ఉవ్వెత్తున ఎగిసిపడ్డ ఉత్తరాఖండ్ కెరటం… కొత్త వాక్యాలకు సరికొత్త ముఖం!
ఇప్పటికే నేహా బోరా గురించి ఇదే పద్ధతిలో బోలెడంత చర్చ జరుగుతోంది. తల పండినవాళ్లూ రాస్తున్నారు. మరి మళ్లీ నేహా బోరా గురించి ఏంటింకా చెప్పుకునేది..?
ఒక్క మాటలో చెప్పాలంటే జెన్ జీ తరానికి చెందిన ఒక మెచ్యూర్డ్ పబ్లిక్ ఫిగర్. వామపక్ష విద్యార్థి రాజకీయాల్లో ఓ అనుభవజ్ఞురాలు.
23 రోజుల నిరాహారదీక్ష ఆమె పట్టుదలకు ప్రతీక… డార్క్ హ్యూమర్ తో ఆమె రీల్స్ నేటితరపు ఆలోచనలకు ప్రతిబింబాలు.
if i can’t dance, it wont be my revolution అంటూ సీజేపీ ఉద్యమం తర్వాత ఆమె డ్యాన్స్ చేయడం ఆమెలోని ఉత్సాహవంతురాలిని, తన వయస్సుకు తగ్గ ఆలోచనలను కళ్లకు కట్టేవి. అంతేకాదు, అంతవరకూ సీరియస్ గా కేంద్రం తీరుపై పోరాటం చేసిన ఆమెలోని కాంట్రాస్ట్ అందరినీ ఆకట్టుకుంది.
నేహా బోరా భగత్ సింగ్ తరం మనిషి కాదేమోగానీ.. ఆ ధైర్యం మాత్రం అందుకేమాత్రం తక్కువ కానిది. జెన్ జీకి కొత్త నిర్వచనంగా మారిన ఒక 29 ఏళ్ల యువతి 23 రోజుల నిరాహార దీక్ష చేస్తే అదో వార్త మాత్రమే. కానీ, అదే యువతి జాతీయ స్థాయి ఉద్యమానికి ఓ గొంతుకగా మారడమే కొత్త తరం రాజకీయ కథ.
23 రోజుల పాటు నిరాహార దీక్ష చేసిన యువతే కొన్ని రోజుల తర్వాత సోషల్ మీడియాలో రీల్స్ చేస్తూ, పాటలకు డ్యాన్సులు వేస్తూ కనిపిస్తే…? సామాన్యుల్లో ఉండే ఈ వైవిధ్యమైన తీరే నేహాను మరింత భిన్నంగా నిలిపింది.

నేహా బోరా సీపీఐ (ఎం) అనుబంధం సంస్థైన ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షురాలుగానే కాదు.. జేఎన్టీయూలో థియేటర్ అండ్ పెర్ఫార్మెన్స్ స్టడీస్ లో పీహెచ్డీ చేస్తున్న పరిశోధకురాలు. ఉత్తరాఖండ్ ఉద్ధమ్ సింగ్ నగర్ జిల్లా నుంచి… కటిమా అనే గ్రామం నుంచి వచ్చిన నేహా బోరా తన పేరుతో పాటే… ఇప్పుడు తన ఊరి పేరుకూ ఓ గుర్తింపు తెచ్చి పెట్టింది. ఢిల్లీ యూనివర్సిటీ, అంబేద్కర్ విశ్వవిద్యాలయాల్లో చదివి విద్యార్థి రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించారు నేహా.
ఇలా ప్రతీ వ్యక్తికీ తమవైన ఏవో ప్రత్యేకతలెలాగూ ఉంటాయి. అలాగే నేహా బయోడేటానూ చూడాల్సి ఉంటుంది. ఇవేవీ నేహాను ప్రత్యేకంగా నిలబెట్టేవి కావు.. ఆమె వ్యక్తిత్వంలోని వైరుధ్యమే ఆమెను నిలబెట్టింది. మిగిలినంతా జస్ట్ సపోర్టింగ్ సిస్టమ్.
