రాజీ సినిమా స్ఫూర్తి: ఈ సెహమత్ ఖాన్ ఎవరు..?

దేశం కోసం జీవితాన్నే త్యాగం చేసిన ఓ మహిళా గూఢచారి!

పక్కలో బల్లెం వంటి దేశం. చిన్న పొరపాటు జరిగినా ప్రాణాలకే ముప్పు. కానీ, దేశం కోసం అక్కడ అడుగుపెట్టడం ఓ త్యాగం. అదేదో ఢంకా బజాయించే త్యాగం కూడా కాదు. ఆ త్యాగం వెనుక నిశ్శబ్దమే తప్ప… పెద్ద గొప్పలుండవు. పైగా గూఢచర్య వ్యవస్థలో ఓ యువతి పోరాటం, సాహసోపేత ప్రయాణం. అదే బాలీవుడ్ లో తెరపైకెక్కిన రాజీ.

రాజీ వెనుక అసలు కథ!

1971 యుద్ధకాలంలో పాకిస్తాన్‌లో గూఢచారిగా పనిచేసిన ఓ భారతీయ మహిళ సెహమత్ ఖాన్ కథే ఈ రాజీ.

అలియా భట్ ప్రధాన పాత్రలో నటించి మెప్పించిన ఈ చిత్రం ఓ ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్. పాకిస్తాన్‌ కి వెళ్లి శత్రు దేశానికి చెందిన సైనిక కుటుంబపు కోడలిగా ఉంటూ… అక్కడి రహస్యాలను ఛేదించే ఓ గూఢచారి కథ. దేశ ప్రయోజనాల కోసం ఉన్న ఊరిని, కన్నవారినీ, తన ప్రేమను, తన గుర్తింపును, చివరకు తన భద్రతనూ త్యాగం చేసిన యువతే ఈ సెహమత్ ఖాన్.

రాజీ సినిమా తెరకెక్కేవరకూ కూడా చాలామందికి పెద్దగా పరిచయంలేని గూఢచారి సెహమత్ ఖాన్. చరిత్ర పుస్తకాల్లో పెద్దగా కనిపించని పేరిది.

అసలెవరీ సెహమత్ ఖాన్..?

సెహమత్ ఖాన్ తండ్రి కశ్మీరీ ముస్లిం, తల్లి పంజాబీ హిందూ కుటుంబానికి చెందినవారు. భిన్నమైన మత విశ్వాసాలతో విభేదాలు లేకుండా.. ఇంటిగ్రిటీ చిరునామాలా బతుకుతున్న కుటుంబం. ఆ నేపథ్యమే సెహమత్ ఖాన్ ను ప్రభావితం చేసింది. పైగా తండ్రి దేశభక్తి కూడా పుణికిపుచ్చుకున్న బిడ్డ కావడంతో.. దేశమే తనకు ముఖ్యమని భావించి గూఢచారి అవతారమెత్తింది.

రెండు దేశాల మధ్య యుద్ధాలు కేవలం సరిహద్దుల్లో మాత్రమే జరుగవు.. అవి నాల్గు గోడల మధ్య ఇళ్లల్లో, కుటుంబాల్లో, తరగతి గదుల్లో నిశ్శబ్దంగా ఎక్కడైనా జరుగొచ్చు. అవే పెద్ద యుద్ధాలకు కారణం కావచ్చు. అదిగో అలాంటి రహస్యాలను ఛేదించడమే గూఢచర్యం.

రాజీ సినిమాకు సెహమత్ ఖాన్ కు ఏంటి సంబంధం..?

భారత మాజీ నేవీ లెఫ్టినెంట్ కమాండర్, రచయితైన హరీందర్ సిక్కా రాసిన కాలింగ్ సెహమత్ ఖాన్ పుస్తకమే రాజీ సినిమా నిర్మాణానికి మూలం. సినిమాటిక్ గా కొన్ని సృజనాత్మక మార్పులు, చేర్పులు సర్వసాధారణంగా చేసినప్పటికీ… మోటో మాత్రం సెహమత్ ఖాన్ జీవితమే. ఒక యువతి శత్రుదేశానికి చెందిన కుటుంబానికి కోడలిగా వెళ్లి.. యుద్ధ పరిస్థితులను ప్రభావితం చేయగల సమాచారాన్ని సేకరించడానికి తన జీవితాన్నే పణంగా పెట్టిన ఓ యువ మహిళా గూఢచారి కథ ఎంత ఆసక్తి రేకెత్తిస్తుంది..? అందుకే ఈ సబ్జెక్ట్ పై మేఘనా గుల్జార్ దృష్టి పడింది. అలా అలియా భట్, విక్కీ కౌశల్ ప్రధాన పాత్రలతో ఈ సినిమా తెరకెక్కి అలరించింది.

సెహమత్ ఎప్పుడు గుఢచారిగా పాక్ లోకి ఎంట్రీ ఇచ్చింది..?

సెహమత్ ఢిల్లా కళాశాలలో చదువుతుండేది. ఆమె తండ్రి హిదాయత్ స్వాతంత్ర్య సమరయోధుడు, వ్యాపారవేత్త. క్యాన్సర్ తో బాధపడుతున్న ఆయనకు అప్పటికే ఇక తానెక్కువ కాలం బతకననీ అర్థమైపోయింది. ఆ సమయంలో కూతురుతో మాట్లాడే క్రమంలో గూఢచర్య వ్యవస్థతో తనకున్న సంబంధాలను ఆయన బిడ్డకు చెబుతుండేవాడు. దేశానికి సేవ చేయాలన్న తన కోరికలు కూతురు సెహమత్ ను ప్రభావితం చేశాయి. ఆమెనేం తండ్రి బలవంతం చేయలేదు. కానీ, తండ్రి చేయలేకపోయింది.. తాను చేయాలని సెహమత్ నిర్ణయించుకుంది.

దేశం కోసం సేవ చేయాలన్న తపనతో సెహమత్ తన చదువును, కళలపై అప్పటికే తనకున్న ఆసక్తిని, అప్పటికే ఒకరితో ఉన్న లవ్ స్టోరీని కూడా కాదని భారత గూఢచారి వ్యవస్థలో తండ్రి సాయంతో అత్యవసర శిక్షణ పొందింది.

మరి పాక్ ఆర్మీ అధికారితో సెహమత్ వివాహమెలా జరిగింది..?

వ్యూహాత్మకంగా పాకిస్థాన్ తో సంబంధం కలుపుకున్నారు. తండ్రి ముస్లిం కావడం, పాకిస్థాన్ లోనూ బంధువర్గముండటంతో… ఆ అవకాశం దక్కింది. అలా సెహమత్.. ఇక్బాల్ సయ్యద్ అనే పాకిస్థానీని వివాహం చేసుకునేలా స్కెచ్ వేశారు. ఇక్బాల్ పాకిస్థాన్ లో ఓ ఉన్నతస్థాయి సైనికాధికారి కుమారుడు. ఆ వివాహంతో సెహమత్ కు పాక్ సైనిక వ్యవస్థలోని కీలకమైన సమాచారం, సైనిక కదలికలు, వ్యూహాత్మక చర్చలను దగ్గరగా ఉండి తెలుసుకునే అవకాశం దక్కింది. సెహమత్ తండ్రి వ్యాపార నేపథ్యం.. పాక్ తో బంధం వంటివి ఎలాంటి అనుమానాలూ ఆమెపై రాకుండా నడిపించాయి.

వాస్తవానికి అదో వేషం వేసి పాత్రలో పరకాయ ప్రవేశం చేయడం కాదు.. తన అసలు గుర్తింపు బయటపడితే ప్రాణాలకే ప్రమాదం. అలాంటిచోట అడుగుపెట్టింది సెహమత్ ఖాన్.

సెహమత్ పాకిస్థాన్ లో ఎలా పనిచేసింది..?

ముందుగా కోడలిగా పాక్ లో తన కుటుంబ సభ్యుల నమ్మకాన్ని సంపాదించింది. ఓవైపు ఇంటి బాధ్యతలు నిర్వర్తిస్తూనే.. మరోవైపు, గూఢచర్య కార్యకలాపాలను అత్యంత జాగ్రత్తగా కొనసాగించింది. అలా పాకిస్థాన్ లోని అత్యున్నత అధికార వర్గాల వరకూ తన చొరవతో వెళ్లగల్గింది. పాకిస్థాన్ ఆర్మీ కమాండర్ ఇన్ చీఫ్ గా పనిచేసిన, పాక్ మూడో అధ్యక్షుడైన యాహ్యా ఖాన్ మనుమలకు పాఠాలు చెప్పేందుకు ఆమె టీచర్ గా కుదిరింది. అలా పాక్ లోని అత్యున్నత అధికార వర్గాలకు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకునే అవకాశాన్ని దక్కించుకుంది. అంటే సెహమత్ ఖాన్ ఏ ఉద్ధేశంతోనైతే గూఢచారిగా ఇండియా నుంచి పాక్ కు వచ్చిందో ఆ లక్ష్యం దాదాపు సగం నెరవేరినట్టే.

ఆమె పంపే సమచారాన్ని భారత గూఢచార సంస్థలు ధృవీకరించుకుంటే.. ఇతర భారత నిఘా నివేదికలతో ఆమె పంపే సమచారం పూర్తి స్థాయిలో సరిపోలేది.

ఐఎన్ఎస్ విక్రాంత్ ను సెహమత్ ఎలా కాపాడింది..?

భారత గూఢచారిగా దేశానికి సెహమత్ ఖాన్ అందించిన అత్యంత కీలక సమాచారాల్లో ఐఎన్ఎస్ విక్రాంత్ పై పాకిస్థాన్ దాడి కుట్ర గురించి చెప్పుకోవాలి. పాక్ అప్పటికే ఎలాంటి ప్రణాళికలు రచిస్తుందో భారత్ కు చేరవేసింది. 1971 యుద్ధ కాలంలో భారత నౌకాదళానికి అత్యంత ముఖ్యమైన యుద్ధ నౌకల్లో ఐఎన్ఎస్ విక్రాంత్ కూడా ఒకటి. యాంటీ సబ్ మెరైన్ యుద్ధ సామర్థ్యాలు, హెలికాప్టర్ ల్యాండింగ్ కార్యకలాపాలకు అనువైన సదుపాయాలతో భారతదేశ సముద్ర రక్షణలో కీలకపాత్ర పోషించింది ఐఎన్ఎస్ విక్రాంత్.

సెహమత్ ఇచ్చిన సమాచారాన్ని నిఘా వ్యవస్థల ద్వారా రూఢీ చేసుకున్న భారత నేవీ దళం పాక్ దాడులు ప్రణాళిక నుంచి అప్రమత్తమైంది. మొత్తంగా భారత నౌకదళ సామర్థ్యంలో కీలకమైన ఐఎన్ఎస్ విక్రాంత్ కు జరుగబోయే ప్రమాదాన్ని ముందే సెహమత్ ఇచ్చిన సమాచారంతో భారత్ అడ్డుకోగల్గింది.

సెహమత్ వ్యక్తిగా కోల్పోయిందేమిటి..?

గూఢచర్యమంటే సమాచారాన్ని సేకరించి భారత్ కు పంపడమే కాదు.. కొన్నిసార్లు అది మనసును జీవితాంత వేధించే నిర్ణయాలను కూడా తీసుకోవాల్సిన పరిస్థితులను సృష్టిస్తుంది. అలా పాకిస్థాన్ గడ్డపైకి కోడలిగా వెళ్లడం సుతారమూ ఇష్టమూ లేకున్నా.. దేశం కోసం వెళ్లిన నిజమైన సేవకురాలు, భక్తురాలు సెహమత్ ఖాన్. ఒకానొక సమయంలో సెహమత్ పై పాక్ లోని తన అత్తగారింట్లో అనుమానాలు మొదలయ్యాయి. ఆ సమయంలో తన ఐడెంటిటీని బయటపడకుండా… అప్పటికే ప్రెగ్నెన్సీతో ఉన్న సెహమత్ భారత్ కు చెందిన కొందరి సాయంతో తిరిగి తన సొంత దేశానికి వెనక్కి వచ్చేసింది.

భారత్ – పాక్ యుద్ధం ముగిశాక సెహమత్ పరిస్థితేంటి..?

భారత్ కు తిరిగి వచ్చాక సెహమత్ తన గర్భంలోని బిడ్డను తీసేయాలని చాలామంది కోరినా అందుకు నిరాకరించింది. అంతకుముందు తన లవర్ అయిన అభినవ్ ఆమెను వివాహం చేసుకుని.. పుట్టే బిడ్డను తన సొంత బిడ్డగా పెంచుకుందామని కోరినా ఆమె నిరాకరించింది. కానీ, తన కుమారుణ్ని అభినవ్ దత్తత తీసుకోవడానికి మాత్రం అంగీకరించింది. ఆ తర్వాత ఆ బాలుడికి సమర్ ఖాన్ అనే పేరు పెట్టారు. ఆ తర్వాత అతను మళ్లీ తల్లి, తాతలాగే దేశభక్తితోనే పెరిగి పెద్దై.. భారత సాయుధ దళాల్లో చేరాడు. అది తల్లిగా జీవితాంతం సెహమత్ ఖాన్ కు గర్వంగా మారిన క్షణం.

సెహమత్ కథ చాలాకాలం ఎందుకు రహస్యంగా ఉండిపోయింది..?

హరీందర్ సిక్కాకు సెహమత్ జీవిత కథను పుస్తకంగా మల్చడానికి ఎనిమిదేళ్లు పట్టిందట. పైగా ఆమె జీవితానికి సంబంధించిన వివరాలను బయటపెట్టడం వల్ల ఆమె కుటుంబానికి కూడా ప్రమాదం సంభవించే అవకాశాలెక్కువ అనే ఉద్ధేశంతో కూడా ఆమె గూఢచర్య కథ ఆలస్యంగా వెలుగులోకొచ్చింది.

మరి సెహమత్ కు ఏం దక్కింది..?

చిన్న చిన్నవాటికే గొప్పలు పోయి.. ఐడెంటిటీ కోసం తాపత్రయపడే సమాజంలో సెహమత్ మాత్రం ఎలాంటి ప్రతిఫలాన్నీ కోరుకోలేదు. ఆమె కోరుకున్నదొక్కటే.. తన ఇంటిపై జాతీయ జెండా రెపరెపలాడటం. దాన్ని కూడా ఎలాంటి ఆర్భాటం, ప్రచారం లేకుండానే నిశ్శబ్దంగా కొనసాగించింది సెహమత్.

దేశభక్తి గురించి మరి సెహమత్ కథ ఏం చెబుతుంది..?

దేశభక్తి గురించి ఛాతీ ఉబ్బించి చెప్పే నేతలున్న సమాజంలో… భవబంధాలనూ వదిలి… వ్యక్తిగత జీవితాన్ని, ప్రేమలు, ఆప్యాయతలు వదిలి బాధ్యతను మించి దేశానికి సేవ అందించిన గొప్ప కథ సెహమత్ ది. గొంతెత్తి అరిస్తేనే దేశభక్తి అనుకునేవారు… ఎలాంటి గుర్తింపుకు నోచుకోకపోయినా, ప్రతిఫలాలు ఆశించకుండా త్యాగాలకూ వెనుకాడని సెహమత్ కథ ఓ చెంపపెట్టు. అందుకే సెహమత్ మన మధ్య లేకపోయినా.. 1971లో జరిగిన భారతదేశ యుద్ధ చరిత్రలో రహస్య సమాచారాన్ని చేరవేసిన ఓ మహిళా గూఢచారిగా ఆమె పేరు ఎప్పటికీ శాశ్వతం.

రాజీ సినిమా ద్వారా ఈమె పేరు మరింత వెలుగులోకొచ్చింది. కోట్లాదిమందికి చేరువైంది. దేశం కోసం చేసిన కొందరి సేవకు, త్యాగాలకు చప్పట్లు, పురస్కారాలు ఉండకపోవచ్చు.. ఇలాంటి స్పై వ్యవహారాల గురించి మాట్లాడే అవకాశమే లభించకపోవచ్చు.. నిశ్శబ్ద త్యాగానికి ప్రతీకలుగా మాత్రం సెహమత్ ఖాన్ కథ ఎప్పటికీ గుర్తుండిపోతుంది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles