ఈరోజు బ్రిడ్జ్ టౌన్ వేదికగా సౌత్ ఆఫ్రికాతో T 20 ఫైనల్ జరుగబోతోంది. లీగ్ దశలో ఒక్క మ్యాచ్ కూడా ఓటమి పాలవ్వకుండా భారత్, దక్షిణాఫ్రికా రెండూ ఫైనల్స్ కు చేరుకోగా.. ఎవరు ఫైనల్స్ లో గెలిచినా.. ఆట ప్రారంభం నుంచి ఫైనల్ వరకూ ఓ ప్రపంచ కప్ లో ఓటమెరుగని దేశంగా రికార్డ్ నమోదై చరిత్ర సృష్టించనున్నారు. మరోవైపు ఒక్క ప్రపంచ కప్ కూడా ఇప్పటివరకూ దక్కించుకోని ఆకలి మీద సౌత్ ఆఫ్రికా ఉంటే.. ధోనీ సారథ్యంలో 17 ఏళ్ల క్రితం 2007లో సాధించిన పొట్టి ప్రపంచకప్ రికార్డు పక్కన మరోసారి చేరాలన్న కసితో భారత్ ఉంది. అయితే, ఈ శనివారం సాయంత్రం ఓ విజువల్ ఫీస్ట్ గా అలరించబోతున్న ఫైనల్స్ కు.. ఇదిగో నాటి కపిల్ సేన వెస్ట్ ఇండీస్ పై సాధించిన మొదటి ప్రపంచకప్ విజయం స్ఫూర్తి నింపాలి.
ఈసారి జరిగిన టీ-20 ప్రపంచ కప్ లో మొత్తం 20 జట్లు.. నాల్గు గ్రూపులు… ఒక్కో గ్రూపులో ఐదేసి జట్లు.. అందులో ఏ గ్రూప్ వెరీ వెరీ స్పెషల్. ఎందుకంటే.. మన గ్రూపులోనే… దాయాది దేశమైన పాకిస్థానూ తలపడింది. అలా ఐపీఎల్ ముగిసిందో, లేదో… ప్రస్తుత వరల్డ్ కప్ పై చర్చకు తెరలేపింది. అయితే, ఇదే సమయంలో… సారీ ఏ వరల్డ్ కప్ సమయంలోనైనా… జ్ఞప్తికి వచ్చే ఓ ముచ్చట.. భారతదేశం లార్డ్స్ వేదికగా 1983లో మొట్టమొదట సాధించిన వరల్డ్ కప్పు గురించి. ఎందుకంటే.. అదే ఓ పేద్ద ఇన్స్పిరేషన్. ఒక్క మాటలో.. అదో నోస్టాల్జియా!

ఇప్పుడంటే వెస్ట్ ఇండీస్ కొంత పేలవంగా కనిపిస్తుందేమోగానీ… ఆ సమయంలో వెస్ట్ ఇండీస్ అంటే హరివీర భయంకరులు. క్రికెట్ సామ్రాజ్యంలో తిరుగులేని క్రీడాకారులు. అలాంటి ఫామ్ లో ఉన్న వెస్ట్ ఇండీస్ ను ఫైనల్ లో ఓడగొట్టి 1983 కప్పును సాధించింది కపిల్ నాయకత్వంలోని భారత క్రికెట్ సేన. అలా ప్రపంచ పటంలో ఇండియా క్రికెట్ జట్టుకు ఓ స్థానం కల్పించింది.
అప్పటికే ప్రపంచ ఛాంపియన్స్ గా ఖ్యాతిగాంచిన వెస్ట్ ఇండీస్ పై గత నాల్గు మ్యాచుల్లో ఇండియా రెండు మ్యాచులు గెల్చినప్పటికీ… 1983 వరల్డ్ కప్ ఫైనల్ లో మాత్రం ఇండియాను ఫేవరేట్ జట్టుగా ఎవ్వరూ చెప్పలేకపోయారు. అసలు అండర్ డాగ్ గా బరిలోకి దిగిన ఇండియా గెలువదనే చాలామంది డిసైడైపోయారు. కొందరైతే న్యూయార్క్ లో జరిగే ఛారీటీ మ్యూచుల కోసం కూడా ఒప్పందాలు చేసుకున్నారు.
అప్పటికి భారత కెప్టెన్… ఇప్పటికీ ఎప్పటికీ పుట్టుకొచ్చే యువ క్రికెటర్లెందరికో ఇన్స్పిరేషన్ గా నిల్చే కపిల్ దేవ్ వయస్సు కేవలం 24 ఏళ్లు. కానీ, కపిల్ సేన విజయాల పరంపర మొదలవ్వగానే.. న్యూయార్క్ ఛారిటీ మ్యాచులు కూడా రద్దు చేసుకుని మళ్లీ రంగంలోకి దిగారు కొందరు.
అయితే, ఇవాళంటే సోషల్ మీడియా వచ్చేసింది. ఎవరో ఒకరు మోబైల్ లో చిన్నగా ఫోటో కీచుమనిపించినా… వీడియోను తెరకెక్కించినా రికార్డైపోతుంది. కానీ, నాడు… లార్డ్స్ లో జరిగిన ఆ మ్యాచ్ సమయంలో అప్పటికే విఖ్యాత మీడియాగా పేరొందిన బీబీసీ సిబ్బంది సమ్మెలో ఉండటంతో… రికార్డులకెక్కిన.. భారత్ ఎనాటికీ మర్చిపోలేని.. ఆ మ్యాచ్ రికార్డ్ మాత్రం కాలేదు. కేవలం కొన్ని ఫోటోలు మాత్రమే తీయగల్గారు.
రికార్డుల మోత మోగించిన భారత్!
వరల్డ్ కప్ ప్రారంభదశలో భారత్ ఒడిదుడుకులెదుర్కొంది. అప్పటికే ఆస్ట్రేలియా చేతిలో ఓటమి పాలైంది. లీగ్ దశలో కరేబియన్ల చేతిలోనూ పరాజయాన్ని చవిచూసింది. ఇక జింబాబ్వేతో మ్యాచులో తాడోపేడో తేల్చుకోవాల్సిన సమయమది. మొదట బ్యాటింగ్ టీమ్ లో వరుసగా ఇద్దరు ఓపెనర్సైన గవాస్కర్, శ్రీకాంత్ డగ్ ఔట్ అయ్యారు. ఆ తర్వాత వన్ డౌన్ లో వచ్చిన మోహీందర్ అమర్నాథ్ 5 పరుగులు, ఆ తర్వాత వచ్చిన సందీప్ పాటిల్ 1 పరుగుకే వెనక్కి తిరగ్గా… యశ్పాల్ శర్మ కేవలం 9 పరుగులకే పెవిలియన్ బాట పట్టాడు. అదిగో అప్పుడు రంగంలోకి దిగిన కెప్టెన్ కపిల్ దేవ్… తనెందుకు ఆల్ రౌండర్ గా కొనియాడబడ్డాడో తన బ్యాటింగ్ తో చూపెట్టాడు. అప్పటివరకూ అంతర్జాతీయ మ్యాచులో న్యూజిలాండ్ బ్యాట్స్ మ్యాన్ జీఎం టర్నర్ పేరు మీదున్న 171 పరుగుల రికార్డును తిరగరాస్తూ… 175 రన్స్ తో అజేయంగా నిల్చాడు. కపిల్ కు తోడుగా రోజర్ బిన్నీ 22 పరుగులు చేయగా… మదన్ లాల్ 17, సయ్యద్ కిర్మాణీ 24 పరుగులతో కపిల్ కు ఆసరాగా నిల్చారు. 266 రన్స్ కొట్టి.. జింబాబ్వేను 235 పరుగులకే కట్టడి చేసిన ఆ విజయం భారత ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసింది.
ఆ తర్వాత అదే ఆత్మవిశ్వాసంతో ఆసీస్ ను మట్టికరిపించిన ఇండియా… సెమీఫైనల్ లో తమ దేశంలోనే ఇంగ్లాండ్ కూ చుక్కలు చూపించింది. అప్పటికే రెండుసార్లు 1975, 79 సంవత్సరాల్లో డిఫెండింగ్ ఛాంపియన్స్ గా జయకేతనమెగురేసిన కరేబియన్లను తమ సొంత గడ్డపై ఓడగొట్టి.. తాము విశ్వవిజేతగా కప్ ఎగురేద్దామనుకుంటే… ఆ ఛాన్స్ ను భారత్ కాలరాసిందనే ఒకింత ఆగ్రహమూ, బాధా ఇంగ్లాండ్ లో ఉండటం అప్పుడు సర్వసాధారణమే. అయితే, మొదట అండర్ డాగ్ గా బరిలో నిల్చిన ఇండియాకు వరుస విజయాలు ఆత్మవిశ్వాసాన్ని ప్రోది చేశాయి. ఇంగ్లాండ్ పై గెలిచిన ఊపుతో… రెట్టింపు ఉత్సాహంతో ఫేవరేట్ గా కూడా మారింది. ఆ రోజుల్లోనే పెద్దఎత్తున బెట్టింగులకు తెరలేపింది భారత్- వెస్ట్ ఇండీస్ మ్యాచ్.
అలా 1983 జూన్ 25న వెస్ట్ ఇండీస్ తో ఫైనల్ లో గత మ్యాచుల ప్రతీకారాల్ని తీర్చుకునేందుకు సిద్ధమైంది భారత్. అయినా, వెస్ట్ ఇండీస్ ను ఓడించడమంటే మాటలు కాదనేవారే ఎక్కువ. అన్నట్టుగానే.. లార్డ్స్ వేదికగా జరిగిన ఫైనల్ లో కృష్ణమాచారి శ్రీకాంత్ 38, సందీప్ పాటిల్ 27, మోహిందర్ అమర్నాథ్ 26 మినహా.. పెద్దగా స్కోర్స్ నమోదు చేయని స్థితిలో… కేవలం 3. 34 రన్ రేట్ తో… 183 పరుగులకే కుప్పకూలింది భారత్. ఆండీ రాబర్ట్స్, జోయెల్ గార్నర్, మల్కం మార్షల్, మైకెల్ హోల్డింగ్ వంటి హేమాహేమీల బంతులను ఆడటం… ఆ బౌన్సీ పిచ్చుల్లో భారత్ కు ఓ సవాల్ గానే మారింది.
కానీ, అదిగో అక్కడే భారత బౌలర్లు విజృంభించారు. నాటి ఆ 60 ఓవర్ల మ్యాచులో… 52 ఓవర్లలోనే 140 పరుగులకు విశ్వవిజేత విండీస్ ను కుప్పకూల్చారు. మదన్ లాల్, మోహిందర్ అమర్నాథ్, బల్వీందర్ సంధు వికెట్లు తీయడంలో కీలకపాత్ర పోషించారు. కెప్టెన్ క్లైవ్ లాయిడ్ ను రోజర్ బిన్నీ కేవలం 8 పరుగులకే పెవిలియన్ బాట పట్టించగా.. వివియన్ రిచర్డ్స్ 33, జెఫ్ డూజాన్ 25, మల్కం మార్షల్ 18 పరుగులు మినహా.. భారత బౌలర్ల ధాటికి కరేబియన్లు చేతులెత్తేశారు. అలా 43 పరుగుుల తేడాతో భారత్ విశ్వకప్ ను లార్డ్స్ వేదికగా ముద్దాడి… భారత్ క్రికెట్ చరిత్రలో ఎప్పటికీ మర్చిపోలేని వండర్ ఫుల్ ముగింపునిచ్చింది.
అయితే, ఆ వరల్డ్ కప్ లోనే సంచలనాలు, రికార్డులు మొదలయ్యాయి. ఆసీస్ పైన 43 కు 5 వికెట్లు పడగొట్టడంతో పాటు.. జింబాబ్వేతో ఆడిన మ్యాచులో 175 రన్స్ తో బ్యాట్ తో చెప్పిన సమాధానం… భారత్ ఆడిన 8 మ్యాచుల్లో 7 క్యాచులు పట్టి ఫీల్డింగ్ లోనూ మెరుపులు మెరిపించి తానెందుకు ఆల్ రౌండర్ అనిపించుకుంటున్నాడో మరోసారి ప్రపంచానికి చాటిచెప్పాడు నాడు హర్యానా హరికేణ్ కపిల్ దేవ్.
అయితే, 1983లో భారత్ విశ్వవిజేతగా నిలబడటంలో ఏ ఒక్కరినో పొగుడ్తూ సరిపెట్టుకోలేం. బ్యాటింగ్ ఆర్డర్ ను నిర్ణయించడంలో మోహిందర్ అమర్నాథ్ ఆలోచనలు, ఫైనల్ లో 38 రన్స్ తో అత్యధిక పరుగులు సాధించిన కృష్ణమాచారి శ్రీకాంత్ దూకుడు, నాటి వరల్డ్ కప్ టోర్నీ మొత్తంలో అత్యధికంగా 18 వికెట్లు తీసిన రోజర్ బిన్నీ బౌలింగ్ ప్రతిభ, ఫైనల్ లో చెలరేగిపోతున్న రిచర్డ్స్ కు అడ్డుకట్ట వేసి ఔట్ చేసిన మదన్ లాల్ వాడివేడి బంతుల శైలి, సెమీస్ లో ఇయాన్ బోథమ్ ను ఔట్ చేసిన కీర్తి ఆజాద్, 14 వికెట్లను ప్రత్యర్థులు కోల్పోవడంలో వికెట్ కీపర్ గా ప్రధాన పాత్ర పోషించిన సయ్యద్ కిర్మాణీ, ఆడిన 8 మ్యాచుల్లో 216 పరుగులతో నిలకడగా రాణించిన సందీప్ పాటిల్ బ్యాటింగ్ మెరుపులు, భారత్ ఫైనల్స్ చేరడానికి సెమీఫైనల్స్ లో ఇంగ్లాండ్ పై యశ్ పాల్ శర్మ చేసిన 61 పరుగులు, చివరగా ఫైనల్ మ్యాచులో బాల్ ఆఫ్ ద టోర్నీగా నిల్చిన… గార్డెన్ గ్రీనిడ్జ్ కు బల్విందర్ సంధు విసిరిన కళ్లు చెదిరే ఇన్ స్వింగర్ తో పాటు… నాడు ప్రపంచ క్రికెట్ లో బీసీసీఐ తరపున ఒకే ఒక్కడిగా వెళ్లి క్రీడాకారులకు ప్రోత్సాహమందించిన జట్టు మేనేజర్ పీ.ఆర్. మాన్ సింగ్… ఇలా అంతా కలిసి భారత్ కు చిరస్మరణీయమైన విజయాన్నందించారు. ఎప్పుడు వరల్డ్ కప్ వచ్చినా… ఇంకే మ్యాచులోనైనా… భారత్ లో 1983 నాటి స్పిరిట్ ను నింపేటువంటి విజయంతో కపిల్ సేన.. చరిత్ర సృష్టించింది. అంతేకాదు.. వరల్డ్ కప్ చరిత్రలోనే అతి తక్కువ స్కోర్ నమోదు చేసి.. ఫైనల్ లో గెల్చిన హిస్టరీ కూడా ఇప్పటివరకూ భారత్ పేరు పైనే ఉండటం కొసమెరుపు.