ఓవైపు ఉద్యమం.. మరోవైపు ఇన్ స్టా రీల్స్.. ఇంకోవైపు నిరాహార దీక్ష… ఇంకొంచెం సమయం చిక్కించుకుని కనబర్చే డార్క్ హ్యూమర్.. మరోవైపు పోలీసుల చర్యలపై తీవ్రమైన ప్రతిఘటనతో కూడిన ప్రసంగాల శైలి.. మరోవైపు విజయమందుకున్నాక ఆమె చేసిన డ్యాన్సులు… ఇవన్నీ గత తరం రాజకీయ నాయకత్వాలకు పరిచయం లేని విషయాలు. ఇవే నేహా బోరాను ప్రత్యేకంగా నిలబెట్టాయి.
భగత్ సింగ్ తో నేహాను పోల్చటం సరైందో కాదో.. లేక, అతిశయోక్తో కానీ… కొన్ని సారూప్యతలైతే కనిపిస్తాయి.
భగత్ సింగ్ యువత రాజకీయ ఆలోచనలకు కొత్త రూపునిచ్చారు. తన తరాన్ని ప్రశ్నించే గొంతుకలుగా మారుస్తోంది నేహా బోరా. భగత్ సింగ్ కాలాన రాజకీయ చైతన్యానికి పుస్తకాలు, సభలు, కరపత్రాలు సాధనాలైతే… నేహా బోరా తరం చేతిలో ఇన్ స్టా రీల్స్, యూట్యూబ్ వీడియోస్, మీమ్స్, పాడ్ కాస్ట్స్ ఉన్నాయి. జస్ట్ మాధ్యమాలు మారుతున్నాయే తప్ప.. ప్రశ్నించే యువత మాత్రం కనిపిస్తోంది.
ఆమె ఒక పెద్ద పార్టీలో అదే స్థాయి బడా నాయకురాలేం కాదు. కానీ, స్టూడెంట్ మూవ్మెంట్, స్ట్రీట్ ఫైట్, సోషల్ మీడియా కమ్యూనికేషన్ తో అంతకన్నా ఎక్కువ పేరే అనతికాలంలో తెచ్చుకుంది. నేను నాయకురాలిని కాబట్టి మీరు వినాలనే మాడల్ కాదు. నేనూ మీలో ఒకరిని.. మీ సమస్యను నేనూ ఎదుర్కొనేందుకు మీతో చేతులు కలుపుతానంటోంది నేహా బోరా.
సోనమ్ వాంగ్ చుక్ నుంచి నేహా బోరా వరకు!
అనుభవజ్ఞుడైన వాంగ్ చుక్ ఒక తరానికి ప్రతినిధిగా కనిపిస్తే… కాక్రోచ్ ఉద్యమంలో నేహా వంటివారు మరో తరానికి ప్రతినిధులుగా కనిపించి అనుభవజ్ఞుల స్థాయి మెచ్యూరిటీని ప్రదర్శించడం విశేషం.
ఒకరు అనుభవాన్ని రంగరించి మాట్లాడుతుంటే.. మరొకరు తమ తరానికి చెందిన అసహనం నుంచి మాట్లాడుతున్నారు.
సాధారణంగా జెన్ జీ అంటే రీల్స్, మీమ్స్, ట్రెండింగ్ ఆడియో, వీడియోలు… ఇవే సమాజంలో ఉన్న గుర్తింపు.
కానీ, నేహాబోరా కథ అందుకు మరో కోణాన్ని చూపించింది. జెన్ జీ నవ్వగలదు. అదే సమయంలో పోరాటమూ చెయ్యగలదు. జెన్ జీ మీమ్స్ చేయగలదు. పాలసీ మ్యాటర్సూ గురించీ విప్పి చెప్పగలదు. నినాదాల్ని ఎత్తుకోగలదు.. అదే ప్రొటెస్ట్ ను ఇన్ స్టా రీల్స్ ద్వారా కమ్యూనికేట్ చేయగలదు. నిరాహారదీక్ష సమయంలో కూడా ఆమె ఇన్ స్టా రీల్స్ ద్వారా హాస్యాన్ని, ఆందోళనను, అనుభవాలను, ఆలోచనలు ఏకకాలంలో సోషల్ మీడియాలో కమ్యూనికేట్ చేసినట్టు ఇప్పటికే చాలా వార్తాకథనాలు పేర్కొన్నాయి.
సాధారణంగా పోరాటాలంటే ఎప్పుడూ విషాదాలే కాదని నిరూపించిన కొత్త తరానికి ప్రతీక నేహా బోరా.
గత రాజకీయ సంస్కృతిలో ఉద్యమకారులంటే గంభీరంగా కనిపించేవారు మాత్రమే. కానీ, నేటి తరం పోరాడతాం.. గెలిస్తే సెలబ్రేట్ కూడా చేసుకుంటామంటోంది. అంకితభావంతో ఉద్యమం చేయడమే కాదు.. ఉద్యమంలోనూ జీవితాన్ని ఆస్వాదించడం ఈ జెన్ జీలో చూడొచ్చు.
ఎవ్వరేమనుకుంటున్నారనే కన్నా… తానేం నమ్ముతున్నాను అనేదే నేహా బోరా లాంటివాళ్లల్లోని ప్రత్యేకత. అది మొండితనమూ, మూర్ఖత్వంగా కొట్టిపారేసేవారున్నా.. సరిగ్గా అర్థం చేసుకుంటే అది ఐడియాలోజికల్ ఇండిపెండెన్స్.
తను వేయాల్సిన అడుగుల గురించి స్పష్టత ఉన్న నేహా బోరా భవిష్యత్ రాజకీయ నాయకురాలవుతుందని స్టేట్మెంట్స్ ఇవ్వడం తొందరపాటే. ఆమె ప్రయాణంలో ఇంకా ఎన్నో చూడాల్సి ఉంది. అయితే, ఆమె తన అకడమిక్ చదువుల ప్రపంచాన్నీ, యాక్టివిజాన్ని, రాజకీయాల్ని ఎలా బ్యాలెన్స్ చేస్తుందన్న క్యూరియాసిటీని మాత్రం రేకెత్తించగల్గింది. ఏదేమైనప్పటికీ ఒక కొత్తతరపు పొల్టికల్ కమ్యూనికేషన్ ను మాత్రం ప్రపంచం ముందుంచింది.
పుస్తకాలు చదివే యువతి, పీహెచ్డీ చేసే ఓ పరిశోధకురాలు, వేదికపై స్పష్టంగా ప్రసంగించే హక్కుల కార్యకర్త, 23 రోజుల నిరాహార దీక్ష చేసిన నాయకురాలు, ఇన్ స్టాలో రీల్స్ చేసే జెన్ జీ యువతి, విజయం దక్కగానే చంగున ఎగిరి గంతేసే ఓ సాధారణ అమ్మాయి.. ఇలా భిన్న పార్శ్వాలు కనబర్చడంతో.. నేహా బోరా ఒక వైరల్ అయిన యువతిగా ఓ చిన్న ఫ్రేమ్ కు మాత్రమే పరిమితం కాలేదు. ఆమె ఆలోచనా పరిణతి.. జెన్ జీ మెచ్యూర్డ్ ఫ్రేమ్ గా… ఓ వైడ్ యాంగిల్ లెన్స్ ను తలపించేది.
గతతరం నాయకత్వం మా కోసం పోరాడమంటోంది సరే.. జెన్ జీ మాత్రం తమ భవిష్యత్తు కోసం పోరాడతామంటోంది. అయితే, ఆ పోరాటాల్లో చిర్నవ్వులను మాత్రం మానుకోమంటోంది.
అందుకే నేటితరానికి, కొత్త వాక్యానికీ… నేహా బోరా ఓ ఆసక్తికరం ఆరంభం.



