కేటర్ హమ్ జీవితంలో ఆకర్షించే అసలైన అందం.



