ఏది అరాచకం..? ఏది కిరాతకం..??

TAADI PRAKASH ✍🏻✍🏻 Senior journo –
97045 41559

ఏది అరాచకం…ఏది కిరాతకం?

ఏది సత్యం? ఏదసత్యం?

LIBERAL DEMOCRATIC BENEVOLENT
TERRORISM ZINDABAD

——————————————

ఒకడు పార్టీలు మార్చి, తలకాయలు మార్చి, డబ్బు సంచులు పంచి, దొంగనోట్లు గుద్దించి, పదోసారి ముఖ్యమంత్రి అయితే.. అది పవిత్రమైన ప్రజాస్వామ్యమని మీకు తెలుసా?

కోటీ, రెండు కోట్లూ కాదు, వేలకోట్లకి బ్యాంకుల్ని నిలువునా ముంచిన మెహుల్ చోక్సీ, నీరవ్ మోదీ, కింగ్ ఫిషర్ దొంగ విజయ్ మాల్యాలు దేశం విడిచి పారిపోడానికి దారి యిచ్చిన వాళ్లు ప్రజాస్వామ్య పరిరక్షకులని మీకు ఎరుకేనా?

ఆవుమాంసం తిన్నాడనో, దాచుకున్నాడనో అఖ్లాఖ్ అనే పెద్దాయన్ని దారుణంగా కొట్టి చంపినవాళ్లూ, యు.పి.లోని హత్రాస్ లో దళిత బాలికని ఘోరంగా రేప్ చేసి హతమార్చిన వాళ్లూ దర్జాగా రోడ్ల మీద తిరగడమే ప్రజాస్వామ్య స్వేచ్ఛ, విలువల పరిరక్షణ అంటారని అర్థం అవుతోందా?

భీమా కోరెగావ్ అనే ఒక పనికిమాలిన దొంగ కేసులో గౌతమ్ నవ్ లఖా, రోనా విల్సన్, అరుణ్ ఫరేరియా, షోమాసేన్, సుధీర్ ధావ్లే, హనీ బాబు, మహేష్ రౌత్ లను అరెస్ట్ చేసి జైళ్లలో బంధించడం వెనక అసలు ఉద్దేశం ఏమిటో కనుక్కునే ప్రయత్నం చేశారా ఎప్పుడైనా?

చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం అనే బరితెగింపు ఎత్తుగడతో ఉమర్ ఖాలిద్ నీ, షాజిల్ ఇమామ్ నీ చీకటి జైళ్లల్లో కుక్కి, ఈ దేశ భద్రతను కాపాడుతున్నామన్న క్రూయెల్ జోకు మిమ్మల్ని గాయపరిచిందా ఏరోజైనా?

చీకూచింతా లేని సుఖవంతమైన జీవితాన్ని కాదనుకుని, దిక్కుమాలిన ఆదివాసులకు పెద్దదిక్కుగా నిలబడి పోరాడుతున్న ఉన్నత విద్యావంతురాలు, లాయర్ సుధా భరద్వాజ్ ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం ప్రజాస్వామ్యమా? వెర్రితలలు వేస్తున్న టెర్రరిజమా?

ఎనభై ఏళ్ల వయస్సు దాటిన వృద్ధాప్యంలో వొణికే చేతుల్తో మంచినీళ్ళూ, కాఫీ తాగలేక ఒక్క స్ట్రా యిప్పించమని స్టాన్ స్వామి ప్రాధేయపడితే, స్ట్రా కావాలని హైకోర్టులో పిటిషన్ పెట్టుకోమన్న జైలు అధికారులు ప్రజాస్వామ్యవాదులా? కిరాతకులా?

ఏం నేరం చేశాడని, ఎందర్ని హత్య చేశాడని ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ జి.ఎన్.సాయిబాబాని అరెస్టు చేశారు? రెండు కాళ్లూ లేని, వీల్ చైర్ లో తప్ప కదల్లేని ఆ కవిని, రచయితని, మేధావిని పదేళ్లు జైల్లో పెట్టి నరకం చూపించిన వాళ్లే ప్రజాస్వామ్యాన్ని రక్షిస్తున్నాం అంటున్నారు. వింటున్నారా?

సామాజిక బాధ్యతతో గొప్ప రచనలు చేసి జనాదరణ పొందిన జర్నలిస్టు గౌరీ లంకేష్ ని, విద్యావేత్త కల్బుర్గిని,రచయిత గోవింద్ పన్సారేని తుపాకులతో కాల్చి చంపిన వాళ్లని దేశభక్తులు అంటారని మీ మట్టిబుర్రలకు తట్టిందా ఎన్నడైనా?

వెంటబడి తరిమి, గుడిసెలు పీకేసి, ఆదివాసులను బెదిరించి, సోనీసోరీ అనే మహిళను నెత్తురు కారేలా కొట్టి హింసించి – అటవీ సంపదని అదానీ గాడి లాంటి గూండాలకు ధారాదత్తం చేయడానికి పూలదారులు పరుస్తున్న పాలకుల్ని చూస్తే ఆనందంతో మీ కళ్ళు చెమర్చకపోతే, మనుషులేనా మీరసలు?

ఢిల్లీలో వేలాది రైతులకు నరకం చూపించి ,
వలస కార్మికుల ప్రాణాలు గాలికి వొదిలేసి ,
గాంధీజీని హత్య చేసిన వాడికి శిలా విగ్రహం పెట్టి, పూలమాలలు వేసి, వొంగి దణ్ణాలు పెట్టినవారే మన రక్షకులు అనే జ్ఞానం లేకపోతే, ఇక మీ దేశభక్తి దేనికి? తగలబెట్టుకోడానికా?

ఒక చిన్న, చిల్లర జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం వందల కోట్ల రూపాయలు వరదలై పారి, మందు కాల్వలై ప్రవహించి, వేల పట్టుచీరల పంపకం పట్టపగ్గాల్లేకుండా సాగిపోయిందంటే, అది మన సంపన్న ప్రజాస్వామ్యం వెదజల్లిన సంపంగి సువాసనలని గుర్తించలేని అరసికులమా మనం?

వేలకోట్ల రూపాయలకి ఆయువుపట్టయిన భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు కుంభస్థలం మీద కూర్చోడానికి అమిత్ షా కొడుకే అర్హుడౌతాడని గనక నీకు తెలిస్తే, లక్షల కోట్ల రూపాయల వెలుగులు విరజిమ్మే తిరుమల – తిరుపతి దేవస్థానం మొగుడు, చంద్రబాబు నాయుడి తాబేదారు బి.ఆర్.నాయుడు అవుతాడన్నది కామన్ సెన్స్ తప్ప, కాలజ్ఞానం చదవక్కరలేదు.

ఎన్టీ రామారావు కొడుకూ, అక్కినేని నాగేశ్వరరావు కొడుకూ, కృష్ణ గారి అబ్బాయీ, చిరంజీవి కుమారుడూ, చిరంజీవి తమ్ముడూ, అల్లు అరవింద్ కొడుకూ, కృష్ణంరాజు గారి బంధువూ – వీళ్లే ఎందుకు తెలుగు సినిమా అగ్ర హీరోలు అవుతారో తెలుసుకోడానికి మీరు అర్జెంటుగా కారల్ మార్క్స్ కేపిటల్ చదువుకోనక్కరలేదు.
ఇది కోట్లకు పడగలెత్తిన కళాత్మకమైన కల్చరల్ టెర్రరిజమ్!

మరి ఇంతమంది దయాళువులూ, కరుణరక్త రసప్లావితులైన డ్రాక్యులాలూ ముందూవెనకా, మన చుట్టూ ఈ సమాజం నిండా వుండగా.. ఒక్క మాడ్వి హిడ్మానే రాక్షసుడూ, టెర్రరిస్టూ, ద్రోహీ ఎలా అవుతాడు? గోండు భాషలో గలగలా మాట్లాడి, జనానికి పాఠాలు చెప్పగల హిడ్మా భార్య రాజే తుపాకులతో కాల్చిచంపదగ్గ పరమ దుర్మార్గురాలు ఎలా అవుతుంది?

నా అడవులు నా కొండలూ పచ్చగా ఉండాలనీ,
నా పేదవాళ్లు, నా ఆదివాసీలు క్షేమంగా, సుఖంగా వుండాలనీ ఆశించినవాడు, వాళ్ల మనుగడ కోసం ఆయుధం పట్టినవాడు – ఇన్ని లక్షల సైన్యం, బాంబులూ, యుద్ధవిమానాలున్న ఒక పెద్ద దేశాన్ని ఎలా భయపెట్టగలిగాడు?

మాడ్వి హిడ్మా … ధర్మాగ్రహంతో వూగిపోయిన హిడ్మా అనే గుండెధైర్యం కలిగిన ఒక యువకుడు – సువిశాలమైన, సకల శక్తిసంపన్నమైన భారతదేశాన్ని గుప్పెట్లో పెట్టుకున్న పాలకవర్గాన్ని గడగడలాడించాడంటే…. తలవంచని అతని తిరుగుబాటులో దాచేస్తే దాగని సత్యం వున్నట్టే.

పొరుగు దేశాలతో యుద్ధానికి కాలుదువ్వే అణ్వాయుధ సంపన్నమైన కేంద్ర ప్రభుత్వం, గిరిజనం కోసం ప్రాణాలకు తెగించిన ఒక యోధుణ్ణి చూసి ఉచ్చపోసుకుందంటే – అతని ఆశయం జ్వాజ్వల్యమానమై వెలుగుతున్నట్టే…

అందుకే మరి , అతని తలమీద కోటి రూపాయల రివార్డు ఉందని అంటాం కదా !

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe

Latest Articles