గాంధీ నుంచి నెహ్రూ వరకు స్వరాన్ని వినిపించిన చికాగో రేడియో! మైక్రోఫోన్ వెనుక ఏంటి ఈ మోత్వానీ కథ?

సాధారణంగా చూస్తే అది కేవలం శబ్దాన్ని పెంచే ఓ మైక్రోఫోన్ మాత్రమే… కానీ, స్వాతంత్ర్యోద్యమ గొంతును లక్షల మందికి చేర్చిన, అప్పటివరకు ఎరుగని ఓ అసాధారణ లౌడ్ స్పీకర్.

గాంధీ గొంతును లక్షల మందికి వినిపించిన చికాగో రేడియో కథేంటి? మోత్వానీ ఎవరు?

స్వాతంత్ర్య పోరాట నినాదాన్ని లక్షల మందితో కమ్యూనికేట్ చేయడం వెనుక పడిన ఓ విప్లవాత్మకమైన అడుగు.. దాగున్న ఓ మైక్ కథే.. చికాగో రేడియో!

ఓసారి ఊహించుకోండి..

ఓ విశాలమైన మైదానం.. వేలాది మంది జనం.. వేదికపై మహాత్మా గాంధీ. ఆయన మాట్లాడుతున్నారు… కానీ చివరి వరుసలో ఉన్నవారికెవ్వరికీ ఆ మాటలు మాత్రం వినిపించడం లేదు.

మహాత్మా గాంధీ గొంతు సహజంగానే అంత పెద్దది కాదు. ఒకే వేదికపై నుంచి సభకొచ్చిన వారందరికీ ఆయన గొంతు వినిపించదు. దాంతో ఒక చోటు నుంచి మరో చోటుకు వెళ్లి.. అవే మాటలను ఆయన మళ్లీ మళ్లీ చెప్పాల్సి వచ్చేది. ఆ సమస్యే ఓ యువకుడి ఆలోచనకు బీజం వేసింది.

గాంధీ గొంతు బలహీనంగా ఉండొచ్చు కానీ… ఆయన చెప్పే మాటలు బలమైనవి. అవి అందరినీ చేరాలి. అప్పుడే ఆ బలమైన మాటలు ప్రభావాన్ని చూపిస్తాయి. మరి గాంధీ అయినా, పటేల్ అయినా.. కదలకుండా ఒకే చోటు నుంచి తమ గొంతును.. వేలాది మందికి ఎలా వినిపించేది..?

ఈ ప్రశ్నకు పరిష్కారం చూపిన అన్ సంగ్ హీరోనే నానిక్ మోత్వానీ.

ఆయన ఇచ్చిన సమాధానమే.. చికాగో రేడియో.

ఇది ఒక సౌండ్ సిస్టం కాదు.. భారత స్వాతంత్ర్యోద్యమానికి గొంతుగా మారిన సాంకేతిక అద్భుతం.

మరి ఈ మోత్వానీ ఎవరు?

1909లో గియాంచంద్ చందుమల్ మోత్వానీ సింధ్‌లోని సుక్కూర్‌లో ఈస్టర్న్ ఎలక్ట్రిక్ అండ్ ట్రేడింగ్ కంపెనీని ప్రారంభించారు. ఫ్లాష్‌లైట్స్, బ్యాటరీస్, జనరేటర్స్, టెలిఫోన్ పరికరాలు… ఇలా విద్యుత్, కమ్యూనికేషన్ రంగాల్లో వ్యాపారం వారి పని. అయితే, ప్రస్తుత పాకిస్థాన్ లో కరాచీకి వీరి కార్యాలయం 1912లో షిఫ్ట్ అయింది. ఆ తర్వాత 1919లో ముంబైకి వచ్చిన తర్వాత.. ఈస్టర్న్ ఎలక్ట్రిక్ అండ్ ట్రేడింగ్ కంపెనీ కాస్తా.. చికాగో టెలిఫోన్ సప్లై కంపెనీగా మారింది. అదే 1926లో గియాచంద్ చందుమల్ మోత్వానీ కుమారుడు నానిక్ మోత్వానీ నేతృత్వంలో చికాగో టెలిఫోన్ అండ్ రేడియో కంపెనీగా పేరు మార్చుకుంది. అమెరికాకు చెందిన చికాగో టెలిఫోన్ కంపెనీ పేరు నుంచే చికాగో అనే పేరును ఉపయోగించినట్టు సంస్థ చరిత్ర చెబుతోంది. కానీ, కొద్ది కాలానికే ఆ పేరు భారత స్వాతంత్ర్యోద్యమ చరిత్రలో.. ఒక ప్రత్యేకమైన పాత్ర పోషించింది.

సమస్య – ఆలోచన – విప్లవం!

అది 1929వ సంవత్సరం. స్వాతంత్ర్యోద్యమం ఉధృతంగా సాగుతున్న కాలం. గాంధీ సభకు నానిక్ మోత్వానీ కూడా వెళ్లాడు. అక్కడ ఆయన గమనించిన దృశ్యం ఆయనను ఆలోచనల్లో పడేసింది. ఓవైపు, జనం విపరీతంగా ఉన్నారు.. మరోవైపు, గాంధీ మాట్లాడుతున్నారు. కానీ ఆయన స్వరం మాత్రం అందరికీ వినిపించడం లేదు. అందుకే, గాంధీ ఒకే ప్రదేశంలో ఏర్పాటు చేసిన వేర్వేరు వేదికల దగ్గరకు వెళ్లుతూ మాట్లాడాల్సి వస్తోంది. నానిక్ మోత్వానీకి అప్పుడే ఒక మెరుపులాంటి ఆలోచన వచ్చింది. గాంధీ గొంతును పెంచాలన్నదే ఆ ఐడియా.

మరి ఎలా…?

ఆ ఆలోచన అమలవ్వాలంటే సాంకేతికంగానే పరిష్కారం చూపాలి. ఆ రోజుల్లో గాంధీ మాట్లాడే ప్రతి మాటా ఒక రాజకీయ తూటా. ఆ మాట ఎంత దూరం వెళ్తే… స్వాతంత్ర్యోద్యమం అంత దూరం పరిగెడుతుంది. ఆ పనిని మోత్వానీ భుజానికెత్తుకున్నాడు.

బ్రిటన్, అమెరికా పరికరాలు… భారతీయుల ప్రయోగాలు!

ఇక్కడొక ఆసక్తికర విశేషమేంటంటే… ఇండియానుంచి బ్రిటీషర్స్ తరిమికొట్టి.. స్వాతంత్రం పొందేందుకు చేపట్టిన ఉద్యమ నినాదాన్ని మరింత పెంచేందుకు బ్రిటన్ నుంచే టెక్నికల్ డివైజెస్ తెప్పించడం. మొదట మోత్వానీ సంస్థ బ్రిటన్, అమెరికా నుంచి మైక్రోఫోన్స్, ఆంప్లిఫైర్స్, లౌడ్‌స్పీకర్స్ వంటి పరికరాలను దిగుమతి చేసుకుంది. భారతదేశంలో పనిచేస్తున్న ఇంజినీర్ల బృందం ఆ పరికరాలను విడదీసి వాటి పని విధానాన్ని ముందు అర్థం చేసుకుంది. అంటే… కొనడం మాత్రమే కాదు… నేర్చుకోవడమూ ఓ పెద్ద కసరత్తే. ఆ సాంకేతికతను తమకు అనుగుణంగా మార్చుకోవడమే ఆ కసరత్తు. అలా రివర్స్ ఇంజనీరింగ్ పద్ధతుల్లో పలు ప్రయోగాల తర్వాత.. పబ్లిక్ అడ్రస్ సిస్టం క్రమంగా భారతీయ సభల అవసరాలకు సరిపోయే రూపానికొచ్చింది.

1931 – దిక్కులు పిక్కటిల్లేలా బిగ్గరగా మార్మోగిన గాంధీ నినాదం!

మైక్రోఫోన్ ప్రయోగానికి 1931 కీలకమైన పరీక్షా సమయం. కరాచీ కాంగ్రెస్ సమావేశంలో చికాగో రేడియో పబ్లిక్ అడ్రస్ సిస్టంను ఏర్పాటు చేశారు. గాంధీ మాట్లాడారు. ఈసారి ఆయన మాటలు కేవలం ముందున్నవారికే కాదు… విశాలమైన సభలో దూరంగా ఉన్నవారికీ స్పష్టంగా వినిపించాయి. ఆ సమావేశం తర్వాత గాంధీ.. స్వయంగా చికాగో రేడియో లౌడ్‌స్పీకర్ ఏర్పాట్లను ప్రశంసించారు. అక్కడి నుంచి చికాగో రేడియో సంస్థ కొత్త ప్రయాణం మొదలైంది. ఒక వ్యాపార సంస్థ.. క్రమంగా కాంగ్రెస్ సభలతో విడదీయలేని అనుబంధాన్ని ఏర్పర్చుకుంది.

మైక్ వెనుక మోత్వానీ – సభల సాక్షిగా స్వాతంత్ర్య సమరం!

స్వాతంత్ర్య పోరాటంలో మైక్రోఫోన్ పాత్రలో అత్యంత ఆసక్తికరమైన విషయం ఇదే. మోత్వానీ కేవలం పరికరాలు అమ్మడానికి మాత్రమే పరిమితమైన వ్యాపారి కాదు.. స్వేచ్ఛ కోసం జరిగిన పోరాటంలో తన వంతు పాత్ర పోషించిన అన్ సంగ్ హీరో. సభ ఉన్న చోటికల్లా మోత్వానీ పరికరాలతో వెళ్లేవారు. రైళ్లు, ట్రక్కుల్లో భారీ సౌండ్ పరికరాలు తీసుకెళ్లేవారు. సభకు ఒక రోజు ముందే అక్కడికి చేరుకుని.. బ్యాటరీలు సిద్ధంగా ఉన్నాయా?, మైకులు పనిచేస్తున్నాయా?, వైర్లు సరిగ్గా ఉన్నాయా?, స్పీకర్లు ఎంత దూరంలో పెట్టాలి?.. ఇలా అన్నింటినీ పరీక్షించేవారు. పెద్ద హారన్ ఆకారంలోని లౌడ్‌స్పీకర్లను వెదురు కర్రలకు కట్టి మైదానం అంతా ప్రసంగాలు వినిపించేలా ఏర్పాటు చేసేవారు. అంటే నేడు భారీ పొలిటికల్ ఈవెంట్స్ కు సౌండ్ ఇంజినీర్, వారి బృందం ఎలా పనిచేస్తుందో.. ఆ పని అప్పట్లో మోత్వానీ బృందం దేశమంతా తిరుగుతూ చేసింది.

గాంధీ, నెహ్రూ నుంచి పటేల్ వరకు.. వారి గొంతు పెంచిన మైక్రోఫోన్!

చికాగో రేడియో క్రమంగా కాంగ్రెస్ సభల్లో కచ్చితంగా ఉండాల్సిందే. గాంధీ, జవహర్‌లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్, ఇతర స్వాతంత్ర్య సమరయోధుల ప్రసంగాలు.. వేలాది, లక్షలాది మందికి చేరడానికి మోత్వానీ పరిచయం చేసిన సాంకేతికత ఎంతో దోహదపడింది. నెహ్రూ కూడా మోత్వానీకి రాసిన ఓ లేఖలో వారి లౌడ్‌స్పీకర్ల పనితీరును ప్రశంసించారు. పటేల్ కూడా నానిక్ మోత్వానీ సేవలను ప్రశంసిస్తూ.. కాంగ్రెస్ సమావేశాల్లో ఆయన చేసిన సేవను కొనియాడారు.

మోత్వానీ ఓ వ్యాపారే కాదు… నిజమైన దేశభక్తి కల్గిన ఒక సేవకుడు!

కాంగ్రెస్ సభలకు చికాగో రేడియో.. తన పబ్లిక్ అడ్రస్ సిస్టం సేవలను.. దశాబ్దాల పాటు ఉచితంగా.. లేదంటే, నామమాత్రపు ఖర్చులో అందించింది. సుమారు 1960ల వరకు కూడా కాంగ్రెస్‌కు సేవలు అందించింది.

స్వాతంత్ర్యం కోసం ఎందరో జైలుకు వెళ్లారు. మరికొందరు పత్రికలు నడిపారు. ఇంకొందరు రహస్యంగా రేడియో ప్రసారాలు చేశారు. మోత్వానీ మైక్ పట్టుకున్నాడు. ఆ మైక్ ద్వారా సమరయోధులు వినిపించిన మాటలతో దేశాన్ని కదిలించాడు.

మోత్వానీ కేవలం కాంగ్రెస్ మైకేనా?

అది 1942వ సంవత్సరం. క్విట్ ఇండియా ఉద్యమంపై బ్రిటిష్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతున్న కాలం. ఆ సమయంలో నానిక్ మోత్వానీ రహస్యంగా పనిచేసిన కాంగ్రెస్ రేడియోతోనూ సంబంధం పెట్టుకున్నాడు. ఉషా మెహతా నేతృత్వంలోని రహస్య రేడియో ప్రసారాలకు.. మోత్వానీ పరికరాలు, సాంకేతిక సాయం అందించినట్టు చారిత్రక ఆధారాలున్నాయి. అంటే ఆయన పని.. సభలో మైక్ పెట్టడంతో ముగియలేదు. స్వాతంత్రోద్యమ నినాదాలు, ప్రచారాన్ని మరింత దూరం పంపే రేడియో పోరాటంలోనూ మోత్వానీ పాత్ర ఉంది.

స్వాతంత్ర్యం వచ్చినా.. చికాగో రేడియో ప్రయాణం ఆగలేదు!

1947లో బ్రిటీష్ దాస్య శృంఖలాలు తెంచుకుని స్వాతంత్ర్యం వచ్చాక కూడా చికాగో రేడియో ప్రయాణం కొనసాగింది. స్వాతంత్ర్యానంతరం నెహ్రూ వంటి నాయకుల సభల్లోనూ ఈ పబ్లిక్ అడ్రస్ సిస్టమ్స్ ఉపయోగించారు. 1947 స్వాతంత్ర్య వేడుకల సందర్భంగా నెహ్రూ చేసిన చారిత్రక “Tryst with Destiny” ప్రసంగానికి కూడా చికాగో రేడియో మైక్రోఫోన్స్ నే వాడారు. 1960లో బొంబాయిలో జరిగిన భారత వైమానిక దళ 27వ వార్షికోత్సవంలోనూ.. లక్షలాది మంది ప్రేక్షకులకు వ్యాఖ్యానం వినిపించడంలో కూడా చికాగో రేడియోనే కీలకం. 1963లో ఢిల్లీలో లతా మంగేష్కర్ అయె మేరే వతన్ కే లోగో పాడిన చారిత్రక సందర్భంలో కూడా చికాగో సౌండ్ సిస్టమ్ నే వాడారు. .

చికాగో పేరుపై చర్చోపచర్చలు!

భారతదేశ సంస్థకు అసలు చికాగో పేరేంటి? ఈ ప్రశ్న.. ముఖ్యమైన నాయకులందరినీ వేధించింది. అమెరికన్ పేరు ఎందుకనే ప్రశ్నల్ని తెరపైకి తెచ్చింది.

అమెరికాకు చెందిన చికాగో టెలిఫోన్ సప్లై కంపెనీ పేరు నుంచి ఈ బ్రాండ్ పేరు అలాగే స్థిరపడిపోయింది. తరువాత ఆ అమెరికన్ సంస్థ వ్యాపారం నుంచి తప్పుకున్నప్పటికీ… మోత్వానీ కుటుంబం చికాగో పేరుతోనే కొనసాగించింది.

1970లలో మరో ఆసక్తికరమైన ఘట్టం చర్చకు తెరలేపింది. ఇందిరా గాంధీ కూడా చికాగో పేరు మార్చాలని కోరింది. ప్రధాని ఇందిరా గాంధీ కార్యాలయం నుంచి సంస్థకు లేఖ వచ్చింది. భారతీయ సంస్థకు విదేశీ పేరు ఎందుకు? అని ప్రశ్నిస్తూ ఆ లేఖ రాశారు. పేరు మార్చాలని సూచించారు. అయినా సరే, చికాగో రేడియో పేరు మాత్రం పూర్తిగా కనుమరుగవ్వలేదు. మోత్వానీ పేరు కూడా దానితో పాటు చేరుస్తూ చిన్న మార్పు చేశారు. అలా… చికాగో రేడియో మోత్వానీ పేరుతో ఒకే మైకుపై కనిపించేలా మార్చేశారు.

మైకుపై పేరు మారిందే కానీ.. కథ ఇంకా పెద్దదైంది!

ఒకప్పుడు వెదురు కర్రలకు కట్టిన హారన్ స్పీకర్ల జాగాలో.. భారీ పబ్లిక్ అడ్రస్ సిస్టం వచ్చింది. ఆ తర్వాత కాన్ఫరెన్స్ హాల్స్ సౌండ్ సిస్టం, ఇప్పుడు ఆధునిక కమ్యూనికేషన్ సిస్టమ్స్ తో.. మారిన సాంకేతికతకు అనుగుణంగా మైకులు చిన్నవై, వైర్లు తగ్గిపోయి, డిజిటల్ సౌండ్ వచ్చేసింది.

ఒక గొంతు.. వీలైనంత ఎక్కువ మందికి చేరాలి. ఈ మోత్వానీ ఆలోచన మాత్రం మారలేదు. అందుకే, 1909లో మొదలైన ప్రయాణం.. నేటికీ మోత్వానీ కమ్యూనికేషన్ సిస్టమ్స్ రూపంలో ఇంకా కొనసాగుతోంది. సంస్థ ప్రస్తుతం పబ్లిక్ అడ్రస్, ఇండస్ట్రియల్ కమ్యూనికేషన్, కాన్ఫరెన్స్ కమ్యూనికేషన్ వంటి వ్యవస్థలకు సౌండ్స్ అందిస్తోంది.

చరిత్రలో మనం సాధారణంగా పెద్ద పేర్లనే గుర్తుంచుకుంటాం.

గాంధీ, నెహ్రూ, పటేల్, సుభాష్ చంద్రబోస్, ఇందిరా గాంధీ.. ఇలా కొందరే పాప్యులారిటీ సంపాదించుకుంటారు. కానీ వాళ్ల మాటలు జనసమూహానికి చేరడానికి వెనుక పనిచేసిన సాంకేతిక మనుషులను ఎంతమంది గుర్తుపెట్టుకుంటారు?

నానిక్ మోత్వానీ అలాంటి మరచిపోయిన ఓ కథానాయకుడు.

చివరగా, ఒక చిన్న మైక్ చెప్పిన పెద్ద కథేంటంటే…? దేశాన్ని కదిలించిన ప్రసంగాలకు మోత్వానీ మైక్ ఇచ్చాడు. గాంధీ గొంతు బలహీనంగా ఉండొచ్చుగానీ.. ఆ గొంతు వెనుక నిలిచిన సాంకేతికతను బలపర్చి ఆ ప్రసంగాన్ని అందరూ వినేలా చేశాడు. చికాగో రేడియో శబ్దాన్ని పెంచిన యంత్రం మాత్రమే కాదు… స్వాతంత్ర్యోద్యమ గొంతును దద్దరిల్లేలా మార్మోగించిన ఓ నసాంకేతిక పరిష్కారం.

రమణ కొంటికర్ల… ✍🏻

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles