ఇదీ నిజాయితీ కథ.. నిజ జీవిత కథ!
2024లో డబ్బు పోగొట్టుకున్న ఓ వృద్ధురాలికి.. రెండేళ్ల తర్వాత తన డబ్బు తనకు దక్కింది. దీన్ని ఆ ముసలావిడ ప్రాప్తం అనుకునేవాళ్లూ ఉండొచ్చు. కానీ, నిజాయితీ అని అనుకోకుండా మాత్రం ఎవరూ ఉండలేరు.
అసలేంటి ఈ స్టోరీ?
2024 ఏప్రిల్ లో కసాబాయి గైక్వాడ్ అనే వృద్ధ మహిళ.. అనారోగ్యంతో ఉన్న తన భర్తతో కలిసి బస్సులో ప్రయాణించింది. దాదాపు నాల్గు గంటల ప్రయాణమనంతరం వారు మాలేగావ్ బస్టాండ్ లో దిగిపోయారు. సదరు వృద్ధ మహిళతో పాటు.. అంతా బస్సు దిగిపోయారు. కానీ, వృద్ధ దంపతులు కూర్చున్న సీటులో కండక్టర్ రాజుకు ఓ పర్స్ కనిపించింది. తెరిచి చూస్తే అందులో 24 వేల రూపాయలున్నాయి.
బ్యాగ్‌లో ఓ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ కూడా ఉంది. దానిపై కసాబాయి గైక్వాడ్ అనే పేరు ఉంది. దాని ఆధారంగా ఆ డబ్బెవ్వరిదో కనిపెట్టేందుకు రాజు విఫలయత్నం చేశాడు.

కసాబాయి వృద్ధ దంపతులో.. లేక, వారి సంబంధీకులో ఎవరైనా తిరిగి వస్తారేమోనని డ్యూటీ ముగిసినా దాదాపు గంటసేపు బస్టాండ్ లోనే నిరీక్షించాడు కండక్టర్ రాజు. కానీ, అప్పటికీ ఇంకా ఎవ్వరూ రాలేదు. ఎంక్వైరీ కౌంటర్ లో ఎవరైనా వస్తే తన వద్దకు పంపించడంటూ అక్కడి సిబ్బందికి చెప్పి వెళ్లిపోయాడు.
కానీ, ఆ డబ్బు కోసం ఇంకెవ్వరూ రాలేదు కదా అని దాన్ని రాజు వాడుకోలేదు. రోజులు గడిచాయి, వారాలు పోయాయి, నెలలు నిండాయి. అయినా రాజ దగ్గర ఆ 24 వేల రూపాయలు అలాగే భద్రంగా ఉన్నాయి. డాక్టర్ ప్రస్క్రిప్షన్ పై ఉన్న ఫోన్ నంబర్ ద్వారా కూడా కసాబాయిని సంప్రదించే ప్రయత్నం చేసినా ఫలించలేదు.
రెండేళ్ల తర్వాతేమైంది మరి..?
మళ్లీ యథావిధిగా ఓరోజు రాజు విధుల్లో ఉండగా… ఓ వృద్ధ మహిళ బస్సు ఎక్కింది. మాలేగావ్ కు టికెట్ అడిగింది. సుమారు 75 ఏళ్ల వయస్సుంటుంది. మహారాష్ట్రలో 75 పైబడ్డ ప్రయాణీకులకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యముండటంతో… ఆ మహిళ ఆధార్ కార్డ్ చూపించమన్నాడు కండక్టర్ రాజు.
ఆధార్ కార్డులో పేరు చేసి అవాక్కయ్యాడు. ఎందుకంటే, ఆమె పేరు కసాబాయి గైక్వాడ్. ఎందుకైనా మంచిదని ఆమెతో మాటలు కలిపాడు. 2024లో 24 వేల రూపాయలు పోగొట్టుకున్నది ఆ మహిళే అని తేలింది. వెతుకుతున్న తీగ కాలికి తగిలినట్టుగా.. ఇంతకాలం ఎవరి కోసమైతే వెతుకుతున్నాడో ఆ వృద్ధ మహిళే మళ్లీ తన బస్సే ఎక్కి తనముందు ప్రత్యక్షమైంది.
వెంటనే కసాబాయిని డిపోకు తీసుకెళ్లాడు. ఉన్నతాధికారులకు జరిగిందంతా చెప్పాడు. వెంటనే తన దగ్గరున్న డబ్బును డిపో అధికారుల ముందే తీసుకొచ్చి ఆ కసాబాయికిచ్చేశాడు.
పోయిందనుకున్న డబ్బు తిరిగి రావడం కసాబాయికి ఊహించని వరంలా అనిపించింది. తన డబ్బును ఇంతకాలం భద్రంగా ఉంచి.. తిరిగి తనను గుర్తించి అప్పగించినందుకు కసాబాయి రాజుకు కృతజ్ఞతలు చెప్పింది. అంతేకాదు, కండక్టర్ రాజు వద్దని వారించినా.. తన మాట కాదనొద్దంటూ 11 వందల రూపాయలు ఆ డబ్బు తనకు తిరిగి ఇచ్చినందుకు ధన్యవాదాలుగా ఆయన చేతుల్లో పెట్టింది. పెద్దావిడ అంతగా బలవంతం చేస్తుంటే.. కండక్టర్ రాజూ కాదనలేకపోయాడు. పైగా డిపో అధికారులు కూడా ఆమె తృప్తికోసం తీసుకోవాలని సూచించారు.
డబ్బు కంటే నిజాయితీకి విలువనిచ్చే మనుషులెలా ఉంటారో రాజు కథ చెప్పిది. ఈ స్టోరీ ఇప్పుడు సోషల్ మీడియాలోనూ ఓ ట్రెండింగ్ టాపిక్.



