పాల ప్రస్తావన వస్తే ప్రపంచం చెప్పుకునే పేరు వర్గీస్ కురియన్. మిల్క్ మ్యాన్ ఆఫ్ ఇండియా.. ఫాదర్ ఆఫ్ వైట్ రెవల్యూషన్. జూన్ 1వ తేదీన వరల్డ్ మిల్క్ డే రోజు ఎలాగైతే ఆయన గురించి తల్చుకుంటామో.. ఆయన పుట్టినరోజునా కాస్త చెప్పుకుందాం.
ప్రపంచ దేశాలన్నీ 2001 నుంచి ప్రతీ ఏటా జూన్ ఒకటవ తేదీన ప్రపంచ పాల దినోత్సవాన్ని జరుపుకుంటున్నాయి. యునైటెడ్ నేషన్స్ విభాగమైన ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (FAO).. ప్రపంచవ్యాప్తంగా పాలకున్న ప్రాధాన్యత.. అందుకోసం పాడిరైతుల సహకారాన్ని గుర్తించేందుకు ఒక ప్రత్యేకమైన రోజును ఎంపిక చేసి.. వరల్డ్ మిల్క్ డేగా జూన్ ఒకటిని ఎంపిక చేసింది. అయితే, ఈ వరల్డ్ మిల్క్ డే రోజు కేవలం భారతీయులు మాత్రమే కాకుండా.. ప్రపంచవ్యాప్తంగా కురియన్ పేరును గుర్తు చేసుకుంటుంటారు.

ఇంతకీ ఎవరు కురియన్..? ఏంచేశాడు…??
1940ల్లో భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా పాల కొరత తీవ్రంగా ఉండేది. ఇక్కడి ప్రజానీకం విదేశాల నుంచి పాల దిగుమతులపై ఆధారపడాల్సిన దుస్థితి. అదిగో ఆ సమయంలో కురియన్ రూపంలో భారత్ లో వెల్లివిరిసిందే వైట్ రెవల్యూషన్. అలా గుజరాత్ లోని ఆనంద్ కేంద్రంగా అమూల్ ను స్థాపించిన కురియన్… పాలు, పాలతో తయారయ్యే ఇతర ఉత్పత్తులతో ఒక విప్లవకారుడయ్యాడు. ప్రభుత్వ స్కాలరిషిప్స్ తో విదేశాల్లో చదువుకున్న వర్గీస్ కురియన్.. ఇండియాకు వచ్చాక తాను ప్రభుత్వం నుంచి పొందిందానికంటే ఎక్కువే చేశాడు.
అలా ఆనంద్ లో డెయిరీ ఆఫీసర్ గా ఐదేళ్లపాటు నియామకమైన కురియన్.. విప్లవాలకు తెరతీశాడు. అప్పటివరకూ గేదెపాలతో ఇతర మిల్క్ బై ప్రోడక్ట్స్ తయారుచేయలేమనే బలమైన విశ్వాసముండటం వల్ల.. భారతీయులు దిగుమతి చేసుకుంటున్న విదేశీ పాలపొడిని అధికంగా వినియోగించేవారు. ఆవుపాల వినియోగం కూడా భారత్ లో అంత పెద్దగా కనిపించని కాలమది. పాడి పరిశ్రమంతా యూరప్ కేంద్రంగా ఉండటం.. పైగా, ఆవుపాలు కూడా విరివిగా అక్కడ దొరుకుతుండటం.. భారత్ లో గేదె పాల వినియోగం మాత్రమే అధికంగా ఉండటంతో ఒక పాల సంక్షోభమే ఏర్పడిన రోజులవి.
అదంతా, ప్రశ్చ్యాత్య దేశాల కుట్ర అని భావించాడు కురియన్. ఇండియా వంటి దేశాలన్నీ తమ నుంచే దిగుమతులు కొనసాగించేందుకు వెస్ట్రన్ యూనియన్ పన్నిన పన్నాగమని పసిగట్టాడు. తన మెమరీస్ లో కూడా ఈ విషయాల్ని ఆయన రాసుకొచ్చారు. ఏదేమైనప్పటికీ ఆ ప్రాశ్చాత్య వాదనను తిప్పికొట్టేందుకు కంకణం కట్టుకున్న కురియన్.. తన మిత్రుడు డెయిరీ మేనేజ్మెంట్ లో ఇంజనీరైన హెచ్.ఎం. దాలయా సాయంతో గేదె పాలను మిల్క్ పౌడర్ గా, కండెన్స్డ్ మిల్క్ గా, ఆ తర్వాత జున్నుగా కూడా తయారుచేయగల్గాడు. ఇక అప్పుడు గ్లాక్సో, నెస్లే వంటి ప్రాశ్చాత్య సంస్థలకు.. అమూల్ తో అసలైన పోటీ మొదలైంది.
అలాంటి సమయంలో నేరుగా వినియోగదారులకు పాడి రైతులే తమ పాలను విక్రయించేలా.. పాడి సహకార సంఘాలకు తెరతీశారు కురియన్. అలా ఆనంద్ వద్ద ఎలాంటి మధ్యవర్తిత్వం లేకుండా మంచి లాభాలతో పాడిరైతులు బాగుపడేలా.. వినియోగదారుడికి నాణ్యమైన పాలందించేలా మొట్టమొదటి పాల సహకార సంఘం ఏర్పాటైంది. అలాంటి సమయంలో గుజరాత్ లోని నాయకులు కొందరు గుజరాత్ కో ఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ గా తమ సహకార సంఘాన్ని విస్తరించాలని కోరారు. అలా అమూల్ పురుడు పోసుకుంది. అమూల్ ఇప్పుడో బ్రాండ్. దేశంలోని సామాజిక, ఆర్థిక, రాజకీయాంశాలన్నింటిపైనా భారతీయులకు అవగాహన కల్పిస్తూనే… మరోవైపు అమూల్ తన ప్రచారాన్ని కొనసాగిస్తుండటం మరీ విశేషం.
నేషనల్ డెయిరీ డెవలప్‌మెంట్ బోర్డ్!
ఆనంద్ సహకార నమూనా దేశవ్యాప్తంగా సంచలనమైంది. దాన్ని విస్తరించేందుకు ప్రభుత్వం నేషనల్ డైరీ డెవలప్‌మెంట్ బోర్డ్‌ను సృష్టించింది. ఆ బోర్డుకు కురియన్ ను వ్యవస్థాపక చైర్‌పర్సన్ గా నియమించింది. అలా పాల కొరతకు కేరాఫ్ అని ముద్ర పడ్డ భారతదేశాన్ని… ఆపరేషన్ ఫ్లడ్ అని పిల్చేట్టు… శ్వేతవిప్లవాన్ని సాధించిన ఘనత కురియన్ ది. ప్రస్తుతం అమూల్ ప్రపంచంలోనే అతి పెద్ద పాల తయారీ కేంద్రంగా ఏడాదికి 60 వేల కోట్ల టర్నోవర్ తో ఇంతింతై ఎదిగిన తీరు… పాలవిప్లవంలో భారత్ సాధించిన వృద్ధికి స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ఎత్తు!
90 ఏళ్ల వయస్సులో 2012, సెప్టెబర్ 9న కన్నుమూసిన కురియన్.. మతాచారాల ప్రతారం ఓ క్రిస్టియనే అయినప్పటికీ.. ఓ నాస్తికుడుగా తాను నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి ఉన్న వ్యక్తి. యూనివర్సిటీ ఆఫ్ మద్రాస్ నుంచి ఫిజిక్స్ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన కురియన్.. మిషిగాన్ యూనివర్సిటీ నుంచి మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. 1949లో భారత ప్రభుత్వమే కురియన్ ను ఆనంద్ మిల్క్ ప్రోడక్ట్స్ తయారీ సంస్థకు మేనేజర్ గా పంపించడ.. ఆ తర్వాత కురియన్ సాధించిన ఘనతలు మనందరమెరిగన చరిత్రలే. నాటి మద్రాస్ ప్రెసిడెన్సీలో.. నేటి కేరళలోని కోడికోడ్ లో జన్మించిన కురియన్… సిరియన్ క్రిస్టియన్ కుటుంబానికి చెందినవాడు.
ఇండియన్ ఆర్మీలోకి వెళ్లాలని సంకల్పించిన కురియన్.. జంషెడ్ పూర్ టాటా స్టీల్స్ టెక్నికల్ ఇనిస్టిట్యూట్ లో మొట్టమొదట ఉద్యోగం చేశాడు. కురియన్ సేవలకుగాను భారత ప్రభుత్వ ఆయన్ని పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మ విభూషణ్ వంటి అత్యున్నత సత్కారాలతో సన్మానించగా.. 1964లో రామన్ మెగసెసే అవార్డ్ కూడా కురియన్ ను వరించింది.
అయితే, ఫాదర్ ఆప్ వైట్ రెవల్యూషన్ అని పొగిడిన కురియన్.. పాడి రైతుల స్థితిగతులు మార్చిన విప్లవకారుడని.. భారత గ్రామీణాభివృద్ధిలో ఆయన సేవలు వెల కట్టలేనివని మాజీ ప్రధాని మన్మోహన్, దివంగత ప్రణబ్ ముఖర్జీలాంటివారు కొనియాడితే… కొందరు మాత్రం కురియన్ ను కూడా వ్యతిరేకించినవారూ ఉన్నారు. కురియన్ అమూల్ లోని లాభాలన్నింటినీ.. క్రిస్టియన్ మిషనరీలకు పంపుతున్నాడంటూ ఆరోపణలూ ఆయనపై వెల్లువెత్తాయి. నాణానికి బొమ్మ ఉన్నప్పుడు బొరుసూ తప్పదనే కోణంగా చూడాలే తప్ప… కురియన్ క్రియేట్ చేసిన బ్రాండ్ ఇమేజ్ మాత్రం పాడి ఉన్నంతవరకూ, పశువుల నుంచి పాలు పిండినంత కాలమూ చిరస్మరణీయమే!



