చక్ దే ఇండియా!
dreamer, sportsman, success full coach, now a hero…
షారుక్ చక్ దే సినిమా చూసి… తాజాగా వార్తల్లోకెక్కిన అమూల్ మజుమ్దార్ స్టోరీ విన్నప్పుడు రెండూ సరిపోలినట్టనిపిస్తుంది.
తన జీవితంలో మిస్సైన డ్రీమ్ ను… ఒక టీమ్ కలగా మార్చి సాధించినవాడు అమోల్ మజూమ్దార్!

వరల్డ్ కప్ సెమీఫైనల్ లో… ఏడుసార్లు విజేతైన ఆస్ట్రేలియా నడ్డి విరిచి ఫైనల్స్ కు చేరడంతోనే ఎనలేని కీర్తి మూటగట్టుకున్న భారత మహిళా క్రికెట్ జట్టు.. ఆ తర్వాత ఫైనల్స్ లో దక్షిణాఫ్రికాపై గెల్చి సాధించిన విజయంతో ఆ కీర్తిని శిఖరాగ్రానికి చేర్చింది. అయితే ఆ విజయాల వెనుక జట్టులోని ప్రతీ క్రీడాకారిణికెంత భాగస్వామ్యముందో.. వారిని చేయి పట్టి నడిపించి వారికా విజయాన్నందించడంలో తోడ్పడిన కోచుదీ అంతే భాగస్వామ్యం.
అందుకే, ఆ జట్టుతో పాటే అమోల్ మజూమ్దార్ పేరు కూడా మార్మోగిపోతోంది.
ఎవరసలు అమోల్ మజూమ్దార్..?
వివక్షకు కేరాఫ్ లా చెప్పుకునే భారత క్రికెట్ జట్టులో స్థానం దొరకడం.. దాన్ని స్థిరంగా నిలబెట్టుకోవడమంటే చాలా కష్టమైన పనే. అలాంటి పనిలో ఓటమిపాలైన క్రీడాకారుడే అమోల్ మజూమ్దార్.
రంజీ ఆరంగేట్రంతోనే 260 పరుగులు చేసిన సూపర్ బ్యాట్స్ మన్. ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో 11 వేల 600 పరుగులు చేసిన పరుగుల మిషన్. అయినా.. భారత్ జట్టు తరపున ప్రాతినిథ్యం వహించే అవాశం దక్కని దురదృష్టవంతుడు. అయితేనేం, భారత మహిళా క్రికెట్ జట్టుకు కోచుగా వెన్నంటి ఉండి తన కెరీర్ మొత్తం వెంటాడిన విషాదాన్ని వరల్డ్ కప్ విజయంతో తుడిచిపెట్టేసి పడిన ప్రతీసారీ లేచి నిల్చోని విజయం సాధించిన ఘనుడు.
అందుకే అమోల్ మజూమ్దార్ ప్రత్యేకం!
పట్టుదల, ఆత్మవిశ్వాసం ఎప్పుడూ వదిలిపెట్టకూడదని నిరూపించిన ఒక ఇన్స్పిరేషన్ సక్సెస్ స్టోరీ అమోల్ మజూమ్దార్. కొన్నిసార్లు విజయాలు ఆలస్యం కావచ్చునేమోగానీ.. చిత్తశుద్ధితో యత్నిస్తే అవి తప్పక వరిస్తాయని నిరూపించిన రూపం మజూమ్దార్.
తాననుకున్నట్టుగా ఒక ఆటగాడిగా తనకు అవకాశం దక్కి ఉంటే కథ ఇంకోతీరుగా ఉండేదేమో బహుశా! కానీ, అలా దక్కకపోవడంతో మాత్రం తనకు క్రికెట్ పైనున్న ప్రేమ, అంకితభావం, కసి… అతణ్ని మరింత దూరం ప్రయాణానికి పురిగొల్పింది. ఇప్పుడా ప్రయాణం కాస్తా దూరం, ఆలస్యమనిపించినా… వ్యక్తిగతంగా తాను ఎదగాలనుకునే కలను.. ఒక టీమ్ మొత్తం నిజం చేసుకుంది.. యావత్ దేశం మొత్తం ఆ విజయాన్ని 2025, నవంబర్ 2న సెలబ్రేట్ చేసుకుంది.
ఎక్కడ ప్రారంభించాడో అక్కడే విజయం సాధించాడు!
శిక్షణ అంటే డిసిప్లిన్ మాత్రమే కాదు. ఎలా ఆడాలో మెళకువలు నేర్పించడమే కాదు.. తన ప్రేరణాత్మక మాటలు, ఆత్మస్థైర్యం దెబ్బతిన్నప్పుడు సాంత్వన చేకూర్చే మాటలు.. ప్రోత్సహించే ప్రేరణ ఇలా ఇవన్నీ ఇండియన్ బ్లూ జెర్సీ మహిళా క్రికెటర్లపై అచంచల ప్రభావాన్ని చూపాయి. ఆ ప్రభావమే చివరకు విజయంగా మారి.. యావత్ ప్రపంచం సాహో అనేలా చేసింది.
1974లో ముంబైలో జన్మించిన అమోల్ మజూమ్దార్.. శివాజీ పార్కులో సచిన్ టెండూల్కర్, రాహూల్ ద్రవిడ్, వీవీఎస్ లక్ష్మణ్, వినోద్ కాంబ్లీ వంటివారందరితో కలిసి ప్రాక్టీస్ సెషన్స్ లో పాల్గొన్నాడు. వారితో కలిసి వారిలాగే ఎదుగుతూ వచ్చాడు. ప్రముఖ కోచుగా పేరొందిన రమాకాంత్ ఆచ్రేకర్ మార్గదర్శకత్వంలోనే మేటి ఆటగాళ్లతో కలిసి నెట్స్ లో ప్రాక్టీస్ చేశాడు. తన వయస్సు కేవలం 19 ఏళ్లున్నప్పుడే రంజీ ఆరంభ మ్యాచులోనే 260 పరుగులు చేశాడు. ముంబై దేశవాళీ క్రికెట్ లో ఓ లెజెండ్ గా అవతరించాడు. అలా రెండు దశాబ్దాల తన కెరీర్ మొత్తంలో 11 వేల 167 పరుగుల సునామీ అయ్యాడు. అందులో 30 సెంచరీలున్నాయి. అవన్నీ అమోల్ మజూమ్దార్ ప్రతిభకు మేథమెటికల్ ప్రూఫ్స్.
జెర్సీ మిస్సైనా.. కల మిస్ చేసుకోని కలలబేహారి!
అంతటి ప్రతిభావంతుడికి భారత క్రికెట్ జట్టులో ఆడే అవకాశం రాలేదు. తనతో పోలిస్తే తన కంటే మెరుగ్గా ఆడకపోయినా అవకాశాలు దక్కినవారిని చూసినప్పుడు కల్గే ఆ బాధ ఒక మనిషిగా సర్వసాధారణం. కానీ, అమోల్ నిరాశ చెందలేదు. అక్కడే ఆలోచిస్తూ ఆగిపోలేదు.. తన ప్రతిభకు సాన పెట్టడం ఆపలేదు. ఎప్పటికైనా నిజం కాకపోతుందానని కల కనడమూ ఆపలేదు.
2014లో క్రికెట్ కు వీడ్కోలు పలికిన అమోల్ మజూమ్దార్.. ఆ తర్వాత దేశంలోని యువ ప్రతిభావంతులకు శిక్షణనివ్వడం ఆరంభించాడు. అండర్ 19, అండర్ 23 జట్లకు కోచుగా కొత్త ప్రయాణాన్ని ప్రారంభించాడు. దాంతో తనకిష్టమైన క్రికెట్ ను విడనాడకుండానే.. మరెందరో యువ ప్రతిభావంతులను తీర్చిదిద్దే అవకాశం వచ్చిందనుకున్నాడు. అమోల్ మజూమ్దార్ కూల్ నెస్ కూడా యువ ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. ఆయన ప్రశాంత చిత్తం.. ఎదుగుతున్న ఆటగాళ్లను మెచ్యూర్డ్ గా మల్చేందుకు ఉపయోగపడింది.
వరల్డ్ కప్ గెలిపించిన కోచుగా మార్మోగిన అమోల్ పేరు!
2023 అక్టోబర్ లో బీసీసీఐ భారత మహిళా జట్టు క్రికెట్ కోచుగా అమోల్ మజూమ్జార్ ను నిమమించింది. ఆ అవకాశాన్ని అందిపుచ్చుకున్న అమోల్.. తన శిక్షణ, మార్గదర్శకత్వంతో ఆటగాళ్లల్లో విశ్వాసాన్ని నూరిపోశాడు. వారే అసాధ్యంగా భావించిన చోట.. వారితోనే సుసాధ్యం చేయించి, భారత మహిళా క్రికెట్ జట్టుకు ఒక కొత్త చరిత్రను లిఖించాడు. తొలి వరల్డ్ కప్ టైటిల్ సాధనతో.. నిరంతర కలల బేహారీగా ఉన్న తన స్వప్నాన్ని నిజం చేసిన నాయకుడయ్యాడు.
మనిషికి ఆసక్తి, అందుకు తగ్గ సాధన, దాంతో పాటు సాధించుకున్న ప్రతిభ, ఆ ప్రతిభకు సానబెట్టే నిరంతర కృషి, అచంచల విశ్వాసం వంటివి ఉంటే… ఎప్పటికైనా ఒక సమయం మనకో సక్సెస్ ను ఇస్తుందనేది.. అమోల్ మజూమ్దార్ జర్నీ మనకు చెప్పే పాఠం.



