కన్నీటిని దిగమింగిన కర్తవ్యం!
రిషి — జర్నలిస్ట్ ✍️
DEVASTATED (సర్వస్వం కోల్పోయాం)..
సుప్రియా సూలే సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఈ ఒక్క పదం కేవలం ఒక సోదరి ఆవేదన మాత్రమే కాదు.. అది యావత్ పవార్ కుటుంబానిది! మరాఠా రాజకీయ సామ్రాజ్యం అనుభవిస్తున్న తీవ్ర దిగ్భ్రాంతికి నిదర్శనం. అజిత్ పవార్ అనే రాజకీయ వృక్షం అకస్మాత్తుగా కూలిపోవడంతో మహారాష్ట్ర రాజకీయాలు శూన్యంలోకి జారుకున్నాయి. కానీ, ఆ శూన్యాన్ని దుఃఖంతో కాకుండా ధైర్యంతో భర్తీ చేయాలని నిర్ణయించుకున్నారు ఆయన భార్య సునేత్ర పవార్. తన వేదనను పంటిబిగువున అదిమి.. రాష్ట్ర నూతన ఉప ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టారు. మహారాష్ట్ర చరిత్రలో ఒక మహిళ అంతటి కఠిన పరిస్థితుల్లో, కుటుంబ విషాదాన్ని దిగమింగి బాధ్యతలు స్వీకరించడం ఇదే ప్రథమమేమో బహుశా!
కుటుంబంలో పెద్ద దిక్కును కోల్పోయి, అంతులేని దుఃఖంలో ఉన్న వేళ.. సాధారణంగా ఎవరైనా ఏకాంతాన్ని కోరుకుంటారు. కానీ సునేత్ర పవార్ భిన్నమైన మార్గాన్ని ఎంచుకున్నారు. తన భర్తను కోల్పోయిన మూడు రోజులకే.. రాజ్‌భవన్‌లో గద్గద స్వరంతో ఆమె ప్రమాణ స్వీకారం చేశారు. ఆ దృశ్యంతో అక్కడ ఉన్నవారందరి కళ్లు చెమర్చాయి. వ్యక్తిగత దుఃఖం కంటే.. అజిత్ పవార్‌ను నమ్ముకున్న లక్షలాది మంది కార్యకర్తల భవిష్యత్తు ముఖ్యమని ఆమె నమ్మారు. ఆ నమ్మకం తన ప్రజల పట్ల ఆమె కృతజ్ఞతను తెలిపితే.. ఆమె ధైర్యం అందరినీ ఆశ్చర్యపర్చేది.

ఎవరు ఈ సునేత్ర పవార్….?
…………………………………………………………..
రాజకీయ వారసత్వం:
1963, ప్రస్తుత ధారాశివ్ ప్రాంతంలో రాజకీయ కుటుంబంలో జన్మించారు. ఆమె తండ్రి బాజీరావు పాటిల్. సోదరుడు పద్మసింహ పాటిల్. ఇద్దరూ మరాఠా రాజకీయ దిగ్గజాలు. పద్మసింహ బాజీరావు పాటిల్ మహారాష్ట్ర రాజకీయాల్లో ఎనిమిది సార్లు ఎమ్మెల్యే. రాష్ట్ర హోం మంత్రిగా పనిచేశారు. శరద్ పవార్, అజిత్ పవార్ కు అత్యంత ఆప్తుడు. విడదీయలేని రాజకీయ భాగస్వామి. శరద్ పవార్ 1999లో ఎన్సీపీని స్థాపించినప్పుడు ఆయన వెన్నంటి నిలిచిన అతికొద్ది మంది నేతల్లో పద్మసింహ ఒకరు.
సునేత్ర, 1983లో ఔరంగబాద్‌లోని ప్రసిద్ధ ఎస్.బి. ఆర్ట్స్ అండ్ కామర్స్ కాలేజీ నుండి బి.కామ్ పట్టా అందుకున్నారు. ఆ నేపథ్యమే ఆమెను అద్భుతమైన పారిశ్రామిక వేత్తగా, నిర్వాహకురాలిగా తీర్చిదిద్దింది.
1985లో అజిత్ పవార్‌తో ఆమె వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు పార్థ్ పవార్ 2019లో రాజకీయ రంగ ప్రవేశం చేయగా, చిన్న కుమారుడు జయ్ పవార్ కుటుంబ వ్యాపారాలను చూసుకుంటున్నారు. 1985లో అజిత్ పవార్‌తో వివాహం తర్వాత, ఆమె పవార్ కుటుంబానికి రాజకీయంగా, సామాజికంగా వెన్నుముకగా నిలిచారు.

