నేరం చేసి లోకం కంట పడకుండా తప్పించుకు తిరగడం మాటలు కాదు. అందులోనూ కలుగులో ఉన్న ఎలుకను కూడా బయటకు లాక్కురాగల్గే సామర్థ్యం, కావల్సిన సాంకేతికత అందుబాటులో ఉన్న కాలంలో నేరస్థులకు తప్పించుకు తిరగడం కత్తిమీద సామే. కానీ, ఓ నేరస్థుడు మాత్రం పోలీసులను 32 ఏళ్లు ముప్పుతిప్పలు పెట్టాడు. మూడు చెరువుల నీళ్లు తాగించాడు. తాజాగా దొరికిన క్రిమినల్ కథ కాస్త ఆసక్తికరం.
పేరు రబీంద్రమాలిక్. ప్రస్తుతం వయస్సు 58 ఏళ్లు. 1994లో ఓ హత్య కేసులో నిందితుడు. సరిగ్గా 32 ఏళ్ల తర్వాత పోలీసులకు చిక్కాడు. మే 22, శుక్రవాైరం వరకూ రబీంద్రమాలిక్ కోసం వేట కొనసాగింది. హైడ్రామాను తలపించింది. మొత్తానికి ఆ శుక్రవారం పోలీసులకు గుడ్ ఫ్రైడే అయింది.

ఇంతకీ రబీంద్ర ఎక్కడ దాక్కున్నాడు..?
రబీంద్ర అనే హత్యా నిందితుడిది ఒడిశా. జాజ్ పూర్ జిల్లా కేంద్రంలో తన ఇంట్లోనే ఓ రహస్య భూగర్భ గదిని ఏర్పాటు చేసుకుని.. అదిగో అక్కడ దాక్కున్నాడు రబీంద్ర. ఓవైపు పోలీసులు దేశమంతా జల్లెడ పడితే… ఎక్కడున్నాడో తెలియక వేట కొనసాగిస్తుంటే… చల్లగా చల్ల కదలకుండా ఇంట్లోనే ఉంటూ పోలీసులకు చుక్కలు చూపించాడు.
రబీంద్రది స్వస్థల ఒడిశాలోని నుహాట్ గ్రామం. రబీంద్ర స్వస్థలమైన నుహాట్ కు పక్కనే ఉండే కువాఖియా పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. దాంతో 1994, అక్టోబర్ నుంచి పోలీసులు గాలింపు చేప్టటారు. పరారీలో ఉన్న ఒక్కడ ఇంత తిప్పలు పెట్టడంపై పోలీస్ వర్గాల్లో పెద్ద చర్చే జరిగింది.
అసలేం చేశాడు రబీంద్ర..?
1994, అక్టోబర్ 21వ తేదీన తన 27 ఏళ్ల వయస్సున్న బామ్మర్తి పరమానంద మాలిక్ ను గొడ్డలితో నరికి దారుణంగా హత్య చేశాడన్నది రబీంద్రపైనున్న ప్రధాన ఆరోపణ. ఘటన తర్వాత రబీంద్ర కనిపించకుండా అదృశ్యమైపోయాడు.
మూడు దశాబ్దాలకు పైగా ఎలా పోలీసుల కళ్లుగప్పాడు..?
రబీంద్ర 32 ఏళ్ల నుంచీ తన ఇంట్లో ఏర్పాటు చేసుకున్న భూగర్బ బంకర్ లో ఏం దాక్కోలేదు. తన ఐడెంటిటీని బయటపడనీకుండా.. వివిధ రాష్ట్రాలు, ఊళ్లూ తిరుగుతూ తప్పించుకుంటూ వచ్చాడు. ఆ క్రమంలో నకిలీ ఆధార్, ఓటర్ ఐడీ కార్డులను తయారు చేసుకున్నట్టుగా కూడా పోలీసుల దర్యాప్తులో బట్టబయలైంది.
ఈ 32 ఏళ్ల కాలంలో హైదరాబాద్, కేరళ వంటి పలు ప్రాంతాల్లో మేసన్ అంటే కూలీగా పనిచేస్తూ తన కుటుంబ సభ్యులతో తన ఐడెంటిటీ ఎక్కడా బయటపడకుండానే సంప్రదింపులు కొనసాగించేవాడు రబీంద్ర. ఎప్పటికప్పుడు కొత్త ప్రాంతానికి వెళ్లిపోతుండటంతో పోలీసులు రబీంద్రను ట్రేస్ చేయడానికి చాలా ఇబ్బందులే ఎదుర్కోవాల్సి వచ్చింది. మొత్తంగా ఒడిశా పోలీసులకు రబీంద్ర కేసు ఛాలెంజింగ్ గా మారింది.
చివరకు ఎలా దొరికాడు..?
రబీంద్ర ఇంట్లో ఏ ఫంక్షన్ ఉండటంతో ఇంటికొచ్చాడన్న పక్కా సమాచారం మేరకు పోలీసులు వాళ్లింట్లో ముమ్ముర తనిఖీలు చేశారు. ఆ సమయంలోనే జాజ్ పూర్ లోని తన ఇంట్లో లోపలికి వెళ్లే బంకర్ లా ఉన్న ఓ ప్రాంతంపై పోలీసులు అనుమానించారు. కాస్త శోధించి చూస్తే.. అది బంకర్ గా తేలింది. దాంతో భూగర్భ గదిలో దాక్కుని ఉండి ఉండొచ్చని అనుమానించిన పోలీసులు.. ఆ మార్గంలో బంకర్ లోకి వెళ్లి సోదాలు చేపట్టారు. సరిగ్గా ఆ గదిలోనే రబీంద్ర కనిపించడంతో.. 32 ఏళ్ల నుంచీ ఊపిరి బిగపట్టి రబీంద్రను వెతుకుతున్న పోలీసులు.. ఒక్కసారిగా ఆ ఉత్కంఠనంతా వదిలి ఊపిరి పీల్చుకున్నారు.
ఎప్పుడైనా ఇంటికొచ్చినప్పుడు పోలీసులు దాడి చేస్తే తప్పించుకోవడానికే రబీంద్ర ఇంట్లోనే బంకర్ ను నిర్మించినట్టు పోలీసులు వెల్లడించారు.
రబీంద్రను పోలీసులు కోర్టులో హాజరుపర్చగా.. అతడి బెయిల్ పిటిషన్ ను కోర్ట్ తిరస్కరించి, జ్యుడీషియల్ రిమాండ్ విధించింది.
రబీంద్ర తప్పించుకుని తిరుగుతూ పరారీలో ఉన్న సమయంలోనే 1998లో మంజులత అనే మహిళను విహహం కూడా చేసుకున్నాడు. భార్యతో కాపురం చేస్తూనే.. పోలీసుల నుంచి తప్పించుకుని తన ఐడెంటిటీ బయటపడకుండా లీడ్ చేశాడు.



