ఆడియో రికార్డింగ్ లో హిస్సింగ్ సౌండ్.. ఆయన్ను డిస్టర్బ్ చేసింది. నాణ్యత లేని శబ్దం.. వినడానికి అంత పరిపూర్ణతనివ్వలేదు. అదే నేటి సౌండ్ డిజైన్ లో ఓ విప్లవాన్ని సృష్టించింది. ఆ అద్భుతమైన సరౌండ్ సిస్టమ్ డిజైనింగ్ కు మొట్టమొదటి వేదిక మన భారతదేశం కావడం అందులో మరో విశేషం. మనం ఇవాళ ఎక్కడికక్కడ ప్రతీ వాద్యం సౌండ్ ను స్పష్టంగా వింటూ అనుభూతి చెందే సరౌండ్ ను సృష్టించిందెవరు..? అందుకు ఇండియా ఎలా వేదికైంది..??
ఇవాళ ఐమ్యాక్స్ థియేటర్స్ నుంచి మొదలుకుంటే, ఇంట్లో ఓటీటీల్లో, హోంథియేటర్స్ లో శ్రావ్యమైన, స్పష్టమైన సౌండ్ ను ఆస్వాదించేందుకు కారకుడు రే మిల్టన్ డాల్బీ. మనం ఇవాళ ఏ టీవీ కొన్నా, హోంథియేటర్ తీసుకున్నా.. డాల్బీ అట్మాస్, డాల్బీ సరౌండ్ ఫీచర్స్ ఉన్నాయా అని తరచి చూసి కొంటున్నాం.

మనం పొందుతున్న నేటి నాణ్యమైన శబ్దగ్రహణానికి.. మన ఇండియాలో జరిగిన ఘటనలే ప్రధాన కారణం. అవే నేటి లేటెస్ట్ డాల్బీ అట్మాస్ కీ, డాల్బీ సరౌండ్ అనుభూతికి రెడ్ కార్పెట్ పరిచిన మూలాలు.
రే 60 దశకంలో భారతదేశంలో పర్యటించాడు. ఉత్తరప్రదేశ్, పంజాబ్ లలో కొన్ని కాన్సర్ట్స్ కి హాజరయ్యాడు. రెండేళ్లపాటు వివిధ రకాల సంగీత కచేరీలు విన్న డాల్బీ రేకు వేదిక వరకూ బాగానే అనిపించిన సంగీతం రికార్డ్ అయ్యాక మాత్రం తృప్తనివ్వలేదు. హిస్ అనే పరిసరాల సౌండ్ ఆయన్ను తీవ్రంగా డిస్టర్బ్ చేసింది.
1960ల కాలంలో సితార్, తబలా వంటి వాద్యపరికరాల సంగీతాన్ని కలిపి రికార్డ్ చేయడమే అప్పటికి ఓ విప్లవాత్మకమైన చర్య.
అవన్నీ కలిపి ఓకేసారి వాయించినప్పుడు లైవ్లీగా బాగానే ఉంటోంది గానీ.. రికార్డింగ్ కు వచ్చేసరికి ఏ వాద్యమూ స్పష్టంగా వినపించని ఒక అస్పష్టత డిస్టర్బ్ చేసేది. దాంతో పాటు చుట్టుపక్కల నళ్లా వదిలినా, టపాసులు మోగిస్తున్నా, ఓ పాప ఏడుస్తున్నా ఆ నాయిస్ అంతా కూడా సైడ్ నుంచి రికార్డ్ కావడంతో… చెవికింపుగా వినిపించాల్సిన శ్రావ్యమైన సంగీతం కాస్తా ఇబ్బందిగా అనిపించేది. అదే రే మనసు సౌండ్ సిస్టమ్ ను మార్చాలన్న లక్ష్యం వైపు కదిలింది.
ఆ కాలంలో కేసెట్స్ లేదా స్పూల్స్ లో రికార్డ్ చేసేవారు. అనలాగ్ సిస్టమ్ లో రికార్డింగ్ చేయడం వల్ల వాద్యాలన్నీ కలిపి స్పష్టత ఉండేది కాదు. ఆ రికార్డింగ్ సిస్టమ్ నే మార్చేయాలన్న రే డాల్బీ తలంపే నేటి డాల్బీ సరౌండ్, డాల్బీ అట్మాస్ కు కారణం. ఇవాళ డాల్బీ అట్మాస్ లో మనం ఏ వాద్యానికావాద్యం విడిపోయి స్పష్టంగా సీనుకు తగ్గట్టుగా, సందర్భానికి తగ్గట్టుగా ఆడియో అనుభవాన్ని ఆస్వాదించగల్గుతున్నామంటే 60ల్లో ఇండియా వేదికగా డాల్బీ రేలో మొలకెత్తిన ఆలోచనలే కారణం.
డాల్బీ సిస్టమ్ లో ఆడియో సిగ్నల్స్ ను ఎన్ కోడ్, డీకోడ్ చేసే వ్యవస్థలను అనుసంధానించడంతో ఒక అద్భుతమైన అనుభూతిని పొందగల్గే ధ్వని కారకాల సృష్టి జరిగింది. అసలు, నేటి రోజుల్లోనైతే డాల్బీ సిస్టమ్ లేకుండా గిటార్, ఓ వంద వయోలిన్స్, డ్రమ్స్, డోలక్స్ వంటివాటిని కలిపి రికార్డ్ చేయడమనేదే ఊహించలేం.
యునెస్కో సైన్స్ సలహాదారుగా ఓ ప్రాజెక్ట్ కోసం భారత్ కు వచ్చినప్పుడు రే మిల్టన్ డాల్బీకి ఎదురైన అనుభవం.. సంగీత ప్రపంచంలో ఓ అద్భుతమైన సౌండ్ సిస్టం ఏర్పాటుకు బీజం వేసింది. విప్లవాత్మకమైన డాల్బీ సిస్టమ్ తెరపైకొచ్చింది. డాల్బీ సౌండ్ సిస్టమ్ లో ఏదైనా పాట కానీ, నేపథ్య సంగీతాన్ని కానీ రికార్డ్ చేసినప్పుడు నాయిస్ క్యాన్సిలైజేషన్ ఎఫెక్ట్ ఉండేలా డిజైన్ చేశాడు డాల్బీ. రికార్డింగ్ స్టూడియోలో కూడా అలాంటి ఏర్పాట్లతో బయట సౌండ్స్ ఏవీ రికార్డ్ కాకుండా పాటను ఆడియో టేప్స్ లో నిక్షిప్తం చేసే పద్దతికి శ్రీకారం చుట్టాడు. దాంతోపాటే.. ప్రతీ వాద్యమూ స్పష్టంగా వినిపించే విధంగా రూపొందించిన సాంకేతికతను అభివృద్ధిపర్చాడు.
ఆ తర్వాత కాలంలో కేసెట్స్, సీడీలు కొనుగోలు చేసినా.. లేదా ఎవరైనా సంగీతకారులు స్టూడియోల్లో రికార్డింగ్స్ చేసినా.. డాల్బీ సరౌండ్ ఆడియోనా, కాదా అని తరచి చూసుకునే స్థాయిలో డాల్బీ ఆడియో ప్రాధాన్యత సంతరించుకుంది.
ఆడియో మెకానిక్స్‌లో రే డాల్బీ ప్రయాణం!
రే డాల్బీ యూఎస్ ఒరెగాన్‌లోని పోర్ట్‌ల్యాండ్‌లో రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్త ఎర్ల్ డాల్బీ, ఎస్తేర్ దంపతులకు జన్మించాడు. రే డాల్బీ చిన్న వయస్సులోనే వారి కుటుంబం కాలిఫోర్నియాలోని పాలో ఆల్టోకు వెళ్లిపోయింది.
ఎలక్ట్రిక్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన రే డాల్బీకి చిన్నప్పట్నుంచీ యాంత్రికమైన విషయాలపైన మక్కువ. కానీ, తనకిష్టమైన ఆటోమోబైల్ రంగంలో కావాల్సిన కొత్త కొత్త ఆవిష్కరణలన్నీ జరిగిపోతున్నాయి. ఆ తర్వాత పెరుగుతున్నకొద్దీ చలనచిత్ర నిర్మాణంపై మనసు పారేసుకున్నాడు. కెమెరా పర్సన్ కావాలనుకుంటున్నాడు. ఆడియో, వీడియో రంగంలో అప్పటికే పేరెన్నికగన్న ఆంపెక్స్ వ్యవస్థాపకుడు అలెక్స్ పోనియాటాఫ్ తో రే డాల్బీకి ఏర్పడిన పరిచయం అతడి జీవిత లక్ష్యాన్ని మరింత స్పష్టం చేసింది. ఓ పాఠశాలలో పోనియాటాఫ్ ప్రసంగం చేస్తున్నప్పుడు ఓ ప్రొజెక్షనిస్ట్ అవసరం పడింది. అప్పుడు రే డాల్బీ ముందుకు రావడంతో.. అలెక్స్ తో, రే డాల్బీకి స్నేహం చిగురించింది. రే డాల్బీకి సినిమా రంగంపై ఉన్న ఆసక్తి, కెమెరా నేర్చుకోవాలన్న తపన వంటివి చూసి పోనియాటాఫ్.. రేను తన ఆంపెక్స్ కంపెనీలో పని చేయమని ఆఫర్ ఇచ్చాడు. మొట్టమొదటి టేప్ రికార్డర్ రూపకల్పన చేసిన కంపెనీ ఆంపెక్సే తనను ఉద్యోగం చేయాలని ఆహ్వానించడంతో.. రే డాల్బీ ఆంపెక్స్ లో ఉద్యోగంలో చేరిపోయాడు.

రే డాల్బీ సౌండ్ సిస్టమ్స్ లో సాంకేతిక ప్రయోగాలకు ఆంపెక్స్ కంపెనీ ఓ వేదికైంది. కేవలం ఓ మూడు, నాల్గు గంటలు మాత్రమే స్కూల్ కు వెళ్లడం, మిగిలిన ఐదు గంటల సమయమంతా ఆంపెక్స్ సంస్థలో పనిచేయడం ఇదీ రే డాల్బీ దినచర్య. 19 ఏళ్ల వయస్సులోనే సౌండ్ సిస్టమ్ లో తన మొట్టమొదటి పేటెంట్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. తన జీవితంలో 50 పేటెంట్స్ పొందిన వ్యక్తిగా కూడా రే డాల్బీ పేరిట రికార్డ్ సాధించాడు.
స్టాన్ ఫోర్డ్ లో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ గా పట్టభద్రుడయ్యాక 1957లో ఆంపెక్స్ ఉద్యోగం వదిలి కేంబ్రిడ్జ్ లో పీహెచ్డీ పూర్తి చేశాడు.
డాల్బీ కంపెనీకి దారితీసిన వైనం!
రే డాల్బీ యునెస్కో సైన్స్ సలహాదారుగా సేవలందించే సమయంలో ఇండియాకొచ్చి ఇక్కడి భారతీయ శాస్త్రీయ, జానపద సంగీతాన్ని రికార్డ్ చేశాక ఆయన సంతృప్తి చెందలేకపోయాడు. ఓ చిన్న హోం స్టూడియో ఏర్పాటు చేసుకుని ఆ రికార్డింగ్స్ పూర్తి చేసినా.. అవి అంత ఇంపుగా అనిపించకపోవడంతో రే లో మథనం మొదలైంది.
అప్పుడు లండన్ కు పయనమయ్యాడు రే డాల్బీ. పర్టిక్యూలర్ అంశాన్ని రికార్డ్ చేస్తున్నప్పుడు చుట్టూ ఉన్న హై ఫ్రీక్వెన్సీ శబ్దాలను నియంత్రించేందుకు పని మొదలుపెట్టాడు. 1965లో లండన్ బేస్డ్ గా 25 వేల డాలర్స్ తో ఒక సంస్థను స్థాపించి.. డాల్బీ పరికరాల తయారీ మొదలెట్టాడు. వాటిని రికార్డింగ్ స్టూడియోస్ కు అమ్మేవాడు. 1969లో మరో ఆడియో ఇంజనీరైన అయోన్ అలెన్ తో కలిసి డాల్బీ లాబోరేటరీస్ ను నెలకొల్పాడు. అక్కడ డాల్బీ సరౌండ్ సౌండ్ సిస్టమ్ కు సంబంధించిన పరిశోధనలు, ప్రయోగాలు మొదలయ్యాయి. డాల్బీ స్టీరియో ఫిల్మ్ తయారీకి బీజం పడింది. పదేళ్లపాటు సౌండ్ సిస్టమ్ లో నూతన ప్రయోగాలు కొనసాగాయి. ఆ తర్వాత పదేళ్లకు ఆ సంస్థ హెడ్ ఆఫీస్ ను కాలిఫోర్నియాకు మార్చారు. అక్కడే అదో దిగ్గజ సంస్థగా ఎదిగింది. అలా డాల్బీ లాబోరేటరీస్ సృష్టించిన డాల్బీ సౌండ్ ప్రపంచమంతా ప్రతిధ్వనించి.. ఇవాళ మన ప్రతీ ఇంట్లో హోంథియేటర్స్, టీవీల రూపంలోనూ డాల్బీ అట్మోస్ వరకూ వచ్చేసింది.
పాప్యులర్ రికార్డింగ్ సంస్థైన డెక్కా రికార్డ్స్ తొమ్మిది డాల్బీ A-301 మాడల్ యూనిట్స్ ని ఒక్కోదాన్ని 7 వందల యూరోల ధరకు నాడే ఆర్డర్ చేసింది. ఆ తర్వాత డాల్బీ లాబోరేటరీస్ ది తిరుగులేని చరిత్రగా మారింది.
చిన్ననాటి నుంచే పియానో, క్లారినెట్ వంటి సంగీత వాద్యాలను నేర్చుకున్న రే డాల్బీలో.. వాద్యాల్లో ఉండే మెట్లను మీటితే సౌండ్ ఎలా వస్తుంది… ఆ ఆర్గాన్స్ నొక్కినప్పుడు వినసొంపైన ధ్వనిగా ఎలా ఉత్పన్నమవుతుంది అనే క్యూరియాసిటీ ఉండేది.
స్టీమ్ ఇంజన్స్, బైకులు, ఇతర వాహనాలు, విమానాలు ఇలా ఏవి చూసినా అలాంటివేవో కొత్తవి తయారు చేయాలన్న తపన పడ్డ రే డాల్బీ… ఆ తర్వాత ఎలక్ట్రానిక్ తరంలో తాను పుట్టడం వల్ల వాటిల్లో తన పరిశోధనలు కొత్త తరానికి అనుగుణంగా మార్చుకున్నాడు.
డాల్బీ లేబోరేటరీస్ రే డాల్బీని బిలియనీర్ ని చేసింది. ఎప్పుడో 1965లో పురుడుపోసుకున్న సంస్థ సంగీత ప్రియులకు మెరుగైన అనుభవాల్నిచ్చేందుకు ఇంకా తన పరిశోధనలు కొనసాగిస్తూనే ఉంది.



