మైదానం సైతం సెల్యూట్ చేసిన సంకల్పం.. మిస్టర్ వాల్!

GOOD SPORTSMANSHIP GOES BEYOND THE GAME; IT STARTS WITH RESPECT – BY TOMMY HILFIGER (AMERICAN FASHION DESIGNER)

ప్రపంచ కప్ గెలవడం ఒక కల. ఆ కల భారత్ కు మొన్నటి 2024 టీ 20తో మరోసారి నిజమైంది. అందులోనూ 20 జట్లు పాల్గొన్న టీ 20. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, పాకిస్థాన్ వంటి హేమాహేమీలను బరిలోనుంచి తోసిరాజని.. సాధించుకున్న కప్పు. ఏస్.. ఎప్పటికదీ మెమరేబులే. కానీ, అంతకుమించిన జ్ఞాపకాల్లో నిల్చేలా టైటిల్ సాధన తర్వాత జరిగిన వీడ్కోల పార్టీ నిల్చింది. అదే మిస్టర్ డిపెండబుల్ ఫేర్ వెల్. రాహూల్ పుట్టినరోజున కాస్త ఆయన గురించి చెప్పుకుందాం.

క్రీడాప్రపంచంలోనే అతి తక్కువ మంది ఇలాంటి ఫేర్ వెల్స్ ను చూసి ఉంటారు. స్కాటిష్ ఫుట్ బాల్ మేనేజర్ అండ్ ప్లేయర్ అలెక్స్ ఫెర్గూసన్, ఇంగ్లీష్ ఫుట్ బాల్ కోచ్ అండ్ ప్లేయర్ పాల్ స్కోల్స్, శ్రీలంక క్రికెటర్స్ కుమార సంగక్కర, మహేళ జయవర్ధనే, టెన్నిస్ స్టార్ ఆండ్రీ అగస్సీ, బాస్కెట్ బాల్ ప్లేయర్ మైఖేల్ జోర్డాన్ తో పాటు… ఈ మధ్య జరిగిన టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ వంటివారిని వేళ్లపై లెక్కించొచ్చు. ఆ జాబితాలో మన రాహూల్ ద్రవిడ్ పేరు కూడా చెప్పుకోవాల్సిందే. 2024 టీ 20 వరల్డ్ కప్ విజయంతో.. కోచ్ గా ఉన్న ద్రవిడ్ కు ఆ ఘనత దక్కింది.

TALENT WINS GAMES,BUT TEAM WORK AND INTELLIGENCE WINS CHAMPIONSHIPS – BY MICHEAL JORDAN (AMERICAN PROFESSIONAL BASKET BALL PLAYER)

2024 టీ20 విజయం తర్వాత రాహూల్ ద్రవిడ్ పేరు ట్రెండింగ్ గా మారింది. తనకు వెంటనే భారతరత్న ప్రకటించాలంటూ గవాస్కర్ వంటివారు డిమాండ్ చేశారు. ఎంతోమందిలాగే నేనూ చిన్ననాటి నుంచి మీ ఆటను చూస్తూ, ప్రేమిస్తూ పెరిగానని.. కానీ, మీతో కలిసి పనిచేసే భాగ్యం నాకు దక్కడం ఓ వరమంటూ కప్ గెల్చిననంతరం.. ద్రవిడ్ వీడ్కోల సందర్భంలో ఇండియన్ కెప్టెన్ రోహిత్ శర్మ ట్వీట్ చేసిన ఆ భావోద్వేగం ద్రవిడ్ గొప్పతనాన్ని కొనియాడేదే.

ఒక క్రికెటర్ గా.. మిస్టర్ వాల్ గా భారత క్రికెట్ జర్నీలో రాహూల్ ద్రవిడ్ పాత్ర ఎప్పటికీ ఓ తీపి జ్ఞాపకం. తాను టెస్టులాడిన తొమ్మిది దేశాలైన ఇంగ్లాండ్, వెస్ట్ ఇండీస్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, జింబాబ్వే, పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్ పైనా సెంచరీలు బాదిన ఒకే ఒక్క క్రికెటర్ రాహూల్ ద్రవిడ్. భారత్ నుంచి మూడోస్థానంలో వచ్చి.. 28 సెంచరీలు, 50 హాఫ్ సెంచరీలతో కలిసి టెస్టుల్లో అత్యధికంగా పదివేలకు పైగా పరుగులు సాధించిన ఆటగాడు. ఏ భారత ఆటగాడు ఈ ఫీట్ సాధించకపోగా… ప్రపంచంలో కుమార సంగక్కర తర్వాత ఆటగాడిగా ఈ రికార్డ్ తో ద్రవిడ్ రెండో స్థానంలో నిల్చాడు. మరో బ్యాట్స్ మ్యాన్ తో కలిసి 50 కంటే ఎక్కువ పరుగుల భాగస్వామ్యాన్ని 128 సార్లు.. వంద పరుగుల భాగస్వామ్యాన్ని 88సార్లు నెలకొల్పిన ఘనత కూడా ద్రవిడ్ పేరుమీదే ఉంది. అందరికన్నా ఎక్కువగా సచిన్ తో కలిసి 20 సెంచరీల పాట్నర్షిప్ కల్గి ఉన్నందుకో ఏమో.. ద్రవిడ్ ఒకానొక సందర్భంలో తనను ఏవిధంగా గుర్తుపెట్టుకోకపోయినా క్రికెట్ దేవుడు సచిన్ తో కలిసి ఆడిన క్రికెటర్ గానైనా తల్చుకుంటారంటూ కామెంట్ చేశాడు.

సిడ్నీలో ఆస్ట్రేలియాతో టెస్ట్ సీరీస్ లో 40 బాల్స్ ఆడి ఒక్క రన్ కూడా చేయని ద్రవిడ్.. 2007లోనూ పాకిస్థాన్ తో టెస్ట్ మ్యాచ్ లో 270 రన్స్ సాధించగా.. 12 గంటలపాట క్రీజులో నిల్చాడు. ప్రపంచంలోని పదిమంది జిడ్డు ఆటగాళ్లల్లో పటౌడీ, రాజేష్ చౌహాన్ తో పాటు.. మన ఇండియన్ క్రికెటర్ గా ద్రవిడ్ పేరు కూడా ఉండటం విశేషమే. ఎందుకంటే.. టెస్ట్ క్రికెట్ లో సమయం, వికెట్సే ముఖ్యం. అలా, 2007లో ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ టెస్ట్ సీరీస్ మ్యాచులో 140 బాల్స్ ఆడి కేవలం 12 రన్స్ మాత్రమే చేసిన ఘనుడు మన ద్రవిడుడు. అందుకే అలా ఇండియన్ వాల్ గా రాహూల్ ద్రవిడ్ పేరు స్థిరపడిపోయింది.

అయితే, తన బ్యాటింగ్ లో ఎంత ఓర్పో.. తన జీవితంలోనూ అంతే సహనశీలి అనేది ఆయన జర్నీ చూస్తే అర్థమయ్యే విషయం. సచిన్, గంగూలీ, సెహ్వాగ్.. ఎవరితోనైనా తాను పెద్దపెద్ద భాగస్వామ్యాల్లో భారీ స్కోర్స్ సాధించినా… తన సహచరుల స్కోర్ డామినేషన్ తో ఓ నీడలా మిగిలిపోయాడు. స్వభావసిద్ధంగా కూడా పెద్దగా ఎక్స్ పోజర్ కోరుకోని గుణం, లక్షణమే రాహూల్ ద్రవిడ్ కు.. మిగిలిన క్రికెటర్స్ తో పోలిస్తే ప్రచారంలోకి రావడానికి అడ్డంకి. అయితే, ఆ నిరాండంబరత్వమే రాహూల్ ను మిగిలిన క్రికెటర్స్ తో భిన్నంగానూ నిలబెట్టింది.

భారత క్రికెట్ నుంచి రిటైర్డయ్యాకే తనకు భారత క్రికెట్ జట్టు కోచ్ గా పదవీ, బాధ్యతలు చేపట్టే అవకాశాలు వచ్చినా అటువైపుగా వెళ్లలేదు. వెళ్లి ఉంటే ఇవాళ అద్భుతాలు సృష్టిస్తున్న భారత క్రికెట్ కుర్రాళ్లు సంజూశాంసన్, ఇషాన్ కిషన్, రిషబ్ పంథ్, ఆవేశ్ ఖాన్, శుభమన్ గిల్, అభిషేక్ శర్మ, పృథ్వీషా, శ్రేయాస్ అయ్యర్, వాషింగ్టన్ సుందర్ వంటివాళ్లను బహుశా మనం చూసి ఉండకపోయేవారమేమో?! అండర్ 19 జట్టు కింద వీరందరినీ జాతిరత్నాలుగా మార్చింది అండర్ 19 కోచ్ ద్రవిడే. ఇండియన్ క్రికెట్ జట్టు కోచ్ గా అప్పటికప్పుడు బాధ్యతలు చేపట్టడం కంటే కూడా… భవిష్యత్ భారత క్రికెట్ కు కొదవలేకుండా యువక్రికెటర్లను తీర్చిదిద్దాలన్న సంకల్పంతో.. ఒక ముందుచూపుతో వ్యవహరించిన నిజమైన దేశప్రేమికుడు రాహూల్ ద్రవిడ్.

తాను 2003 వరల్డ్ కప్ టీమ్ లో ఒక అత్యున్నత ఆటగాడిగా ప్రాతినిథ్యం వహించినా.. సాధించలేకపోయానన్న భావన, బాధ రాహూల్ ను ఎక్కడో ఓమూల వెంటాడుతుంటే… దానికి పరిహారం 2024 టీ 20 వరల్డ్ కప్ సాధనతో తీరిపోయింది. రాహూల్ మధ్యప్రదేశ్ వాసి. కానీ, జీవితంలో పెరిగిన అనుభవమంతా బెంగళూర్ తోనే కావడంతో.. అక్కడి క్రికెట్ అకాడమీకి వచ్చినప్పుడు అతనికి లభించిన ఘనస్వాగతం, గౌరవం యావత్ దేశాన్నీ భావోద్వేగానికి గురిచేసింది.

ద్రవిడ్ ఇండియన్ కోచ్ గా బాధ్యతలు చేబూనాక.. బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీ కైవసం చేసుకోవడం నుంచి ద్వైపాక్షిక సీరీసుల్లో భారత్ వరుస విజయాలు సాధించింది. చారిత్రాత్మక ఆసియా కప్ విజయం నుంచి మొన్నటి 2024 టీ 20 ప్రపంచకప్ వరకూ రాహూల్ ఓ మెంటార్ గా, కోచ్ గా పోషించిన పాత్రతో పాటు, టీ 20 విజయం.. గతంలో నీడచాటున కనిపించకుండా పోయిన ద్రవిడ్ పేరును మార్మోగించింది. టెస్టుల్లో, వన్డేల్లో, టీ20ల్లో ఇలా మూడు ఫార్మాట్లలో ఇండియాను తన కోచింగ్ సారథ్యంలో నంబర్ వన్ టీమ్ గా నిలబెట్టాడు రాహూల్.

ఎవరమైనా ఓరోజు వెళ్లిపోయేవాళ్లమే. ఏదీ శాశ్వతం కాదు. రాహూల్ ద్రవిడ్ కూడా.. తన కోచ్ పదవి నుంచి అలా నిష్క్రమించడం ఒకింత బాధే! మిగతా కోచుల్లోనూ ఆయన పనితీరు నిత్యం రగిలించే స్ఫూర్తి అయితే మాత్రం.. ఇండియాకు అంతకన్నా కావల్సిందేముంది..?

పద్మశ్రీ, పద్మభూషణ్ వంటి అత్యున్నత పురస్కారాలందుకున్న ద్రవిడ్.. భారతరత్నకు నిజమైన అర్హుడు. ద్రవిడ్ వంటి క్రీడాకారుడికి అది అందితే యావత్ క్రీడాలోకం హర్షిస్తుంది. లేకపోయినా, ద్రవిడ్ భారతరత్నమే!

తన క్రీడా నైపుణ్యంతో ఓ దార్శనికుడిగా రాహూల్ ద్రవిడ్ రాసిన స్క్రిప్ట్.. భారత క్రికెట్ చరిత్రలో ఓ సువర్ణాధ్యాయం.

A TROPHY CARRIES DUST. MEMORIES LAST FOREVER – MARY LOU RETTON ( AMERICAN JIMNAST)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles