బాగా సంపాదించి కుటుంబాన్ని నిలబెట్టాలని బహ్రెయిన్ వెళ్లాడు. సంపాదన పక్కనబెడితే.. బతికి బట్టకట్టి తన జన్మస్థలానికి చేరుకోవడానికే 42 ఏళ్లు పట్టింది ఓ గల్ఫ్ బాధితుడికి. ఇదో కేరళైట్ గల్ఫ్ కథ. గోట్ లైఫ్ వంటి మరో సర్వైవల్ రియల్ డ్రామా.
1983లో ఇల్లు వదిలి వెళ్లిన కేరళ తిరువనంతపురంకు చెందిన చంద్రన్ గోపాలన్.. అనూహ్యమైన పరిస్థితులెదురై బహ్రెయిన్ లో చిక్కుకుపోయాడు. దాంతో తాను కన్న కలలు కల్లలైపోవడమే కాకుండా.. బహ్రెయిన్ వెళ్లిన మూడేళ్లకు జీవితమే తలకిందులైంది.

తన యజమాని చనిపోవడంతో తన పాస్ పోర్ట్, ఇతర ప్రయాణపత్రాలన్నీ తన దగ్గరే ఉండిపోవడంతో వాటిని కోల్పోయిన చంద్రన్ గోపాలన్ కు ఏం చేయాలో తెలియని ఒక అయోమయం నెలకొంది. దాంతో డాక్యుమెంట్స్ లేని అక్రమ వలసదారుడిగా చంద్రన్ గోపాలన్ మారిపోయాడు. అసలే బహ్రెయిన్ చట్టాలు కఠినంగా ఉండటంతో.. అక్కడి చట్టానికి చిక్కుకోకుండా జాగ్రత్తపడేందుకు నానా కష్టాలూ పడ్డాడు.
2020లో కేరళకు చెందిన మరో ప్రవాసీయుడితో జరిగిన ఓ గొడవ తర్వాత చంద్రన్ గోపాలన్ అక్కడి పోలీసులకు చిక్కాడు. అప్పుడు చంద్రన్ గోపాలన్ దైన్యస్థితి తన ఊరైన తిరువనంతపురంవాసులకు తెలిసింది. దాంతో అప్పటికే చంద్రన్ గోపాలన్ జాడ గురించి కుటుంబ సభ్యులు చాలాకాలంగా ఆందోళన చెందుతున్న క్రమంలో… తన ఆచూకీ లభించేసరికి… కేరళలోని గోపాలన్ ఉండే వీధికి సంబంధించిన స్థానికులు, కొందరు పెద్దమనుషులు గోపాలన్ కు ఎలాగైనా సాయం చేయాలని నిర్ణయించుకున్నారు.
అలా ప్రవాసీ లీగల్ సెల్ ను ఆశ్రయించారు. వారి సహకారంతో బహ్రెయిన్ లోని భారత రాయబార కార్యాలయానికి వెళ్లి, అక్కడి అంతర్గత వ్యవహారాల మంత్రిత్వశాఖ దృష్టికి చంద్రన్ గోపాలన్ బతుకుచిత్రాన్ని తీసుకెళ్లారు. వారందరి మద్దతుతో చంద్రన్ గోపాలన్ రెండు రోజుల క్రితం ఫిబ్రవరి 23న కేరళలోని తన సొంత ఇంటికి 42 ఏళ్ల తర్వాత తిరిగి చేరుకున్నాడు.
ఇప్పుడు చంద్రన్ వయస్సు 64 ఏళ్లు. నేను బాగా సంపాదించి తిరిగి రావాలనుకున్నాను. కానీ, ఖాళీ చేతులతో మళ్లీ ఇంటికి నిస్సహాయంగా తిరిగొచ్చాను. నా విమాన టిక్కెట్ కూడా రాయబార కార్యాలయమే ఏర్పాటు చేసిన దైన్యస్థితిలో ఇంటికి చేరుకోవడమే గగన గండమైపోయిందంటున్నాడు చంద్రన్. చంద్రన్ బహ్రెయిన్ వెళ్లిన రెండేళ్లకే 1985లో 95 ఏళ్ల వయస్సులో తన తండ్రి తాను ఆఖరి చూపు కూడా చూడకుండానే మరణించాడని… ఇప్పుడు తన తల్లి సంచలాక్ష్మిని కలవడమే తనకు లభించిన పెద్ద ఊరట అని ఒకింత ఆవేదన, మరింత ఆనందంతో నిండిన ఆనందభాష్పాలతో చెబుతున్నాడు ఈ కేరళైట్.
బహ్రెయిన్ లో మేస్త్రీగా పనిచేయడానికి ఓ వలస కూలీగా వెళ్లిన చంద్రన్ గోపాలన్ ఆరోగ్యం కూడా ఇప్పుడు అంతంత మాత్రమే. జీవితం మీద ఎన్నో ఆశలతో గల్ఫ్ బాట పట్టిన చంద్రన్.. సుమారు 40 ఏళ్లుగా దేశం కాని దేశంలో, భాష కాని భాషతో, నా అన్నవాళ్లెవ్వరూ కానరాక, కఠినమైన చట్టాల భయానికి ఆందోళనతో భిక్కుభిక్కుమంటూ బతికాడు.
బ్రహ్మచారిగానే బహ్రెయిన్ బాట పట్టిన చంద్రన్ గోపాలన్ తన జీవితం అస్తవ్యస్థమై పెళ్లి కూడా చేసుకోకుండా.. ఆ జన్మబ్రహ్మచారిగా మిగిలిపోయాడు. ఇప్పుడు తన ఊరంతా మారిపోయింది. స్నేహితులు, బంధువులు, కుటుంబీకులకు వారసులు కూడా వచ్చేశారు. ఈ 42 ఏళ్ల కాలంలో ఇంటి ముఖం చూడకపోవడంతో ఎంతగా మారిపోయిందో అర్థం కాక కాస్సేపు ఆశ్చర్యపోవడమే చంద్రన్ గోపాలన్ కు పనైంది.
ప్రవాసీ లీగల్ సెల్ బహ్రెయిన్ చాప్టర్ అధ్యక్షుడు సుధీర్ తిరునిలత్ దృష్టికి చంద్రన్ కేసు 2020లో వెళ్లింది. చంద్రన్ బహ్రెయిన్‌లో అడుగుపెట్టిన తర్వాత పోలీసులకు చిక్కడం కూడా అదే మొదటిసారి. అంతవరకూ ఎలాగోలా తనను కాపాడుకుంటూ చట్టానికి చిక్కకుండా బతికాడు. పత్రాలు పోగొట్టుకున్న తర్వాత అతను అక్కడేం జరుగుతుందో, ఎలాంటి శిక్షలు పడుతాయోనన్న భయంతో కనిపించకుండా పోయాడు. కానీ, అక్కడి చట్టాలపై కాస్తో కూస్తో అవగాహన ఉన్నవారు, స్థానికుల నుంచీ, ప్రవాసీ లీగల్ సెల్ వంటివారి నుంచి మద్దతు లభించేవారు మాత్రం తమ డాక్యుమెంట్స్ కోల్పోయినప్పుడు త్వరగా పోలీసులను ఆశ్రయిస్తుంటారు. చంద్రన్ మాత్రం భయంతో కూడిన ఆందోళనతో ఆ పని చేయకపోగా.. అతడు పోలీసులకు నిజం చెప్పడానికి దశాబ్దాలు పట్టింది. దాంతో చంద్రన్ మూడు నెలల జైలు శిక్ష కూడా అనుభవించాడు.
మళయాళ ఛానల్ కైరళీలో విదేశాల్లోని కేరళైట్స్ గురించి ప్రవాసలోకం అనే ఒక కార్యక్రమాన్ని ప్రసారం చేస్తుంటారు. అందులో చంద్రన్ తల్లి తన కొడుకు గురించి వెలిబుచ్చిన ఆవేదనను చూసిన కొందరు అక్కడ చంద్రన్ కు తన తల్లి బతికే ఉందనే సమాచారాన్ని అందించారు. అప్పుడు చంద్రన్ లో ఎలాగైనా తల్లిని కలుసుకోవాలనే తపన మరింత పెరిగిందంటారు ప్రవాసీ లీగల్ సెల్ బహ్రెయిన్ అధ్యక్షుడు సుధీర్.
22 ఏళ్ల వయస్సులో ఇంటిని వదిలిపెట్టి వెళ్లిన చంద్రన్ గోపాలన్ సరిగ్గా 64 ఏళ్ల వయస్సులో ఇంటికి చేరుకునేందుకు 42 ఏళ్ల సమయం పట్టింది.
తన యజమాని చనిపోయిన తర్వాత తన పత్రాలు దొరక్కుండాపోవడంతో ఎక్కడెక్కడో పోలీసులకు, అక్కడి చట్టాలకు చిక్కకుండా పెయింటర్ గా పనిచేశాడు చంద్రన్ గోపాలన్. ఒకే చోట ఉంటే పట్టుకుంటారేమోనన్న భయంతో పలుచోట్లకు మారాడు. మనామా వంటి ఎడారి శివార్లలో తలదాచుకుంటూ బతికే కాలంలో మొదట్లో తన కుటుంబానికి లేఖలు కూడా రాసేవాడు. కానీ, కొన్నేళ్ల తర్వాత లేఖలు రాసే పరిస్థితి కూడా లేకపోవడంతో ఇటు చంద్రన్ బాగోగులుగానీ, అటు కేరళలోని ఆయన కుటుంబీకుల బాగోగులుగానీ పరస్పరం తెలుసుకోలేకుండా పోయింది.
ప్రస్తుతం చంద్రన్ గోపాలన్ తన అన్న మోహనన్ వద్దే ఉంటున్నాడు. చంద్రన్ ఆచూకీ కోసం ఎందరినో సంప్రదించినా జాడ కనుక్కోలేక ఆ కుటుంబం పడ్డ వేదన అంతా ఇంతా కాదు. గల్ఫ్ కన్నీటిగాధలు రాస్తే రామాయణమంత… చెప్పుకుంటే భారతమంత… అందులో ఒకటే ఈ అభాగ్యుడుచంద్రన్ గోపాలన్ కథ. ఏదేమైనా.. చివరకు స్వదేశంలోని కుటుంబం వద్దకు చేరుకోవడమొక్కటే ఇప్పుడు చంద్రన్ గోపాలన్ స్టోరీలో అతడికీ, అతడి కుటుంబానికీ కల్గిన ఓ ఊరట.



