మొక్కలు నాటడం వేరు.. ఒక్క మొక్కనైనా కాపాడుతూ పెంచడం వేరు. మొక్కలు నాటడం ఇప్పుడొక ఫ్యాషన్. కాపాడటం ఓ ప్రశ్న..?
అలా మొక్కలను కాపాడుతున్న వ్యక్తే మనం చెప్పుకోబోతున్న ఆక్సిజన్ బాబా. చెట్లు మనకు ఆక్సిజనందిస్తే.. ఆ చెట్లు బతికే ఆక్సిజన్ ను అందిస్తున్న వ్యక్తే ఈ వారణాసి బాబా.
12 ఏళ్లుగా రోడ్డు పక్కన ఉన్న వేలాది మొక్కలకు నీళ్లు పోస్తూ పెంచుతున్న కల్పతరువు ఇతను.

ప్రతీరోజూ 500 లీటర్ల ట్యాంకుతో బయల్దేరుతాడు. గంటల తరబడి రోడ్డు పక్కన నిర్లక్ష్యానికి గురవుతున్న మొక్కలకు నీళ్లు పోస్తున్నాడు గోపాల్. దశాబ్దానికి పైగా ఇతణిలా ఆలోచించాలన్న స్పృహ పక్కనబెడితే… ఎగతాళి చేసే మనుషులతో సహవాసం చేస్తూనే, ఆర్థిక ఇబ్బందులెదురైనా తన మొక్క సంరక్షణా యజ్ఞాన్ని మొక్కవోని దీక్షతో చేస్తున్నాడు.
మనదేశంలో వృక్షసంపద పెంపుదల, మొక్కలు నాటడమనే కార్యక్రమాలన్నీ దాదాపూ ఒకేలా కనిపిస్తాయి. ప్రజాప్రతినిధులు, అధికారులు రావడం.. ఫోటోలు దిగడం.. పచ్చదనం కోసమంటూ బ్యానర్స్ కట్టడం.. హరితహారం పేరిట సొంత బాజాలు వాయించుకోవడం.. కార్యక్రమం ముగిసిన వెంటనే అంతా తుర్రుమని వెళ్లిపోవడం.. ఆ తర్వాత ఆ మొక్కలను ఎవ్వరూ పట్టించుకోకపోవడం.. మీడియాలో వస్తే ఓ పది రోజులు పర్యవేక్షకుల్ని ఏర్పాటు చేయడం.. ఇదిగో ఇలా.
కానీ, ఆ మొక్కలు ఎండ, దుమ్ము, వాహనాల కాలుష్యం, పశువుల బెడద మధ్య తమంతట తామే బతకాల్సి వస్తుంది. ఆ క్రమంలో ఏడాది గడవకుండానే చాలా మొక్కలు ఎండిపోవడం మనం కళ్లారా చూస్తున్నదే.
ఉత్తరప్రదేశ్ కు చెందిన గోపాల్ కూడా మనలాగే గమనించిన వ్యక్తే. అందుకే కావల్సింది కొత్త మొక్కలు నాటడం కాదు.. ఉన్న మొక్కల్ని కాపాడటమనే సంకల్పాన్ని భుజానికెత్తుకున్నాడు. అలా ప్రారంభమైన ఆయన చిన్ని ప్రయత్నమే నేడు ఓ మొక్కల సంరక్షణా యజ్ఞమై.. ఆక్సిజన్ బాబా అన్న పేరు తెచ్చిపెట్టింది.
మట్టి మనిషి ఆక్సిజన్ బాబా!
మట్టితో జీవనం.. మొక్కలతో అనుబంధం ఇవే గోపాల్ ఆశ, శ్వాస. కుండలు తయారు చేసుకుంటూ పొట్టపోసుకునే కుమ్మరివాడైన గోపాల్ నిత్య జీవితం కూడా నీరు, మట్టితో ముడిపడటంతోనే ప్రకృతిపై గోపాల్ కు మరింత మక్కువకు కారణమైంది.
తొలినాళ్లల్లో ఆయన కొన్ని బకెట్లల్లో నీళ్లు మోసుకుపోయి తమ కాలనీలో రోడ్డు పక్కనే ఉన్న మొక్కలకు నీళ్లు పోసేవాడు. గోపాల్ వెనుక ఎలాంటి స్వచ్ఛంద సంస్థ లేదు… ప్రభుత్వ సాయం అంతకన్నా లేదు.. నిధుల్లేవు… తొలినాళ్లల్లో ఇరుగుపొరుగువారి ఎగతాళీ తప్పలేదు. కానీ, మొక్కలు మాత్రం నిర్లక్ష్యం వల్ల చనిపోకూడదనే.. లక్ష్యం మాత్రం స్పష్టంగా ఉంది.
చిన్న ముందడుగు నుంచి ఓ పెద్ద ఉద్యమంగా!
బకెట్లతో నీళ్లు పోయడం మొదలైన ఆయన మొక్కల సేవ.. కాలక్రమేణా విస్తరించింది. గోపాల్ ఇప్పుడు 500 లీటర్ల నీటి ట్యాంకులతో వారణాసి రహదారుల వెంట ప్రతీ రోజూ మొక్కలకు నీళ్లు పోస్తూ కనిపిస్తుంటారు. తన జీవన వృత్తి, భృతి అయిన కుమ్మరి చక్రాన్ని ఎంత శ్రద్ధగా తిప్పుతాడో.. అదే క్రమశిక్షణతో రిక్షాను తిప్పుతూ దానిపై ఓ సింటెక్స్ వంటి ట్యాంకును పెట్టుకుని మొక్కలనూ సంరక్షిస్తున్నాడితను.
మొక్కలు నాటడం కంటే కూడా వాటిని బతికించడమే గోపాల్ దృష్టిలో పెద్ద పని. గోపాల్ భావననే గణాంకాలూ చెబుతున్నాయి. 2022లో కాగ్ విడుదల చేసిన నివేదిక ప్రకారం కాంపెన్సేటరీ అఫారెస్టేషన్ కింద నాటిన మొక్కల్లో 40 శాతానికి పైగా మొదటి ఏడాదిలోనే చనిపోతున్నాయి.
అనువు కాని ప్రాంతాల్లో మొక్కలు నాటడం, తర్వాత పర్యవేక్షణ కొరవడటం, మొదటి రెండేళ్లల్లో సరిపడా నీరందకపోవడం ఇవే ప్రధాన కారణాలుగా కూడా కాగ్ నివేదిక పేర్కొంది. ప్రత్యేకంగా రోడ్డు పక్కన నాటే మొక్కలు నేల గట్టిగా ఉండటం, నీడ లేకపోవడం వల్ల వాటి మనుగడ మరింత కష్టమవుతోందన్నది ఆ నివేదిక సారాంశం.

అలాంటి లోటుపై దృష్టి సారించిన వ్యక్తే గోపాల్!
గమ్మత్తేంటంటే ఏదైనా మంచి పని చేస్తే ఇష్టం లేకపోతే ఊరుకోరు ఈ జనం. పైగా వెక్కిరిస్తారు. దీన్ని లేకితనమో, దిగజారుడుతనమో.. లేక, కావల్సిన మెచ్యూరిటీని పొంద వాతావరణాల్లో పెరగకపోవడమో ఏదైనా అనుకోవచ్చుగానీ.. మొదట్లో గోపాల్ అలాంటి వెక్కిరింపులన్నీ రుచి చూశాడు. ఎందుకు చేస్తున్నావ్, నీకేం వస్తుందని అడిగి దెప్పి పొడిచినావాళ్లూ ఉన్నారు.
నీళ్లు కూడా కొనుక్కోవాల్సిన కలికాలమిది. ఇలాంటి రోజుల్లో నీటి ఖర్చు, రవాణా ఖర్చు కూడా తన కుమ్మరి వృత్తిలో వచ్చిన ఆదాయంతోనే భరిస్తూ ముందుకెళ్లాడే తప్ప.. ఏ ఒక్క రోజూ తన మొక్కల సంరక్షణా యజ్ఞాన్ని మాత్రం ఆపలేదు. ప్రతి నిత్యం సూర్యుడదయించినా ఉదయించకపోయినా.. వాన కురిసినా, కురవకపోయినా… మంచు కురిసినా, కురవకపోయినా… గోపాల్ మాత్రం రోడ్ల వెంట మొక్కలకు నీళ్లు పోస్తూ కనిపించే క్రమశిక్షణతో ఆ తర్వాత ఆయన్ను వెక్కిరించిన వాళ్లే నోళ్లు వెళ్లబెట్టారు. గోపాల్ అకుంఠిత దీక్షకు కరిగిపోయారు. వేసవి ఎండలు దంచేస్తున్నా తన కార్యాచరణను ఆపని గోపాల్ జీవితంలో మొక్కల సంరక్షణ ఓ దినచర్యగా మారిపోయింది.
ఆక్సిజన్ బాబా అనే పేరెలా వచ్చింది..?
గోపాల్ సేవను దగ్గర నుంచి చూసిన స్థానికులు ప్రేమతో ఆక్సిజన్ బాబా అని పిలవడం ఆరంభించారు. ఎలాంటి గుర్తింపు, ప్రచారం, ప్రతిఫలం ఆశించకుండా ప్రకృతిని కాపాడుతున్న వ్యక్తికి ఈ పేరే సరైందని అలా ఆక్సిజన్ బాబాగా గౌరవించడం మొదలైంది.
ఇప్పుడు గోపాల్ పెంచిన మొక్కలన్నీ వృక్షాలుగా మారి గాలిని శుద్ధి చేస్తున్నాయి. ప్రయాణీకులకు నీడనిస్తున్నాయి. నగర ఉష్ణోగ్రతను తగ్గిస్తున్నాయి. పచ్చదనం తగ్గిపోయి కాంక్రీట్ జంగల్స్ గా మారుతున్న పట్టణాల్లో పచ్చదనాన్ని తిరిగి పెంచుతున్నాయి.
అయినా గోపాల్ మాత్రం తన గురించిగానీ.. తాను చేస్తున్న పని గురించిగానీ మాట్లాడడు. తను పెంచుతున్న మొక్కల గురించి మాత్రం మస్త్ కథలు చెబుతాడు. అవెందుకు ఉపయుక్తమో మనకు పూసగుచ్చుతాడు. అందుకే గోపాల్ ఇప్పుడు ఆక్సిజన్ బాబాగా శాశ్వతమైపోయాడు.
ఓ మనిషి.. ఓ నీటి ట్యాంకు.. ఓ గొప్ప సామాజిక సందేశము!
చిన్నప్పుడు పాఠ్యపుస్తకాల్లో చిప్కో ఉద్యమం వంటి కథలు చదువుకున్న మనకు… గోపాల్ కథ మనకు పర్యావరణ పరిరక్షణ అంటే ఏమిటో కళ్లకు కట్టి చూపిస్తుంది. ప్రకృతిని కాపాడాలంటే కోట్ల బడ్జెట్ అవసరం లేదని ప్రభుత్వాలను వెక్కిరిస్తుంది. ప్రతీరోజూ ఒక నీటి ట్యాంకుతో మొక్కలకు నీళ్లు పోసే ఓర్పు, క్రమశిక్షణ, ప్రకృతి పట్ల మమకారం ఉంటే చాలని చెబుతుంది.



