తల్లిని కోల్పోయినా… తడబడని అడుగు!

22 ఏళ్లకే సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ గా… నాసిన్ కుమార్ నిశాంత్! దుఖం నుంచి విజయం వరకూ… ఓ గెలుపు కథ!

……………………………………………………………………………………………………………………………………………..

The inspiring journey of Bihar’s Nasin Kumar Nishant!

తొవ్వే లేదు. అంతా అగాథమే. అయితేనేం తానే తొవ్వేర్పాటు చేసుకున్నాడు. జీవితంలో కొన్ని విజయాలు మార్కుల వల్ల రావు. కొన్ని గెలుపుల వెనుక కనిపించని కన్నీళ్లుంటాయి. కొన్ని సాధించేందుకు కుంగదీసే పరిస్థితులను ఎదురొడ్డి జయించాల్సి ఉంటుంది. ఇక నీవల్ల కాదు అని చెప్పే విధినెదిరించి జయించే ఒక నిశ్శబ్ద సమాధానం ఆ తర్వాత యావత్ సమాజాన్నే నివ్వెరపరుస్తుంది.

22 ఏళ్లకే బీహార్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పరీక్ష పాసై సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ గా ఎంపికైన పిన్న వయస్కుడు నాసిన్ కుమార్ నిశాంత్. తల్లి మరణం కృంగదీసింది. ఆమె మృతితో జీవితమే ఛిన్నాభిన్నమైంది. సీతామడి జిల్లాలోని పుప్రీలో పాఠశాల విద్యను అభ్యసించిన నిశాంత్ చిన్నప్పట్నుంచే చదువుల్లో మంచి ర్యాంకర్. కానీ, చదువుకుంటున్న ఆ యువకుడి యవ్వనంలో.. సరిగ్గా 20 ఏళ్ల వయస్సులో తల్లి చనిపోయింది. ఇంట్లో విషాదం. ఇంకోవైపు, కుటుంబ బాధ్యతలు. మరోవైపు, తన భవిష్యత్తుపై ప్రశ్నలు. చుట్టుపక్కల వాళ్ల మాటలు, విమర్శలు బోనస్. అయినా నిశాంత్ వెనక్కి తగ్గలేదు. బాధను తన లక్ష్యానికి అడ్డుగా కాకుండా.. ముందుకు నడిపించే చోదకశక్తిగా మార్చాడు.

డబ్బుల్లేవు.. కలలు మాత్రం పెద్దవి!

ఐఐటీ చదువు కోసం కోటాకు వెళ్లిన సమయంలో ఆర్థిక ఇబ్బందులు కూడా ఎదుర్కొన్నాడు. కోచింగ్ ఫీజ్ సుమారు 76 వేలు. కుటుంబ పరిస్థితుల కారణంగా తన దగ్గర ఉన్నది కేవలం 35 వేలు మాత్రమే. అప్పుడతను కోచింగ్ సంస్థ నిర్వాహకులను సంప్రదించాడు. తన పరిస్థితి వివరించాడు. తాను పదో తరగతిలో సాధించిన మార్కులు చూపించి.. తన ప్రతిభకు ఓ అవకాశంగా తనకు స్థానం కల్పించాలని కోరాడు. అలా చేస్తే ఐఐటీ సాధించి చూపుతానని నమ్మకం కల్పించాడు.

కోటాలో పెట్టిన పరీక్ష!

సరే నువ్వు ప్రతిభావంతుడివంటున్నావు కదా.. నీకో పరీక్ష పెడతాం పాస్ అయితే నీకు అవకాశం కల్పిస్తామన్నారు కోటా నిర్వాహకులు. 200 మార్కులు వస్తే ఫీజ్ తగ్గిస్తామన్నారు. నిశాంత్ ఏకంగా 211 మార్కులు సాధించాడు. దాంతో నిశాంత్ ప్రతిభను గుర్తించి.. అదే సమయంలో అతడి పేదరికాన్ని అర్థం చేసుకుని అవకాశం కల్పించారు కోటా నిర్వాహకులు.

ఐఐటీ తర్వాత మరో దారిలో ప్రయాణం!

ఐఐటీలో ఇంజనీరింగ్ తర్వాత కార్పోరేట్ ఉద్యగం చేస్తే లక్షలు సంపాదించొచ్చు. ఆ అవకాశం నిశాంత్ కు ఉంది. కానీ, నిశాంత్ లక్ష్యం వేరే ఉంది. ప్రజాసేవలోకి వెళ్లాలన్నదే ఆ ఆలోచన. అలా బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షకు సిద్ధమయ్యాడు. అది కూడా సులభమైన ప్రయాణమేం కాదు. ఓవైపు కుటుంబ బాధ్యతలు, ఇంకోవైపు గతంలో ఎదురైన కష్టాలు, మరోవైపు తనపై ఉన్న అంచనాలు.. ఇలా సవాళ్లన్నీ ముప్పేట దాడి చేస్తున్న కాలమది. అయినా పట్టు వదలని విక్రమార్కుడిలా చదువు మాత్రం ఆపలేదు.

తొలి ప్రయత్నంలోనే ఊహించని ఫలితం!

నిశాంత్ కష్టానికి తొలి ప్రయత్నంలోనే ఫలితం లభించింది. 140 వ ర్యాంక్ సాధించాడు. 64వ బీహార్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ పరీక్షలో తొలిసారే అద్భుతమైన ఫలితాన్ని సాధించిన నిశాంత్ 22 ఏళ్ల వయస్సుకే సబ్ డివిజన్ మేజిస్ట్రేట్ గా ఎంపికై బాధ్యతలు చేపట్టాడు.

ఆర్థిక ఇబ్బందులతో కోచింగ్ ఫీజ్ కోసం పోరాటం చేసిన యువకుడు, తల్లిని కోల్పోయిన బాధను దిగమింగుకుని చదివిన కుర్రాడు, తన సామర్థ్యాన్ని వెక్కిరించిన వారి మధ్యే ఎదిగిన బాలుడు, చివరకు అదే సమాజం ముందు అధికారై నిల్చున్నాడు.

విజయమంటే ఉద్యోగం మాత్రమేనా..?

నిశాంత్ కథలో ఆకట్టుకునే ఎండ్ సబ్ డివిజన్ మేజిస్ట్రేట్ పదవి కావచ్చుగానీ… కష్టాలు వచ్చినప్పుడు తలవంచకుండా, చాలామందిలా లక్ష్యాన్ని మార్చుకోకుండా.. ఇది నావల్ల కాదనుకోకుండా శక్తివంచన లేకుండా ఓ ఛాలెంజ్ గా తీసుకుని ఎదిగిన తీరు మరింత ఆకట్టుకునేది.

మొత్తంగా తల్లిని కోల్పోయిన బాధ అతణ్ని ఆపలేదు, డబ్బు కొరత అడ్డుకోలేదు, కుటుంబ బాధ్యతలు అడ్డుకట్ట వేయలేదు, ఇతరుల మాటలు ఆపలేకపోయాయి.. దాంతో అతడు సాధించింది ఓ అధికారిగా పెద్ద ఉద్యోగమే కాదు… తనపై తనకున్న నమ్మకానికి ఓ అధికారిక ముద్ర అది.

కన్నీళ్ల మధ్య కూడా కలను కాపాడుకుంటే.. ఎన్నడో ఓరోజు ఆ కలే మన జీవితానికి దారి చూపుతుందనే ఒక మెస్సేజ్ నాసిన్ కుమార్ నిశాంత్ కథలో కనిపిస్తుంది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe

Latest Articles