త్యాగయ్యకు క్షమాపణలతో…🙏

మోదుమూడి సుధాకర్ – ప్రముఖ సంగీతకారులు.. ✍🏻

అయ్యా! సద్గురువర్యా! త్యాగయ్యా! నీ పుట్టినరోజుని మర్చిపోయాం! ఏమనుకోకయ్యా!
ఎందుకంటే మేమూ తెలుగువాళ్ళమయ్యా!

మాకు సినీ, రాజకీయ ప్రముఖుల జయంతులు తప్ప, మరేవీ గుర్తుండవయ్యా! వారి సేవలో తరిస్తామయ్యా!

అయినా, మేం నీ ఋణం తీర్చుకుంటూనే ఉన్నాం కదయ్యా!..

‘త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు..’ అని పాడుకోవటానికే నిన్ను పరిమితం చేశాం…నీకృతిలేని కచేరీ లేదని అంటూనే ఆకచేరీలకు తెలుగునాట తావులేకుండా చేస్తున్నాం. అపురూపమైన నీకృతులని సినిమాలలో అపహాస్యం చేయటంలో మిగతా రాష్ట్రాలవారికన్నా ముందున్నాం! ఇంతకంటే ఏమిచేయగలం?

నీకూ కులాన్నీ, ప్రాంతాన్నీ అంటగట్టి.. ‘నీవు మావాడివేనా?’ అని సందేహిస్తున్నాం. ‘భక్తి బిచ్చమియ్యవే’… అంటూ ‘చక్కని రాజ(రామభక్తి సామ్రాజ్య)మార్గం’లో నడచిన నీకు వారసులమని చెప్పుకుంటూ, నీ ఉత్సవాలలో పాల్గొనటానికి పారితోషకాలడగటంలో పోటీపడుతున్నాం. ‘రాముని సన్నిధి,సేవ సుఖమని నువ్వంటే…’ ‘నిధిచాల సుఖమని’ మేమంటున్నాం. నీకృతులతో ధనార్జనే ధ్యేయంగా పెట్టుకున్నాం.. ఇక నిన్ను సంస్మరించుకునే తీరికెక్కడిది మాకు?

నీకృతులను, భాష తెలియని ఆంధ్రేతరులు దోషాలతో పాడితే, వాటినే ప్రామాణికమని అనుకరిస్తున్నాం. వారు నీసాహిత్యాన్ని సంగతులు,నెరవుల పేరిట కైమా చేస్తుంటే, తొడలుచరిచి తాళాలు వేస్తూ, రెట్టింపు పారితోషకాలిచ్చి వారిని నెత్తినపెట్టుకుంటున్నాం.

విశ్వవేదికలపై అందరినోటా తెలుగును నినదింపజేసే నీ కృతులకు మా తెలుగు మహాసభలలో మాత్రం, ఏనాడూ స్థానం ఇవ్వం. నీకు స్వరం కట్టడం చేతకాలేదని, నీసాహిత్యాలకు మా సినీస్వరకర్తలతో బాణీలు కట్టిస్తున్నాం. ఒకవేళ నీ సంగీత బాణీలు నచ్చితే, వాటికి మా సినీకవులతో పదాలు తిరగ వ్రాయిస్తున్నాం.

ఎందరో మహానుభావులు-అందరికీ వందనములు’ అని నీవంటే.. ‘కొందరే మహానుభావులు-ఎందరికని వందనములు?’ అని మేమంటున్నాం. రాముని ‘సొగసు చూడ తరమా!’ అని నువ్వు పాడుకొంటే.. దాన్ని శృంగారగీతంగా మార్చి.. సినిమాలో మేం పాడించేశాం. ‘సామజవరగమనా’, ‘దొరకునా ఇటువంటిసేవ’, ‘జగదానందకారకా’.. ఇవన్నీ నీ కృతులంటే ఎలా నమ్ముతాం? అవి సూపర్ హిట్ ఫిల్మ్ సాంగ్స్ ఐతేను!

ఈమధ్య మదరాసులో విద్వాంసులొకరు, నీవు హిందూ ఛాందసవాదివని, స్త్రీవ్యతిరేకివని, నీకు జాత్యహంకారమని తూలనాడితే, వారిని దేశం అంతా ఏకోన్ముఖులై ఖండించగా, అసలు ఆవిషయాలే మాకు తెలియవు. తెలిసినా, మనకు సంబంధంలేదని మిన్నకుండిపోయిన నికార్సయిన తెలుగువాళ్లం మేము. అసలు నీవు కవివే కావన్న ప్రబుధ్ధులమే మేము. ఎంతో ఆర్తితో నువ్వు పాడుకున్న ‘నగుమోము గనలేని నాజాలి తెలిసి’.. కృతిని ప్రయోగాల పేరిట చిత్రవధ చేసిన యువతను వెన్నుతట్టి ప్రోత్సహించాము కూడానూ!

ఖరహరుడైన రామునికి ప్రియమైనదని ఖరప్రియరాగంలో నీవేమో ‘రామ! నీసమానమెవరు?’ అని పాడుకొంటే, అదే బాణీని పరమతస్థులకు తాకట్టు పెట్టి, సొమ్ముచేసుకొంటున్నవారిని, లౌకికవాదులని శ్లాఘించినవాళ్ళం మేం!

రెండేళ్ల క్రితం నీ రెండువందల యాభయ్యవ పుట్టినరోజును ప్రపంచమంతా ఘనంగా జరిపితే,మా తెలుగురాష్ట్రాల ఏలినవారు మాత్రం పట్టించుకోలేదు. ఏమీ అనుకోకు స్వామీ! అది అలవాటులో పొరపాటే!

త్యాగయ్యా! అసలు నీతాతముత్తాతలు తెలుగునేలను వదలి, తిరువయ్యారు వెళ్ళటానికి కారణం ఏమిటయ్యా?..

ఏది ఎలాఉన్నా, నీవు మాకు పరాయివాడవే కనుక, ’పొరుగింటి పుల్లకూర రుచి’ తెలిసిన మేము.. నీకు బ్రహ్మరథం పట్టేరోజు రాకపోదు. ఏదో ఒకనాటికి నీ కీర్తనలను విదేశీయుల దగ్గర నేర్చుకొనైనా పాడుకుని, నీ రుణం తీర్చుకోలేకపోము!

వందనమయ్యా! త్యాగయ్యా!!

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles