టైటానిక్ – తెర వెనుక కథ!

29 ఏళ్ల టైటానిక్… తెరవెనుక ప్రయాణం!

టైటానిక్ ఓ కల్ట్ క్లాసిక్. తెరకెక్కించడం ఓ మహాయత్నం. జేమ్స్ కామెరాన్ కు ఓ సవాల్. ఎవరూ ఊహించని స్థాయిలో చిత్రీకరించి తెరకెక్కించిన ఆయన బృందానికి ఓ ఛాలెంజ్. సాధారణ స్టూడియో నిర్మాణ పరిమితులను మించి చిత్రీకరించిన సినిమా. ఇవాళ అంటే మూడు దశాబ్దాల క్రితం కంటే సాంకేతికత మరింత అందుబాటులోకొచ్చింది. రోబోటిక్ టెక్నాలజీలు… వీఎఫ్ఎక్స్, ఆర్టీఫిషియల్ ఇంటలిజెన్స్ ఇలా ఎంతో టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతోంది. కానీ, 1997.. అంటే మిల్లేనియం నాటికే ఒక అసాధారణ చిత్రీకరణకు సిద్ధమై విజయవంతం చేసిన సినిమా టైటానిక్.

అందుకోసం అట్లాంటిక్ సముద్రం లోతుల్లోకి వెళ్లి టైటానిక్ శిథిలాలను సేకరించారు. ఒక చారిత్రాత్మక మహా విషాదంగా మిగిలిన ఆ నౌకకు సంబంధించిన అత్యంత సూక్ష వివరాలతో ఓ ప్రతి రూపాన్నీ తయారుచేశారు. ఇదంతా ఇప్పుడెందుకు చెప్పుకోవడమంటే ఈమధ్య టైటానిక్ సినిమా చిత్రీకరణ వెనుక షూటింగ్ ఎలా జరిగిందో ఒక వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగవుతూ కనిపిస్తోంది.

ఒకవైపు, అప్పటికే అందిపుచ్చుకున్న అత్యాధునిక డిజిటల్ టెక్నాలజీని ఉపయోగించుకుంటూనే.. భౌతికంగా వేసిన భారీ సెట్లను సమన్వయం చేసి… తమ కళ్ల ముందే ఒక భారీ నౌక మునిగిపోతున్న విజువల్ ఎఫెక్ట్స్ ను క్రియేట్ చేశాడు కామెరాన్. ఇంకొందరైతే ఆ నౌకలో తామూ ఉన్నామా అనేంత ఫీల్ తీసుకొచ్చి..ఓ అద్భుత దృశ్యంగా మల్చాడు.

అద్భుతమైన నటీనటుల బృందం… హృదయాన్ని కదిలించే నేపథ్య సంగీతం వెరసి.. చరిత్రలో జరిగిన అత్యంత విషాద ఘట్టానికి తెరపై జీవం పోశారు.

టైటానిక్ తీయాలనే బలమైన ఆకాంక్ష, పట్టుదల, అందుకు కావల్సిన కళ వెనుక ఉన్న కథేంటి..?

ఒర్జినాలిటీ ఉట్టిపడాలంటే సాహసానికి ఒడిగట్టాల్సిందే. అలా సముద్ర గర్భంలో టైటానిక్ శిథిలాలున్న లోతుకు వెళ్లడం ఓ మహత్తర సాహసమే. అసలు అట్లాంటిక్ సముద్రంలో మంచులాంటి చల్లటి నీటిలోకి దిగడానికి ముందే విస్తృతమైన కసరత్తు చేశారు. ఆధునిక సాంకేతికత సాయంతో ఈ నీటి లోతుల్లోకెళ్లి… టైటానిక్ శిథిలాల భయానకమైన, ఆకర్షణీయమైన రూపాలను తెరపై చూపించేందుకు నడుం బిగించారు. నిజమైన శిథిలాల దృశ్యాలను కూడా సందర్భోచితంగా సినిమా కథనంలో భాగం చేశారు.

టైటానిక్ శిథిలాలను చిత్రీకరించాల్సిన కెమెరాల నుంచి.. అత్యంత లోతుకు వెళ్లే సబ్ మెర్సిబుల్స్ వరకూ ప్రతీదాన్నీ జాగ్రత్తగా సిద్ధం చేసుకున్నారు. సముద్ర వ్యవహారాలు చూసే అధికారుల అనుమతి, సహకారం కూడా టైటానిక్ చిత్రీకరణలో కీలకమైంది. లోతైన సముద్ర అన్వేషణలో నిపుణులతో కలిసి పనిచేస్తూ యాత్రకవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్నీ సమకూర్చుకున్నారు. ఎంతో ప్రమాదమని తెలిసినప్పటికీ… నిజమైన చరిత్రను సినిమాతో కలిపాలన్న ఒక ఉత్సాహం టైటానిక్ ప్రయోగాత్మక చిత్రీకరణను ముందుకు నడిపింది.

టైటానిక్ శిథిలాలను చేరేందుకు ఉపయోగించిన సాంకేతికతేంటి?

అప్పటికే సినిమా చిత్రీకరణకు ఉపయోగించే సాధారణ కెమెరాలు ఎలాగూ సరిపోవు. సముద్ర జీవ శాస్త్రవేత్తలు ఉపయోగించే సబ్ మెర్సిబుల్స్ లో… ఆధునిక చిత్రీకరణ పరికరాలను అమర్చారు. శాస్త్రీయ అన్వేషణ, సాంకేతికతల కలయికలతో టైటానిక్ శిథిలాలను అంతకుముందెన్నడూ చూడని రీతిలో దృశ్యమానం చేశారు. సముద్ర గర్భంలో వెలుతురు మరో సవాల్. అలాంటి చీకట్లను ఛేదిస్తూ డీప్ సీ లైట్ల వెలుతురులో టైటానిక్ శిథిలాల రూపురేఖలను కెమెరాకెక్కించారు. స్టూడియోల్లో నిర్మించే సెట్లతో సాధ్యం కాని సహజత్వం, జీవం ఉట్టిపడేలా సూక్ష్మమైన నిర్మాణాలన్నీ కెమెరాలకు క్యాప్చరయ్యాయి. ఇది కేవలం దృశ్యాలను కెమెరాలో రికార్డ్ చేయడమే కాదు.. ఆ విషాద ప్రదేశంలో వాస్తవికతను సినిమా కథతో జతచేసే ఓ భావోద్వేగ ప్రయాణం. అవే సినిమా చూస్తున్న ప్రేక్షకుణ్ని కనెక్ట్ చేశాయి. కొత్త అనుభూతినందించాయి.

https://www.instagram.com/reel/DRsVyVdE_i4

డీప్ సీలో ఎదురైన సవాళ్లేంటి..?

సబ్ మెర్సిబుల్స్ లో కెమెరాలను ఏర్పాటు చేసుకుని వెళ్లనైతే వెళ్లారుగానీ… అగాథంలో ఎదురయ్యే ఒత్తిళ్లను తట్టుకోవడం అంత సులభం కాదు. పరికరాలు పాడైపోయే పరిస్థితులు తరచుగా ఎదురయ్యాయి. దాంతో షూటింగ్ విజయవంతమవ్వడం పక్కనబెడితే.. అప్పటివరకూ సేకరించిన ఫుటేజ్ భద్రత కూడా చాలాసార్లు ప్రమాదంలో పడింది. ఆ శిథిలాల మధ్య సబ్ మెర్సిబుల్స్ నడపడం మరో ఛాలెంజింగ్ టాస్క్. సముద్రగర్భంలోని ఓ చిట్టడవిలో ఏ చిన్న పొరపాటు జరిగినా సబ్ మెర్సిబుల్ అక్కడే చిక్కుకుపోయే ప్రమాదముంటుంది. అలాంటి కండిషన్స్ లో టైటానిక్ చిత్రీకరణ జరిగింది.

టైటానిక్ రీక్రియేషన్ వెనుక జరిగిందేంటి..?

సృజనాత్మకత, సాంకేతికత సాయంతో టైటానిక్ ను మళ్లీ తెరపై సజీవంగా నిలబెట్టిన ప్రయత్నం ఆ సినిమా. అందుకు మెక్సికో వేదికైంది. మైన్యూట్ డీటెయిల్స్ ను కూడా విడిచిపెట్టకుండా భారీ ప్రతిరూపాన్ని సిద్ధం చేశారు. ప్రాక్టికల్ ఎఫెక్ట్స్ తో పాటు.. కంప్యూటర్ జనరేటెడ్ ఇమేజరీని వాడుకుని అప్పటి కాలాన్ని రీక్రియేట్ చేశారు. కేవలం నౌకను నిర్మిస్తే కాదు… ఆ కాలం ఆత్మ, జీవనశైలి, వైభవాన్ని తెరపైన చూపించాలి. అలా ప్రతీ పార్ట్ పార్ట్, ఇంచించు టైటానిక్ లో ఆ సినిమా బృందం తపన కనిపిస్తుంది.

రోసారిటోలో టైటానిక్ ప్రతిరూప నిర్మాణం ఒక భారీ ప్రాజెక్టుగా మారిపోయింది. సంప్రదాయ నైపుణ్యాలను, ఆధునిక సాంకేతికతతో జత చేశారు. టైటానిక్ రెండు భాగాలుగా విడిపోయే సన్నివేశాలకు మాత్రమే సీజీఐని ఉపయోగించారు. గ్రాండ్ లుక్స్ కోసం సాంకేతికతను వాడారు. మంచుకొండను ఢీకొట్టే సన్నివేశాన్ని నమూనాలతో సహజంగా రూపొందించి.. ఢీకొట్టిన ప్రభావం, గందరగోళాన్ని మరింత భారీగా చూపించేందుకు కంప్యూటర్ గ్రాఫిక్స్ ను వాడారు.

అలా 1900 ఆరంభ కాలాన్ని… ఆ శతాబ్దపు అంతంలో తిరిగి సృష్టించడం ఓ అద్భుతమైన కళ. భవనాలు, నౌకా నిర్మాణాలు మాత్రమే కాదు.. ప్రతీ సన్నివేశం, దుస్తులు, వస్తువులు, సామాజిక పద్ధతుల వరకూ విస్తృతమైన పరిశోధనతో మొత్తంగా ఆ కాలపు వాతావరణాన్ని ప్రతిబింబించారు.

టైటానిక్ లో ఐకానిక్ డ్రాయింగ్ సీన్ వెనుకా ఓ కథ!

టైటానిక్ నిర్మాణంలో భావోద్వేగపరంగా, సినిమాటిక్ గా గుర్తుండిపోయే సన్నివేశాల్లో జాక్… రోజ్ బొమ్మను గీయడం. రోజ్ హార్ట్ ఆఫ్ ది ఓషన్ నెక్లెస్ ను ధరించి ఉన్న సమయంలో జాక్ ఆమె చిత్రాన్ని గీసే సన్నివేశమది. అయితే, ఆ సన్నివేశ చిత్రీకరణ కోసం లియోనార్డో డికాప్రియో, కేట్ విన్సెట్ కు ప్రత్యేక శిక్షణనిచ్చారు. వారి దుస్తులు, గది అలంకరణ, ఫర్నీచర్ వంటి ప్రతీ అంశంలోనూ చారిత్రకతలో కచ్చితత్వాన్ని కనబర్చే యత్నం చేశారు.

పరిమితుల నుంచి స్వేచ్ఛ వైపు పయనించే మార్పుకు ప్రతీకగా హార్ట్ ఆఫ్ ది ఓషన్ నెక్లెస్ ఎంపిక చేశారు. అది కేవలం ఒక నగలా మాత్రమే కనిపించే వస్తువుగా కాకుండా… రోజ్ పాత్రలో పరివర్తన, కథలోని కీలక మలుపులను ప్రతిబింబించేలా ప్లాన్ చేశారు. అందుకోసం డిజైనర్స్ వివిధ రకాల నగల నమూనాలను తయారుచేశారు. కామెరాన్ బాగా పరిశీలించి ప్రతీకాత్మకంగా ఉండే హార్ట్ ఆఫ్ ది ఓషన్ నెక్లెస్ మాడల్ ను ఎంపిక చేశారు.

వాతావరణం – ఎదురైన సవాళ్లు!

టైటానిక్ చిత్రీకరణలో నీటిలో సన్నివేశాల చిత్రీకరణలో పలు సవాళ్లెదురైనాయి. మెక్సికోలో నిర్మించిన భారీ నీటి ట్యాంకుల్లో అక్కడి నీటి స్వభావం అనేక సమస్యలను సృష్టించింది. గాయాలు, శరీర ఉష్ణోగ్రతలు పడిపోయే హైపోథర్మియా వంటి ప్రమాదాలకు దారితీసింది. కేట్ విన్స్లెట్ ఆ బాధలను మరింత ఎదుర్కోవాల్సి వచ్చింది.

