ప్రాంతమేదైనా ఓట్ల ప్రచారానికి పాటే ఆయుధం!
మారుతున్న సమాజం… కాలానికి తగ్గట్టుగా.. ప్రక్రియలు కూడా మారుతుంటాయి. అక్టోబర్ లో జరుగబోయే బ్రెజిల్ సాధారణ ఎన్నికల నేపథ్యంలో.. అక్కడి ప్రచారం మరింత భిన్నంగా ఆకట్టుకుంటోంది. ఇంతకాలం ప్రసంగాలు, ర్యాలీలకే పరిమితమైన అక్కడి నాయకత్వం.. ఇప్పుడు పాటలు, జింగిల్స్ రూపంలో తమ ప్రచారాన్ని హోరెత్తిస్తోంది.
యూరోపియన్, ఆఫ్రికన్, ఇండీజీనియస్ ఇన్ఫ్లుయెన్సెస్ తో మ్యూజిక్ కార్నివాల్ సెలబ్రేషన్స్ కు పెట్టింది పేరు బ్రెజిల్. సాంబా, బోసనోవా, ఫొర్రో, యాక్స్, కోరో వంటి ఫ్యూజన్ కు కేరాఫ్ గా నిల్చే ఈ దేశంలో సంగీతంతో ఎన్నికలకు వెళ్లితే ఆకట్టుకునే పంథాలో ఈసారి ఎన్నికల సరళి హోరెత్తుతోంది. సోషల్ మీడియా కూడా విస్తరించడంతో ఇప్పుడు ప్రపంచాన్నీ ఆకర్షిస్తోంది.

ఈ పంథా ఇప్పటికే భారతదేశంలో.. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లోనూ ఉంది. ఎన్నికలు వచ్చాయంటే ప్రముఖ జానపద కళాకారులతో హై పిచ్చులో పాడించే పాటలు ఎంత హిట్టవుతున్నాయో తెలిసిందే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై గత ఎన్నికల సమయంలో వచ్చిన పాట మూడు రంగుల జెండా పట్టి.. సింగమోలే కదిలినాడంటూ అందుకు ఓ ఉదాహరణ. అంతెందుకు, తెలంగాణాలో ప్రధాన పార్టీగా అవతరించి రెండుసార్లు అధికారంలోకొచ్చిన బీఆర్ఎస్ కు.. తెలంగాణా సాధనలోనైనా, ఆ తర్వాత ప్రభుత్వ పథకాల ప్రచారంలోనైనా పాటే ఆయుధమైంది.
అలాంటి సన్నివేశాలు ఇప్పుడు బ్రెజిల్ లో కూడా కనిపిస్తున్నాయి.
ప్రస్తుత బ్రెజిల్ అధ్యక్షుడిగా ఉన్న లూయిజ్ ఇనాసియో లులా డా సిల్వా ప్రచార పాటలు బ్రెజిల్ ఓటర్లను ఆకట్టుకుంటున్నాయి. రియో డి జనీరో మురికివాడల్లో వినిపించే లోకల్ ఫ్లేవర్ తరహా సంగీతాన్ని సృష్టించి లూయిజ్ ఇనాసియో ప్రచారానికి ఊపునిచ్చాడు. ఇక ఆయన ప్రధాన ప్రత్యర్థిగా బరిలోకి దిగిన సెనేటర్ ఫ్లావియో బోల్సోనారో.. గ్రామీణ జీవన విధానం, వ్యవసాయం, విశ్వాసం వంటి అంశాలకు తమ పార్టీ ప్రచారాన్ని ముడిపెట్టి కంట్రీ మ్యూజిక్ శైలిలో ప్రచారాన్ని ముమ్మురం చేశాడు.
వీరిద్దరి పాటల శైలి ఆకట్టుకుంటుండగా… సాహిత్యం, మ్యూజిక్ వీడియోల్లో కనిపించే దృశ్యాలు… బ్రెజిల్ రాజకీయాలు ప్రస్తుతం ఏ దిశలో నడుస్తున్నాయో చెబుతాయి.
ప్రస్తుత అధ్యక్షుడి కోసం ఫవేలా ఫంక్!
లులా ప్రచారంలో ఉపయోగిస్తున్న సిల్వాస్ ర్యాప్ అనే పాట 1995 కాలంలో రియో డి జనీరో మురికివాడల్లో పుట్టి.. ఫంక్ మ్యూజిక్ వరల్డ్ లో ప్రాచుర్యం పొందిన ఓ పాట ప్రేరణతో కంపోజ్ చేశారు. పైగా పాట లులా జీవిత ప్రయాణాన్ని చెప్పే విధంగా సాహిత్యం సమకూర్చారు.
ఓ సాధారణ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి.. యూనియన్ నాయకుడిగా, దేశ అధ్యక్షుడిగా ఎలా ఎదిగి.. ప్రపంచ వామపక్ష రాజకీయాల్లో ఎలా గుర్తింపు పొందిన నాయకుడయ్యాడో తన పాటలతో ప్రచారం చేస్తున్నాడు లూయిస్ ఇనాసియో. బ్రెజిల్ లో అత్యంత సాధారణంగా ప్రతీ ఇంటి పేరులోనూ కనిపించే సిల్వా అనే పదాన్ని ఉపయోగించడంతో.. ప్రజలతో అనుసంధానం చేసేలా రూపొందించారు. లులా రాజకీయ జీవితంలోని ముఖ్యమైన సన్నివేశాలను మ్యూజిక్ వీడియోలో చేర్చారు.
వాస్తవానికి ఒకనాడు వివాదాస్పదమైన సంగీతమే ఇప్పుడు అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ఉపయోగించడం ఓ విశేషం, ఆ ఫంక్ సంగీతానికి దక్కిన ఓ గుర్తింపు. లులా ఉపయోగిస్తున్న ర్యాప్ అండ్ ఫంక్ మ్యూజిక్ కొత్త ఓటర్లను ఆకట్టుకోవడం కంటే కూడా.. ఇప్పటికే మద్దతుగా నిలుస్తున్న ప్రగతిశీల వర్గాలను మరింత ఉత్సాహపర్చేందుకనే అభిప్రాయమూ ఉంది.
ప్రధాన ప్రత్యర్థైన బోల్సోనారో పాట వెనుక విశేషాలేంటి మరి..?
లులాకు ప్రధాన ప్రత్యర్థిగా బరిలో ఉన్న 45 ఏళ్ల సెనేటర్ ఫ్లావియో బోల్సోనారో… లూలాకు పూర్తి భిన్నమైన సంగీతాన్నెంచుకున్నాడు.
మాజీ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో పెద్ద కుమారుడైన ఫ్లావియో.. తన ప్రచారంలో ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ సాయంతో రూపొందించిన కమ్ విత్ ఫెయిత్ అనే పాటతో దూసుకుపోతున్నారు. అయితే, లులా పాటలో తన వ్యక్తిగత జీవిత విశేషాలు, ఎదుగుదల వంటివాటిని జోడిస్తే… ఫ్లావియో మాత్రం భవిష్యత్తు ప్రణాళికలు, మెరుగైన అభివృద్ధి వంటి ఆశావాదాన్ని రేకెత్తించే సందేశాలతో పాటలను తయారు చేయించారు. అందుకోసం బ్రెజిల్ గ్రామీణ ప్రాంతాల్లో ప్రాచుర్యం పొందిన సెర్టానెజో కంట్రీ మ్యూజిక్ శైలిని అనుసరించి, తన ఎన్నికల పాటలను రికార్డ్ చేయించారు. వ్యవసాయం, గ్రామీణ జీవన విధానం, మత విశ్వాసాలన్నింటికీ ముడిపెడుతూ.. తనను గ్రామీణ, సంప్రదాయ బ్రెజిల్ కు ప్రతినిధిలా చూపించే ప్రయత్నం ఆయన పాటల్లో కనిపిస్తుండటంతో ఓటర్లు ఆ పాటలకూ అట్రాక్ట్ అవుతున్నారు. పైగా ఫెయిత్, హోప్, బిలీవ్ వంటి పదాలను పదే పదే పాటల్లో జొప్పిస్తూ నొక్కివక్కాణించే శైలిలో ఫ్లావియో తన పాటలను రికార్డ్ చేయించారు. తన తండ్రి జైర్ బోల్సోనారోకు మద్దతుగా నిల్చిన యాంజెలికల్ క్రైస్తవ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నంగా కూడా దీనిపై బ్రెజిల్ లో చర్చ నడుస్తోంది.
పాటల్లో రాజకీయ సందేశాలు!
ఫ్లావియో ప్రచార వీడియోల్లో కౌబాయ్ టోపీలు ధరించి.. పశువుల కాపరులు కొందరు ఉపయోగించే కొమ్ము బుర్రను ఊదే దృశ్యాల్లో తానూ కనిపిస్తూ అలరించాడు. అలా బ్రెజిల్ లోని విస్తారమైన వ్యవసాయ క్షేత్రాలు, పశు పోషకులు, అగ్రికల్చర్ బిజినెస్ వర్గాలతో అనుసంధానం కావడానికి ఈ పాటలతో ఫ్లావియో చేస్తున్న ప్రయత్నమది. పైగా ఈ వర్గాల్లో లులా ప్రభుత్వ తీరుపై తీవ్ర వ్యతిరేకత ఉండటాన్ని కూడా ఎన్ క్యాష్ చేసుకునే ఎత్తుగడ పాటల్లో కూడా జొప్పించి ప్రచారం చేస్తున్నాడు ఫ్లావియో.
బ్రెజిల్ ఎన్నికల్లో పాటల్లో అంత ప్రాధాన్యమెందుకు..?
బ్రెజిల్ రాజకీయ ప్రచారంలో పాటలు ఇప్పుడే మొదలేం కాదు. దశాబ్దాల చరిత్ర ఉంది. వీధి వ్యాపారులు తమ వస్తువులను అమ్మకునేందుకు పాటలనుపయోగించే సంప్రదాయం నుంచి రాజకీయ ప్రచార పాటల సంస్కృతి బ్రెజిల్ లో అభివృద్ధి చెందిందని అక్కడి సంగీత పరిశోధకులు, దర్శకులు చెప్పే మాట. చారిత్రకంగా కూడా చూస్తే అక్షరాస్యత తక్కువ ఉన్న సమయంలో కూడా పాటలతో అక్కడి ప్రజల్లోకి బలంగా రాజకీయ సందేశాలను చేరవేయగల్గింది అక్కడి నాయకత్వం.
అందుకే బ్రెజిల్ ఎన్నికల్లో ఒక మంచి రాజకీయ పాట అంటే కేవలం వినోదం మాత్రమే కాదు.. ఓ రాజకీయ సందేశాన్ని ప్రజల మెదళ్లల్లోకెక్కించి.. ఓటు వేసేవరకూ వారి నోళ్లల్లో నాన్చే ఓ ఆయుధం.
లులా నుంచి ఫంక్ వరకూ పాటల తీరు!
లులా పాట ఎంత ఫేమస్సో మనకూ తెలిసిందే. మన ఇండియాలోని చాలా పాటల్లోనూ ఆ పాట ప్రభావం ఎన్నో పాటలపై కనిపిస్తుంది.
1989లో లూయిస్ ఇనాసియో తొలిసారి అధ్యక్ష ఎన్నికల్లో బరిలోకి దిగినప్పుడు కూడా లూలా లా అనే పాటను ప్రచారంలో ఉపయోగించాడు. ఆ పాట ఫుట్ బాల్ పోటీల్లోనూ, ప్రతీ కార్నివాల్ సెలబ్రేషన్స్ లోనూ బ్రెజిల్ లో సర్వసాధారణంగా వినిపించేతంటి పాప్యులారిటీ సంపాదించుకుంది. అందుకే ఆ పాటను లూయిస్ ఇనాసియో మొత్తం ఆరుసార్లు అధ్యక్ష ఎన్నికల్లో కూడా తన ప్రచారంలో కొత్త రూపంతో ఆ పాటను వాడుకున్నారు. అలా తన రాజకీయ జీవితంలో సంగీతాన్నీ ఓ బ్రాండుగా మార్చుకున్నాడు.
ఈ పాటల ప్రచార శైలిపైన యూనివర్సిటీల్లోని కొందరు సంగీత పరిశోధకుల విశ్లేషణ ప్రకారం ఇప్పుడు పాట కూడా రాజకీయ పార్టీల గుర్తింపును తెలియజేసే ఆయుధాలయ్యాయి. కేవలం ప్రజలను ఆకట్టుకునేందుకే పరిమితం కాకుండా.. తమ పొల్టికల్ ఐడెంటిటీకి ఈ పాటలు బాగా ఉపయోగపడుతున్నాయన్నది విశ్లేషకుల అభిప్రాయం.
పాటల పోరా, ఓట్ల పోరా అన్నట్టుగా కనిపిస్తున్న బ్రెజిల్ ఎన్నికల సన్నివేశాలు!
ఇప్పటికే పాటల రూపంలో హోరెత్తిన ఎన్నికల ప్రచారంలో.. రాబోయే రోజుల్లో ఇరువురు ప్రత్యర్థులైన లూయిస్ ఇనాసియో, ఫ్లావియో నుంచి మరిన్ని పాటలు, వీడియో ఆల్బమ్స్, జింగిల్స్ రావొచ్చన్న అంచనా ఉంది.
లూయిస్ ఇనాసియో లులా తనను సామాన్య ప్రజల ప్రతినిధిగా ఎస్టాబ్లిష్ చేసుకునే యత్నం చేస్తుంటే.. ఫ్లావియో బోల్సోనారో గ్రామీణ బ్రెజిల్ ఉద్ధారకుడిలా ప్రెజెంట్ చేసుకుంటూ పాటలతో చేస్తున్న ప్రచారం ఇప్పుడు యావత్ ప్రపంచాన్నీ ఆకట్టుకుంటోంది.
ఎన్నికల ఫలితాలు ఏవిధంగానైనా ఉండొచ్చు కానీ… నాయకులు ప్రసంగాలకు మాత్రమే పరిమితం కాకుండా పాటలు పాడే స్టేజ్ కు ఎదగడమే ఆసక్తికరం. మొత్తంగా నాయకుల పాటలు, వాటిని నడిపించే బీట్స్… బ్రెజిల్ రాజకీయాల్లో ఈసారి ఎవరిని విజేతగా నిలుపుతాయో చూడాలి.



