టర్టిల్ వాకర్… ఈ డాక్యుమెంటరీకి గత ఏడాది అమెరికాలో అవార్డుల పంట పండింది. మరెవరు ఆ టర్టిల్ వాకర్….?
అంతరించిపోతున్న సముద్ర తాబేళ్ల ఉనికికై పోరాడాడు. అందుకోసం 7 వేల 516 కిలోమీటర్ల మేర బహుదూరపు బాటసారై నడిచాడు. ఎవరి మద్దతూ లేకున్నా.. ఓ చిన్న ట్రాన్సిస్టర్ తో, తన దగ్గరున్న స్ఫూర్తితోనే… పరిశోధన చేసి వాటి అస్తిత్వాన్ని కాపాడేందుకు నడుంబిగించాడు. అతనే.. సతీష్ భాస్కర్.
అందుకే, ఆ సతీష్ భాస్కర్ లైఫ్ స్టోరీని టర్టిల్ వాకర్ పేరుతో డాక్యుమెంటరీగా తెరకెక్కించారు తైరామలానీ అనే రచయిత్రి.

సతీష్ భాస్కర్ 7 వేల 516 కిలోమీటర్ల లైఫ్ జర్నీని 75 నిమిషాల్లో డాక్యుమెంటరీలో జొప్పించి చూపించడం పూర్తిగా సాధ్యపడకపోవచ్చునేమోగానీ.. టర్టిల్ వాకర్ డాక్యుమెంటరీలో ఆ స్పిరిట్ ను పట్టిచూపించారు. కాబట్టే తైరా మలానీ డాక్యుమెంటరీకి న్యూయార్క్ డాక్యుమెంటరీ ప్రదర్శనల్లో స్థానం లభించింది. అవార్డులూ కొల్లగొట్టింది.
గోవాకు చెందిన ఎమాహో ఫిల్మ్స్ స్టూడియో.. తైరా మలానీ దర్శకత్వంలో ఈ టర్టిల్ వాకర్ ను నిర్మించింది. న్యూయార్క్ డాక్యుమెంటరీ ప్రదర్శనకు ముందే జాక్సన్ వైల్డ్ మీడియా అవార్డుల్లో అత్యున్నతమైన గ్రాండ్ టైటాన్ అవార్డును కూడా ఈ టర్టిల్ వాకర్ డాక్యుమెంటరీ సొంతం చేసుకుంది. పర్యావరణ పరిరక్షణ, జీవవైవిధ్యాన్ని కాపాడే అంశాల్లో భాగంగా సముద్ర తాబేళ్ల కోసం తన జీవితాన్ని అంకితం చేసిన భాస్కర్ కథను.. నేటి సమాజాన్ని చైతన్యపర్చే ఓ ఉత్తేజకర డాక్యుమెంటరీగా మల్చారు తైరామలానీ. అందుకే సినీ దర్శకులైన జోయా అక్తర్, రీమా కాగ్టీ యాజమాన్యంలో నడిచే టైగర్ బేబీ, టాంగిల్డ్ బ్యాంక్ వంటి ప్రముఖ స్టూడియోస్ కూడా ఈ డాక్యుమెంటరీని న్యూయార్క్ డాక్యుమెంటరీ ప్రదర్శనకు పంపించేందుకు సమర్థించాయి.
టర్టిల్ వాకర్ ఏదో ప్రకృతి రమణీయమైన డాక్యుమెంటరీలా రూపొందించి మమ అనిపించింది కాదు. భారతదేశ సముద్రతీర ప్రాంతంలో సతీష్ భాస్కర్ ఒంటరి ప్రయాణాన్ని కళ్లకు కట్టేది. సముద్ర తాబేళ్లతో పాటు… జనావాసాలు కనిపించని దీవుల్లో అక్కడి సముద్ర జీవుల కోసం నెలల తరబడి ఆయన చేసిన పరిశోధనను కళ్లకుగట్టేది. సముద్ర తాబేళ్ల పరిశోధనలో భాగంగా భాస్కర్ ఏడు వేల ఐదొందల కిలోమీటర్లకుపైగా తాను ఒంటరిగానే నడిచినా.. ఏనాడూ తాను ఒంటరిననుకోలేదంటాడు. లక్షద్వీప్ లోని ఓ మారుమూల ద్వీపమైన సుహేలిపారా ద్వీపంలో శిథిలావస్థలో ఉన్న ఓ గుడిసెలో తానున్నప్పుడు.. పక్కనే సముద్ర తాబేళ్ల గుడ్లు పెట్టడాన్ని గుర్తు చేసుకుంటాడు. అలా ఆ సముద్ర తాబేళ్ల పరిశోధనలోనే ఇంటిని వదిలి ఏకంగా ఓసారి ఐదునెలల పాటు గడిపాడు. పెన్నూ, పేపర్లు లేని ఆ దీవుల్లో గాజు సీసాల్లోనే తన భార్య బ్రెండాకు లేఖలు రాశాడు. అందులో ఒక లేఖ గాజు సీసాలో రాసింది వయా శ్రీలంక బ్రెండాకు కూడా పంపించగల్గాడు భాస్కర్.

భాస్కర్ జీవితమంతా సముద్ర తాబేళ్లను అర్థం చేసుకోవడానికే సరిపోయింది. వాటి పరిశోధనకే సమయమంతా కేటాయించాడు. అలా, సముద్ర తాబేళ్లపై ఒక 50 నివేదికలు తయారుచేశాడు. పరిశోధనా పత్రాలను రాశాడు. కేరళ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, గుజరాత్, అండమాన్ నికోబార్ దీవులతో పాటు.. ఇండోనేషియాలోని పశ్చిమ షాపూవా వరకూ భాస్కర్ సముద్ర తాబేళ్ల పరిశోధనా ప్రయాణం సాగింది. తాను లక్షద్వీప్ లోని సుహేలీ దీవిలో ఉన్నప్పుడు వర్షాకాలంలో తాబేళ్లు గుడ్లు పెట్టే ప్రాంతానికి వెళ్లాడు. కానీ, తాను ఏర్పాటు చేసుకున్న షెల్టర్ వద్దకు తిరిగి చేరుకోలేకపోయాడు. దాంతో ఆ సీజన్ మొత్తం భాస్కర్ అక్కడే గడిపాల్సి వచ్చింది.
టర్టిల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పేరుగాంచిన సతీష్ భాస్కర్ సముద్ర తాబేళ్ల పరిశోధనలో భాగంగా చేసిన జర్నీలో ఉత్తర అండమాన్ సౌత్ రీఫ్ ఐల్యాండ్ పర్యటన ఆయనకు బాగా సంతృప్తినిచ్చింది. అక్కడ సతీష్ భాస్కర్ సముద్ర తాబేళ్లలో అరుదైన జాతి, ఒంటరిగా జీవించే హాక్స్ బిల్స్ గూళ్లు కట్టే విధానాలను దగ్గరగా పరిశీలించగల్గాడు. అయితే, 2004లో వచ్చిన సునామీ వల్ల విచారకరంగా ఆ ద్వీపమే పూర్తిగా ధ్వంసమైపోయింది. పడవల్లో చేరుకోవడానికి కూడా చాలా ప్రమాదకరమైన ద్వీపమది. అక్కడి హాక్స్ బిల్స్ ప్రత్యుత్పత్తి విధానాలపై పరిశోధన చేయడానికి భాస్కర్ మళ్లీ కూడా ఆ సౌత్ రీఫ్ ను సందర్శించాలనుకున్నాడు. ఆ ప్రాంతానికి తిరిగి వెళ్లినప్పుడు అతణ్ని డైవ్ చేయించడానికి కూడా మాకు మనసు ఒప్పలేదంటారు టర్టిల్ వాకర్ రచయిత్రి, దర్శకురాలైన మలానీ. అప్పటికే 73 ఏళ్ల వయస్సున్న భాస్కర్ ట్రైజెమినల్ న్యూరాల్జియా అనే నరాల వ్యాధితో పోరాటం చేస్తున్నాడు. అయినా సరే, భాస్కర్ మాత్రం ఆ ప్రమాదకర ద్వీపంలో డైవ్ చేశాడు. ఆయన వెనుకే కొందరు గజ ఈతగాళ్లైన సిబ్బంది కూడా ఉన్నప్పటికీ.. తన జీవిత లక్ష్యం కోసం భాస్కర్ ఎలా తపనపడుతున్నాడనే అంశం తనను కదిలించిందంటుంది తైరామలానీ. ఆ స్ఫూర్తే టర్టిల్ వాకర్ డాక్యుమెంటరీ నిర్మాణాన్ని మరింత ఆసక్తిగా తీసేందుకు పురిగొల్పిందని వెల్లడించింది.
1970ల కాలంలోనే సముద్ర తాబేళ్ల మాంసం, గుడ్ల కోసం జరుగుతున్న దోపిడీతో వాటి ఉనికికే ముప్పు పరిణమించిందని భావించిన సతీష్ భాస్కర్ ఏకంగా 19 ఏళ్ల పాటు వాటికోసం అన్వేషణ, పరిశోధన చేశాడు. తాబేళ్లు, వాటిల్లో రకాలు, వాటి గుడ్లు, వాటి బరువు, అవి గూళ్లు కట్టుకునే తీరు, తాబేళ్ల పాదముద్రల ఆకారం ఇలా వాటిపైన ఓ సమగ్రమైన పరిశోధన గావించాడు. లక్ష్యద్వీప్ తో పాటు, అండమాన్ దీవుల్లో ముప్పావు భాగాన్ని కవర్ చేసిన సముద్ర యాత్రికుడు భాస్కర్. అక్కడే హాక్స్ బిల్, లెదర్ బ్యాక్ తాబేళ్ల వంటివాటిని గుర్తించాడు. సతీష్ భాస్కర్ పరిశోధన.. ఆ తర్వాత రీసెర్చర్స్ కు ఓ దారి దీపమైంది. ఆ తర్వాత కార్తీక్ శంకర్, అదిత్ స్వామినాథన్ వంటి సైంటిస్టులు సతీష్ భాస్కర్ దారిలోనే నడిచి మరింత అన్వేషించారు.

భాస్కర్ ను తైరామలానీ ఎలా కలుసుకున్నారు..?
సరీసృపాలు, ఉభయచరాల అధ్యయనం చేసే శాస్త్రవేత్తైన హెర్పటాలజిస్ట్ రోములస్ విటేకర్ రాసిన ఆర్టికల్స్ చదివి సతీష్ భాస్కర్ స్టోరీని డాక్యుమెంటరీగా మల్చాలనుకుంది తైరామలానీ. అలా సతీష్ భాస్కర్ ను కలిసి ఆయనతో కలిసి రోజుల పాటు ప్రయాణించింది. ముందు పరిశీలించింది. అధ్యయనం చేసింది. అయితే, భాస్కర్ తో జర్నీలో ఆయన కాస్త సిగ్గరి కావడంతో కెమెరా ముందు అన్నీ చెప్పలేకపోయేవారు. తన అనుభవాల వరకు మాత్రమే పరిమితమయ్యేవారు. కానీ, అంతకుమించి తాబేళ్ల సంరక్షణలో తన భావోద్వేగాలెలాంటివో తెలుసుకోవాలంటే చాలా కష్టపడాల్సే వచ్చిందంటారు తైరామలానీ. తైరామలానీ నిర్మించిన టర్టిల్ వాకర్ లో సతీష్ భాస్కర్ పాత్రను రోహన్ జోగ్లేకర్ అచ్చూ ఆయనలాగే పోషించారు. మొత్తంగా టర్టిల్ వాకర్ పూర్తి కావడానికి ఏకంగా ఏడేళ్ల సమయం పట్టింది. 2023 వరకూ కూడా ఆ డాక్యుమెంటరీని నిర్మిస్తున్నకొద్దీ దాన్ని సతీష్ భాస్కర్ కూ చూపించారు. కానీ, డాక్యుమెంటరీ పూర్తయ్యేసరికి సతీష్ భాస్కర్ కన్నుమూశారు.
డాక్యుమెంటరీ నిర్మాణంలో ఎన్నో సవాళ్లను ఫేస్ చేసింది తైరామలానీ బృందం. రాత్రి పూట గూడు కట్టుకునేందుకు వచ్చే సముద్ర తాబేళ్లను ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా చిత్రీకరించేందుకు ఇన్ఫ్రా రెడ్ కెమెరాలను ఉపయోగించారు. మొత్తంగా ఓ తాబేళ్ల అన్వేషకుడు, పరిశోధకుడు.. టర్టిల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని కీర్తించబడ్డ సతీష్ భాస్కర్ డాక్యుమెంటరీ నిర్మాణం, ఆ తర్వాత దానికి దక్కుతున్న ఆదరణతో సతీష్ భాస్కర్ పేరు అంతర్జాతీయ స్థాయికి చేరుకుంది.
మృత్యువును ధిక్కరించే పరిశోధనతో… సంద్రమంత ప్రేమతో తాబేళ్లను తన సొంత పిల్లల్లా భావించి వాటి ఉనికి, అస్తిత్వం కోసం పోరాటం చేసిన పర్యావరణ ప్రేమికుడు సతీష్ భాస్కర్.



