పుట్టుకతో ఆ అబ్బాయికి పోలియో ఉండటం శాపమైంది. కానీ శాపాన్ని వరంగా మార్చుకున్న అతడి సంకల్పబలం ముందు అంగవైకల్యం చిన్నబోయింది. అందుకే వికాస్ ఖన్నా ఇప్పుడు మిషెలిన్ స్టార్ షెఫ్.
ఔను అసలు మిషెలిన్ స్టార్ అంటే ఏంటి..?
అత్యధిక నాణ్యతా ప్రమాణాలతో నడిచే రెస్టారెంట్స్ కు దక్కే అవార్డ్. ప్రధానంగా రుచి, శుచి, నాణ్యత, వండే విధానం, వంటగదిలో ఉండే షెఫ్ వ్యక్తిత్వం, ఇతర వంటగాళ్లు పాటిస్తున్న పద్ధతులు.. ఇవన్నీ వెరసి ప్రతీ విజిట్ లోనూ కనిపిస్తే… అలాంటి రెస్టారెంట్స్ కు మిషెలిన్ గైడ్ ఇచ్చే హోదా, అవార్డ్ మిషెలిన్ స్టార్.
అలాంటి అవార్డ్ విన్నింగ్ రెస్టారెంట్ గా ఇప్పుడు లండన్, న్యూయార్క్ ల్లో వికాస్ ఖన్నా హోటల్ స్లాట్ బుక్ చేసుకుంటేనేగానీ సీటు దొరకని హాట్ సీట్.

1971లో అమృత్ సర్ లో వికాస్ ఖన్నా పుట్టగానే.. అతడి తల్లి బిందూ ఖన్నాకు వైద్యులు చెప్పేశారు.. పుట్టుకతోనే పోలియో ఉన్న వికాస్ లైఫ్ లో నడవడం, పరిగెత్తం చేయలేడని. కానీ, బిందూ ఖన్నా ఆ మాటలను లెక్క చేయలేదు. ఢిల్లీకి తీసుకెళ్లింది కొడుకుని. తన కొడుకు నడవలేకపోవచ్చు, పరుగెత్తలేకపోవచ్చు.. కానీ, ఎగురగలడంటూ ఆ తల్లి తన బిడ్డపైనున్న మమకారంతో ఆనాడు చెప్పిన మాటది.
అయితే, తన తల్లి మాటను నిజం చేశాడు వికాస్ ఖన్నా. ప్రస్తుతం 52 ఏళ్ల వయస్సులో ఆయన లండన్ లో మిషెలిన్ స్టార్ షెఫ్ హోదా సంపాదించి తన తల్లి మాటను నిలబెట్టాడు. అంతేకాదు, ఇప్పుడు వికాస్ ఖన్నా ఓ రచయిత, సినిమా నిర్మాత. ఇవే కాక కోవిడ్ ప్యాండమిక్ లో.. 5 కోట్ల మీల్స్ ప్యాకెట్స్ ను తన వంతు సాయంగా అందించిన దాతృత్వంతోనూ తన వ్యక్తిత్వాన్ని చాటిచెప్పాడు.
సాఫీగా సాగుతున్న జీవితంలో చిన్న అవాంతారాలెదురైతేనే అయ్యో ఎలా అనుకునేవారు ఎక్కువ కనిపించే సమాజంలో.. ఊహించని మలుపులతో తన జీవితం తనకో ప్రశ్నగా మారినా.. ఎక్కడా డీలా పడలేదు. మొక్కవోని ఆత్మస్థైర్యంతో ముందుకెళ్లి.. ఇవాళ లండన్ లో టాప్ ఇండియన్ రెస్టారెంట్ కు కేరాఫ్ గా తన హోటల్ ను మల్చాడు ఖన్నా.

వికాస్ కు పుట్టుకతోనే పోలియో ఉండటంతో కాళ్లకు కట్టె బూట్లు ధరించాల్సి వచ్చింది. దాంతో తాను చదువుతున్న స్కూల్ లో ఎన్నో అవమానాలకు గురైనాడు. తనను పోలియో వాలా లడ్కా అని పిల్చి అవమానించేవారని.. ఖన్నా టెడ్ టాక్ షోలోనూ చెప్పుకొచ్చాడు. తన స్కూల్ అయిపోయాక.. తన అమ్మమ్మ, నానమ్మలతో వంటగదిలోకి దూరిపోయేవాడు ఖన్నా. అలా వారే వికాస్ ఖన్నాకు వంటల్లో గురువులయ్యారు. వారి వద్ద పాకశాస్త్రంలో ప్రావీణ్యం సంపాదించాడు. అలా అమృత్ సర్ లోని గోల్డెన్ టెంపుల్ లో లంగర్ వేసే కమ్యూనిటీ కిచెన్ లో వంటల్లో సహాయకుడిగా పనిచేయడం మొదలెట్టాడు.
నీ పుట్టుక వెనుక ఏదో కారణముందనే విషయాన్ని తన అమ్మమ్మ చెప్పేదని.. ఇవాళ ఈ స్థాయిలో ఉండటం చూశాక తన అమ్మమ్మ చెప్పిన మాటలు మళ్లీ మళ్లీ గుర్తుకొస్తున్నాయనే విషయాల్ని టెడ్ టాక్ షోలో పంచుకున్నాడు ఖన్నా.
13 ఏళ్ల వయస్సులోనే వంటగాడిగా పరిణతి చెందిన ఖన్నా.. పాఠశాలలకు ఛోలే భటూరే వండిపెట్టే తన తల్లికి సహాయకుడిగా పనిచేసేవాడు. అలాగే, లారెన్స్ గార్డెన్స్ అనే బంకెట్ హాల్ లోనూ తల్లికి అసిస్టెంట్ గా ఉండేవాడు. కానీ, కొద్ది రోజుల తర్వాత అనివార్య పరిస్థితుల వల్ల తన తల్లి ఉపాధి కోల్పోయింది. ఆ సమయంలో ఏంచేయాలో పాలుపోని పరిస్థితుల్లో వికాస్ ఖన్నా… చాలామందిలాగే పొట్ట చేత పట్టుకుని లండన్ పయనమయ్యాడు.
లండన్ లో 31 చోట్ల ఉద్యోగం చేశాడు. వాటిల్లో బోళ్లు, గిన్నెలు కడగడం, ఇళ్లల్లో హౌజ్ కీపింగ్, శుభ్రంగా తుడవడం, ఊడ్వడం.. హోటళ్లు, రెస్టారెంట్లలో పనిచేయడం.. కుక్కలను, పిల్లులను పెంచేవారు ఉద్యోగాలకు, బయటకు పోతే వాటిని జాగ్రత్తగా చూసుకోవడం.. క్యాటరింగ్ చేయడం.. ఇలా చేయని పనిలేదు. అక్కడి నుంచి పారిస్ పయనమైన ఖన్నా ఓ రెస్టారెంట్ లో ఉద్యోగంలో కుదిరాడు. అక్కడి యజమాని.. నల్లవాళ్ల చేతులు వండవు.. శుభ్రం మాత్రమే చేస్తాయంటూ జాతిభేదాన్ని చూపిన మాటలు వికాస్ ఖన్నాను తీవ్రంగా కలిచివేశాయి. తక్షణమే ఆ జాబ్ మానేశాడు. అప్పుడే మనసులో అనుకున్నాడు. మళ్లీ నాకంటూ ఒకరోజొస్తుందని బలంగా సర్దిచెప్పుకుని.. అక్కడి నుంచి నిష్క్రమించాడు.
తిరిగి 2010లో వికాస్ ఖన్నా లండన్ కు తిరిగి వెళ్లాడు. అక్కడ జునూన్ అనే రెస్టారెంట్ ను ప్రారంభించాడు. మరుసటి ఏడాదే తన జునూన్ రెస్టారెంట్ కు మిషెలిన్ స్టార్ హోదా సంపాదించాడు. ఇక ఆ తర్వాత వికాస్ వెనక్కి తిరిగి చూడలేదు. 2024లో తాజాగా న్యూయార్క్ లో బంగ్లా పేరిట మరో రెస్టారెంట్ ను ప్రారంభించి ఆతిథ్య రంగంలో భారతీయ వంటకాల రుచికి అంతర్జాతీయ గుర్తింపు తీసుకొచ్చాడు. ఇప్పుడా రెస్టారెంట్ కు వెళ్లాలంటే ముందుగా సీట్ రిజర్వ్ చేసుకోవాలంటే.. అమెరికాలో ఆ హోటల్ ఏ స్థాయిలో నడుస్తుందో ప్రత్యేకంగా చెప్పవల్సిన పన్లేదు.
అమ్మమ్మ వంటగదిలో నేర్చుకున్న పాఠాల నుంచి నేడు లండన్ లో మిషెలిన్ స్టార్ షెఫ్ హోదా సంపాదించేంతవరకూ సుమారు 40 ఏళ్ల పాటు సాగిన ఒడిదుడుకుల ప్రయాణం వికాస్ ఖన్నాది. ప్రజలు మీనుంచి ఏదైనా తీసుకోగలరేమోగానీ.. మీరు సాధించిన విజయాన్ని, మీరు పొందే ఆనందాన్ని మాత్రం ఎవ్వరూ గుంజుకోలేరంటాడు వికాస్ ఖన్నా. పోలియో వ్యాధితో బాధపడిన ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్.. మెంటల్ గా స్ట్రాంగ్ గా ఉంటే ఏం సాధించవచ్చో వికాస్ ఖన్నా స్టోరీ మనకు చెబుతుంది.



