విలాసం వెనుక విలాపాన్నీ చూపే దర్శకుడు!

నాల్గు ఫైట్లు, డ్యాన్సులు పెట్టి హీరోయిజమే కేంద్రంగా తీసే ఫక్తూ కమర్షియల్ బాలీవుడ్ సినిమాకు ఆయన శైలి పూర్తి భిన్నం. వాస్తవిక కోణాన్ని స్పృశించే కొద్దిమంది దర్శకుల్లో మధూర్ భండార్కర్ పేరు ఒకటి. ముంబై పబ్బుల్లో రంగురంగుల సీతాకోక చిలుకల తెరవెనుక జీవితాలను ఆవిష్కరించాలన్నా… కార్పోరేట్ ప్రపంచంలోని వైఫై మెరుగులను పట్టి చూపించాలన్నా… పేజ్ త్రీ వంటి సినిమాలతో సెలబ్రిటీల బతుకు చిత్రాన్ని ఆవిష్కరించాలన్నా.. బాలీవుడ్ కు లభించిన ఓ సృజనశీలి. ఆగస్ట్ 26 మధూర్ భండార్కర్ పుట్టినరోజు. ఆయన రంగులకల ఆవిష్కరణే నేటి ఈ కథనం.

చాందినీబార్, కార్పోరేట్, హీరోయిన్, సత్తా, ట్రాఫిక్ సిగ్నల్, పేజ్ 3, ఫ్యాషన్ ఇలా ఏ సినిమా చూసినా… మధూర్ భండార్కర్ మార్క్ కనిపిస్తుంటుంది. సమాజం తాలూకు భిన్న పార్శ్వాల్ని గమనించడంతో పాటే… వాటిని అంతే వాస్తవికతను గోచరించేలా… హృద్యంగా తెరకెక్కించినవాడు. భండార్కరుడికి ఇది క్లాప్ తో కొట్టిన విద్య. ఐతే అందుకు భండార్కర్ జీవితానుభవాలు కూడా ప్రధాన కారణాలు. చదువు సరిగ్గా అబ్బని ఓ స్కూల్ డ్రాపవుట్. పొట్టకూటి కోసం ముంబై ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర చూయింగ్ గమ్ లు అమ్ముకునే నాడే భండార్కర్ లో ట్రాఫిక్ సిగ్నల్ బతుకుచిత్రానికి సంబంధించిన ఐడియాకు బీజం పడింది. ఆ తర్వాత ఓ వీడియో లైబ్రరీలో జాయినయ్యాడు. అక్కడికి సినిమా వీడియో క్యాసెట్లకై వచ్చేవాళ్లకు వాళ్లడిగిన సినిమాల తాలూకు సంగతులు చెప్పాల్సివచ్చే క్రమంలో… సినిమాలను కేవలం జస్ట్ టైంపాస్ వ్యూయర్ గా కాకుండా… నిశితంగా పరిశీలించేవాడు. ప్రపంచ సినిమాపై ఆ వీడియో లైబ్రరీ అనే యూనివర్సిటీలోనే పీహెచ్డీ పూర్తి చేశాడు.

మొదట్లో టీవీ సీరియళ్లకు అసిస్టెంట్ దర్శకుడిగా వెయ్యి రూపాయలకు పనిచేసేవాడు. ఎదుగూబొదుగూ లేకపోవడంతో ఏకంగా బొంబాయి నుంచి దుబాయ్ వెళ్లిపోయాడు. అలా, ఓ మలుపు తిరిగిన జీవితంలో ఎక్కడో మళ్లీ సినిమాలకు పనిచేయాలనే ఆశ మాత్రం వదల్లేదు. దాంతో పీచేముడ్ అంటూ ముంబై చేరుకున్నాడు. జాతీయస్థాయిలో కీర్తి గడించిన మన తెలుగువాడైన రాంగోపాల్ వర్మ వద్దే అసిస్టెంట్ గా జాయినయ్యాడు. రాత్ నుంచి రంగీలా వరకూ రామ్ తో ప్రయాణం సాగింది. నేర్చుకునే నిత్యవిద్యార్థి కావడంతో వర్మ దగ్గరి పాఠాలు మధూర్ కి బాగా ఉపయోగపడ్డాయి. ఇంకేం త్రిశక్తి అనే ఓ సినిమాతో దర్శకుడిగా మొట్టమొదటిసారి పరిచయమయ్యాడు. మనం వినే ఎందరో సక్సెస్ ఫుల్ దర్శకుల స్టోరీల్లాగానే… భండార్కర్ మొదటి సినిమా విడుదలకు రెండేళ్లు పట్టింది. ఆ తర్వాత రిలీజైనా అది అట్టర్ ఫ్లాపైంది. దాంతో మళ్లీ కష్టాలు తప్పలేదు. కానీ 2001లో టబు ప్రధాన పాత్రలో… బార్ గర్ల్స్ జీవిత దర్పణంగా… వారి బతుకుల్లోని చీకటికోణాల్ని ఆవిష్కరించాడు. చాందినీబార్ తో ఇక మధూర్ భండార్కర్ మధురమైన ప్రస్థానానికి బీజం పడింది. ఉత్తమ దర్శకుడిగా గుర్తింపునిచ్చింది.

ఆయన ఆవిష్కరణ నుంచి పుట్టుకొచ్చిన సంపన్నవర్గాల పార్టీ కల్చర్ లోని చేదు నిజాల సమాహారమే పేజ్ 3. విలాసం చాటు విలాపాన్ని కళ్లకు కట్టింది. తళుకుబెళుకుల రంగుల కలల ప్రపంచపు విషవలయం ఎలా ఉంటుందో ఆయన ‘ఫ్యాషన్’ చూపించింది. ఆ సినిమా ప్రియాంకాచోప్రాను జాతీయ ఉత్తమనటిని చేసింది. భండార్కర్ కు రెండోసారి జాతీయ ఉత్తమ దర్శకుడి అవార్డును కట్టబెట్టిన చిత్రం ట్రాఫిక్ సిగ్నల్. డబ్బు, పలుకుబడి కల్గిన నేతలు, గ్యాంగ్ స్టర్ల జీవితాకోణాల్ని… ట్రాఫిక్ సిగ్నల్స్ మాటున జరిగే చీకటి దందాల్ని.. సాదాసీదాగా కనిపించే మనుషుల భయంకర మనస్తత్వాల అద్భుత ఆవిష్కరణే ట్రాఫిక్ సిగ్నల్. ఇక ఐశ్వర్యారాయ్ తో మొదలెట్టిన హీరోయిన్ అనే మరో సినిమా వ్యక్తిగత కారణాతో ఆమె చేయలేకపోవడంతో… కరీనా కపూర్ తో పూర్తి చేశాడు.

కల్పిత గాధలను తన సినీ క్యాన్వాస్ కు వాడుకోని దర్శకుడు. తన చుట్టూ ఉన్న వాస్తవిక జీవనచిత్రంలోని అంశాలే తన కథలకు ప్రతిరూపాలు. అంత వాస్తవి’కథ’నూ… పక్కా ప్రాక్టికాలిటీని మాత్రమే తన సినిమా ద్వారా ఆవిష్కరించే భండార్కర్… దేవుణ్ని కూడా అదే స్థాయిలో నమ్ముతూ, ప్రతీ మంగళవారం ముంబైలోని ప్రముఖ సిద్ధి వినాయకుడి గుడికి వెళ్లడమే ఆయనలో కనిపించే మరో విశేషమైన కోణం. రంగుల కలల్లాగా కనిపించే వాస్తవిక చిత్రాలతో సమ్మెహనపర్చి.. పద్మశ్రీ పురస్కారాన్నందుకున్న ఆ రియలిస్టిక్ దర్శకుడు మధూర్ భండార్కర్ కు జన్మదిన శుభాకాంక్షలతో..💐

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles