శకునం చెప్పే బల్లి కుడితిలో పడ్డట్టేనా..? బీహార్ లో పీకే ప్రభావం ఏమైనట్టు..??

Ramu suravajjula… ✍🏻

బీహార్ లో ప్రశాంత్ కిషోర్ ప్రభావం లేదా?

భారతదేశంలో ఒకపక్క ఎన్నికల ఖర్చు, మరోపక్క ప్రభుత్వ నిర్వహణా వ్యయం పెరగడానికి ఎన్నికల వ్యూహకర్తలు ఒక కారణం. రాజకీయ పార్టీల నుంచి పెద్ద మొత్తంలో డబ్బు తీసుకుని, ప్రజాభిప్రాయం వారికి అనుకూలంగా మార్చేందుకు వారు నానా రకాల వ్యూహాలు రూపొందించి ప్రచారం చేస్తారు. ఈ క్రమంలో అధికార హస్తగతమే పరమావధిగా అలవిమాలిన హామీలు తయారుచేసి జనంలోకి వదులుతారు. అందులో కుట్టికుట్టి చంపే ఫ్రీ బీ లే ఎక్కువ అన్న అపవాదు ఉంది. భవిష్యత్ గురించి కాకుండా తాత్కాలిక ప్రయోజనం గురించి ఆలోచించే ఓటర్లు ఎక్కువగా ఉన్నందున స్ట్రాటజిస్టుల పాచికలు బాగా పారాయి. దాంతో ఆ వ్యవహారం మల్టీ క్రోర్ బిజినెస్ అయ్యింది. దీనికి ఆద్యుడిగా ప్రచారం జరిగిన ప్రశాంత్ కిషోర్ అలియాస్ పీకే బీహార్ కేంద్రంగా అక్టోబర్ 2, 2014 లో జన సురాజ్ పార్టీ (JSP) పెట్టడం దేశ రాజకీయాల్లో ఒక ఆసక్తికర పరిణామం.

ఎందుకంటే, ముఖ్యమైన రాష్ట్రాల్లో ప్రభుత్వాలు మారడంలో తెర వెనుక కీలక భూమిక పోషించిన పెద్ద మనిషి సొంతగా రాజకీయ పార్టీ స్థాపించడం మామూలు విషయం కాదు. అప్పటికే తన వ్యాపారానికి వీడ్కోలు పలికి సుదీర్ఘ పాదయాత్ర చేసి పీకే ఎన్నో ముఖ్యమైన అంశాలు లేవనెత్తారు. ఆయన ప్రచార సరళి, లేవనెత్తిన ప్రశ్నలు, వాగ్ధాటి, ఇంటర్వ్యూలలో సమాధానం ఇచ్చే తీరు నాకు బాగా నచ్చాయి.

తన పార్టీ ప్రభావం వల్ల బీహార్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత పాలిటిక్స్ లో ఫండమెంటల్ షిఫ్ట్ జరుగుతుందని పీకే గట్టిగా నమ్మారు. కానీ ఎన్నికల సర్వేలు చెబుతున్న దాన్ని బట్టి #JSP కి పది సీట్లైనా వచ్చేట్లు లేవు. కనీసం 20 సీట్లైనా వారికి వస్తాయని, ఆయన కింగ్ మేకర్ అవుతారని నేను అనుకున్నా. కానీ తాను బరిలో దిగకుండా కొత్త ముఖాలకు టికెట్లు ఇచ్చి రణతంత్రం నడిపారు. మిగిలిన చోట్ల ప్రచారానికి విఘ్నం కలగకుండా ఉండడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన చెబుతూ వచ్చారు. ఇది వ్యూహాత్మక తప్పిదం అని నాకు అనిపించింది.
అట్లాగే అన్నీ తానై ప్రచారం నడపడం కూడా కరెక్ట్ కాదేమో! ఎన్ని పిల్లి మొగ్గలు వేసినా బీహార్ ఓటర్ల ప్రజాభిమానం పొందే నితీష్ కుమార్ ను ఎక్కువ టార్గెట్ చేసి ఆయనకు పీకే సానుభూతి ఓట్లు సృష్టించారేమో తెలియదు. ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదిగి అరవింద్ కేజ్రీవాల్ బాగా క్లిక్ అయ్యారు. మన డా. జయప్రకాష్ నారాయణ్ గారు స్వల్ప విజయం సాధించి మధ్యలో అస్త్ర సన్యాసం చేశారు. ఇప్పుడు పీకే కి ఆదిలోనే హంస పాదు కావడం ఒక విచిత్రం.

బీహార్ ఎన్నికలకు సంబంధించి ఈ సర్వేలు, నా అంచనా బట్టి చూస్తే… శకునం చెప్పే బల్లి కుడితిలో పడినట్లేనా!

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles