దానం అనర్హత… వాట్ నెక్స్ట్..?

హైకోర్టు తీర్పుతో అసలు లీగల్ ఫైట్ ఇప్పుడే మొదలైందా..?

తెలంగాణా హైకోర్ట్ ఒక సంచలనమైన తీర్పు వెల్లడించింది. స్పీకర్ తగిన ఆధారాలు లేవంటూ తీసుకున్న నిర్ణయాన్ని పక్కనబెట్టి… దానం నాగేందర్ పై అనర్హత వేటు వేసింది. మరి నాగేందర్ సుప్రీం కోర్టుకు వెళ్లొచ్చా..? ఏం జరుగనుంది..?

గతంలోనూ తెలంగాణ రాజకీయాల్లో పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యేల పార్టీ మార్పులు, విలీనాలపై వివాదాలు రావడం.. ఇప్పుడు ఈ ఫిరాయింపుల వ్యవహారంలో రాజకీయ వాదనలకు కారణమైంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకొచ్చాక కూడా దానం నాగేందర్ తో పాటు.. మరో తొమ్మిది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ తో కలిసి పనిచేయడంతో బీఆర్ఎస్ అనర్హత వేటు వేయాలని డిమాండ్ చేస్తోంది.

గతంలోనూ తెలంగాణలో ఇతర పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్‌లో చేరారు. 2019లో 18 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో 12 మంది బీఆర్ఎస్ శాసనసభా పక్షంలో విలీనమయ్యారు. రెండింట మూడొంతు సభ్యుల మద్దతుతో జరిగిన ఈ విలీనాన్ని పదో షెడ్యూల్‌లోని మెర్జ్ ప్రొవిజన్ కింద స్పీకర్ గుర్తించారు. ఇప్పుడు బీఆర్ఎస్ కూడా గతంలో జరిగిన ఇలాంటి విలీనాలను ప్రస్తావిస్తూనే.. ప్రస్తుత ఫిరాయింపుల వ్యవహారంలో ఈ ప్రమాణాలెక్కడున్నాయో చూపించాలని ప్రశ్నిస్తోంది.

ఈ క్రమంలో దానం నాగేందర్ విషయంలో విచారణ చేపట్టిన స్పీకర్ తగిన ఆధారాల్లేవంటూ పిటిషన్ కొట్టేయడంతో.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డితో పాటు.. బీజేపీ శాసనసభా పక్ష నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి హైకోర్ట్ తలుపు తట్టారు.

ఇప్పుడు తెలంగాణా హైకోర్ట్ స్పీకర్ నిర్ణయాన్నే పక్కనబెట్టింది. ఖైరతాబాదా ఎమ్మెల్యే దానం నాగేందర్ ను అనర్హుడిగా ప్రకటించింది. 2024 ఏప్రిల్ 23 నుంచే ఆయన అనర్హత వర్తిస్తుందనీ చెప్పింది.

మరి ఇదే తుది తీర్పా..? దానంకు ఇంకా లీగల్ గా ప్రోసీడ్ అయ్యేందుకు మార్గాలేమైనా ఉన్నాయా..? దానం తరపున ఇతర పక్షాలు సుప్రీంను ఆశ్రయించొచ్చా..? ఇదే ఇప్పుడు మరో ప్రశ్న..?

అసలు వివాదం ఎక్కడ మొదలైంది..?

2023 తెలంగాణా అసెంబ్లీ ఎన్నికల్లో దానం నాగేందర్ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఖైరతాబాద్ నుంచి గెలిచారు. కానీ, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకొచ్చింది. దాంతో కాంగ్రెస్ తో రాజకీయంగా అనుసంధానమైన దానం నాగేందర్.. 2024 లోక్ సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగారు. అయితే, తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి… బీఆర్ఎస్ కు రాజీనామా చేసి తాను బరిలోకి దిగి ఉంటే ఇంత రాజకీయ కథ ఉండేది కాదు.
దానం నాగేందర్ మరో పార్టీ అభ్యర్థిగా లోక్ సభ ఎన్నికల్లో నిలబడటమంటే.. ఆయన అప్పటికే ఉన్న మరో పార్టీకి చెందిన సభ్యత్వాన్ని స్వచ్ఛందంగా వదులుకున్నట్టే అన్నది పిటిషనర్స్ వాదన. 2024 ఏప్రిల్ 23న కాంగ్రెస్ అభ్యర్థిగా లోక్ సభ నామినేషన్ దాఖలు చేసిన తేదీనే ఈ ఫిరాయింపుల వ్యవహారంలో కీలకంగా మారింది.

మరి దానం వాదనేంటి..? స్పీకర్ ఏం చెప్పారు..?

దానం నాగేందర్ మాత్రం తాను బీఆర్ఎస్ కు రాజీనామా చేయలేదని.. తనను పార్టీ నుంచి తొలగించలేదనీ వాదించారు. స్పీకర్ కూడా మార్చ్ 11, 2026న తగిన ఆధారాలేవీ లేవన్న కారణంతో దానం నాగేందర్ అనర్హత పిటిషన్ ను తిరస్కరించారు.