కీలకంగా మారిన నటీనటుల ఎంపిక!

విషాదభరితమైన ఓ చారిత్రక ఘట్టానికి.. ఓ ప్రేమకథ జోడించి చెప్పేటప్పుడు ఆ నేపథ్యాన్ని ప్రతిబింబించేలా ప్రతీ పాత్రలో జీవం ఉట్టిపడేలా ఎంపిక ప్రక్రియ జరిగింది. కామెరాన్ దర్శకత్వ ప్రతిభకు తోడు.. జాక్ డాసన్ గా లియోనార్డో డికాప్రియో, రోజ్ డివిట్ బుకేటర్ గా కేట్ విన్స్లెట్ ఎంపిక సినిమా సాంస్కృతిక స్వభావాన్ని కళ్లకు కట్టింది. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ ప్రపంచ ప్రేక్షకులను ఆకట్టుకుని.. దశాబ్దాల తర్వాత కూడా మాట్లాడుకునే ఒక సినిమాగా టైటానిక్ ను నిలబెట్టింది.

అలాగే టైటానిక్ లో ప్రతీ ప్రయాణీకుడికి, చిన్న పాత్రలకు కూడా ప్రత్యేకమైన నేపథ్యాన్ని జోడించి.. వారి భయాలు, లక్ష్యాలు అన్నింటినీ మిళితం చేసి ఒక వండర్ క్రియేషన్ చేశారు. చారిత్రక రికార్డులపై పరిశోధించి.. నాటి సంక్లిష్టమైన సామాజిక వర్గ వ్యవస్థనూ ప్రతిబింబించే విధంగా కథలో భాగం చేశారు. దాంతో టైటానిక్ మునిగిన విషాదమే కాకుండా.. అందులోని పాత్రలపైనా ప్రేక్షకుడు ఆలోచించే విధంగా తెరకెక్కించారు. భావోద్వేగాన్ని పండించేందుకు సెట్స్ లో స్వేచ్ఛ, ఫీడ్ బ్యాక్ వంటివిస్తూ కామెరాన్ ప్రాణం పోశాడు.

టైటానిక్ లో సంగీతం పాత్ర!

టైటానిక్ సినిమాకు సరైన సంగీతమివ్వడమంటే సినిమా నిర్మాణాన్ని మించిన మరో సవాల్. తనను ఎంపిక చేసుకున్నందుకు ఆ భావోద్వేగాలను, వాటి లోతును స్పృశించేలా జేమ్స్ హార్నర్ ది బెస్ట్ ఇవ్వడంతో… థీమ్ సాంగ్ కు సెలిన్ డియాన్ ను ఎంపిక చేసి టైటానిక్ రేంజును మరింత పెంచాడు. కథలోని విషాదం, ప్రేమ రెండింటినీ సమన్వపర్చే సంగీతాన్ని సంఫనీగా రూపొందించి… దాన్ని ప్రేక్షకుల గుండెచప్పుడుగా మార్చారు. ఎంతో మందిని అనుకున్నాకే కథలోని ప్రేమ, రాబోయే విషాదాన్ని ప్రతిబింబించే విధంగా సెలిన్ డియాన్ ను ఎంపిక చేసుకోవడంతో ఇప్పటికీ టైటానిక్ థీమ్ సాంగ్ ఎవర్ గ్రీన్ గా నిలబడింది.

ఐకానిక్ థీమ్ సాంగ్ వెనుకా ఓ కథ!

టైటానిక్ థీమ్ సాంగ్ రూపుదిద్దుకోవం వెనుకా ఎంతో కసరత్తు జరిగింది. అంతకుమించిన సృజనాత్మకతా కనిపిస్తుంది. కథలోని ప్రధానాంశాలు, భావోద్వేగాలను పరిశీలించి థీమ్ సాంగ్ కు సాహిత్యం తయారుచేశారు. ఆ సాహిత్యానికి.. సరైన స్వరాన్ని సమన్వయం చేసి ప్రేక్షకుల్లో చిరస్థాయిగా నిల్చే సంగీతంగా టైటానిక్ థీమ్ సాంగ్ ను మల్చారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles