అక్కడికెళ్తే ఎంచక్కా బుక్ మారథాన్ చేయొచ్చు! ఏంటీ ఆ హిమగిరి గ్రామ ప్రత్యేకత..?

అది ప్రకృతి సిద్ధమైన హిమగిరి గ్రామం… అక్కడ ప్రకృతి ఎంత సౌందర్యంగా ఉంటుందో… ఆ గ్రామాన్ని పుస్తక పఠనం అంతే విశేషం గా నిలుపుతోంది. అందుకే, ఆ గ్రామాన్ని హిమాలయాల్లో మొట్టమొదటి గ్రంథాలయ గ్రామంగా పిల్చుకుంటున్నారు. హిమాలయాలకు పరుగులు పెట్టి ట్రెక్కింగ్ చేసే పర్యాటకులు ప్రయాణించే మార్గంలోనే ఉంది ఆ విలేజ్.

అందుకు మనం ఉత్తరాఖండ్ లోని రుద్రప్రయాగ్ జిల్లాకు వెళ్లాలి. అగస్త్యముని బ్లాకులో సముద్ర మట్టానికి 1 వెయ్యి 664 మీటర్ల ఎత్తులో ఉంది ఈ కుగ్రామమైన మణిగుహ్. ఇక్కడి నుంచి చౌఖంబా, సతోపంత్, థలయ్ సాగర్ వంటి హిమశిఖరాల అద్భుత దృశ్యాలను చూడొచ్చు. అయితే అదే సమయంలో ఇక్కడ పిల్లలు మోబైల్ స్క్రీన్స్ కు బదులు.. పుస్తకాల్లో మునిగిపోవడం నేటి కాలంలో కాస్త ఆశ్చర్యపరుస్తుంది. అందుకే, ఉత్తరాఖండ్ రాష్ట్రంలోనే ఈ గ్రామం ఓ ప్రత్యేక పేరును సంపాదించుకుంది.

20 వేల పుస్తకాల సంపద ఈ లైబ్రరీ విలేజ్ ప్రత్యేకత!

పుస్తక్ తీర్థ్ గా పిల్చుకునే మణిగుహ్ సెంట్రల్ లైబ్రరీలో ఏకంగా 20 వేల కంటే ఎక్కువ పుస్తకాలే ఉన్నాయి. హిందీ, ఇంగ్లీష్, ఉర్దూ, సంస్కృతం, కశ్మీరీ, పంజాబీ భాషల్లోని పలు పుస్తకాలకు కేంద్ర బిందువు ఆ పుస్తక్ తీర్థ్. సైన్స్ నుంచి సాహిత్యం వరకూ… చరిత్ర నుంచి పోటీ పరీక్షల సన్నాహక పుస్తకాల వరకూ… చిన్నారుల కథా పుస్తకాల వరకూ వివిధ రకాలకు కేరాఫ్.

అంతేకాదు, 1800 సంవత్సరం నుంచి 1905 మధ్యలో ప్రచురించబడిన నవల్ కిషోర్ ప్రెస్ వాళ్ల అరుదైన పుస్తక సంపద ఈ పుస్తక్ తీర్థ్ ప్రత్యేకత.

ఇక్కడి గ్రంథాలయ సేవలు పూర్తి ఉచితం. విద్యార్థులు, పోటీ పరీక్షల అభ్యర్థులు, తిరిగి విద్యను కొనసాగించాలనుకునే మహిళలు, పర్యాటకులు ఇలా ఎవ్వరైనా ఉచితంగా చదువుకునే వెసులుబాటు ఈ పుస్తక్ తీర్థ్ లో కల్పించారు.

కొండంత పఠనాసక్తి!

కొండలపైకెక్కిన ఈ పుస్తక పఠన సంస్కృతిలో మరో ప్రత్యేకతేంటంటే… ఈ పుస్తకాలన్నీ ఒకే చోట లైబ్రరీలాగా ఏర్పాటు చేయలేదు. హమారా గావ్ ఘర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో పుస్తక్ మందిర్ పేరిట ఎనిమిది చిన్న చిన్న పఠనా కేంద్రాలుగా ఈ లైబ్రరీలను ఏర్పాటు చేశారు. మనకు పుణ్యక్షేత్రాల్లో అడుగడుగునా ఓ గుడి కనిపించినట్టే.. ఇక్కడ కూడళ్లల్లో, చౌరస్తాల్లో ఒక్కో చోట ఒక్కో లైబ్రరీ దర్శనమిస్తుంది. ప్రతాప్ నగర్, ఖమోలీ, బండి, ఖల్యూ వంటి వివిధ ప్రాంతాల్లో.. గుళ్లు, ట్రెక్కింగ్ మార్గాల్లో ఈ లైబ్రరీలను ఏర్పాటు చేశారు.

అలా ఎక్కడ చూసినా సరస్వతీ నిలయాల్లా లైబ్రరీలను నెలకొల్పి.. చదువును ఓ అలవాటుగా మార్చింది ఈ మణిగుహ్ హిమాలయ గ్రామం.

జ్ఞానమార్గంలో ట్రెక్కింగ్!

ఈ ప్రాంతంలో ఉన్న కార్తీకస్వామి దేవాలయానికి వెళ్లే మార్గాన్ని జ్ఞానమార్గంగా అభివృద్ధి చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. అద్భుతమైన ఘాట్ రోడ్డులో హిమాలయాల సౌందర్యాన్ని ఆస్వాదిస్తూనే… సాహిత్యాన్నీ, పుస్తక పఠనాన్నీ పర్యాటకులు ఆస్వాదించేలా చేయాలన్నది ఇక్కడి గ్రంథాలయాల నిర్వాహకుల ఆలోచన.

పుస్తకాలతో పాటే, ఉపాధి మార్గాలు!

మణిగుహ్ ను లైబ్రరీ విలేజ్ గా అభివృద్ధి చేసి ఉత్తరాఖండ్ రాష్ట్రంలోనే విశేషంగా నిలబెట్టిన సంస్థలు.. తమ ప్రాజెక్టును కేవలం చదువుకు మాత్రమే పరిమితం చేయలేదు. గ్రామాభివృద్ధిలో భాగంగా ఉపాధి అవకాశాలనూ సృష్టిస్తున్నారు.

హస్తకళలకూ ప్రోత్సాహం!

అగ్ని ప్రమాదాలు అధికంగా కారణమయ్యే పైన్ చెట్లకు ఉత్తరాఖండ్ చిరునామా వంటింది. అదిగో ఈ చెట్ల ఎండిన ఆకులను ఉపయోగించి మహిళలకు ఇక్కడ హస్తకళల శిక్షణనిస్తున్నారు. ఈ ఆకులతో తయారుచేసిన రాఖీలైతే ఇతర రాష్ట్రాలతో పాటు, విదేశాల్లోనూ డిమాండ్ తో అమ్ముడుపోతున్నాయి.

అసలు ఈ ఆలోచనలకు మూలకర్త ఎవరు..?

మణిగుహ్ ను లైబ్రరీ విలేజ్ గా మార్చడంలోనూ.. యువతకు ఉపాధి కల్పించడంలోనూ.. స్థానిక వనరులతో హస్తకళలను ప్రోత్సహించడంలోనూ కీలకమైన వ్యక్తి, ప్రముఖ సామాజిక కార్యకర్తైన మంజు. ఆర్. షా. ఈమెకు పిరుల్ ఉమన్ ఆఫ్ ఉత్తరాఖండ్ గా పేరు.

తేనెటీగల పెంపకానికీ పెట్టింది పేరు మణిగుహ్!

నేచురల్ గానే ఎంతో అందంగా, ప్రకృతి సహజసిద్ధంగా కనిపించే ఈ మణిగుహ్ ను మరింత పర్యాటకంగా అభివృద్ధి చేయడంతో పాటు.. ఇక్కడివారి జీవనోపాధిపైనా నిర్వాహకులు దృష్టి పెట్టారు. ఈ క్రమంలో గ్రామస్థులందరికీ తేనెటీగల పెంపకంపై శిక్షణనిస్తూ, అదనపు ఆదాయ మార్గాలను కల్పిస్తున్నారు.

ఓ థింక్ ట్యాంకులా మణిగుహ్!

సృజనాత్మక ఆలోచనల కేంద్రంలా కనిపిస్తుంది ఈ మణిగుహ్. ప్రతీ ఏటా ఇక్కడ జరిగే గావ్ ఘర్ మహోత్సవ్ అనే రెండురోజుల సాంస్కృతిక ఉత్సవం పర్యాటకులను ఆ సమయంలో అలరిస్తుంది. ఈ వేడుకకు ఎక్కడెక్కడి నుంచో ప్రొఫెసర్స్, కళాకారులు, రచయితలు, నాటక కళాకారులు, గాయనీ, గాయకులు, నర్తకులు, పరిశోధకులు హాజరవుతారు. అక్కడివారి సంస్కృతి, సంప్రదాయాలను ఆ గ్రామీణులను అడిగి తెలుసుకోవడంతో పాటు… మంచుకొండల్లో ఓ గ్రామంలో అమలవుతున్న విధానాలు చూసి మురిసిపోతారు.

వలసలకు చెక్ పెడుతున్న కొండ గ్రామం!

ఇప్పుడు వలసలకు కేరాఫ్ గా మారిన రాష్ట్రాల్లో ఉత్తరాఖండ్ పేరు కూడా మారుమోగిపోతోంది. యువత ఉద్యోగాలు, ఉపాధి కోసం నగరాలకు వలస వెళ్తున్నారు. దీంతో మణిగుహ్ లో చదువు, హస్తకళలు, హోమ్ స్టేస్, ఎడ్యుకేషనల్ టూరిజం, నైపుణ్యాభివృద్ధి వంటి కార్యక్రమాలను ప్రోత్సహిస్తూ అవకాశాలను సృష్టిస్తున్నారు.

ఈ మధ్యే 2026 మార్చ్ లో ఉత్తరాఖండ్ ఓపెన్ యూనివర్సిటీ సౌజన్యంతో చదువు మధ్యలోనే ఆపేసిన మహిళలకు తిరిగి ఉన్నత విద్యనందించే ప్రక్రియ మొదలైంది.

పుస్తక పఠనం, పుస్తక్ మందిరాలు, పైన్ ఆకులతో తయారయ్యే రాఖీలు, వార్షికంగా జరిగే సాంస్కృతిక ఉత్సవాలు.. వీటన్నింటికీ తోడు హిమాలయాల్లోని సహజసిద్ధమైన నిశ్శబ్ద సౌందర్యం వెరసి.. మణిగుహ్ ఇప్పుడో ప్రత్యేక పర్యాటక క్షేత్రంగా గుర్తింపు పొందింది.

చదువు, సంస్కృతి, ఉపాధి, సామాజిక భాగస్వామ్యం వీటన్నింటీ ఒకే గొడుగు కిందకు తెచ్చి.. గ్రామీణ భారతానికి ఒక ఆదర్శ గ్రామంగా నిలుస్తోంది మణిగుహ్. మొత్తంగా గ్రామాల ముఖచిత్రాలను మర్చాలనుకునేవారికి మార్గదర్శకంగా.. ఒక కొత్త భవిష్యత్తుకు చిరునామాలా మణిగుహ్ ఆకట్టుకుంటోంది.

ఇన్ని విశేషాలకు తోడు.. బుక్ మారథాన్ తో పుస్తక పఠనాన్ని సామూహిక ఉద్యమంగా మల్చిన మణిగుహ్ ఉత్తరాఖండ్ లోని హిమాలయాలకు వెళ్లినప్పుడు తప్పకుండా చూడాల్సిన ఓ పర్యాటక క్షేత్రంగా రారమ్మంటోంది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles