వెన్నెముక లేని నాయక లోకంలో.. దీదీ, నిటారుగా నిలబడ్డ ఓ మేరునగం!

మమత దీదీ ఓడిపోయింది


Vamsy Krishna…✍🏻

మమత దీదీ ఓడిపోయింది. రాజకీయాలలో గెలుపు ఓటములు సహజం. అదేమీ కొత్త కాదు. వింత కాదు. నిప్పులు చిమ్ముకుంటూ నింగికెగిరితే, విజయం సాధిస్తే నిబిడాశ్చర్యంతో కళ్ళు విప్పార్చుకుని చూసే లోకమే, నెత్తురు కక్కుతూ నేలకు రాలితే నిర్దాక్షిణ్యంగా బుగ్గలు నొక్కుకుంటూ చూస్తుంది. కానీ మమత దీదీ లాంటి వాళ్ళ ఓటమికి కూడా ఒక చారిత్రక ప్రాధాన్యత ఉంటుంది. వాళ్ళ భావజాలలతో మనకు ఏకీభావం ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ, ఎవరికీ తల వొంచని వ్యక్తిత్వం, పోరాడే మనస్తత్వం వాళ్లకు పెట్టని ఆభరణాలు. వంగమంటే, ఆ సాంతం సాగిలబడి సాష్టాంగ నమస్కారం చేసే వెన్నెముక లేని నాయకుల లోకంలో దీదీ ఒక నిటారుగా నిలబడిన మేరునగం.

ఆమె రాజకీయ ప్రస్థానం అంటేనే అడుగడుగునా అవమానాలు, ప్రతిఘటనల సమాహారం. 1990లో కలకత్తా వీధుల్లో యువజన కాంగ్రెస్ నాయకురాలిగా ఆమె నిరసన తెలుపుతుండగా, సిపిఎం కార్యకర్త ఒకరు ఆమె తలపై కర్రతో బలంగా కొట్టిన సంఘటన అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆ దాడిలో ఆమె తలకు తీవ్ర గాయమై మృత్యువు అంచు దాకా వెళ్ళొచ్చారు.

ఆ గాయం మమతను భయపెట్టలేదు సగదా, బెంగాల్ రాజకీయాల్లో ఆమెను ఒక అగ్నిశిఖలా మార్చింది. మరుసటి ఏడాది పార్లమెంటులో తన వాణిని వినిపిస్తుండగా ప్రత్యర్థుల నుండి ఎదురైన వెక్కిరింతలు, హేళనలు ఆమెను మరింత మొండిగా మార్చాయి.


సింగూర్ భూసేకరణకు వ్యతిరేకంగా ఆమె చేపట్టిన 26 రోజుల నిరాహార దీక్ష ఆమె రాజకీయ జీవితంలో అత్యంత కీలకమైన ఘట్టం. ఆ సమయంలో ప్రభుత్వం ఆమెను బలవంతంగా ఈడ్చుకుంటూ వెళ్లిన దృశ్యాలు, ఆమె పట్ల పోలీసులు ప్రవర్తించిన తీరు బెంగాల్ ప్రజానీకాన్ని కదిలించివేశాయి.

నందిగ్రామ్‌లో రైతులపై జరిగిన కాల్పుల తర్వాత మమత వీధి పోరాటాన్ని ఉధృతం చేశారు. ఆ సమయంలో ఆమెపై ఎన్నో వ్యక్తిగత విమర్శలు, కుట్రలు జరిగాయి. మహిళ అన్న విచక్షణ కూడా లేకుండా ప్రత్యర్థులు చేసిన కొన్ని వ్యాఖ్యలు ఆమె ఆత్మగౌరవాన్ని దెబ్బతీయాలని చూశాయి. 1993లో రైటర్స్ బిల్డింగ్ వద్ద జరిగిన ఆందోళనలో ఆమెను జుట్టు పట్టుకుని బయటకు లాగి పడేసిన సంఘటన ఆమె మనసులో గట్టి ముద్ర వేసింది. తాను ముఖ్యమంత్రిగా తప్ప మళ్ళీ ఈ భవనంలోకి అడుగుపెట్టనని ఆనాడే ఆమె శపథం చేశారు. అన్నట్టుగానే 2011లో మూడు దశాబ్దాల కమ్యూనిస్టు పాలనకు చరమగీతం పాడుతూ అధికారాన్ని చేజిక్కించుకున్నారు.

కేంద్ర మంత్రులుగా ఉన్న వారు కూడా ఆమెను ‘ఒక అస్థిరమైన వ్యక్తి’గా ముద్ర వేయాలని చూశారు. నిజానికి ఒక స్త్రీని అవమాన పరచాలి అనుకుంటే మాటలే అవసరం లేదు. ఆ మాటలను విలువరించే మనుషుల హావ భావాలు, మాటలని ఉచ్చరించే విధానం కూడా అవమాన పరచే సాధనాలే. వాటికేమీ సాక్ష్యాలు, దస్తావేజులు వుండవు. దీదీ ఓ దీదీ అని హృదయం లో వున్న వ్యతిరేకత మొత్తానికి కాసింత అసహ్యాన్ని గార్నిష్ చేసి వ్యంగ్యం గా, హేళన గా కూడా మాట్లాడొచ్చు. గాయపరచవచ్చు. గాయం, చేసిన వాడికి కాదు గాయ పడిన వాడికి ఆ సలపరం తెలుస్తుంది

కానీ, ప్రతి అవమానాన్ని ఆమె ఒక ఇంధనంగా మార్చుకున్నారు. అధికారం కోసం సిద్ధాంతాలను తాకట్టు పెట్టే నాయకులు ఉన్న ఈ రోజుల్లో, జైలుకు వెళ్లడానికైనా, దాడులను భరించడానికైనా సిద్ధపడి తన నమ్మిన సిద్ధాంతం కోసం నిలబడడం మమత ప్రత్యేకత. ఇన్నేళ్ల ప్రయాణంలో ఆమె శరీరంపై ఉన్న గాయాలు, ఆమె ఎదుర్కొన్న పరాభవాలు ఆమె విజయానికి పునాదులుగా నిలిచాయి.

ఆమె కేవలం రాజకీయ నాయకురాలే కాదు. వాజ్ పేయ్ లాగా, పి వి లాగా మంచి సాహిత్య జీవి. బెంగాలీ లో మంచి కవిత్వం రాశారు

ఆమె కవిత్వం కేవలం భావోద్వేగాల సమాహారం మాత్రమే కాదు, అది నేరుగా ప్రజలతో సంభాషించే ఒక రాజకీయ ఆయుధం. మమత తన కవిత్వాన్ని రాజకీయం నుండి వేరుగా చూడకుండా, రెండింటినీ ఒకదానికొకటి పూరకాలుగా మార్చుకున్నారు. ఆమె సుప్రసిద్ధమైన “మా, మాటి, మానుష్” (తల్లి, మట్టి, మనుషులు) కేవలం ఎన్నికల నినాదమే కాదు ఆమె హృదయ ప్రతి బింబం కూడా.ఆమె రాసిన అనేక కవితల్లో ఆమె సున్నితత్వం అంతర్లీనంగా కనిపిస్తుంది.

సింగూరు, నందిగ్రామ్ ఉద్యమాల సమయంలో ఆమె రాసిన కవితల్లో భూమి కోసం పోరాడే రైతుల ఆవేదనను, మట్టిపై ఉన్న మమకారాన్ని రాజకీయ నిరసనగా మలిచారు. పాలకుల అణచివేతకు వ్యతిరేకంగా మట్టి మనుషుల గొంతుకను వినిపించడమే తన రాజకీయ మార్గమని ఆమె తన కవిత్వం ద్వారా స్పష్టం చేసింది.

ఉపరితల అంశాల ఆధారంగా, ఆమె రోహింగ్యాలకు, బంగ్లా వలస దారులకు ఆశ్రయం ఇచ్చి ఓటు బ్యాంక్ సృష్టించుకున్నారు అని విమర్శలు చేసే వారికి ఆమె లౌకికవాదం, సామాజిక ఐక్యతపై వున్న అవగాహన లోతు విస్తృతి తెలియదు.

మమతా బెనర్జీ తన కవిత్వంలో తరచుగా మతసామరస్యం గురించి ప్రస్తావిస్తుంటారు. రాజకీయాల్లో విభజన ధోరణులు తలెత్తినప్పుడు, ఆమె కవితలు ఐక్యతను చాటిచెప్పే సంకేతాలుగా పనిచేస్తాయి. వివిధ మతాల పండుగలు, సంప్రదాయాలను మేళవిస్తూ ఆమె రాసిన కవితలు ఓటర్లను ప్రభావితం చేయడమే కాకుండా, తృణమూల్ కాంగ్రెస్ అనుసరించే రాజకీయ భావజాలాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్ళాయి.

అధికారం కంటే సామాన్యుల హక్కులే ముఖ్యమని, అన్యాయం జరిగినప్పుడు కవిత్వం ద్వారా నిరసన తెలపడం తన బాధ్యతని ఆమె నమ్ముతారు. ఇలా తన రాజకీయ పోరాటాలలోని తీవ్రతను కవిత్వంలోని సున్నితత్వంతో జోడించి, ప్రజల మనసులను గెలుచుకోవడంలో ఆమె విజయవంతమయ్యారు.

నేడు ఓటమి ఎదురైనా, ఆ ఓటమి వెనుక దశాబ్దాల పోరాట చరిత్ర ఉంది. ఎందరో హేమాహేమీలు ఆమెను అణచివేయాలని చూసినా, అలుపెరగని ఫీనిక్స్ లా ఆమె మళ్ళీ మళ్ళీ పైకి లేస్తూనే ఉన్నారు. ఈ పోరాట పటిమే ఆమెను భారత రాజకీయాల్లో ఒక విశిష్టమైన వ్యక్తిగా నిలబెట్టింది.

ఓటములు అన్నీ అపజయాలు కావు..
అపజయంలో కూడా జయం వుంది. అప శబ్దాన్ని ఎంత తొందరగా పక్కకు నెట్టేస్తాము అనే విషయం మీదే మన విజయం ఆధారపడి ఉంటుంది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe

Latest Articles