అక్షర సేద్యం – విద్యా ప్రతిష్ఠాన్!
1972లో స్థాపించబడిన విద్యా ప్రతిష్ఠాన్ సంస్థను ఒక అంతర్జాతీయ స్థాయి విద్యా సంస్థగా తీర్చిదిద్దడంలో సునేత్ర పవార్ కృషి వెలకట్టలేనిది. ఇంజనీరింగ్, ఐటీ, లా, మేనేజ్‌మెంట్ వంటి ఉన్నత విద్యా కోర్సులతో ప్రస్తుతం 25,000 మంది విద్యార్థుల భవిష్యత్తును ఆమె పర్యవేక్షిస్తున్నారు. సామాజిక చొరవ తీసుకుని ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు, మహిళా సాధికారత కోసం ప్రత్యేక వసతి గృహాల వంటి వినూత్న కార్యక్రమాలతో ఆమె ఒక నిశ్శబ్ద విద్యా విప్లవాన్ని నడిపారు.
పర్యావరణం – గ్రీన్ లీడర్!
2010లో ఆమె స్థాపించిన ఎన్విరాన్మెంటల్ ఫోరం ఆఫ్ ఇండియా (EFOI) ద్వారా సామాన్య ప్రజలతో మమేకమయ్యారు. నిర్మల్ గ్రామ్ ఉద్యమం ద్వారా 86 గ్రామాల్లో పరిశుభ్రత, నీటి సంరక్షణ చేపట్టి గ్రీన్ లీడర్ గా గుర్తింపు పొందారు. కేవలం నాయకురాలిగా కాకుండా, క్షేత్రస్థాయిలో ఒక కార్యకర్తలా ఆమె పనిచేయడం ఆమెలోని ప్రజా నాయకత్వ లక్షణాలకు నిదర్శనం.
ఎన్నికల పరీక్ష!
పదవిని చేపట్టడం ఒక ఎత్తైతే, దానిని నిలబెట్టుకోవడం ఇప్పుడు అసలైన సవాల్. రాజ్యాంగ నిబంధనల ప్రకారం ఆమె 6 నెలల లోపు శాసనసభకు ఎన్నిక కావాలి. అజిత్ పవార్ మరణంతో ఖాళీ అయిన బారామతి స్థానం నుండి ఆమె త్వరలో ఎన్నికల బరిలోకి దిగే అవకాశం ఉంది. సానుభూతి మరియు బాధ్యత ఇప్పుడు ఆమెను గెలిపించే ప్రధానాస్త్రాలు.
వ్యాపార నేపథ్యం!
2024 అఫిడవిట్ ప్రకారం, ఆమెకు సుమారు 4 కోట్లపైన వార్షిక ఆదాయం ఉంది. బారామతి ఆగ్రో లిమిటెడ్ వంటి దిగ్గజ సంస్థల్లో వాటాలతో పారిశ్రామిక వేత్తగా కూడా ఆమెకు బలమైన గుర్తింపు ఉంది.
ఎండ్!
అజిత్ పవార్ మరణవార్తతో ఆయనే సర్వస్వమని భావించిన వేలాది మంది అనుచరులకు, కార్యకర్తలకు సునేత్ర పవార్ తీసుకున్న ఈ నిర్ణయం ఒక దిక్సూచిలా నిలిచింది. నేత మరణించవచ్చు, కానీ ఆయన ఆశయం మరణించకూడదు అని ఆమె నిరూపించారు. తన వ్యక్తిగత సర్వస్వాన్ని కోల్పోయిన వేళ కూడా, ప్రజల కోసం ఆమె పగ్గాలు పట్టడం మరాఠా రాజకీయ చరిత్రలో ఒక చెరగని విశేషం. ఆమె తీసుకున్న ఈ బాధ్యత కేవలం ఒక పదవి కాదు.. అది ఒక నమ్మకం, ఒక ఉనికి, ఒక సరికొత్త చరిత్రకు నాంది!
కన్నీటిని దిగమింగిన కర్తవ్యం… కఠిన పరిస్థితిలో తలవంచని సంకల్పం… అందుకే, ఆమె మరాఠా రాజకీయాల్లో సరికొత్త Iron Lady.



