ఆవిష్కర్తల ఎగుమతి.. ఆవిష్కరణల దిగుమతి! సంధు స్టోరీ విన్న సోషల్ మీడియా.. ఏం ప్రశ్నిస్తోంది?

భారత్ ఇంజనీర్లను తయారుచేస్తుంది… అమెరికా పేటెంట్లను ఫైల్ చేస్తుంది. ఇండియా ఆవిష్కర్తలను ఎగుమతి చేస్తుంది.. చిప్స్ ను దిగుమతి చేసుకుంటుంది. ఇది గర్వకారణమా…? కాదు.. మన ఖర్మ! మరి లోపమెక్కడుంది..? ఈ స్టోరీతో ఈ చర్చ ఇప్పుడు సోషల్ మీడియాలో ఉపందుకుంటోంది.

భారత్ నుంచి అమెరికా వెళ్లాడు. ఇప్పుడు ప్రపంచంలోనే ఏడో అత్యుత్తమ ఆవిష్కర్తగా నిల్చాడు.పేటెంట్లలో థామస్ అల్వా ఎడిసన్ రికార్డును కూడా బ్రేక్ చేశాడు. అయితే, ఈ రికార్డులకు గర్వపడాలో… లేక, దేశం కోల్పోతున్న ఇలాంటి ప్రతిభావంతుల గురించి బాధపడాలో తెలియని పరిస్థితిపై చర్చకు తెర లేపాడు.

X వేదికగా వచ్చిన ఓ పోస్ట్.. బ్రెయిన్ డ్రెయిన్ ప్రభావాన్ని మరింత ప్రభావవంతంగా ఇప్పుడు లోకముందుంచుతోంది. ఇంతకీ ఏ వ్యక్తి గురించి ఇంత చర్చకు తెరలేచిందంటారా..? తను గుర్తేజ్ సంధు. అమృత్ సర్ కు చెందిన గుర్తేజ్ ఢీల్లీలో ఐఐటీ పూర్తి చేసుకుని.. అమెరికాలో అత్యంత ప్రతిష్ఠాత్మక ఆవిష్కర్తగా నిల్చి ఇప్పుడు ఈ చర్చకు తెర తీశాడు.

భారతదేశంలోని ఐఐటీలు, ఎన్ఐటీలు, ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీలు, ఇంకా ఎన్నో ఇతర కోర్సులను నిర్వహిస్తున్న యూనివర్సిటీల్లో అద్భుతమైన ప్రతిభావంతులు తయారవుతున్నారు. కానీ, ఏం లాభం..? భారత్ ఇంజనీర్లను తయారుచేస్తుంది… ఆ ఇంజనీర్స్ మల్టీ నేషనల్ కంపెనీస్ లో పనిచేస్తున్నారు. అలా టెక్ సీఈవోల నుంచి అంతరిక్ష శాస్త్రవేత్తల వరకూ అనేకమంది భారతీయ మూలాలున్నవారు ఇప్పుడు అమెరికా అభివృద్ధిలో భాగస్వామ్యులు. అందులో ఒకరే గుర్తేజ్ సంధు.

అసలు గుర్తేజ్ సంధు ఆ స్థాయికెలా చేరుకున్నాడు..?

ప్రతిభావంతులైన భారతీయులు ఇతర ప్రాశ్చాత్య దేశాల అభివృద్ధిలో భాగస్వాములవుతున్న నేపథ్యంలోనే.. గుర్తేజ్ సంధు సాధిస్తున్న విజయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అదే సమయంలో ఇంత మంచి ప్రతిభావంతులు మన దేశానికి కాకుండా ఇతర దేశాలకు ఉపయోగపడటంపైనా చర్చకు తెరలేచింది. ఈ క్రమంలోనే గుర్తేజ్ సంధు స్టోరీ అందుకు ఊతమైంది.

గుర్తేజ్ సంధు మైక్రాన్ టెక్నాలజీలో సీనియర్ ఫెల్లో. సంస్థ వైస్ ప్రెసిడెంట్. మైక్రో ఎలక్ట్రానిక్స్ రంగంలో సంధు సాధించిన విప్లవాత్మక విజయాలు, తీసుకొచ్చిన మార్పులు మనం గర్వించదగ్గవే. కానీ, అదే సమయంలో ఆయనతో పాటే, ఇలాంటివారంతా ఇతర దేశాల సాంకేతికాభివృద్ధిలో భాగస్వాములవ్వడం మరోవైపు చర్చనీయాంశమే.

గుర్తేజ్ సంధు జన్మించింది లండన్ లోనే అయినా.. మూలాలు మాత్రం భారత్ వే. చిన్ననాట జీవితాన్నీ భారత్ లో గడిపారు. సంధు తండ్రి ప్రొఫెసర్ ఎస్. ఎస్. సంధు గురునానక్ దేవ్ యూనివర్సిటీ కెమిస్ట్రీ విభాగానికి తొలి అధిపతి.

సంధు ఎలక్ట్రిక్ ఇంజనీరింగ్ లో ఢిల్లీ ఐఐటీ నుంచి తన బీటెక్ పూర్తి చేశారు. గురునానక్ దేవ్ యూనివర్సిటీలో ఎంఎస్సీ ఫిజిక్స్ చదివారు. ఆ తర్వాత యూనివర్సిటీ ఆఫ్ నార్త్ కరోలినాలో ఫిజిక్స్ లో పీహెచ్డీ చేశారు. సెమీ కండక్టర్స్ రంగంలో అత్యున్నత సంస్థగా కొనసాగుతున్న మైక్రాన్ లో వైస్ ప్రెసిడెంట్ స్థాయికెదిగిన సంధు.. సెమీ కండక్టర్ స్కేలింగ్ లో చేసిన కృషికి 2018లో ఐఈఈఈ ఆండ్రూ ఎస్. గ్రోవ్ అవార్డ్ అందుకున్నారు.

సంధు సాధించిన ఆవిష్కరణలేంటి..?

గుర్తేజ్ సంధు మైక్రో ఎలక్ట్రానిక్స్ రంగంలో విశేషానుభవం కల్గిన వ్యక్తి. థిన్ ఫిల్మ్ ప్రాసెస్, వీఎల్ఎస్ఐ, సెమీ కండక్టర్ ఫ్యాబ్రికేషన్ వంటి విభాగాల్లో ఈయన నైపుణ్యం అపారమైనది.

ఆటోమేటిక్ లేయర్ డీపోజిషన్, ఆక్సిజన్ ఫ్రీ టైటానియం కోటింగ్, పిచ్ డబ్లింగ్ టెక్నిక్స్ వంటి వాటిల్లో సంధు సాధించిన విజయాలు.. మూర్స్ లా లో కీలకంగా మారాయి. వీటివల్ల చిన్న పరిమాణంలో, వేగవంతంగా స్పందించే, అధిక సామర్థ్యమున్న చిప్స్ తయారీకి బీజం పడింది. ఇవే నేడు మనం వాడుతున్న స్మార్ట్ ఫోన్స్, కెమెరాలు, క్లౌడ్ సిస్టమ్స్, ల్యాప్ టాప్స్ వంటివాటికెన్నింటికో ప్రధానాధారాలు.

సాంకేతిక పరిశ్రమ ఎదుగుదలలో సంధు పాత్రేంటి..?

సెమీ కండక్టర్స్ తయారీ రంగంలో గుర్తేజ్ సంధుది 30 ఏళ్ల పాత్ర. ముఖ్యంగా సిలికాన్ సీఎమ్వోస్ ప్రాసెస్ ద్వారా డీఆర్ఏఎమ్, ఎన్ఏఎన్జీ మెమరీల అభివృద్ధికి కృషి చేసి ఇవాళ మనం వాడుతున్న మోబైల్ విప్లవంలో సంధు కీలకపాత్ర పోషించారు.

మైక్రాన్ టెక్నాలజీలో 35 ఏళ్లుగా పనిచేస్తూ.. ప్రస్తుతం బోయిస్, ఇడాహో వంటి సంస్థల్లో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ టెక్నాలజీ రోడ్ మ్యాప్సుకు నాయకత్వం వహిస్తున్నాడు. టెక్నాలజీ లోపాలను గుర్తించడం, బృందాలను సమన్వయపర్చడం, స్కేలబుల్ మెమరీ సొల్యూషన్స్ అభివృద్ధి పర్చడం ఈయన ప్రధాన బాధ్యతలు.

పేటెంట్లలో ప్రపంచ రికార్డ్!

2025లో గుర్తేజ్ సంధు ప్రపంచంలోనే 7వ అత్యధిక పేటెంట్స్ పొందిన ఆవిష్కర్తగా గుర్తింపు పొందారు. వరల్డ్ రికార్డ్సుల్లోకెక్కారు. ఇందులో 1 వెయ్యి 382 అమెరికన్ పేటెంట్స్, సుమారు 2 వేల 200 గ్లోబల్ పేటెంట్స్ సాధించి.. థామస్ అల్వా ఎడిసన్ పేటెంట్ల కంటే ఎక్కువ సంఖ్యలో సాధించి రికార్డ్ సృష్టించారు.

గురునానక్ దేవ్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కరమ్ జీత్ సింగ్… సంధు విజయాన్ని దేశానికి గర్వకారణమని కొనియాడారు. గుర్తేజ్ ప్రయాణం నేటి యువతకు ప్రేరణగా పేర్కొన్నారు.

బ్రెయిన్ డ్రెయిన్… ఒక చర్చ!

అయితే గుర్తేజ్ సంధు మైక్రో చిప్స్ టెక్నాలజీలో సాధించిన విజయాలు ఏ స్థాయిలోనైతే గుర్తింపు పొంది అప్లాజ్ అందుకుంటున్నాయో.. అదే స్థాయిలో సోషల్ మీడియా వేదికగా బ్రెయిన్ డ్రెయిన్ పై మరోవైపు చర్చ ఊపందుకుంది. గుర్తేజ్ వంటి ప్రతిభావంతులు విదేశాలకు వెళ్లి విజయాలు సాధించాల్సి రావడం.. అలాంటి అవకాశాలను భారత్ కల్పించలేకపోవడం.. అలాంటి ప్రతిభావంతులను ఉపయోగించుకోలేకపోవడం.. అవకాశాల కొరతపై చర్చకు తెర లేపింది.

భారత్ లో సరైన అవకాశాలుండి, విదేశాల తరహాలో వాతావరణాన్ని కల్పిస్తే ఇక్కడి ప్రతిభ ఈ దేశానికే ఉపయోగపడుతుంది. ఈ దేశ అభివృద్ధిలో భాగస్వామ్యమవుతుంది. విదేశాల్లో ప్రతిభకు ఎక్కువ ప్రాధాన్యమిస్తుంటే.. ఇక్కడ భారత్ లో మాత్రం కులం, మతం, రాజకీయం, వర్ణ వివక్షలు, లింగ భేదాల మధ్య ప్రతిభావంతులకు సరైన గుర్తింపు దక్కడం లేదన్న అభిప్రాయాలు సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్నాయి. అవకాశాలు దక్కక విదేశాలకు వెళ్లినవారు సైతం ఇప్పుడు మంచి ఆవిష్కర్తలుగా మారుతున్న ఉదంతాలను కూడా సోషల్ మీడియా వారియర్స్ చర్చిస్తున్నారు.

సంధూ సక్సెస్ సంధిస్తున్న ప్రశ్నలేంటి మరి..?

ది జియోస్ట్రాటా అంచనా ప్రకారం బ్రెయిన్ డ్రెయిన్ కారణంగా భారత్ ప్రతీ ఏటా 35 నుంచి 50 బిలియన్ డాలర్ల వరకూ నష్టపోతోందట. ఇది దేశ యువతపైనే కాదు.. దేశ ఆర్థికాభివృద్ధిపైనా తీవ్ర ప్రభావం చూపుతోంది.

గుర్తేజ్ సంధు ఓ భారతీయుడుగా సాధించిన విజయం ఓవైపు గర్వకారణమైతే.. మరోవైపు, ఈ దేశానికీ, ఇక్కడి పాలకులకు గంభీరమైన ప్రశ్నలను, సవాళ్లనూ ముందుంచుతోంది. ప్రతిభను నిలబెట్టుకునే వాతావరణాన్ని భారత్ ఇంకెప్పుడు సృష్టిస్తుందని సోషల్ మీడియా నిలదీస్తోంది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles