స్టార్స్ నూ వదలని ముండే!

21 ఏళ్ల సర్వీస్.. 25 బదిలీలతో పేరుకెక్కడమే కాదు.. మహారాష్ట్రలో పాల కల్తీపైనా కొరడా ఝళిపిస్తున్న తుకారాం ముండే గురించి ఈ మధ్య చెప్పుకున్నాం. ఇప్పుడు ఆయన మరో పనిచేసి వార్తల్లోకెక్కారు.

మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్టేషన్ ఆఫీసర్ గా ఉన్న తుకారాం ముండే ఇప్పుడు సెలబ్రిటీల నుంచి బడా వ్యాపారుల వరకూ కొరకరాని కొయ్యగా మారుతున్నాడు. దేశం మొత్తమ్మీద ఇంత మంది ఆఫీసర్స్ ఉంటే మరి ముండే గురించే ఎందుకు మాట్లాడుకుంటున్నారు..?

ఎంతో కాలంగా సమాజంలో వినిపిస్తున్న చర్చను తుకారాం ఆచరణలోకి తెచ్చాడు. సెలబ్రిటీలుగా ఎదిగినవారిని సామాజికంగా అనుసరించేవారి సంఖ్య ఎక్కువ. వారు ఏ మాత్రం బాధ్యతారాహిత్యాన్ని ప్రదర్శించినా.. ఆ ఎఫెక్ట్ సమాజంలోనూ చాలావరకూ చూపిస్తుంది. అలాంటి స్థాయికెదిగిన నటులు టొబాకో, ఆల్కహాల్, కండోమ్స్ వంటివాటికి యాడ్స్ లో డబ్బుల కోసం ఎగబడి నటించడం ఇప్పటికే సమాజంలో చర్చలో ఉంది. కానీ, చర్యలే లేకుండా పోయాయి. ఇప్పుడా చర్యలను ముండే మొదలుపెట్టాడు.

ఇంతకీ ఏంచేశాడు ముండే..?

విమల్ ఎలాయితీ ప్రకటనలో కనిపించే షారుక్ ఖాన్, అజయ్ దేవగణ్, టైగర్ ష్రాఫ్ కు నోటీసులు జారీ చేశాడు. ఓవైపు మహారాష్ట్ర ప్రభుత్వం పాన్ మసాలలను నిషేధిస్తే.. మరోవైపు, సెలబ్రిటీ నటులుగా ఎదిగినవారు ప్రకటనలో నటించడంతో ఈ నోటీసులు సర్వ్ చేశారు. పాన్ మసాలా సంస్థ అయిన విమల్ కు చెందిన విమల్ ఇలాయిచీ ఉత్పత్తిని ప్రచారం చేసే ప్రకటనలో ఈ ముగ్గురూ కలిసి 2024లో ఓ యాడ్ లో నటించారు.

ఆ ప్రచార కార్యక్రమంలో తమ భాగస్వామ్యాన్ని వెంటనే నిలిపివేయాలని, తమ అధికారిక సోషల్ మీడియా ఖాతాల్లో సదరు ప్రకటనకు చెందిన ప్రచార కంటెంట్ మొత్తం తొలగించాలని.. ఆగస్ట్ 11వ తేదీన తన షోకాజ్ నోటీసులో ముండే పేర్కొంటూ షారుక్, అజయ్ దేవగణ్, టైగర్ ష్రాఫ్ కు నోటీసులు పంపించారు.

నోటీసుల్లో ముండే ప్రధానంగా పేర్కొన్న అంశాలేంటి..?

తొమ్మిది పేజీల నోటీసును పంపిన ముండే ఇలా పేర్కొన్నారు.

పాన్ మసాలాతో అనుబంధమున్న విమల్ బ్రాండును ప్రచారం చేస్తున్నట్టు ప్రాథమికంగా కనిపిస్తోంది. మహారాష్ట్రలో పాన్ మసాలా తయారీ, నిల్వ, రవాణా, పంపిణీ, విక్రయాలన్నీ నిషేధించారు. ప్రకటలనో విమల్ ఇలాయిచీ అనే పద ప్రయోగం కూడా.. వినియోగదారులను, విమల్ పాన్ మసాలా వైపు దృష్టి సారించేలా ఉంది. ఇలాంటి ప్రకటనలు వినియోగదారులను తప్పుదోవ పట్టించే అవకాశముంది. నిషేధిత ఉత్పత్తి బ్రాండును పరోక్షంగా ప్రచారం చేయడమే అవుతుంది. ప్రజారోగ్యం, భద్రతకు సంబంధించిన నిబంధనల ప్రకారం ఇది సరైంది కాదంటూ ముండే తన నోటీసుల్లో పేర్కొన్నారు.

నేరుగా విమల్ గుట్కాకో, పొగాకు బ్రాండులకో ఈ ప్రకటన ప్రచారం చేయకపోయినా… వాటివల్లే జనానికి సుపరిచితమైన ఆ బ్రాండును ప్రమోట్ చేస్తున్నట్టుగా విమల్ ఇలాయిచీ బ్రాండ్ ను అర్థం చేసుకునే అవకాశాలూ లేకపోలేదన్నది తుకారాం ముండే నోటీసుల సారాంశం.

పైగా నటులు షారుక్, అజయ్ దేవగణ్, టైగర్ ష్రాఫ్ కు సంబంధించిన ఎండార్స్మెంట్ ఒప్పందాల పూర్తి కాపీలు, ప్రకటన ప్రచారానికి సంబంధించిన క్యాంపెయిన్ బ్రీఫ్స్, చెల్లింపులకు సంబంధించిన వివరాలు, ప్రకటనలో నటించే ముందు కుదిరిన ఒప్పందాలవంటివన్నీ సమర్పించాలని ఆదేశించారు.

వినియోగదారుల పరిరక్షణ చట్టాల ప్రకారం ఇలాంటి ప్రకటనలో తప్పుదోవ పట్టించే కేసుల్లో పది నుంచి యాభై లక్షల వరకూ జరిమానా విధించే అవకాశాలూ ఉంటాయి. అలాగే, సంబంధిత సెలబ్రిటీలను మరో మూడేళ్ల వరకూ ఎలాంటి ఉత్పత్తులకు ప్రచారం చేయకుండా నిషేధించే అవకాశాలూ ఉంటాయి.

2022లో ఇలాంటి వివాదంలోనే ఇరుక్కున్న అక్షయ్ కుమార్ స్టోరీ ఏంటి..?

2022లో అక్షయ్ కూడా షారుక్, అజయ్ దేవగణ్ తో కలిసి ఈ విమల్ ఇలాయిచీ ప్రకటనలో కనిపించి తీవ్ర విమర్శలెదుర్కొన్నాడు. కానీ, సోషల్ మీడియా వేదికగా విమర్శల వర్షం వెల్లువెత్తేసరికి.. అక్షయ్ అభిమానులకు క్షమాపణలు చెప్పి విమల్ ఇలాయిచీ ప్రకటన నుంచి తాను పూర్తిగా తప్పుకుంటున్నట్టు పేర్కొన్నారు. ఆ మెస్సేజును సోషల్ మీడియా వేదికగా అప్పట్లో అక్షయ్ షేర్ చేశాడు. అంతేకాదు, తన ఎండార్స్మెంట్ ద్వారా పొందిన మొత్తం పారితోషికాన్ని ఓ మంచి సామాజిక కార్యక్రమానికి విరాళంగా ఇవ్వాలని నిర్ణయించుకున్నట్టూ వెల్లడించాడు.

ఇప్పుడు తాజాగా షారుక్, అజయ్ దేవగణ్, టైగర్ ష్రాఫ్ కు కూడా నోటీసులు జారీ అయ్యేసరికి.. బాలీవుడ్ సెలబ్రిటీస్ పై గురిపెట్టిన తుకారాం ముండే మరోసారి చర్చల్లోకొచ్చారు. సెలబ్రిటీస్, స్టార్స్, బిజినెస్ మ్యాగ్నెట్స్ వ్యవహారాల్లో ఇలాంటి చర్యలు తాత్కాలిక దూకుడేనని, టీ కప్పులో తుఫాన్ లా అనిపించినా.. ముండే తన వంతు బాధ్యతాయుతమైన డ్యూటీ కొనసాగిస్తుండటం మాత్రం విశేషమే!

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles