సుబ్రహ్మణ్యం వల్లూరి… ✍🏻
మీరే కనుక మహా మహాఙ్ఞానులను గౌరవించే వారైతే , మీ పిల్లలకు లెక్కలపై మక్కువ పెంచాలనుకునే వాళ్ళైతే ? తప్పకుండా ఈ పోస్టు పూర్తిగా చదవండి. మిగిలిన వారితో చదివించండి. గణిత బ్రహ్మగా పేరొందిన లక్కోజు సంజీవరాయశర్మ ప్రపంచంలో ఆరు వేల గణితావధానాలు చేసిన ఏకైక వ్యక్తి.
(నవంబర్ 27, 1907 – డిసెంబరు 2, 1997)

సంజీవరాయశర్మ 1907 నవంబర్ 27 న కడప జిల్లా ప్రొద్దుటూరు మండలంలోని కల్లూరులో జన్మించాడు. ఈయన తల్లితండ్రులు నాగమాంబ, పెద్ద పుల్లయ్య. శ్రీ సంజీవరాయ శర్మ జన్మతః అంధుడు. అప్పట్లో బ్రెయిలీ లిపి కానీ, అంధుల్ని చేరదీసే వ్యవస్థ కానీ లేదు. శర్మ గారి అక్క పాఠశాలలో చదివినవి ఇంటిదగ్గర గొంతెత్తి బిగ్గరగా మననం చేస్తే, అవి విని, గుర్తుపెట్టుకుని, గణితంలో అపార విజ్ఞానం సాధించాడు. చిన్నతనంలోనే తండ్రి మరణించడంతో, తల్లి పెంచి పెద్దచేసింది. కల్లూరులో రైతులకు ధాన్యం ధర, భూమి కొలతలు చెప్పేవారు. వారు ఆయనకి కొంత సొమ్ము చెల్లించేవారు. గణితంలో పేరు ప్రఖ్యాతులు పొందుతున్న కాలంలోనే ఆయన వయొలిన్ పట్ల ఆకర్షితుడై నేర్చుకొన్నారు.
దేశాభివృద్ధి గణితాభివృద్ధితో ముడిపడి ఉంది.. డాక్టర్ సంజీవరాయశర్మ
సంజీవరాయశర్మ తొలిసారి 1928 లో గణితావధానం నిర్వహించారు. అప్పటినుంచి 1995 వరకు ఆయన ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, బీహార్, ఢిల్లీ రాష్ట్రాల్లో విస్తృతంగా పర్యటించి, ఆరువేల ప్రదర్శనలు ఇచ్చాడు. మహానగరాలైన ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, హైదరాబాదులోను పలు ప్రదర్శనలిచ్చారు. అఖిల భారత కాంగ్రెస్ మహాసభలు 1928 నవంబర్ 15న నంద్యాలలో జరిగినపుడు, ప్రధాన ఆకర్షణ శ్రీసంజీవరాయశర్మ గారి గణితావధానమే.
సాధారణంగా, గణితావధానం లో.. పుట్టిన తేదీ ఇస్తే.. అది ఏ వారమైందో చెప్పడం ఒక అంశం. కానీ, ఈ విషయంలో శ్రీ సంజీవరాయశర్మకు ఒక ప్రత్యేకత ఉంది. ఆ పుట్టిన తేదీ ఏ వారము అయిందో చెప్పడమే కాకుండా, ఆనాటి పూర్తి పంచాంగము చెప్పేవారు. అంటే, పుట్టిన తేదీ, సమయము, ప్రదేశము చెప్పగానే, దానికి సంబంధించిన తిథి, వారము, నక్షత్రము, కరణము, యోగము, వర్జ్యము, రాశి కూడాచెప్పి.. కొంతవరకు జాతకం కూడాచెప్పేవారు. ఈ ప్రత్యేకతను (మానవ గణనయంత్రంగా [Human Computer] పేరొందిన శకుంతలాదేవితో సహా) మరెవరూ చూపలేకపోయారు. ఆవిధంగా, ఇది అనితరసాధ్యమైన ప్రత్యేకత.
1966 డిసెంబరు ఏడో తేదీ.. అది హైదరాబాదులో శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషానిలయం వేదిక
2 power 103 ఎంత? దానికి సమాధానంలో ముప్పైరెండు అంకెలున్న సంఖ్య చెప్పారు అవధాని.
‘క’ నుంచి ‘క్ష’ వరకు ఉన్న అక్షరాలకు వరుసగా నంబర్లు వేస్తే, ‘స, రి, గ, మ, ప, ద, ని” అక్షరాల లబ్దం ఎంత? ఏభై రెండు కోట్ల అయిదు లక్షల ఆరువేలు. కలం, కాగితం రెండూ ఉన్నా గంటల కొద్దీ సమయంలో కూడా చెప్పలేని సమాధానాల్ని ఆయన ప్రశ్న అడిగినంత సులభంగా, ఏమాత్రం తడుముకోకుండా, ఆలస్యం లేకుండా చెప్పేవారు!
ఆయనేమన్నా విద్యావంతుడా ?… కాదు! పోనీ రెండు కళ్లూ ఉండి అంకెలిలా ఉంటాయి, సంఖ్యలిలా ఏర్పడతాయని చూడగలిగినవారా ? లేదు!! పుట్టుగుడ్డి! పై ప్రశ్నల వంటివి ఆయన్ని వేలల్లో అడిగారు. ఆయన చెప్పిన సమాధానాలు సరిచూడడానికి గణిత మేధావులకు గంటల తరబడి సమయం కావలసి వచ్చింది. అయినా, ఆ గణిత బ్రహ్మ డాక్టర్ లక్కోజు సంజీవరాయశర్మ అంకెల ఆకాశంలో అమావాస్య చంద్రుడిలా మిగిలిపోయాడు. ప్రపంచంలో ఆరువేల గణితావధానాలు చేసిన ఏకైక మేధావి సంజీవరాయశర్మ!
శ్రీపాద కథల్లో వడ్ల గింజల ప్రస్తావన తెలిసిందే. రాజుని చదరంగంలో ఓడించినందుకు బహుమానంగా… మొదటి గడిలో ఒక వడ్లగింజ, రెండో గడిలో రెండు గింజలు, మూడో గడిలో నాలుగు, నాలుగో గడిలో ఎనిమిది… ఇలా అరవై నాలుగు గళ్లు నింపి ఇమ్మంటాడతను. రాజు ఓస్ ఇంతేనా అనుకొంటారు. తీరా ఎన్ని వడ్ల గింజలో తేల్చాల్సి వచ్చేటప్పటికీ అందరూ తలలు పట్టుకుంటారు! దానికి సంజీవరాయశర్మ చెప్పిన సమాధానం… ”ఒక కోటి 84 లక్షల, 46 వేల 74 కోట్ల 40 లక్షల, 73 వేల, 70 కోట్ల, 95 లక్షల 51 వేల, 615 వడ్ల గింజలన్నమాట..(1,84,46,74,40,73,70,95,51,615!)
ఒక ఘనపు మీటరు పరిమాణం ఉన్న బస్తాలో దాదాపు ఒక కోటి యాభై లక్షల వడ్లగింజలు పడితే… అటువంటి బస్తాలు ఒక కోటి ఇరవై లక్షల వేల కోట్లు ఘనపు మీటర్ల బస్తాలు అవసరం! నాలుగు మీటర్ల ఎత్తు, పది మీటర్ల వెడల్పు గల ఒక గాదెలో ఆ ధాన్యం నింపాలంటే ఆ గాదె పొడవు మూడు వందల కోట్ల కిలోమీటర్లు ఉండాలి. ఈ దూరం భూమికీ సూర్యుడికీ మధ్య ఉన్న దూరానికి 20 ఇంతలు! అంత ధాన్యం ఈ భూమండలంపై ఉండదు! ఇదంతా అబ్బురమనిపించవచ్చు. కానీ సంజీవరాయశర్మ గణితావధాన వివరణ మహిమ ఆ లెక్కలకే అందనంత ఎత్తు!
ఒకటి, రెండు, మూడు…. ఎలా ఉంటాయో తెలియకుండానే గణితబ్రహ్మ అయ్యారు! సంవత్సరాలు, తిధులు, నెలలు, నక్షిత్రాలు, వారాలు, పక్షాలు… గంటలు, నిముషాలు, సెకనులు ఏవీ తెలియకున్నా అన్నీ తెలుసుకుని గణితంలో అపార విజ్ఞానం సాధించారు. తొలిసారి 1928లో గణితావధానం నిర్వహించిన అప్పట్నించీ 1995 వరకు ఆయన వేల ప్రదర్శనలిచ్చారు. ఆయన పొందిన సన్మానాలు, ప్రదర్శనలు.. ప్రచురిస్తే, ఓ పుస్తకమంత! అప్పట్లో మద్రాస్ గవర్నర్, భారత ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ వంటి జాతీయ ప్రముఖులు ఆయన మేధాశక్తికి ఆశ్చర్యచకితులయ్యారు! నాలుగువేల సంవత్సరాల వరకు సరిపోయే క్యాలండరు సైతం తయారుచేశారు. అప్పటి రాష్ట్రపతి డా. రాజేంద్రప్రసాద్ శర్మ ప్రతిభకు ముగ్ధులై తన దగ్గర ఉన్న సొమ్ము ఎం.ఓ. చేయడం విశేషం!
అప్పట్లో అనీబ్‌సెంట్, నెహ్రూ, రాజేంద్రప్రసాద్‌లతో పాటు, బెజవాడ గోపాలరెడ్డి, శ్రీమాలి, హుమాయూన్ కబీర్, కాశీనాధుని నాగేశ్వరరావు, పి.వి.రాజమన్నార్, గవర్నర్ సర్ జార్జి స్టాన్లే, మేధ్స్ విజార్డ్ శకుంతలాదేవి తదితరులంతా శర్మ గణితావధాన ప్రదర్శనలు స్వయంగా తిలకించి అన్యులకు సాధ్యం కాదని వేనోళ్లా కీర్తించారు. శర్మ పలు విశ్వవిద్యాలయాల్లో, ప్రసిద్ధ కళాశాలల్లో అవధానం ప్రదర్శించి విద్యార్ధుల్ని ఉత్తేజితుల్ని చేశారు. అలాగే గ్రంధాలయాల పిలుపునందుకుని పలు గ్రంధాలయాల్లోనూ తమ గణితావధాన ప్రదర్శనలు చేశారు. మేథమేటికల్ సొసైటీల ఆహ్వానం మేరకు వాటి సభ్యుల ముందు ప్రదర్శనలిచ్చారు. ఆయన ప్రతిభ రాయలసీమ నుంచి అంతర్జాతీయ వేదికలకెక్కింది. దురదృష్టం ఏమిటంటే 1993లో అమెరికా సందర్శించాలని ఆయన్ని అక్కడి తెలుగు సంఘాలు ఆహ్వానించినా సకాలంలో వీసా రాకపోవడంతో ఆ మేధావి ఇల్లు కదలలేకపోయారు. వివిధ విశ్వవిద్యాలయాలు… ఆయన్ని సత్కరించాయి. కొన్ని ఆయన్ని బంగారు పతకాలతో సన్మానించాయి.
దురదృష్టమేమిటంటే 1964 అక్టోబరు పదో తేదీన శర్మ రేణిగుంట నుంచి తిరుపతికి రైల్లో ప్రయాణిస్తున్న సందర్భంలో ఆయన 14 బంగారు పతకాల సూట్‌కేసును దొంగలు తస్కరించారు.
ప్రపంచంలో అంధులైన మహా ప్రతిభావంతుల్లో జాన్‌మిల్టన్, బ్రెయిలీ కనుగొన్న హెల్‌న్ కెల్లర్, ద్వారం వెంకటస్వామినాయుడు వంటివారు పుట్టుకతో అంధులు కారు. తదనంతర కాలంలో వారు అంధులయ్యారు. మన దేశంలో గణిత శాస్త్రజ్ఞుల్లో భాస్కరాచార్యులు, రామానుజన్, శకుంతలాదేవి వంటివారు మంచి శిక్షణ పొందారు. కానీ సంజీవరాయశర్మ అంధుడే కాక చదువు సంధ్యలు లేని వ్యక్తి. అంతా వినికిడి జ్ఞానమే! ప్రపంచంలో ఆరుగురు గణిత శాస్త్రజ్ఞుల్లో ఒకరు శర్మ.
ఆనాడే బ్రిటిష్ వైస్రాయ్ ”ఈయన మా దేశంలో పుట్టి వుంటే దేశం నడిబొడ్డున విగ్రహం పెట్టి రోజూ పూజలు చేసేవాళ్లం” అని శర్మనుద్దేశించి అన్నారు. శకుంతలాదేవి స్వయంగా నాకన్నా ప్రతిభావంతుడు అని అంగీకరించింది. అయినా ఆయన పేదరికంలోనే జీవించారు. శ్రీనివాస రామానుజన్ వంటి మేధావిని గుర్తించని దేశమిది. అలాగే సంజీవరాయశర్మని రక్షించుకోలేకపోయింది. 1997 డిసెంబరు రెండోతేదీన సంజీవరాయశర్మ అస్తమించారు.
‘అంక విద్యాసాగర’ విశ్వసాంఖ్యాచార్య, శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయం వారి గౌరవ డాక్టరేట్ పొందిన శర్మ తన చివరి రోజుల్ని శ్రీ కాళహస్తీశ్వరస్వామి సన్నిధిలో వయొలిన్ మీటుతూ స్వామినర్చిస్తూ గడిపారు! ఈ నోబెల్ బహుమతులు, మెగసెసేలు, జ్ఞాన్‌పీఠ్‌లు… ఆయన ప్రతిభ ముందు జస్ట్ జుజుబీ… 🙏
వికిపీడీయా మరియు ఇతర మాధ్యమాల నుంచి సంకలనం .




సర్, మా కడప లో ఇంతటి మహానుభావులు పుట్టారని మాకు తెలియదు. ఎవరికి తెలియదు. దీనికి అందరం సిగ్గుతో చచ్చిపోవాలి. కడప వాళ్ళు నిజంగా దరిద్రులు.
ఈ మహానుబావుడి గురించి తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు.