ఎన్నో యుద్ధకళలకు అమ్మలాంటిది కళరిపయట్టు!

నేటి ఎన్నో యుద్ధకళలకు అమ్మలాంటిది కళరిపయట్టు. కేరళ జన్మస్థానమైన ప్రాచీన భారతీయ యుద్ధకళ ఇది. ప్రపంచంలోనే ఇప్పటికీ కొనసాగుతున్న అత్యంత పురాతన యుద్ధకళ. శారీరక సాధన, వైద్య విజ్ఞానం, ఆధ్యాత్మికత ఇలా ఈ మూడింటి సమ్మేళనంగా కళరిపయట్టును చెబుతారు. కేవలం పోరాట విద్యగానే కాకుండా.. కేరళలో ఇప్పటికీ ఇదో జీవన విధానం.

అన్ని యుద్ధకళలకూ మూలం!

కళరిపయట్టుకు సంబంధించిన మూలాల్లోకి వెళ్లాలంటే ఏకంగా 2 వేల ఏళ్ల క్రితంలోకి ఓసారి టైం మిషన్ లో వెళ్లిరావాల్సిందే. క్రీస్తుశకం 3వ శతాబ్దం మధ్యకాలంలో దక్షిణ భారతదేశంలో అభివృద్ధి చెందింది ఈ కళరిపయట్టు. ప్రాచీన కేరళ యోధులు యుద్ధరంగంలో ఉపయోగించిన పోరాట పద్ధతుల నుంచే ఈ యుద్ధకళ ప్రాచుర్యం పొందింది. ఈ యుద్ధకళపై ద్రవిడ సంస్కృతి మూలాలతో పాటు, ఆయుర్వేదం, యోగా సంప్రదాయాల ప్రభావం కూడా ఉన్నట్టుగా కనిపిస్తుంది.

శిక్షణా స్థలం ఎలా ఉంటుంది..?

మట్టి ప్రాంగణంలోనే ఈ కళరిపయట్టు శిక్షణనిస్తారు. ఈ విద్య సాధనలో భాగంగా శిష్యులు ముందుగా భూమికీ, గురువుకూ, రక్షణ దేవతలకు నమస్కరిస్తారు. ఈ విధానాలు కళరిపయట్టును.. క్రమశిక్షణ, గౌరవం, ఆచారాలపై ఆధారపడిన కళగా సూచిస్తాయి.

కళరిపయట్టు శిక్షణలో నాల్గు దశలు!

కళరిపయట్టు శిక్షణ కఠినతరంగా ఉంటుంది.

1) మేయిపయట్టు – శరీర బలవృద్ధి, సమతుల్యత, ఫ్లెక్సిబిలిటీకి సంబంధించిన శిక్షణలో ముందు రాటుదేలుస్తారు.

2) కోల్దారి – దీర్ఘదండం వంటి చెక్క ఆయుధాలతో సాధన చేయిస్తారు.

3) అంగథారి – ఖడ్గాలు, భళ్లాల వంటి లోహపు ఆయుధాలతో యుద్ధమెలా చేయాలో శిక్షణనిస్తారు.

4) వేరుంకై – అంటే, ఎలాంటి ఆయుధాల్లేకుండానే నిరాయుధ పోరాటమెలాగో నేర్పిస్తారు.

ఈ నాల్గు దశల్లో ప్రతీ దశలో తర్ఫీదు పొంది.. కళను పూర్తిగా తమ స్వాధీనంలోకి తెచ్చుకున్నాకే.. మరో దశకు అనుమతినిస్తారు.

కళరిపయట్టులో ఏ ఆయుధాలకు ప్రత్యేక స్థానం ఉంటుంది..?

ఈ యుద్ధకళలో కొన్ని అరుదైన ఆయుధాలు ప్రసిద్ధి చెందాయి. వాటిల్లో..

1) ఉరుమి – బెల్టులా ధరించే వంపు ఖడ్గం

2) కెట్టుకరి – పొడవైన చెక్క దండం

3) చెరువడి – చిన్నదండం

ఆయుర్వేదంతో కళరిపయట్టుకు అనుబంధమేంటి..?

కేరళలో సాంప్రదాయంగా కళరి గురువులెవరైనా ఉజిచిల్ గా మళయాళంలో పిల్చుకునే మసాజ్ తో పాటు, మర్మ చికిత్సలో శిక్షణ పొందుతారు. ఈ మర్మ యుద్ధం వంటివాటిని భారతీయుడు సినిమాలో పెద్ద కమల్ హాసన్ క్యారెక్టర్ లో మనం గమనించవచ్చు. ప్రత్యర్థిని అశక్తుడినే చేయడానికి మాత్రమే కాకుండా… అలా అశక్తుడను చేయడానికి ఎంచుకునే మర్మ బిందువులనే గాయాలను నయం చేసే, శక్తిని పునరుద్ధరించేందుకూ ఈ మర్మచికిత్స ఉపయోగపడుతుందట.

కళరిపయట్టులో దిట్ట మీనాక్షీ అమ్మ!

కేరళకు చెందిన మీనాక్షి కళరిపయట్టులో అత్యంత గౌరవంగా అక్కడి సమాజం చూసే గురువుల్లో ఒకరు. చిన్ననాటి నుంచే శిక్షణ పొందిన ఆమె.. పురుషాధిక్యంగా ఉన్న యుద్ధకళలో లింగ భేదాలనే చెరిపేసి రికార్డ్ సృష్టించారు. తన కళరి యుద్ధ విద్యతో అంతర్జాతీయ వర్క్ షాప్స్ నిర్వహించారు. యూరప్, అమెరికా, ఆసియా ఖండాల్లో ఆమె ఇచ్చిన ప్రదర్శనల ద్వారా కళరిపయట్టుకు ప్రపంచవ్యాప్త గుర్తింపును తీసుకొచ్చారు. ప్రస్తుతం తరాల మహిళలెందరో ఈ శిక్షణ పొందేందుకు ప్రేరణగా నిల్చారు మీనాక్షి.

అయితే, ఇప్పుడు వస్తున్న ఎన్నో మార్షల్ ఆర్ట్స్ కు ముందే కళరిపయట్టు ఓ ప్రాచీన యుద్ధకళగా గుర్తింపు పొందింది. ఇప్పటికీ అక్కడక్కడా సినిమాల్లోనూ మనం చూడవచ్చు. జపాన్ నుంచి వచ్చి విదేశీయులు కేరళలో ఉంటూ ఈ యుద్ధవిద్య నేర్చుకున్నవాళ్లూ ఉన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles