గార్ధబంబునకేల కస్తూరి తిలకంబనుకోకుండా.. గాడిదనే వ్యాపార రహస్యం చేసుకున్నాడు!

కడివెడైననేమి ఖరము పాలన్న మాటకు భిన్నంగా!

కాదేదీ కవితమనర్హమని శ్రీశ్రీ ఎలాగైతే బల్లగుద్ది చెప్పాడో… ఎవ్వరినన్నా కసితీరా తిట్టాలంటే.. అందుకు గాడిదనే ఉపమానంగా చేసుకోవాలని బలంగా తీర్మానించుకున్న సమాజమిది. అందుకే అడ్డగాడిద, గాడిదకొడుకా, కూసే గాడిద వచ్చి మేసే గాడిదను చెరిచిందట, గాడిదకేం తెలుసు గంధపు చెక్కల వాసన, వసుదేవుడంతటివాడు గాడిద కాళ్లు పట్టుకున్నాడు, గాడిదచాకిరీ, కర్ణకఠోర గార్దభ స్వరం, గాడిద సంగీతానికి ఒంటె ఆశ్చర్యపోతే.. ఒంటె ఆనందానికి గాడిద మూర్ఛబోయిందట.. గుర్రం గుర్రమే గాడిది గాడిదే.. ఇదిగో ఇలాగా గాడిద గురించి ఒకటా, రెండా… ప్రతీ పనిలో ఎవరినైనా తీసేయాలంటే.. ఫాఫం ఏ జన్మలో ఏం పాపం చేసిందో ఏమో.. గాడిదే మన తిట్ల పరాకాష్ఠకు ఓ ఉపమానం.

మరలాంటి గాడిదను ప్రతి తిట్టుతిట్టులో ఉపయోగిస్తున్నప్పుడు.. గాడిద కూడా జీవితానికీ అర్హమైందని చెప్పే స్టోరీ ఇది! అంతేకాదు.. గంగిగోవుపాలు గరిటెడైనను చాలు… కడివెడైననేమి ఖరము పాలన్న వేమన పద్యానికీ సవాల్ విసిరే కథ ఇది!!

ఎందుకంటే ఆ గాడిదపాలతోనే… అతగాడు శ్రీమంతుడు సినిమాలో మన హీరో మహేశ్ బాబులా ఎదుగుతున్నాడిప్పుడు. పేరు ఎమాద్ అట్టియట్. జోర్డాన్ కు చెందిన ఈ 32 ఏళ్ల వ్యక్తి ఇప్పుడు వేమన చెప్పినట్టుగా కడివెడైననేమి ఖరము పాలనుకోకుండా… శేషప్పన్నట్టుగా గార్ధబంబునకేల కస్తూరి తిలకంబనకుండా.. అదిగో ఆ గాడిదనే తన వ్యాపార రహస్యం చేసుకున్నాడు. ఒక్కో గాడిద నుంచి రెండు లీటర్ల పాలు సేకరించి… ఆ పాలతో సబ్బులు తయారుచేస్తున్నాడు. మేనేజ్ మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ లో పీజీ చేసినా… ఉద్యోగం దొరక్క ఇబ్బంది పడ్డ ఎమాద్.. ఇప్పుడు ఖరాన్ని నమ్ముకునే తన కర్మను తాను కొత్తగా రాసుకుంటున్నాడు. తల్లి కూడా ప్రోత్సాహాన్నందించడంతో… గత ఏడాదిగా ఎమాద్ నెలకొల్పిన అటాన్ డాంకీ మిల్క్ సోప్స్ ఇప్పుడు ఫుల్ సేల్స్ తో డిమాండ్ సంతరించుకుంది. జోర్డాన్ రాజధాని అమ్మాన్ కు 35 కిలోమీటర్ల దూరంలో.. మడాబా అనే ప్రాంతంలో ఓ షెడ్ వేసి అక్కడ 12 గాడిదలను పెంచుతున్నాడు ఎమాద్. ఒక్కో గాడిద రోజుకు రెండు లీటర్ల పాలిస్తుంటుంది. ఎలక్ట్రానికి పంప్ సాయంతో అక్కడి సిబ్బంది గాడిదల పాలు పిండి.. కొన్ని పాలు గాడిద పిల్లల కోసం వదులుతారు. మిగిలిన సేకరించిన పాలను శీతలీకరించి.. వాటిని అమ్మాన్లో ఉన్న ప్రాసెసింగ్ సెంటర్ కు తరలిస్తారు. అక్కడ అమ్మాన్ లో ఎమాద్ తల్లి పర్యవేక్షణలో వివిధ రకాల తైలాలు, మూలికలు కలిపి.. గడ్డకట్టేలా చేసి.. ఆ పాలతో సబ్బుల తయారీ చేస్తారు. అలా లీటర్ పాలతో 30 సబ్బులు తయారవుతాయి.

కడివెడైననేమి ఖరము పాలని వేమనన్నట్టుగా కాకుండా… ఈ ఖరం పాలతో చేసిన సబ్బులే ఇప్పుడు మెయికి నిగారింపుతో పాటు.. వయస్సేర్పడకుండా చర్మపు ముడతలనూ రానివ్వదన్న నమ్మకంతో జనాలు తెగ కొనేస్తున్నారట. ఇప్పటికే ఒక్కో 85 గ్రాముల బరువుండే సబ్బు ధర 11 డాలర్లు.. అంటే మన ఇండియన్ కరెన్సీలో- 807 రూపాయలట. ప్రస్తుతం నెలకు 4500 సబ్బులను ఎమాద్ ఉత్పత్తి చేస్తుండగా… రాబోయే రోజుల్లో గాడిదపాలతో క్రీమ్స్, లోషన్స్ కూడా తయారుచేసేందుకు సిద్ధమవుతున్నాడు ఎమాద్.

మరింత చెప్పినా… గాడిదనలాగే సంబోధిస్తాం… అలాంటి ఉపమానాలకే వాడుతాం.. ఇది మానవజాతిలో పొరపాటుగా మారిన అలవాటు.. వీడెవడు మనకు చెప్పడానికి అని లోలోన తిట్టుకుంటారా..? అయితే.. కానివ్వండి మరి! మారేందుకు మనమేం గాడిదలం కాముగా…?!!

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles