సరదాగా ఒక పాత కాలం హాలీవుడ్ రివేంజ్ థ్రిల్లర్ చూడాలి అనుకుంటే Amazon Prime లో Rolling Thunder చూడవచ్చు. వియత్నాం నుంచి అమెరికాకు తిరిగొచ్చిన సైనికుల మీద 70 ల్లో చాలానే సినిమాలు వచ్చాయి. వియత్నాం యుద్ధపు చీకటి రోజుల్ని అప్పటికి సామాజికంగా ఆమోదయోగ్యమయ్యే masculinity తో ఎలా సంధించాలో తెలియక లోపల విరిగిపోయి, పైన గట్టిబడిపోయిన అమెరికన్ మేల్ పర్సన్ ఇక్కడ హీరో.

Charles Rane కొన్ని సంవత్సరాల పాటు వియత్నాం లో యుద్ధ ఖైదీగా బంధించబడి అమెరికాకు తిరిగి వస్తాడు. ఖైదులో అతను అనుభవించిన హింస అతన్ని శారీరికంగా కంటే మానసికంగానే ఎక్కువ ప్రభావితం చేస్తుంది. తిరిగొచ్చిన రాత్రి తన భార్య తను యుద్ధఖైదీగా ఉండి తిరిగొస్తాడో రాడో తెలీని రోజుల్లో మరో వ్యక్తితో ప్రేమలో పడ్డానని చెప్పినప్పుడు అతని ముఖంలో ఏ స్పందనా కనపడదు. తన భార్య ప్రియుడు Cliff ని ఒక్క మాట కూడా అనడు. ఒక సన్నివేశంలో వియత్నాం గురించి Cliff తో మాట్లాడుతుండగా వాళ్ళు పెట్టే చిత్రహింసల గురించి ప్రస్తావన వస్తుంది. Cliff కి వివరించే క్రమంలో తన చేతులకి తాడు కట్టుకొని అక్కడి సైనికులు ఖైదీల్ని ఎలా రెక్కలు విరిచేలా తాళ్ళు కట్టి లాగుతారో చెబుతూ అతన్ని వెనక నిలబడి అలాగే లాగమంటాడు. కొంతసేపు అతను చెప్పినట్టే చేసి వదిలేస్తాడు Cliff. తన భార్యను తన నుంచి దొంగిలించినందుకు Cliff మీద అతనికి ఏ స్పందన అయినా కలగటానికి, మానసికంగా నిర్వీర్యం అయిపోయిన నేపథ్యంలో ఇలా బాహ్యంగా హింసించిబడితే తప్ప అతను తన భావోద్వేగాల్ని స్పృశించలేడని అతనికి కూడా తెలిసిపోయిందా? “ఇవన్నీ ఎలా తట్టుకున్నావు?” అని Cliff అడిగితే “ఈ తాడును ప్రేమించడం నేర్చుకోవాలి. అప్పుడు నువ్వే గెలిచినట్టు” లాంటి masochist తత్త్వమేదో చెప్తాడు. అతనికి ప్రభుత్వం బహుమానంగా ఇచ్చిన సిల్వర్ కాయిన్స్ కోసం ఒక మెక్సికన్ గ్యాంగ్ అతని మీద దాడి చేసినప్పుడు వాళ్ళు పెట్టే హింసను మౌనంగానే భరిస్తాడు కానీ సిల్వర్ కాయిన్స్ ఎక్కడ ఉన్నాయో మాత్రం చెప్పడు. అతని చేతిని గార్బెజ్ డిస్పోసల్ లో వేసి నుజ్జు నుజ్జు చేస్తారు. అతని భార్యని, కొడుకుని చంపేస్తారు. Charles స్పందన ఇప్పుడు పైకి కనబడుతుంది. తన పోయిన చెయ్యి స్థానంలో ఇప్పుడు పెట్టుకున్న ఐరన్ హుక్ ని పదును పెట్టుకుంటాడు. గన్స్ ని బ్యాగ్స్ లో సర్దుకుంటాడు. అతను తిరిగి ఈ ప్రపంచానికి వచ్చినట్టేనా? లేదు. “నాలో మనిషిని వాళ్ళు అక్కడే (వియత్నాం లో ) బైటికి లాగేసారు. నాకు చెప్పడానికి ఏమీ లేదు” అంటాడు తన మీద మోజు పడి తనతో పాటు తిరుగుతున్న Lindaa తో.
కథ పరంగా ఇది చాలా రొటీన్ వ్యవహారం. ఐతే Paul Schrader (Taxi Driver రచయిత) దీన్ని Taxi Driver కి companion piece గా రాసుకున్నాడన్న విషయం తెలిస్తే ఈ సినిమా మీద మన దృష్టి మారుతుంది. ఎమోషనల్ గా డామేజ్ అయిన మేల్ క్యారెక్టర్స్ ని Schrader రాసే విధానం వేరుగా ఉంటుంది. Taxi Driver లో Travis తన లోలోపలి ఒంటరితనానికి సమాజంపై విరుచుకుపడే హింసను విరుగుడుగా భావిస్తాడు. ఈ సినిమాలో Charles పాత్ర ఒక racist anti-hero గా అనుకున్నాడట Schrader. ఐతే అతను ఈ సినిమాని మధ్యలో వదిలేసి వెళ్లిపోయాక తర్వాత వచ్చిన రచయితలు అతన్ని ఒక అమెరికన్ హీరోగా మార్చి రాసారు. అయినా Schrader తాలూకు చీకటి మాత్రం పాత్రను విడిచిపెట్టి పోలేదు.
70ల్లో సినిమా అయినా యాక్షన్ సన్నివేశాలు ఇప్పటికీ పాతబడిపోలేదు. బిల్డప్ ఎంత ఉండాలో పే ఆఫ్ ఎంత ఉండాలో సరైన లెక్కల్లో ఉన్న ఈ సినిమా విడుదలైనప్పుడు ప్రేక్షకులకు అంతగా రుచించలేదు. తర్వాత కాలంలో ఒక cult సినిమాగా గుర్తించబడింది. Quentin Tarantino కి ఈ సినిమా అంటే ఉన్న విపరీతమైన ఇష్టం వల్ల తను కొంతకాలం నడిపిన డిస్ట్రిబ్యూషన్ కంపెనీకి Rolling Thunder Pictures అని పేరు కూడా పెట్టుకున్నాడు.



