బాలీవుడ్ సూపర్ స్టార్ రాజేష్ ఖన్నా మరణం వరకూ కూడా ఆశీర్వాద్ అనే బంగ్లా బాలీవుడ్ కు ఓ హిస్టారికల్ అడ్రస్. అయితే ఆ బంగ్లా వెనుక ఉన్న కథతో పాటే.. మొదట ఆ బంగ్లా యజమాని గురించీ చెప్పుకోవాలి. ప్రతిభ ఒక్కటే ఉంటే కాదు.. ఉచ్ఛ స్థాయిని చూసిన జీవితం అంతే స్థిరంగా సాగాలంటే కొంత క్రమశిక్షణ, స్వీయ నియంత్రణ ఎంత అవసరమో చెప్పేది ఈ బాలీవుడ్ స్టార్ హీరో కథ.
ఆయనే భరత్ భూషణ్. 71 ఏళ్లకు మరణించారు. 1950ల కాలంలో స్టార్ భరత్ భూషణ్. మీరట్ జన్మస్థలి. అలీగఢ్ లో పెరిగాడు. నటుడిగా మారాలన్న చాలామందిలాంటి కోరికతోనే ముంబైకి చేరుకున్నాడు. 1941 చిత్రలేఖతో సినీ ప్రయాణాన్ని ఆరంభించాడు. 1952లో వచ్చిన బైజూ బావరా భరత్ భూషణ్ సినీ కెరీర్ కు మంచి బ్రేకునిచ్చింది. ఈ ఒక్క సినిమా భరత్ భూషణ్ ఆ దశాబ్ద కాలానికే అగ్రస్థాయి నటుడిగా నిలబెట్టింది.

ఆ తర్వాత ఆనంద్ మఠ్, మీర్జా గాలిబ్, బర్సాత్ కీ రాత్ వంటి చిత్రాల్లో తన మృదువైన నటనతో తనకు ఓ అభిమానగణాన్నే సంపాదించుకునేంతగా ఎదిగాడు. తను శిఖర స్థాయికి చేరుకోవడంతో పాటే.. బాలీవుడ్ అత్యంత సంపన్న నటుల్లో ఒకడిగా ఎదిగాడు.
చివరికేమైంది…?
జూదం వ్యసనంగా మారింది. ఆర్థికంగా దివాళా తీసేందుకు కారణమైంది. దానికి తోడు సినీ నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టి చేయి కాల్చుకున్నాడు. జూదంతో డబ్బు, కార్లు, బంగ్లా ఇలా అన్నీ అమ్ముకున్నాడు. అంత్యకాలమందు అత్యంత విషాదాన్ననుభవించాడు. కష్టపడి ఎదిగి రాజులా జీవించి.. చివరకు మళ్లీ జీవనోపాధి కోసం తన వస్తువులు, కార్లు, పుస్తకాలు, ఇళ్లు అమ్ముకున్నాడు. ఇక జీవించడానికి డబ్బు అవసరం పడి జూనియర్ ఆర్టిస్టుగా కూడా పనిచేసినట్టు చెబుతుంటారు.
ఐకానిక్ బంగ్లా ఆశీర్వాద్ వెనుక కథేంటి..?

అమితాబ్ కు ముందు బాలీవుడ్ ను ఒంటి చేత్తో ఏలిన సూపర్ స్టార్ రాజేశ్ ఖన్నా అంటే ఆయన సినిమాలతో గుర్తొచ్చేది ఆశీర్వాద్ బంగ్లానే. ఎందుకంటే, ఈ బంగ్లా బాలీవుడ్ హిస్టరీలో ఓ ఎస్సెట్ గా.. చారిత్రక చిరునామాగా ప్రసిద్ధి చెందింది. ఖన్నా స్టార్ డమ్ కు ప్రతీకలా నిలువెత్తు నిల్చింది. అయితే, ఈ బంగ్లా మొట్టమొదటి ఓనర్ భరత్ భూషణే. అవును.. 1950ల కాలంలోనే ముంబై సముద్రం ఒడ్డున బాంద్రా వద్ద ఈ బంగ్లా నిర్మించారు భరత్ భూషణ్. కష్టకాలంలో ఆశీర్వాద్ ను రాజేంద్ర కుమార్ కొన్నాడు. ఆ తర్వాత రాజేంద్ర కుమార్ నుంచి రాజేశ్ ఖన్నా వశమైంది. ఖన్నా మరణం వరకూ కూడా ఆశీర్వాద్ బంగ్లా అంటే ముంబైలో ఓ స్పెషల్ టూరిస్ట్ ప్లేస్.
భరత్ భూషణ్ పతనానికి ఇంకేం కారణాలున్నాయి..?
ఏవిధంగా ఖ్యాతి సంపాదించాడు.. అదే విధంగా డబ్బు వచ్చిపడింది. కానీ, ఆ హోష్ లో తానేం చేస్తున్నాడన్న ఆలోచనల నుంచి కాస్త పక్కకు జరిగాడో.. లేక, తన అంచనాలే తలక్రిందులయ్యాయో తెలీదుగానీ… ఆర్థికంగా తప్పుడు నిర్ణయాలే ఎక్కువ. బైజు బావరా విజయం తర్వాత తన సోదరుడితో కలిసి సినిమా నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టి.. వరుసగా తన నిర్మాణంలోని సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ నష్టాలు చవిచూడటంతో ఒక్కసారిగా భరత్ భూషణ్ ను కష్టాలు చుట్టుముట్టాయి.
ఆ కష్టాల్లోంచి రిలాక్సేషన్ కోసం జూదం ఆడటం మొదలెట్టాడు. అది అలవాటుగా.. ఆ తర్వాత వ్యసనంగా మారిపోయింది. చివరకు విలాసవంతమైన జీవితాన్ని చూసిన అదే భరత్ భూషణ్.. దివాళా అంచులకు చేరుకున్నాడు.
1992, జనవరి 27న కన్నుమూసిన భరత్ భూషణ్ జీవితం.. ప్రతిభతో మనిషి ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చేమోగానీ.. ఆర్థిక వ్యవహారాల్లో విధానపరమైన నిర్ణయాలు లేకపోతే.. వాటికి తోడు దుర్వ్యసనాలకు బానిసలైతే.. క్రమశిక్షణ తప్పితే.. ఎంతటి వారైనా కుప్పకూలిపోవాల్సిందేనన్న పాఠాన్ని చెబుతుంది భరత్ భూషణ్ స్టోరీ.



