సిద్ధిఖీ ప్రాణం మీదకు తెచ్చిన సల్మాన్ వేట! బ్లాక్ బక్ పోచింగ్ కేసు గుర్తుందా..?

2024, అక్టోబర్ 12వ తేదీ… రాత్రి వేళ… ముంబై బాంద్రా ఈస్ట్.. నిర్మల్ నగర్ లో దసరా విజయదశమి పురస్కరించుకుని పెద్దఎత్తున టపాసులు పేలుతున్నాయి. ఆ శబ్దాల్లోనే కలిసిపోయి తూటాలూ దూసుకొచ్చాయి. ఆసుపత్రికి తీసుకెళ్లే లోపే అవి ఒకరి ప్రాణాన్ని బలిగొన్నాయి. ఆయన పేరు బాబా సిద్ధిఖీ. ముంబై బాంద్రా వెస్ట్ నుంచి మూడుసార్లు ఎమ్మెల్యే.. అసలేం జరిగింది…? సినీ ఎపిసోడ్ ను తలపించిన ఆ దుర్ఘటనకు కారణమేంటి..?

ప్రతీ ఏటా బాబా సిద్ధిఖీ రంజాన్ వేళల్లో ఇచ్చే ఇఫ్తార్ విందు అంటే.. అదో సెలబ్రిటీల వేదిక. అంతేకాదు.. ఆమధ్య కొంత విభేదాలు పొడచూపి ఒకరికొకరు దూరమైన బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్, మరో అగ్రహీరో సల్మాన్ ఖాన్ ఇద్దరూ మళ్లీ భాయి భాయి అనుకునేందుకు వేదికైన కేంద్రం. అదిగో అక్కడే బాబా సిద్ధిఖీకి మరణశాసనం రాయబడింది.

1958స ఏప్రిల్ 10వ తేదీన జన్మించిన బాబా సిద్ధిఖీ.. 1970ల కాలంలో ఎన్ఎస్యూఐ నుంచి తన విద్యార్థి రాజకీయ జీవితాన్ని ఆరంభించాడు. ఆ తర్వాత వరుసగా 1992, 1997ల్లో రెండుసార్లు ముంబై మున్సిపల్ కార్పోరేటర్ అయ్యాడు. 1999, 2004, 2009 మూడుసార్లు ఎమ్మెల్యేగా గెల్చాడు. చీఫ్ మినిస్టర్ గా విలాస్ రావ్ దేశ్ ముఖ్ హయాంలో మంత్రిగా పనిచేశాడు. కాంగ్రెస్ నుంచి బయటకొచ్చి అజిత్ పవార్ నేతృత్వంలో ఎన్సీపీలో చేరాడు.

సరిగ్గా తన 66 ఏళ్ల వయస్సులో గుర్తు తెలియని ముష్కరుల రూపంలో మృత్యువు సిద్ధిఖీని గుంజుకుపోయింది. మహారాష్ట్ర ప్రభుత్వంలో సివిల్ సప్లైస్, లేబర్ మినిస్టర్ ఆయన. హై సెక్యూరిటీ. కానీ, విధి మాత్రం మరణాన్నే శాసించింది.

ఆ రాత్రి బాబా సిద్ధిఖీ మరణానికి.. బాంద్రా ఈస్ట్ నిర్మల్ నగర్ లో ఉన్న తన కుమారుడు జీషాన్ కార్యాలయమే వేదికైంది.

ముగ్గురు అగంతకులు అక్కడే కాపు కాసి వేచి చూస్తున్నారు. ఓవైపు టపాసులు పేలుతున్న శబ్దాలు.. చెవులకు చేతులు అడ్డం పెట్టుకుని ఆ శబ్దాలు వినలేక కాస్త దూరం నుంచి చూస్తున్న జనం.. ఆ శబ్దాల్లోనే అందరినీ అవాక్కయ్యేలా మరింత భిన్నమైన, భారీ సౌండ్స్ తో దూసుకొచ్చిన బుల్లెట్స్ ధ్వనులతో బాంద్రా ఉలిక్కిపడింది. నిర్మల్ నగర్ వణికిపోయింది. ఆ ముగ్గురు అగంతకులు నేరుగా బాబా సిద్ధిఖీకి గురి పెట్టి కాల్చారు. సిద్ధిఖీ కుప్పకూలిపోయాడు. వెంటనే లీలావతి ఆసుపత్రికి తరలించేలోపే ఆయన మరణించినట్టు వైద్యులు ప్రకటించారు.

అగంతుకుల జాడ దొరికిందా..?

ముగ్గురిలో ఇద్దరు ఉత్తరప్రదేశ్ కు చెందిన ధర్మరాజ్ కాశ్యప్, హర్యానాకు చెందిన గుర్మైల్ సింగ్ ను మాత్రం పోలీసులు, స్థానికుల సాయంతో అక్కడికక్కడే పట్టుకున్నారు. కానీ, మూడో వ్యక్తి శివకుమార్ గౌతమ్ అనే దుండగుడు మాత్రం ఇంకా పోలీసులకు చిక్కకుండా పరారీలోనే ఉన్నాడు.

సిద్ధిఖీ హత్యకు ప్లాన్ ఎలా వేశారు..?

గుర్మైల్ సింగ్ కు 50 వేల రూపాయలిచ్చి.. హత్య తర్వాత దేశం విడిచి పారిపోవడానికి నకిలీ పాస్ పోర్ట్ కూడా ఇప్పిస్తామని హామీ ఇచ్చారు కాంట్రాక్ట్ కుదుర్చుకుని మర్డర్ కు స్కెచ్ వేసిన సూత్రధారులు. పోలీసుల దర్యాప్తులో ఈ హత్య కోసం 2024 మే నుంచే ప్లాన్ చేస్తున్నట్టు తేలింది. ఐదు నెలల తర్వాతగానీ.. తామనుకున్న టార్గెట్ ను మట్టుబెట్టగల్గింది ముఠా.

అసలెందుకు సిద్ధిఖీ టార్గెట్ అయ్యాడు..?

ఈ మొత్తం వ్యవహారానికి ప్రధాన కారకుడు లారెన్స్ బిష్ణోయ్. లారెన్స్ బిష్ణోయ్ చంపాలనుకోవడానికి కారణం సల్మాన్ ఖాన్. ఎందుకు సల్మాన్ ఖాన్ కారణమంటే… మళ్లీ హమ్ సాత్ సాత్ హై సినిమా షూటింగ్ రోజులకు ఓసారి వెళ్లాల్సి ఉంటుంది.

1998లో జరిగిన ఓ ఘటన లారెన్స్ బిష్ణోయ్, సల్మాన్ ఖాన్ మధ్య శత్రుత్వానికి తెరలేపింది. అప్పట్నుంచీ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ కు సల్మాన్ మెయిన్ టార్గెట్. అందుకే, సల్మాన్ కు వ్యక్తిగత భద్రతా సిబ్బందినీ పెంచింది మహారాష్ట్ర ప్రభుత్వం.

సినిమా షూటింగ్ ఓవైపు నడుస్తున్న సమయంలోనే సల్మాన్ ఖాన్ బ్లాక్ బక్ గా పిల్చుకునే కృష్ణజింకను వేటాడినట్టు ఆరోపణలెదుర్కొన్నాడు. ఆ కేసు బ్లాక్ బక్ పోచింగ్ కేసుగా పాప్యులరైంది.

బిష్ణోయ్ సమాజం.. ముఖ్యంగా రాజస్థాన్ ప్రజానీకం.. కృష్ణజింకలను పవిత్రంగా భావిస్తారు. ఆ జంతువుల సంరక్షణ వారి ప్రధాన బాధ్యతగా కూడా భావిస్తారు. అది వారి సంప్రదాయ ధర్మం. అక్కడే బిష్ణోయ్ కి.. సల్మాన్ ఖాన్ కు ఎలాంటి వ్యక్తిగత శత్రుత్వం లేకున్నా చెడింది. కృష్ణజింకను సల్మాన్ వేటాడినట్టు వార్తలు గుప్పుమనడంతో లారెన్స్ బిష్ణోయ్ సల్మాన్ పై పగ పెంచుకున్నాడు. తనను టార్గెట్ చేశాడు. రాను రాను కాలక్రమంలో ఈ శత్రుత్వం మరింత ముదిరింది.

జైల్లో ఉన్న లారెన్స్ మరి ఎలా మర్డర్ కు ప్లాన్ చేశాడు..?

లారెన్స్ బిష్ణోయ్ సోదరుడు అన్మోల్ బిష్ణోయ్ అన్న ఆజ్ఞను అమలు చేశాడు. హత్యకు సుపారీ కాంట్రాక్ట్ మాట్లాడింది తానేనన్న ఆరోపణలున్నాయి. మహ్మద్ జీషాన్ అక్తర్, శుభమ్ లోంకర్ అనే మరో ఇద్దరు దుండగులు కలిసి బాబా సిద్ధిఖీ మర్డర్ కేసుకు సంబంధించిన ఆపరేషన్ ను నిర్వహించారు.

జీషాన్ అక్తర్ ఎవరు..?

జీషాన్ పంజాబ్ లోని జలంధర్ వాసి. క్రిమినల్ రిలేషన్స్ ఉన్న వ్యక్తి. షూటర్లు, ఆయుధాలు, ఆయుధాలు దాచుకునే స్థలాలు, ఇంకా ఇతర అవసరమైన లాజిస్టిక్స్ అన్నింటినీ ఏర్పాటు చేసింది జీషాన్ అక్తరే.

బాబా సిద్ధిఖీ హత్య బాధ్యతను.. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ బహిరంగంగానే స్వీకరించింది. అందుకు కారణం సల్మాన్ తో సిద్ధిఖీకి ఉన్న స్నేహమేననీ పేర్కొంది.

ఆపరేషన్ కు పక్కా స్కెచ్ గీసిన జలంధర్ వాసి జీషాన్ కూడా పోలీసుల కళ్లు గప్పి భారత్ నుంచి నకిలీ పాస్పోర్ట్ తో పారిపోయాడు. 2025 జూన్ లో కెనడాలోని సర్రే పోలీస్.. జీషాన్ ను అదుపులోకి తీసుకున్నారు. భారత్ కు అప్పగించే ఎక్స్ట్రాడిషన్ ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది.

ఇంతకీ ప్రధాన సూత్రధారి లారెన్స్ బిష్ణోయ్ ఎక్కడ..?

లారెన్స్ బిష్ణోయ్ గుజరాత్ అహ్మదాబాద్ లోని సబర్మతీ జైల్లో ఉన్నాడు. క్రాస్ బార్డర్ స్మగ్లింగ్ కేసులో అరెస్టై అక్కడే ఊచలు లెక్కిస్తూనే.. అక్కడి నుంచే మొత్తం తతంతగమంతా ఆపరేట్ చేశాడు. బాబా సిద్ధికీ హత్య కేసులో పోలీసులు 25 మంది నిందితులను అరెస్ట్ చేశారు.

మూడుసార్లు ఎమ్మెల్యేగా గెల్చి, మంత్రిగా ఉన్న నేత దసరా వేళ రాత్రి కుమారుడి కార్యాలయం బయట పటాకులు కాలుస్తుంటే చంపబడ్డాడు. ఆదేశాలిచ్చిన వ్యక్తి గుజరాత్ జైలులోనే ఉన్నాడు. ఇంకోవైపు, ట్రిగ్గర్ నొక్కిన దుండగుడు పరారీలోనే ఉన్నాడు. భారతదేశంలో ఇలాంటి కేసులెన్నో. అందులో ఇదొకటి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles