అమ్చీ ముంబై.. ఆ కొందరి చేతుల్లోనే!

అమ్చీ ముంబై. ముంబైనెరిగినవారు బాగా వాడే మాట. దేశ ఆర్థిక రాజధాని. ఫ్యాషన్ కు ప్యారిస్. అండర్ వరల్డ్ అడ్డా. ఇలా చెప్పుకుంటూ పోతే.. వడాపావుతో ఉదయాన్నే పని ప్రారంభించేందుకు లోకల్ ట్రైన్ ఎక్కే సామాన్యుడి నుంచి.. ఎగిసిపడే అరేబియన్ సముద్రపు అలల ఒడ్డున అరేబియన్ గుర్రాలపై విహరించే సంపన్నుల వరకూ కలల నగరం. సుమారు 1 కోటి 30 లక్షల మంది జనాభా కల్గి.. ఆసియాలోనే అత్యంత ధనికులెక్కువ మంది ఉన్న అర్బనైజ్డ్ కాంక్రీట్ జంగల్. అలాంటి ముంబైలో పదిశాతం భూమి ఒక ఆరుగురి చేతుల్లో ఉందంటే మీరు నమ్మగలరా..? కానీ, నమ్మితీరాలి. ఎలా అంటే.. అందుకోసారి మనం స్లమ్ రిహాబిలిటేషన్ అథారిటీ నిర్వహించిన సర్వే గురించి తెలుసుకోవాలి.

ఆరుగురు భూస్వాముల చేతుల్లో పది శాతం కంటే ఎక్కువ భూమి!

మహారాష్ట్రలో మురికివాడల అభివృద్ధి కోసం పనిచేస్తున్న ఎస్ఆర్ఏ అనే సంస్థ సర్వే ప్రకారం.. ముంబై రియల్ ఎస్టేట్ వ్యాపారం మొత్తం 1 లక్ష ఎకరాల్లో విస్తరించి ఉంటే.. అందులో నివాసయోగ్యమైన భూమి 34 వేల ఎకరాలు. ఆ మొత్తం భూమిలో కేవలం కొందరు భూస్వాములు మాత్రమే.. ట్రస్టులు, ప్రైవేట్, కార్పోరేట్ సంస్థల పేరుతో.. 20 శాతం భూమిని కల్గి ఉంటే… నివాసయోగ్యమైన ప్రాంతాల్లో ఆ 20 శాతంలో సగం భూమి విఖ్రోలి ప్రాంతంలో గోద్రెజ్ కుటుంబానికి చెందిందన్నది ఆ నివేదిక సారాంశం.

గోద్రెజ్ ప్రాపర్టీస్!

ముంబైలోని విఖ్రోలి ప్రాంతంలో ఎస్ఆర్ఏ సర్వే ప్రకారం.. గోద్రేజ్ కుటుంబం 3 వేల 400 ఎకరాలకు పైగా భూమిని కలిగి ఉంది. ఈస్ట్రన్ ఎక్స్ ప్రెస్ హైవేలో ఉన్న ఈ భూమి అత్యంత విలువైంది కావడంతో.. ఇప్పటివరకూ ముంబైలో అగ్రశ్రేణి భూయజమానుల జాబితాలో గోద్రెజ్ కుటుంబం పేరే ప్రధానంగా వినిపిస్తోంది.

సబ్బులు, ఇతర గృహోపకరణాల నుంచి మొదలుకుంటే రియల్ ఎస్టేట్ రంగం వరకూ ప్రతీరంగంలోనూ విస్తరించిన గోద్రేజ్ గ్రూప్ ఇప్పుడు విడిపోగా… ఆది గోద్రేజ్, తన సోదరుడు నాదిర్ గోద్రేజ్ కు ఐదు భారీ పరిశ్రమలు రాగా.. కజిన్స్ అయిన జంషేద్, స్మిత కు అన్ లిస్టెడ్ ఇండస్ట్రియల్ సెక్టార్ లోని అనుబంధ సంస్థలతో పాటు.. ముంబైలోని ప్రధాన ఆస్తిగా చెప్పుకుంటున్న భూమి దక్కింది.

3 వేల 400 ఎకరాల ల్యాండ్ గోద్రేజ్ కుటుంబం పేరిట ఉన్నప్పటికీ… వాటిని పొందే విషయంలో ల్యాండ్ సీలింగ్ రిజర్వేషన్స్ తో కూడిన పరిమితులున్నాయి. ముఖ్యంగా విఖ్రోలి సెంట్రల్ సబర్బన్ భాగంలో గోద్రేజ్ భూముల్లో అడవులు, మడ అడవులు, సముద్ర తీర ప్రాంతం ఉండటంతో ఈ రిజర్వేషన్ తప్పనిసరి. ఈ క్రమంలో అలా కొంత భూమిని గోద్రేజ్ కుటుంబం కోల్పోయినప్పటికీ… వారికి దక్కే భూమి విలువ 30 వేల కోట్లుంటుందని ఓ అంచనా. ఇక బయట మార్కెట్ లో రియల్ ఎస్టేట్ బూమ్ ప్రకారమైతే 50 వేల కోట్ల రూపాయల విలువ ఉంటుదన్నది ఎస్ఆర్ఏ సర్వే సంస్థకు ముంబై సెంట్రల్ సబర్బన్ కు చెందిన ఓ రియల్ ఎస్టేట్ డెవలపర్ చెప్పిన లెక్క.

ఫ్రమ్రోజ్ దిన్షా ట్రస్ట్!

ఇక గోద్రేజ్ కుటుంబం తర్వాత మరో బడా భూయాజమాన్యం కల్గి ఉన్న ఫ్యామిలీ ఫ్రమ్రోజ్ దిన్షాలది. వీరు స్థాపించిన ట్రస్ట్ పేరు మీద ముంబైలో సుమారు 683 ఎకరాల భూమిని కల్గి ఉన్నారు. మలాడ్ పరిసర ప్రాంతాల్లో వీరు ఈ భూమి కల్గి ఉన్నట్టు ఎస్ఆర్ఏ సర్వే సంస్థ వెల్లడించింది. పార్సీ కుటుంబీకుడైన ఫ్రమ్రోజ్ దిన్షా ఫైనాన్షియర్, పెద్ద ల్యాండ్ లార్డ్. అయితే, ఈ కుటుంబానికి చెందిన భూములను పలుమార్లు మహారాష్ట్ర ప్రభుత్వం భూపరిమితి చట్టాల పేరుతో పెద్దమొత్తంలో స్వాధీనం చేసుకున్న దాఖలాలూ ఉన్నాయి.

మిగిలినవారి కథ..?

ఇక గోద్రేజ్, ఫ్రమ్రోజ్ దిన్షాల తర్వాత.. ప్రతాప్ సింగ్ వల్లభదాస్ సూర్జీ కుటుంబం ముంబైలోని భాండూప్ ప్రాంతంలో 647 ఎకరాల భూమిని కల్గి ఉంది. అలాగే, జీజీభాయో ఆర్ధేషిర్ ట్రస్ట్ ముంబైలో నాల్గో అతి పెద్ద భూయజమానిగా సర్వేలో తేలింది. ఈ ట్రస్ట్ పేరిట చెంబూరులో 508 ఎకరాల భూమి ఉంది. ఇక మరో పార్సీ కుటుంబీకుడైన వాడియా ట్రస్ట్ కు కుర్లాలో 361 ఎకరాల భూమి ఉండగా.. చెంబూరు ప్రాంతంలో మూడింట ఒకటో వంతు వీరి పేరిటనే ఉండేదనేది ఎస్ఆర్ఏ సర్వే సంస్థ చెబుతున్న మరో రిపోర్ట్. కుర్లా ప్రాంతంలో ఉన్న ఈ అత్యంత విలువైన భూమిని 19వ శతాబ్దం ప్రారంభంలో ఆర్ధేషిర్ హోర్ముస్జీ వాడియా ఏడాదికి కేవలం 3 వేల 587 రూపాయలకు లీజుకు తీసుకున్నారు. కానీ, వారి పేరిట క్రమంగా క్రమబద్ధీకరణ కావడంతో పాటు.. ఆ 361 ఎకరాల్లో ఇప్పుడు చాలావరకూ కబ్జాలకు గురైందన్నది ఎస్ఆర్ఏ నివేదిక బహిర్గతం చేసిన విషయం. అలాగే బైరామ్జీ బీబీభాయ్ గ్రూప్ ముంబైలోని వివిధ ప్రాంతాల్లో తన ట్రస్ట్ పేరిట 269 ఎకరాల భూమిని కల్గి ఉంది. ఈ కుటుంబం 1830లోనే ఈస్ట్ ఇండియా కంపెనీ నుంచి మొత్తం 12 వేల ఎకరాలతో కూడిన ఇప్పుడు ముంబై మహానగరంలో కలిసిన ఏడు గ్రామాల్లోని భూమిని పొందారు. అంతేకాదు, ప్రస్తుతం ముంబై ఐకానిక్ హోటల్ గా వెలుగొందే తాజ్ హోటల్ పక్కన బాంద్రా ఎండ్ ప్రాంతంలోనూ వీరి భూములున్నాయి.

వీరితో పాటు.. సర్ మహమ్మద్ యూసుఫ్ ఖోట్ ట్రస్ట్, వీ.కే. లాల్ ఫ్యామిలీ, ఇతర కొందరు ప్రైవేట్ భూస్వాములు ముంబైలోని కంజుర్ మార్గ్, కాండివాలీ ప్రాంతాల్లో పెద్దఎత్తున భూములు కల్గి ఉన్నారు.

అయితే, ముంబై భూయజమానుల్లో పార్సీలదే ఆధిపత్యం!

తళుకుబెళుకుల ముంబై మహానగంలో పార్సీలే అందరికంటే పెద్ద ల్యాండ్ లార్డ్స్. మధ్యయుగ కాలంలో భారతదేశంలో పాలకుల తరపున వ్యవసాయ ఉత్పత్తులపై కొందరు పన్నులు వసూళ్లు చేసేవారు. వారినే జమీందార్లనీ, దేశ్ ముఖ్ లనీ, ఖోట్ లనీ వివిధ పేర్లతో పిలుస్తుంటాం. బ్రిటీషర్స్ ముంబైని పాలించే సమయంలో మరాఠా హిందువులు, కొంకణ్ ముస్లింలతో సహా చాలామంది సంపన్నులకు అనేక గ్రామాలనిచ్చారు. ఓపీయమ్ వంటి నల్లమందుతో పాటు.. పత్తి వ్యాపారంలో వారు తమ అదృష్టాన్ని పరీక్షించుకోగా.. అందులో పార్సీలు బాగా విజయవంతమయ్యారు. దాంతో వారు మరింత ఎదిగి ఈ ద్వీపకల్పంలో ల్యాండ్ లార్డ్స్ గా ఎదిగినట్టు సర్వే వెల్లడించింది.

అయితే, ఈ ప్రైవేట్ వ్యక్తులు, బడా బిజినెస్ మ్యాగ్నైట్స్, ట్రస్టులు, సంపన్న కుటుంబాలవారే గాకుండా.. ముంబై పోర్ట్ ట్రస్ట్, నేషనల్ టెక్స్ టైల్స్ కార్పోరేషన్, మహారాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, సెంట్రల్ రైల్వే, వెస్ట్రన్ రైల్వే వంటి ప్రభుత్వరంగ సంస్థలూ భారీగా భూములు కల్గిఉన్నట్టు స్లమ్ రిహాబిలిటేషన్ సంస్థ సర్వే వెల్లడించింది.

మొత్తంగా ముంబై వంటి మహానగరాన్ని పార్సీ కుటుంబాలు ఎలా శాసిస్తున్నాయో చెప్పడానికి… ఫిలాంత్రోపిస్టులుగా పరోపకారం పేరుతో క్యాపటిలజం ఎలా వేళ్లూనుకుపోయిందో కళ్లకు కట్టేందుకు ఎస్ఆర్ఏ సర్వేలో వెల్లడైన భూవివరాలు ఓ చిన్న ఉదాహరణ మాత్రమే.

COURTESY: HINDUSTAN TIMES

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe

Latest Articles