ట్రెండీ లుక్కులో కనిపించాలనుకునే యువతకు జావేద్ హబీబ్ అనే ప్రముఖ హెయిర్ స్టైలిస్ట్ పేరు తెలియదనుకోలేం. షారుక్ ఖాన్ మొదలు, ఐశ్వర్యారాయ్, ప్రియాంకాచోప్రా, కరీనా కపూర్ వంటి వారెందరికో హెయిర్ స్టైలిస్ట్ గా వ్యవహరించిన జావేద్ హబీబ్ సెలూన్స్ ఈ మధ్య మనకు ద్వితీయశ్రేణి నగరాలకూ విస్తరించాయి. ఈ క్రమంలో ఓసారి ఈ హెయిర్ స్టైలిస్ట్ వారసత్వమెలా కొనసాగిందో ఓసారి తెలుసుకుందాం. ది లల్లన్ టాప్ అనే పాడ్ కాస్ట్ షోలో జావేద్ ఈ వివరాలు వెల్లడించారు.
జావేద్ హబీబ్ హెయిర్ స్టైలిస్ట్ గా మారడం వారసత్వంగా కొనసాగుతోంది. తాత నజీర్ అహ్మద్ కూడా ఓ బార్బర్. రాష్ట్రపతి భవన్ లో పనిచేసేవారు. తన తాత తండ్రి జవహర్ లాల్ నెహ్రూకూ హెయిర్ కట్ చేసేవారని చెప్పుకొచ్చారు జావేద్.
1935లో రాష్ట్రపతి భవన్ లో తన తాత తండ్రి పని ప్రారంభించారు. అప్పట్లో దాన్నే గవర్నర్ హౌజ్ అని కూడా పిల్చేవారు. రాష్ట్రపతి భవన్ కు వచ్చే అవరసమైన ప్రతీవారికీ మా తాతే హెయిర్ కటింగ్ చేసేవారు. ఎంత పెద్దవాళ్లైనా ఆయన ముందు తల వంచాల్సిందేనంటూ కాసింత ఫన్నీగా చెప్పుకొచ్చారు. 1972 వరకూ ఆయన అక్కడే పనిచేయగా.. మేమంతా అక్కడే ఉండేవాళ్లం. నేనూ అక్కడే పుట్టాను. ప్రతీరోజూ సైకిల్ పైన ఆ రాష్ట్రపతి భవన్ లో తిరిగేవాణ్ని. అదంతా తిరిగి చూస్తూ ఉండేవాణ్ని. మా తాత వద్ద రేజర్, కత్తెర, ఓ తువ్వాలుతో ఓ పెట్టె ఉండేది. వాటన్నింటినీ నీట్ గా ఉంచేవారు. ఆ యాది ఇంకా నా మదిలో ఉంది.
తన కుటుంబంలో బార్బర్ గా జీవితాన్ని ఆరంభించింది మా తాతే. మా నాన్న చిన్న సెలూన్ లో పనిచేసేవారు. కానీ, ఎక్కువ కాలం నా తండ్రి ఈ వృత్తిలో కొనసాగలేదు.

మా తాత మహాత్మాగాంధీ జుట్టు కూడా కత్తిరించారంటే మీరు నమ్మకపోవచ్చు. మహాత్మాగాంధీకి జుట్టుండదు కదా అని నన్ను చూసి నవ్వుకోవచ్చు. కానీ, ఒక సమయంలో గాంధీకీ జుట్టుండేది. నెహ్రూ మా తాతకు రెగ్యులర్ కస్టమర్. వారానికొకసారి వచ్చి షేవ్ చేయించుకునేవారు. ఆయనకు జుట్టు తక్కువ.
నెహ్రూ రష్యా వెళ్లేటప్పుడు నా తాతకు ఏమైనా కావాలా అని అడిగారు. ఆయనకు గడియారం లేదని చెబితే.. వాచ్ తీసుకొచ్చి బహుమతిగా ఇచ్చారు. చిన్న కోరికను నెరవేర్చిన గొప్ప మనసు నెహ్రూది. అప్పట్లో ఈ హోదాలనేవి మనుషుల మధ్య అడ్డంకులుగా ఉండకపోయేవి. స్నేహపూర్వకంగా ఉండేవి ఆ రోజులంటూ తన చిన్ననాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నాడు జావేద్ హబీబ్.
తన తాత తర్వాత మా తండ్రికీ రాష్ట్రపతి భవన్ లో అవకాశం వచ్చింది. కానీ, ఆయన దాన్ని తిరస్కరించారు. ఆయనకు అక్కడ పనిచేయడం ఇంట్రెస్ట్ లేకుండేది. ఆ తర్వాత మా ఫాదర్ లండన్ వెళ్లారు. అదీ లార్డ్ మౌంట్ బాటన్ సహకారంతో జరిగింది. అక్కడే ఒక ఏడాది పాటు నా తండ్రి హెయిర్ డ్రెస్సింగ్ కోర్స్ పూర్తి చేసి.. ఒబేరాయ్ గ్రూపులో చేరారంటూ హబీబ్ తన వారసత్వ హెయిర్ స్టైలిస్ట్ జర్నీ గురించి వివరించారు.



