విజయ్ ని విజయానికి కేరాఫ్ గా మార్చడంలో కీలక పాత్రధారులు ఎవరు..?

అనూహ్య విజయంతో సంచలనమై… విజయానికి కేరాఫ్ గా.. తన పేరును సార్థకం చేసుకున్న విజయ్ వెనుక ఎవరున్నారు..? కర్ణుడి చావుకు వేయి కారణాలన్నట్టుగా.. కొందరి సక్సెస్ వెనుక మరికొందరు అన్ సంగ్ హీరోస్ ఉంటారు. తమిళనాడులో మరి విజయ్ విజయం వెనుకున్న ఆ వ్యూహకర్తలెవ్వరు…?

సూపర్ స్టార్ గా… పెరియార్ వారసత్వాన్ని కొనసాగిస్తానన్న నినాదంతో వచ్చి విజయ్ విజయం సాధించడంలో తనే ప్రధాన ఆకర్షకుడన్నది నిర్వివాదాంశమే. మూడు దశాబ్దాల తన సినీ కెరీర్ ఛరిష్మా అందుకు బలంగా పనిచేసింది. కానీ, ఒక గొప్ప విజయం సాధించాలంటే.. అదీ సమిష్ఠిగా పొందాలంటే కచ్చితంగా దానివెనుక బలమైన కసరత్తు అవసరం. అలా తలపతి విజయం వెనుక ఒక బలమైన బృందముంది. ఆ బృందమే డీఎంకే, ఏఐఏడీఎంకే వంటి ప్రధాన ద్రవిడ పార్టీల ఆధిపత్యానికి గండికొట్టి, టీవీకేకు తోడ్పడింది.

విజయ్ తెరవెనుక బృందంలో అభిమానుల నుంచీ ఐఆర్ఎస్ అధికారులు, సోషల్ మీడియా వ్యూహకర్తలు, అనుభవజ్ఞులైన నాయకులూ ఉన్నారు. సినిమాటిక్ యూనివర్స్ కే పరిమితమైన విజయరథాన్ని రాజకీయ రంగంలోనూ దింపి.. వీరంతా కలిసి ముందుకు నడిపించారు. సోషల్ మీడియా ఫ్యాన్ బేస్ ను ఓటు బ్యాంకుగా మల్చారు. పార్టీ నిర్మాణానికి అవసరమైన సమయంలో ఈ కోర్ టీం కీలకపాత్ర పోషించింది.

వారిలో కీలకమైనవారు ఎన్. ఆనంద్, అరుణ్ రాజ్, సీటీఆర్ నిర్మల్ కుమార్, ఆథవ్ అర్జున, కే.ఏ. సెంగొట్టయ్యన్ వంటివారుండగా… వీరే తమిళ వెట్రి కజగాన్ని నిలబెట్టారు. అందుకు కావల్సిన నినాదాలను రూపొందించారు. బుత్ స్థాయిలో నిలబెట్టారు.

ఆ ఐదుగురి గురించి కాస్త తెలుసుకుందాం.

ఆనంద్ బస్సీ… బస్సీ ఆనంద్ గా ప్రసిద్ధి చెందిన ఈయన.. 2006లో పుదుచ్చేరీ బస్సీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. విజయ్ కి అత్యంత నమ్మకమైన వ్యక్తి. విజయ్ ఫ్యాన్ క్లబ్ విజయ్ మక్కల్ ఇయక్కంను రాజకీయ పార్టీగా మార్చడంలో కీలక పాత్రధారుడు ఆనంద్ బస్సీనే. పార్టీ పేరు, జెండా ప్రకటించే సమయంలో ఈయన భావోద్వేగానికి గురై కన్నీళ్లు కూడా పెట్టుకున్న ఘటన విజయ్ రాజకీయాల పట్ల ఆయన నిబద్ధతకు కారణంగా ప్రచారం జరిగింది. తాజా ఎన్నికల్లో ఈయన టీనగర్ నుంచి ఎమ్మెల్యేగా గెల్చారు. అన్నీ అనుకూలిస్తే విజయ్ మంత్రి వర్గంలో ఈయనా ఒకరిగా ఉండబోతున్నారు.

అరుణ్ రాజ్… ఈయన ఎంబీబీఎస్ చదివిన డాక్టర్. మాజీ ఐఆర్ఎస్ అధికారి. టీవీకే అడ్మినిస్ట్రేషన్ అంతా ఈయన చేతుల్లోనే ఉంటుంది. ట్యాక్సులకు సంబంధించి దాడులు, విచారణలు, తనిఖీలు చేసిన అనుభవం ఉన్న అరుణ్ రాజ్.. స్వచ్ఛంద పదవీ విరమణ చేసి విజయ్ తో చేరారు. డీఎంకేపై ఘాటైన విమర్శలు చేసే ఈయన.. ఈ ఎన్నికల్లో తిరుచెంగోడ్ నుంచి గెల్చారు.

సీటీఆర్ నిర్మల్ కుమార్… టీవీకేకు డేటా నిపుణుడు, సోషల్ మీడియా వ్యూహకర్త. ముందు బీజేపీలో పనిచేసిన ఈయన.. తమిళనాడులో ఆ పార్టీకి డిజిటల్ వ్యూహాలను నిర్మించడంలో గతంలో కీలక పాత్రధారిగా పనిచేశాడు. పార్టీలో విభేదాల కారణంగా టీవీకేలో చేరారు. ఓటర్ల పక్కా డేటా, ఎప్పటికప్పుడు సర్వేలు చేయించడం, బుత్ లెవెల్ విశ్లేషణలో ఈయన కీలక పాత్రధారి. ఎట్టి పరిస్థితుల్లో టీవీకే 30 శాతం ఓట్లను సాధిస్తుందని నమ్మిన నిర్మల్ కుమార్ ఊహించినదానికన్నా టీవీకే ఇంకో ఐదు శాతం ఎక్కువగా.. 35 శాతం ఓటు షేర్ సాధించింది. ఈయన తిరుపరంకుండ్రం నుంచి విజయం సాధించారు.

ఆథవ్ అర్జున్… లాటరీ కింగ్ గా పేరు పొందిన సాంటిగో మార్టిన్ అల్లుడే ఆథవ్ అర్జున్. టీవీకేలో అత్యంత చురుకైన నాయకుల్లో ఒకరు. వాయిస్ ఆఫ్ కామన్స్ అనే పొల్టికల్ కన్సల్టెన్సీ సంస్థను స్థాపించి.. ఆ తర్వాత డీఎంకేలో చేరాడు. ప్రశాంత్ కిషోర్ ను డీఎంకేతో కలిపింది కూడా గతంలో ఈయనే. కానీ, ఆ తర్వాత రాజకీయ విభేదాలతో వీసీకేలో చేరి.. అక్కడా ఉండలేక, టీవీకేలోకొచ్చారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఈయన విల్లివాక్కం నుంచి గెల్చారు.

కే.ఏ. సెంగొట్టయ్యన్… అనుభవజ్ఞుడైన రాజకీయ నాయకుడు. టీవీకేకు అత్యవసరమైన రాజకీయ అనుభవాన్ని అందించిన నేత. తొమ్మిదిసార్లు ఎమ్మెల్యే. ఎం.జీ. రామచంద్రన్, జయలలితకు సన్నిహితుడిగా మెదిలినవాడు. జయలలిత మరణాననంతరం ముఖ్యమంత్రి పదవికి పోటీ పడినవారిలో ఈయన పేరు కూడా అప్పుడు వినిపించింది. ఏఐఏడీఎంకేలో విభేదాలతో 2025లో పార్టీని వీడి.. టీవీకేలో చేరారు. విజయ్ కు పూర్తి మార్గదర్శిగా నిల్చాడు. ఈ ఎన్నికల్లో గోబిచెట్టిపాళియం నుంచి ఎమ్మెల్యేగా మళ్లీ విజయం సాధించారు.

ఇలా విజయ్ ఛరిష్మాతో పాటు… ఈ కోర్ టీం బ్యాక్ ఎండ్ కృషి కూడా టీవీకే విజయంలో కీలకపాత్ర పోషించింది. టీవీకే ప్రభుత్వ ఏర్పాటులో పొత్తుల విషయంలోనూ వీరిదే కీలకపాత్ర.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles