సోషల్ మీడియా రాజకీయాలను మార్చేస్తోందా..? మీమ్స్, రీల్సే వర్తమాన ప్రచార అస్త్రాలా..??

రాజకీయాలపై సోషల్ మీడియా ప్రభావం!

సోషల్ మీడియా రాజకీయాలను మార్చేస్తోందా? సభలు, పోస్టర్లు, మైకులు పోయి… రీల్స్, మీమ్స్, ఇన్‌ఫ్లుయెన్సర్లే కొత్త రాజకీయ ఆయుధాలా?

గతంలో పార్టీలు, నాయకులు ప్రజల్ని చేరుకోవాలంటే సభలు, సమావేశాలు తప్పనిసరి. అందుకు భారీగా జనాన్ని సమీకరించాలి. పోస్టర్లు, కరపత్రాలు ముద్రించాలి. పత్రికల్లో ప్రకటనలు ఇవ్వాలి. టీవీ చర్చల్లో కనిపించాలి.

కానీ, రాను రాను సోషల్ మీడియా పూర్తిగా ఈ విధాలన్నింటినీ మార్చేసేలా కనిపిస్తోంది.

ఒక్క స్మార్ట్ మోబైల్ ఫోన్ ఉంటే చాలు. కెమరా, సోషల్ మీడియా ఖాతాలతో… ఒక్క చిన్న 30 సెకన్ల వీడియో చేసినా అదిప్పుడు లక్షల మందికి చేరుతోంది. కంటెంట్ బాగుంటే వైరలైపోతుంది. ఒక్క మీమ్ రాజకీయ నాయకుడి ప్రసంగం కంటే ఎక్కువ చర్చకు దారితీస్తోంది. ఒక్క హ్యాష్ ట్యాగ్ ఇప్పుడు ఉద్యమాల్ని నిర్మిస్తోంది.

సోషల్ మీడియా రాజకీయ ప్రచార సాధనమా…? లేక, రాజకీయాల స్వరూపాన్నే మార్చేస్తున్న ఆయుధమా..?

2026 సంవత్సరంలోనే మన దేశంలో జరుగుతున్న ఉద్యమాలను ఓసారి పరిశీలిస్తే… ఈ ప్రశ్నల్లో సమాధానాలు చాలా సులభంగానే మనం వెతుక్కోవచ్చు.

సోషల్ మీడియా ప్రభావంతో ఉవ్వెత్తున ఎగిసిపడిన కాక్రోచ్ జనతా పార్టీ కథేంటో అందరికీ తెలిసిందే. జెన్ జీ ఐకమత్యంగా నిర్వహించిన కాక్రోచ్ ఉద్యమం ఓ ఉదాహరణగా నిల్చింది

సంప్రదాయ రాజకీయ ఉద్యమాల్లో నినాదాలు, ప్రసంగాలు, బ్యానర్లు ప్రధాన ఆయుధాలుగా ఉండేవి. కానీ, జెన్ జీ చేపట్టిన కాక్రోచ్ ఉద్యమంలో… మీమ్స్, వ్యంగ్యం, ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ జెనరేటెడ్ కంటెంట్, పెరడీ వీడియోస్.. వాటిని సమర్థవంతంగా జనంలోకి తీసుకెళ్లేందుకు సోషల్ మీడియా పోస్టింగ్స్.. ఇవే ఆయుధాలుగా ఒక కొత్త దారి కనిపించింది. మారుతున్న కాలానికి తగ్గ అప్డేషన్ రాజకీయాల్లో కూడా కొట్టొచ్చినట్టు స్పష్టమైంది.

మరి జెన్ జీ ఉద్యమంలో గమనించాల్సిందేంటి..?

వాళ్లు గత సంప్రదాయ నాయకుల్లా కేవలం ప్రభుత్వాన్ని విమర్శించేందుకు మాత్రమే పరిమితం కాలేదు. రాజకీయ నిరసనలు చేసే పద్ధతినే పూర్తిగా మార్చేశారు. హాస్యం, వ్యంగ్యం, శత్రువునైనా ప్రేమించే పలకరింపులు, మీమ్ కల్చర్ ఇవన్నీ ఇప్పుడు పొల్టికల్ కమ్యూనికేషన్ లో కొత్త డైమెన్షన్స్ ను తెరపైకి తెచ్చాయి.

నాయకులూ మారాల్సిందేనా..?

ఇంతకాలం సోషల్ మీడియాను తమ సందేశాలను, వీడియోలను పోస్ట్ చేయడానికి మాత్రమే వాడుకున్న రాజకీయ పార్టీలూ ఇప్పుడు మారాల్సిన సమయమిది. ప్రజలకేం కావాలో గమనిస్తూ తమ సందేశాలుండేలా చూసుకోవడం.. అవి కూడా నేటి ట్రెండుకు తగ్గట్టుగా ప్రభావవంతంగా రూపొందించడం చేయకపోతే రాబోయే రోజులు ఇప్పటివరకూ ఉన్న సంప్రదాయ పార్టీలు, నాయకులకు గడ్డు కాలాన్ని ముందుంచొచ్చు.

ట్రెండుకు తగ్గట్టు నడవాల్సిందే!

కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోరుతూ ఢిల్లీ వీధుల్లో నినదించిన సీజేపీ ఉద్యమం… దేశవ్యాప్తంగా పల్లెపల్లెకూ వ్యాపించడానికి సోషల్ మీడియానే ప్రధాన కారణం. వారి దెబ్బకు ఏకంగా ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఇన్ స్టాలో రీల్ చేసి తన సందేశాన్ని విడుదల చేయాల్సి వచ్చింది. ఇంతకాలం ఆర్గనైజ్డుగా కెమెరాల ముందుకొచ్చే మోడీ సోషల్ మీడియా ఖాతాలో.. ఇప్పుడు సెల్ఫీ రీల్స్, వీడియోస్ తో కొంచెం మారిన నేత కనిపిస్తున్నాడు. బీజేపీ కూడా ఇప్పుడు అలర్ట్ అయింది. సీజేపీ ఉద్యమం తర్వాత యువతకు చేరువయ్యేలా పాలిష్ట్ డిజిటల్ కంటెంట్ వైపు అడుగులేసేందుకు కసరత్తు చేస్తోంది.

గతానికీ, వర్తమానానికి రాజకీయాల్లో ఏంటి తేడా..?

గతంలో రాజకీయ నాయకులు ఏం చెబితే అదే వేదం. వారే ఎలా మాట్లాడాలో ముందే నిర్ణయించుకుని, దాన్నే జనం ముందుకు తెచ్చేవారు. కానీ, నేడు… సోషల్ మీడియా ఎరాలో నాయకులెలా మాట్లాడాలో నెటిజన్సే ప్రభావితం చేసే రోజులొచ్చేశాయి.

వైరల్ అంటే ప్రజాదరణేనా..?

సోషల్ మీడియాలో ఎక్కువ వ్యూస్ వచ్చినంత మాత్రాన ఆ ఆలోచనకు ఎక్కువ మంది మద్దతిచ్చారనే అర్థంగా ఎప్పుడూ చూడొద్దు. ఒక సెన్సేషనల్ కంటెంట్ కు… లక్షల వ్యూస్ వస్తాయి. ఒక నిజం గడప దాటే లోపే.. అబద్ధం ప్రపంచాన్ని గిరగిరా చుట్టేసి వస్తుంది. ఒక మ్యానిప్యులేటెడ్ ఫోటోగ్రాఫో.. లేక, ఏఐ జెనరేటెడ్ వీడియోనో ప్రజల అభిప్రాయాల్ని తీవ్రంగా ప్రభావితం చేయొచ్చు.

ఇందుకే ఎన్నికల సమయంలో సోషల్ మీడియా మిన్ ఇన్ఫర్మేషన్, డీప్ ఫేక్స్, ఏఐ జెనరేటెడ్ కంటెంట్ పై ఎలక్షన్ కమిషన్ స్పెషల్ ఫోకస్ పెడుతోంది. 2025లో ఎలక్షన్ కమిషన్ రాజకీయ పార్టీలతో ఓ పెద్ద సమావేశమే ఏర్పాటు చేసి.. డిజిటల్, సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్స్ ను బాధ్యతాయుతంగా ఉపయోగించాలనీ సూచించింది. తప్పుదోవ పట్టించే వార్తలు, కథనాలు, చట్ట విరుద్ధమైన ఏఐ జనరేటెడ్, మ్యానిప్యులేటెడ్ కంటెంట్ పై వేగంగా చర్యలు తీసుకునేలా ఓ వ్యవస్థనే తయారు చేసుకుంది.

మారిన వైఖరి!

నాయకుడు, పార్టీ, మీడియా, ప్రజలు.. ఇదీ ఓల్డ్ ట్రెండ్. ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్, రీల్, ఆల్గారిథమ్స్, పబ్లిక్.. ఇదీ నయా ట్రెండ్.

అల్గారిథమ్స్ ఎవరి పక్షం..?

డిజిటల్ ఎరాలో ఇదే పెద్ద ప్రశ్న..?

ఓ రాజకీయ నాయకుడి ప్రసంగాన్ని ప్రజల ముందుకు తీసుకెళ్లేది ఇప్పుడు కేవలం ఆ నాయకుడి పార్టీ మిషనరీ మాత్రమే కాదు. అల్గారిథమ్ కూడా.

ఏ వీడియో ఎక్కువ సమయం చూస్తున్నారు..? ఏ వీడియోకు ఎక్కువ వ్యూస్ వస్తున్నాయి..? ఎవరెవరు సదరు కంటెంట్ ను షేర్ చేస్తున్నారు…? ఎలాంటి కంటెంట్ కు పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది..? ఎలాంటి కంటెంట్ పై కోపాన్ని వ్యక్తం చేస్తున్నారు..? ఎలాంటి విషయాలపైన నవ్వుకుంటున్నారు..?

ఇదిగో ఈ డేటా ఆధారంగా.. సోషల్, డిజిటల్ మీడియా ప్లాట్ ఫామ్స్ లోని అల్గారిథమ్స్ మరింత కంటెంట్ ను మన ముందుకు తెస్తున్నాయి.

మరి సోషల్ మీడియా ప్రజాస్వామ్య బలోపేతానికి ఉపయోగమా..? లేక, తమకు నచ్చిన కంటెంట్ లో బంధీని చేస్తోందా..?

ఈ విషయాన్ని నిశ్చితంగా ఇదీ అని చెప్పలేం. సందర్భాన్ని బట్టి ఆ ప్రభావం కనిపించవచ్చు. కానీ, సోషల్ మీడియా వల్ల సాధారణ పౌరుడికి కూడా ప్రశ్నించే శక్తి లభ్యమైంది. ఎందుకంటే, ఇవాళ ఎక్కడో మారుమూల గ్రామంలో జరిగిన ఓ చిన్న ఘటన కూడా జాతీయస్థాయిలో చర్చకు తెరలేపే బలమైన ఆయుధంగా సోషల్ మీడియా ప్రభావం చేస్తోంది. నీట్ లో విద్యార్థులెదుర్కొన్న సమస్య ఇవాళ పెద్ద ఉప్పెనగా మారింది. సీజేఐ వ్యాఖ్యలు దావానంలా వ్యాపించి సీజేపీ పుట్టుకకు కారణమైంది.

ఒక నాయకుడి ప్రసంగాల్ని ఫ్యాక్ట్ చెక్ చేసుకునే సౌకర్యాన్నీ సోషల్ మీడియా కల్పించింది. అందుకే, సోషల్ మీడియా అధికారానికి మాత్రమే ఓ మైక్రోఫోన్ కాదు.. ఇప్పుడు సామాన్య మానవుడి ఆయుధంగా నిలుస్తున్న మైక్రోఫోన్.

మరి ఏం మార్పు జరిగింది..?

రాజకీయాల్లో ఒకనాడు ప్రజల్ని ఆకర్షించడానికి నాయకుడి ఛరిష్మా ఉపయోగపడేది. తర్వాత టెలివిజన్ విప్లవంతో వార్తలు, కథనాలు, చర్చలు, ఇంటర్వ్యూలతోనూ జనంలోకి వెళ్లగల్గారు. అలాగే, భారీ సభలు, 24 గంటల న్యూస్ ఛానల్స్ రాక కూడా ఉపయోగపడింది.

కానీ, ఇప్పుడు దశ మారింది. ఎవరెక్కువ కనిపిస్తున్నారు, ఎవరెక్కువ షేర్ అవుతున్నారు, ఎవరి వీడియోస్ ఎక్కువగా జనంలో చర్చకొస్తున్నాయి…? ఇవే నేటి రాజకీయ విజయంలో కొత్త ప్రమాణాలుగా మారబోతున్నాయి.

చివరగా ఒక్క మాట.. రాజకీయాలు పార్లమెంట్, అసెంబ్లీ, సభా వేదికలపైనే జరగడం లేదు.. ఇప్పుడు మోబైల్ స్క్రీన్స్ పైనా రాజకీయాలను ప్రభావితం చేసే చర్చలు నడుస్తున్నాయి.

ఒక రీల్, ఓ మీమ్, ఒక హ్యాష్ ట్యాగ్, ఓ కామెంట్.. ఇవే నేటి రోజుల్లో ప్రచారం కోసం నాయకులు దృష్టి పెట్టాల్సిన అంశాలు.

రేపటి ఎన్నికల్లో ఓటు వేసే ఓటర్ ముందుగా నాయకుడి ప్రసంగాలకు ప్రభావమైతాడా… లేక, తన ఫోన్ అల్గారిథమ్ ప్రకారం నడుచుకుంటాడా..? ఇదే ఇప్పుడు రాబోయే భారత రాజకీయాలను ఆకర్షిస్తున్న ప్రధాన ప్రశ్న..?

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles