నేను ఆయనకు కేవలం తబలా మాత్రమే తయారు చేసిచ్చాను.. అందుకాయన నా జీవితాన్నే తీర్చిదిద్ది, ఓ కొత్త రూపునిచ్చాడు… ఇవీ మేస్ట్రో జాకీర్ హుస్సేన్ గురించి ఆయన తబలా తయారీదారు హరిదాస్ వట్కర్ చెప్పిన మాటలు.
ఇకముందు అన్ని సూచనలు, సలహాలతో ఏకాగ్రతతో తయారుచేసిన ఆ తబలా తయారీ నేను చేయకపోవచ్చు. అది జాకీర్ హుస్సేన్ సాబ్ తోనే అంతమైపోయిందంటూ… ఆ పద్మవిభూషణుడికి శ్రద్ధాంజలి ఘటిస్తూ జాకీర్ హుస్సేన్ పట్ల ఆరాధనతో హరిదాస్ వట్కర్ వ్యక్తం చేసిన ఆవేదన.

జాకీర్ హుస్సేన్ తండ్రి అల్లారఖా ఖాన్ కోసం మొదట తబలాలు తయారు చేసిన్నాట్నుంచి… ఆ కుటుంబంతో నా పరిచయం కొనసాగుతోంది. 1998 నుంచి జాకీర్ సాబ్ కోసం తబలాల తయారీ మొదలుపెట్టాను. అప్పట్నుంచీ మా బంధం అవినాభావ సంబంధంగా మారిందంటూ ఆ వాద్యకారుడితో తనకున్న జ్ఞాపకాలను విషాదవదనంతో గుర్తు చేసుకున్నాడు 59 ఏళ్ల హరిదాస్ వట్కర్.
తన 73 ఏళ్ల వయస్సులో ఈ లోకం నుంచి.. ఎల్లలులేని తన సంగీతాభిమానులను వదలివెళ్లిన జాకీర్ హుస్సేన్ ను ఈ ఏడాది ఆగస్టులో ముంబైలోని కంజూర్ మార్గ్ లోని తన వర్క్ షాపులో కలిసిందే చివరిసారంటూ కంటతడి పెట్టాడు.
తాను తయారుచేసిన తబలా.. అంత సృజనాత్మక శబ్దతరంగమై… వీనులవిందు చేసిందంటే.. తయారీదారునైన తనకంటే ఆ గొప్పదనం ముమ్మాటికీ జాకీర్ సాబ్ దే… ఇదీ వట్కర్ మాట. సరిగ్గా గురుపూర్ణిమ రోజు తన అభిమానుల మధ్య చివరిసారిగా కలిశాక.. ఓ రెండు గంటల సమయం ఆయనతో తన ఇంట్లో గడిపానంటూ తన తయారీ నైపుణ్యానికి ఎల్లలు లేని కీర్తి తెచ్చిన జాకీర్ సాబ్ కళ గురించిన బావోద్వేగం వట్కర్ మాటల్లో అణువణువూ కనిపించింది.
పశ్చిమ మహారాష్ట్రలోని మిరాజ్.. తబలా తయారీదారులకు ఫేమస్ స్పాట్. అలాంటిచోట… తయారీలో ప్రత్యేకతలతో, నైపుణ్యంతో… ప్రముఖ తబలా కళాకారులెందరికో తబలాలు తయారుచేసే హరిదాస్ వట్కర్… టాప్ మోస్ట్ కస్టమర్స్ లో జాకీర్ హుస్సేన్ ది మరింత ప్రత్యేక స్థానం. జాకీర్ సాబుకు తబలా ఏ శృతిలో ఉండాలి… అది తనకు ఎప్పటివరకూ కావాలి… ఎలా కావాలి అనే అంశాలపై స్పష్టత ఉండేదంటాడు. గత రెండు దశాబ్దాలుగా జాకీర్ హుస్సేన్… తబలా తయారీదారుడైన హరిదాస్ వట్కర్ మధ్య బంధం కొనసాగుతోంది. ఎన్ని తబలాలు మీరు తయారు చేసి ఇచ్చి ఉంటారన్న ప్రశ్నకు.. ఆ లెక్క కచ్చితంగా చెప్పలేను కానీ.. ఎన్నో చేశాను.. అందులో తాననుకున్న విధంగా చేయలేనివాటిని తన దగ్గరే వదిలిపెట్టారంటాడు వంశపారపర్యంగా తబలాలు తయారు చేస్తున్నవారిలో మూడో తరానికి చెందిన వట్కర్.
హుస్సేన్ సాబుకు కొత్త తబలాల తయారీతో పాటు, ఆయన వద్దనుండే పాత తబలాల రిపేర్ కూడా తానే చేసేవాడినని… ఒక తబలా తయారీదారుగా ఆయనవల్లే తన ఖ్యాతి మరింత ఇనుముడించిందంటున్నాడు ఈ హరిదాస్. తనకు నేను కేవలం తబలా తయారుచేసిస్తే… తను తనకు కొత్త జీవితాన్ని ఇచ్చాడంటూ కన్నీరు పెట్టుకున్నాడు.
రెగ్యులర్ గా తమతో ఫోన్ కాల్స్ లోనో, నేరుగానో కలవనప్పటికీ… తబలా తయారీ అవసరమైనప్పుడల్లా తమనే సంప్రదించేవారనే హరిదాస్ వట్కర్ కుటుంబమంతా తబలా తయారీదారులే. తాత కేరప్ప రామచంద్ర వట్కర్, తండ్రి రామచంద్ర కేరప్ప వట్కర్ ఇద్దరూ కూడా తబలా తయారీదారులే కాగా.. వంశపారంపర్యంగా వస్తున్న ఆ సంప్రదాయం ఇప్పుడు తన కుమారులు కిషోర్, మనోజ్ కు కూడా అంటింది. దాంతో వారూ ఇప్పుడు మిరాజ్ లో ప్రముఖ తబలా తయారీదారులుగా పేరుగాంచారు.
హరిదాస్ చిన్నవయస్సులోనే తబలా తయారీ కళలో నిష్ణాతుడయ్యాడు. 1994లో ముంబైకి వచ్చి.. హరిభావ్ విశ్వనాథ్ అనే ఓ ప్రముఖ కంపెనీలో తబలా తయారీదారుగా పనినారంభించాడు.

మూడేళ్లకే తబలా వాయించి.. ఏడేళ్లకే కచేరీ చేసి.. 12 ఏళ్లకే అంతర్జాకతీయ యనవనికపై అడుగిడిన జాకీర్ శైలి.. నిత్య విద్యార్థిత్వం. ఎప్పుడూ నేర్చుకోవడమే కొత్త సొబగులకు, సృజనాత్మకతకు అవకాశం కల్పిస్తుందని నమ్మేవాడు. తాను తన పరిణతితో సంతృప్తి చెందినప్పటికీ… తాను నేర్చుకోవాల్సినవెన్నో ఉన్నాయని.. తనకంటే బాగా వాయించేవారిని చెప్పగలరా అంటే ఓ పదిహేను మంది పేర్లు తడుముకోకుండా చెప్పగలననీ చెప్పేవాడు జాకీర్ హుస్సేన్.
హిందుస్థానీ క్లాసికల్ మ్యూజిక్, జాజ్ ఫ్యూజన్ లో ఉవ్వెత్తున ఎగిసిపడ్డ తబలా తరంగం జాకీర్ హుస్సేన్.
సాయిపరంజంపే దర్శకత్వంలో వచ్చిన SAAZ సినిమాలో షబానా అజ్మీ, అరుణా ఇరానీతో కలిసి కనిపించిన జాకీర్ హుస్సేన్.. ఆ సినిమాకు యశ్వంత్ డియో, భూపేన్ హజారికా, రాజ్ కమల్ తో కలిసి సంగీతాన్నీ అందించారు. నాల్గుసార్లు గ్రామీ అవార్డ్స్ అందుకున్న జాకీర్ హుస్సేన్ ఏడుసార్లు నామినేట్ అయ్యాడు. 2024లోనూ యాజ్ వియ్ స్పీక్ కు గాను బెస్ట్ కాంటెంపరరీ ఇన్స్ట్రుమెంటల్ ఆల్బమ్ విభాగంలో, దిస్ మూమెంట్ కు బెస్ట్ గ్లోబల్ మ్యూజిక్ ఆల్బమ్ విభాగంలో, పాష్ఠోకు బెస్ట్ గ్లోబల్ మ్యూజిక్ పెర్ఫార్మెన్ విభాగంలో ఏకంగా మూడు అవార్డ్ అందుకున్నాడు జాకీర్ హుస్సేన్.
2009 తర్వాత ఏకంగా 2024లో మూడు గ్రామీ అవార్డ్స్ అందుకోవడంపై జాకీర్ హుస్సేన్ ఏమంటారంటే.. అవార్డ్స్ మన పనితీరుకు గీటురాళ్లు.. లేదంటే, ఈ సమయానికి తనకు దక్కాల్సింది లైఫ్ టైం అఛీవ్ మెంటే కదా అంటూ సరదాగా సమాధానమిచ్చారట. భారతదేశ అత్యున్నత పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ వంటివే కాకుండా… అంతర్జాతీయంగా జాకీర్ హుస్సేన్ అందుకున్న అవార్డుల సంఖ్య… ఆయన ప్రతీ కాన్సర్ట్ లో అభిమానుల నుంచి అందుకునే అప్లాజ్ తో పోటీ పడేది.
అలాంటి జాకీర్ హుస్సేన్ కు తాను తబలా తయారీదారుగా ఉండటమంటే ఈ జీవితానికింకేవాలంటాడు హరిదాస్ వట్కర్.
లయ తప్పిన తబలాపై విషాదగీతిక వినిపిస్తూ… శాన్ ఫ్రాన్సిస్కోలో ఊపిరితిత్తుల సంబంధింత వ్యాధితో కన్నుమూసి… ఆకాశాన ధృవతారగా నిల్చిపోయిన ఉత్తుంగ తరంగం జాకీర్ హుస్సేన్ కు బాతాఖానీ అందిస్తున్న కన్నీటి నివాళి ఇది.



