అలెగ్జాండర్ జ్వెరేవ్.. ఈ పేరొక వైబ్రేషన్!

ఓ చేతికి ఇన్సులిన్.. మరో చేతిలో రాకెట్!

ఏ ఆటగాడికైనా పోటీదారుడైన మరో ఆటగాడే ప్రత్యర్థి.. కానీ, జ్వెరేవ్ కు మధుమేహం అంతకుమించిన ప్రత్యర్థి.

శతాబ్దాల అంతర్జాతీయ వాణిజ్యానికి యూరప్ కు గేట్ వే టు ది వరల్డ్ గా నిలిచే జర్మనీలోని హాంబర్గ్ లో పుట్టాడు జ్వెరెవ్. చిన్న వయసులోనే టెన్నిస్ రాకెట్ పట్టిన అతను.. తన తండ్రి అలెగ్జాండర్ జ్వెరేవ్ సీనియర్‌ వద్ద శిక్షణ పొందాడు. తల్లితో పాటు, తమ్ముడు మిషా జ్వెరేవ్ కూడా ప్రొఫెషనల్ టెన్నిస్ ప్లేయర్సే. అంటే, జ్వెరేవ్ కు టెన్నిస్ కేవలం ఆట కాదు.. కుటుంబ జీవన విధానం.

జర్మనీకి చెందిన జ్వెరేవ్ చిన్న వయసులోనే టైప్-1 డయాబెటిస్‌కు గురయ్యాడు. జీవితాంతం ఇన్సులిన్‌పై ఆధారపడక తప్పని స్థితిలో పెరిగాడు. సాధారణ జీవనంలోనే అది ఒక సవాల్. కానీ ప్రొఫెషనల్ టెన్నిస్‌లో గంటల తరబడి శారీరక శ్రమ, ప్రయాణాలు, మ్యాచ్‌ల ఒత్తిడి మధ్య అదే వ్యాధితో ప్రపంచ స్థాయిలో ఆడటం మరింత పెద్ద సవాల్. వైద్యులు రాకెట్ వద్దని వారించారు. కానీ, బాల్యంలోనే రాకెట్ పై మనసు పారేసుకున్న జ్వెరేవ్ కు డాక్టర్ల మాటలు తలకెక్కలేదు. వెనక్కి తగ్గలేదు. జ్వెరేవ్ పట్టుదలకు మొదట్లో తల్లిదండ్రులు ఆందోళన చెందారు. కానీ తర్వాత్తర్వాత అదే పట్టుదల వారికి ముచ్చట గొలిపింది. ప్రోత్సాహం లభించింది.

యువ ఆటగాడిగా ఎదుగుతున్న కొద్దీ జ్వెరేవ్‌లోని శక్తేంటో వెలుగులోకి వచ్చింది. ఆరున్నర అడుగులకు పైగా ఉన్న ఎత్తు.. భారీ సర్వ్.. బలమైన రెండు చేతుల బ్యాక్‌హ్యాండ్.. కోర్టు వెనుక నుంచి ప్రత్యర్థిని ఒత్తిడిలోకి నెట్టే ఆట.. ఇవన్నీ జ్వెరేవ్ లో ప్రత్యేకతలు.

డయాబెటిస్‌ను దాటి.. టెన్నిస్ ప్రపంచాన్ని శాసించిన జ్వెరేవ్!

రాకెట్ పట్టిన చేతి.. నిత్యం ఇన్సులిన్ సూదులను కూడా ఎదుర్కోవాల్సిందే. టెన్నిస్ కోర్టులో ప్రత్యర్థితో పోరాడటం ఒకెత్తైతే.. తన శరీరంతోనే ప్రతిరోజూ పోరాడటం మరో ఎత్తు. అలెగ్జాండర్ జ్వెరేవ్‌ కథలోని ఈ రెండు భిన్న పార్శ్వాలే.. ఎంతో మంది తారలను చూసిన టెన్నిస్ ప్రపంచంలో తనకంటూ ఓ గుర్తింపును తెచ్చి పెట్టాయి.

2013 నుంచి ప్రొఫెషనల్ ఆటగాడిగా కెరీర్ మొదలు పెట్టిన జ్వెరేవ్.. తాను ఆటోగ్రాఫ్ తీసుకున్న ఫెదరర్ తోనే ఢీకొన్న సమయం అదో ఉద్విగ్న క్షణం. 2017లోనే ATP ర్యాంకింగ్స్‌లో టాప్-5 లోకి దూసుకెళ్లాడు. అదే ఏడాది ATP Finals టైటిల్ గెలిచి.. తన సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటాడు.

ఒలింపిక్స్ లోనూ స్వర్ణం సాధించిన ఘనుడు!

అలెగ్జాండర్ జ్వెరేవ్‌ ఒలింపిక్స్‌లోనూ స్వర్ణ పతకం సాధించాడు. 2020లో టోక్యోలో జరిగిన పురుషుల సింగిల్స్‌లో ఫైనల్లో కరెన్ ఖచనోవ్‌ను మట్టి కరిపించి బంగారు పతకాన్ని ముద్దాడాడు. సెమీఫైనల్ లో అప్పటి ప్రపంచ నంబర్ వన్ నోవాక్ జకోవిచ్‌ను ఓడించడం జ్వెరేవ్ స్పోర్ట్స్ హిస్టరీలో ఓ కీలక ఘట్టం.

గ్రాండ్ స్లామ్ జ్వెరేవ్ కల!

గ్రాండ్‌స్లామ్ కథ మాత్రం అంత సులభంగా సాగలేదు. 2020 US Open ఫైనల్‌లో డొమినిక్ థీమ్‌పై మొదటి రెండు సెట్లు గెలిచిన జ్వెరేవ్.. చివరికి టైటిల్‌ను కోల్పోయాడు. చేతిదాకా వచ్చిన గెలుపు జారిపోయింది. మళ్లీ మొదలుపెట్టాల్సిందే. కానీ, వెనుకడుగు వేయలేదు. 2022 ఫ్రెంచ్ ఓపెన్‌లో రఫెల్ నాదల్‌తో సెమీఫైనల్ ఆడుతున్నప్పుడు కూడా ఉద్వేగానికి గురయ్యాడు. కానీ ఆ గేమ్ లోనే జ్వెరేవ్ క మరో భారీ దెబ్బ తగిలింది. చీలమండకు గాయమై మ్యాచ్‌ మధ్యలోనే వదులుకోవాల్సి వచ్చింది. కోర్టు నుంచి వీల్‌చైర్‌లో బయటకు వెళ్లిన ఆ దృశ్యం.. పట్టుదలతో ప్రయత్నిస్తూ వచ్చిన తన కెరీర్‌లో అత్యంత కఠినమైన క్షణాల్లో ఒకటి.

కానీ, అక్కడితో కథ ముగియలేదు!

కానీ జ్వెరేవ్ మళ్లీ వచ్చాడు. గాయం నుంచి కోలుకున్నాడు. మళ్లీ ఉత్థాన స్థాయికి చేరుకున్నాడు. విమర్శలు, ఓటములు, గాయాలు, శారీరక పరిమితులు.. ఏవీ, అతన్ని ఆపలేకపోయాయి. అడ్డుకోలేకపోయాయి. 2026లో కెరీర్ తొలి గ్రాండ్ స్లామ్ ఫ్రెంచ్ ఓపెన్ గెలిచి.. తన చిరకాల కల నెరవేర్చుకున్నాడు. మూణ్నెల్లు తిరక్కుండానే యూఎస్ ఓపెన్ గెలిచి రెండో గ్రాండ్ స్లామ్ ను కైవసం చేసుకుని.. ప్రపంచమంతా తన గురించి మాట్లాడుకునేలా చేశాడు.

అందుకే జ్వెరేవ్ కథను.. కేవలం ఒక టెన్నిస్ స్టార్ కథగా చూడటం తక్కువే!

ఇది ఒక ఆటగాడు తన ప్రత్యర్థులతో మాత్రమే కాదు.. తన శరీరం విధించిన పరిమితులతో కూడా ఎలా పోరాడవచ్చో చూపించాడు. రాకెట్ ఓ చేతిలో.. ఇన్సులిన్ మరో చేతిలో. కోర్టులో ప్రతి పాయింట్ కోసం పోరాడుతూనే.. జీవితంలో ప్రతి రోజునూ గెలుచుకోవాలనే అతడి సంకల్పానికి ఓటమి తోకముడిచింది. .

అందుకే, టెన్నిస్ లో ఎందరో తారలున్నా.. అలెగ్జాండర్ జ్వెరేవ్‌ ఓ ధృవతాగా ఇప్పుడు వార్తల్లోకెక్కాడు. ఇది జ్వెరేవ్ సాధించిన ట్రోఫీల సంఖ్యా కథ కాదు.. ఓటమి తర్వాత కూడా మళ్లీ పడి లేచిన ఓ ఉత్తుంగ తరంగం స్ఫూర్తి కథ. కలలను నిజం చేయాలని పరితపించే ఓ రుషి.. యుద్ధం గెలవడం నేర్చుకున్న ఓ యోధుడి కథ.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe

Latest Articles