హైకోర్ట్ స్పీకర్ నిర్ణయాన్ని ఎలా కొట్టేసింది..?

ఇదే ఈ కేసులో కీలకమైన లీగల్ పాయింట్!

రాజ్యాంగంలోని పదో షెడ్యూల్ ప్రకారం పార్టీ ఫిరాయింపులపై అనర్హత నిర్ణయించే అధికారం మొదట స్పీకర్ కే ఉంటుంది. కానీ, స్పీకర్ నిర్ణయమే అంతిమం కాదు.

1992లో కిహోటో హొల్లోహాన్ తీర్పు ప్రకారం… స్పీకర్ పదో షెడ్యూల్ కింద తీసుకునే నిర్ణయాలు న్యాయసమీక్షకు లోబడి ఉంటాయని సుప్రీంకోర్ట్ స్పష్టం చేసింది. 2025లో తెలంగాణలో ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులకు సంబంధించిన కేసులోనూ సుప్రీంకోర్టు కూడా ఇదే న్యాయసూత్రాన్ని స్పష్టం చేసింది. స్పీకర్ నిర్ణయం అంతిమం కాదన్నట్టు. కోర్ట్ సమీక్షకూ అతీతం కాదన్నట్టు. అందుకే దానం కేసులో స్పీకర్ నిర్ణయాన్ని హైకోర్ట్ పరిశీలించింది.

మరి దానం ఏం చేయొచ్చు..?

అయితే, దానంకు సుప్రీం కోర్టును ఆశ్రయించే అవకాశమూ ఉంది. ఎందుకంటే హైకోర్ట్ తీర్పుతో న్యాయపోరాటం పూర్తిగా ముగిసిపోయిందని చెప్పలేం. కాబట్టి దానం సుప్రీం తలుపు తట్టే అవకాశాల్లేకపోలేదు.

సాధారణంగా రాజ్యాంగంలోని ఆర్టికల్ 136 కింద స్పెషల్ లీవ్ పిటిషన్ ద్వారా సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చంటున్నారు న్యాయనిపుణులు. మరి కేసును విచారణకు స్వీకరించడమా, లేదా అన్నది సుప్రీం విచక్షణపై ఆధారపడి ఉంటుంది.

సుప్రీం కోర్టుకు వెళ్లితే… హైకోర్ట్ తీర్పుపై స్టే పొందొచ్చా..?

అప్పీల్ లేదా ఎస్ఎల్పీ దాఖలు చేసినంత మాత్రాన… హైకోర్ట్ తీర్పు ఆటోమేటిక్ గా నిల్చిపోదు. అయితే, దానం తరపు న్యాయవాదులు సుప్రీంకోర్టును ఆశ్రయించి.. హైకోర్ట్ తీర్పు అమలుపై మాత్రం మధ్యంతర ఉత్తర్వులు కోరవచ్చు. సుప్రీంకోర్ట్ ఏం ఆదేశిస్తుందన్నదే.. ఆ తర్వాత పరిణామాలను నిర్ణయిస్తాయి.

మరి స్పీకర్ మళ్లీ రంగంలోకి దిగొచ్చా..?

స్పీకర్ కు పదో షెడ్యుల్ కింద అనర్హత పిటిషన్లను నిర్ణయించే రాజ్యాంగపరమైన అధికారముంది. కానీ, స్పీకర్ తగిన ఆధారాలు లేవన్న నిర్ధారణను హైకోర్టు పక్కనబెట్టింది. కాబట్టి, ఇక స్పీకర్ హైకోర్ట్ తీర్పును తిరగరాయడం జరుగదు. తర్వాత పరిణామాలన్నీ ప్రధానంగా న్యాయపరమైన మార్గంలో ఎదుర్కోవాల్సిందే. సుప్రీంకోర్ట్ హైకోర్ట్ తీర్పును కొట్టేసినా, మార్చినా, స్టే ఇచ్చినా మరోవిధంగా ఈ కేసు ముందుకెళ్లే అవకాశముంటుంది.

ఫిరాయింపుల వ్యవహారం కేవలం పొలిటికల్ ఫైట్ గా మిగిలిపోతుందా..?

రాజకీయంగా ఇది ఇప్పటికే పెద్ద చర్చగా మారింది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వెళ్లిన ఇతర ఎమ్మెల్యేలపై కూడా అనర్హత పిటిషన్స్ దాఖలైనాయి. దానం కేసు తీర్పు తర్వాత ఆ కేసులపై కూడా రాజకీయంగా, న్యాయపరంగా చర్చలు పెరుగొచ్చు. కానీ, దానం కేసు తరహాలోనే మిగిలిన ప్రతీ ఎమ్మెల్యేపై ఇదే తరహా తీర్పులుంటాయనుకోవడానికి వీల్లేదు. ప్రతీ కేసులోనూ ఆయా వ్యక్తుల చర్యలు, ఆధారాలు, పార్టీ సభ్యత్వం, పిటిషన్ లోని అంశాలు, స్పీకర్ నిర్ణయం వంటి అంశాలను విడిగా పరిశీలించాల్సి ఉంటుంది.

దేశంలో ఇలాంటి కేసులు ఎందుకు సంచలనంగా మారుతున్నాయి..?

పార్టీ ఫిరాయింపులపై స్పీకర్ నిర్ణయం, న్యాయసమీక్ష అనే అంశం భారత రాజకీయాల్లో చాలాకాలంగా చర్చల్లో ఉన్నదే.

కిహోటో హోలోహాన్ కేసు స్పీకర్ నిర్ణయాలపై న్యాయ సమీక్షకు కీలక పునాది వేసింది. మహాచంద్ర ప్రసాద్ సింగ్ కేసులో శాసనసభ్యుడు సభ వెలుపలి ప్రవర్తన కూడా ఇక్కడ చర్చకొచ్చేది. పార్టీ సభ్యత్వాన్ని స్వచ్ఛందంగా వదులుకున్నాడా అనే ప్రశ్న ఇక్కడ పరిగణనలోకి తీసుకోవచ్చనే న్యాయసూత్రాలు చర్చకొచ్చాయి. ఈ కేసునే దానం నాగేందర్ వ్యవహారంలో పిటిషనర్స్ తరపు న్యాయవాదులు ఆధారంగా ప్రస్తావించారు.

కర్నాటక ఎమ్మెల్యేల అనర్హత కేసుతో పాటు, మహారాష్ట్ర శివసేనను రెండు ముక్కలు చేసిన కేసుల్లో స్పీకర్ అధికారాలు, పార్టీ ఫిరాయింపులు, న్యాయ సమీక్ష వంటి అంశాలన్నీ సుప్రీంకోర్ట్ ముందుకొచ్చినవే.

మరి ఖైరతాబాద్ కు ఉపఎన్నిక తప్పదా?

ఇదే ఇప్పుడు రాజకీయంగా ఆసక్తికరమైన ప్రశ్న..? హైకోర్ట్ తీర్పే తుదిస్థాయిలో నిలబడితే ఎమ్మెల్యే సభ్యత్వం ఖాళీ అయ్యే రాజ్యాంగపరమైన పరిణామాలు తప్పవు. అప్పుడు ఉపఎన్నికా ముందుకు రావొచ్చు. కానీ, దానికి ముందు సుప్రీం తలుపు తట్టడం, అక్కడ జరిగే పరిణామాలను బట్టి ఇవన్నీ ముందుకెళ్తాయి.

మరి దానం కేసు చెబుతున్న పాఠమేంటి..?

దానం నాగేందర్ వ్యవహారం ఒక ఎమ్మెల్యే అనర్హతతో ముగిసే కథ కాదు. ప్రజాప్రతినిధి హక్కులు, స్పీకర్ అధికారాలు, న్యాయ సమీక్ష పరిధి వంటి కీలక రాజ్యాంగ అంశాలను మరోసారి చర్చకు తెచ్చే కేసు.

ఎమ్మెల్యేకు రాజకీయంగా హక్కులెలా ఉంటాయి… స్పీకర్ కు విచక్షణాధికారమెంత… కోర్టుకు న్యాయ సమీక్షా అధికారమెంత… ఇదిగో ఇలాంటివన్నీ పార్టీ ఫిరాయింపులను అడ్డుకునేందుకు ఉద్ధేశించిన పదో షెడ్యూల్ తో చర్చకొచ్చేవి.

కానీ, ఇలాంటి విషయాల్లో పూర్తిస్థాయి అమల్లోకి రావాలంటే.. స్పీకర్ నిర్ణయం, కోర్ట్ సమీక్ష, రాజకీయ వాస్తవాలు.. ఇలా ఇవన్నీ కలిసినప్పుడు విషయం సంక్లిష్టంగా మారుతుంది. అందుకు దానం నాగేందర్ కేసు ఓ ఉదాహరణ మాత్రమే.

మరి దానం తదుపరి అడుగులెటు..?

సుప్రీం కోర్ట్ తలుపు తట్టడమా… లేక, హైకోర్ట్ తీర్పును అంగీకరించడమా..? ఈ కేసులో హైకోర్ట్ తీర్పు తర్వాత ఇతర ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల కేసులపైనా రాజకీయల చర్చలు ఊపందుకున్నాయి. మరింత ఆసక్తిని రేకెత్తించేవిధంగా తెలంగాణాలో చర్చలకు తెరలేచినట్టే.

మొత్తంగా ఒక ఎమ్మెల్యే అనర్హత కేసు రాజ్యాంగం, రాజకీయాలు, న్యాయవ్యవస్థ మధ్య ఓ అగ్నిపరీక్షగా మారింది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe

Latest Articles