అర్జిత్ సింగ్ ఓ ఆత్మవిశ్వాస ప్రతీక!
ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటూ సినీ ఇండస్ట్రీ ముందు సాగిలపడి ప్రూవ్ చేసుకోవాలనుకునేవారివి ఎన్నో కథలు. అందులో కొన్ని విజయాతీరాలకు చేరితే.. మరికొన్ని ఎలాంటి గుర్తింపు లేకుండానే మధ్యలోనే కనుమరుగైపోతాయి. అలాంటి ఇండస్ట్రీ చూపు తమవైపు పడితే చాలనుకునే రోజుల్లో… మంచి బూస్టప్ ఉన్న సమయంలో, స్పాటిఫై వంటి పాటల వేదికల్లో అత్యంత ప్రజాదరణ చూరగొన్న టాప్ స్టార్ అర్జిత్ సింగ్ సినీ ఇండస్ట్రీని వీడాడు. ఇకపై తాను పాడబోనంటూ సంచలన ప్రకటన చేశాడు. తాను ట్రెండ్ ఫాలోవర్ ను కాను.. ట్రెండ్ సెట్ చేస్తానంటూ సినీ సంగీత పరిశ్రమ నుంచి రిటైర్మెంట్ ప్రకటించి అందరినీ నిశ్ఛేష్ఠుల్ని చేశాడు
.
అర్జిత్ సంచలన నిర్ణయం వెనుక కారణమేంటి..?
అయితే, దీనివెనుక కారణాలూ అన్వేషించాల్సి ఉంది. అర్జిత్ సింగ్ తన పాటను వదిలేయలేదు. కానీ, ప్రతిభ కన్నా.. విధేయత, సాగిలపడే మనస్తత్వాలు, పైరవీలు, కాస్టింగ్ కౌచ్ కు విలువనిచ్చే ఇండస్ట్రీ తనకు వద్దనుకున్నట్టుగా కనిపిస్తోంది. అంతేకాదు, ప్రతిభ ఉంటే… సినీ ఇండస్ట్రీనే కాదు.. తన సొంత ఆల్బమ్స్ తోనూ దూసుకుపోవచ్చనే ఆత్మవిశ్వాసం కూడా అర్జిత్ నిర్ణయం వెనుక కనిపిస్తోంది. ఇవాళ మోబైల్ విప్లవంతో ఫింగర్ టిప్స్ పైకి టెక్నాలజీ అందివచ్చిన రోజులివి. ఇలాంటి క్రమంలో ప్లే బ్యాక్ సింగర్ గా తాను గుర్తింపు తెచ్చుకున్న క్రమంలో.. ఆ గుర్తింపు కార్డ్ తన కొత్త ప్రయాణానికి ఉపయోగపడుతుందన్న ఆలోచన అర్జిత్ సింగ్ లో కనిపిస్తోంది.
ప్రాశ్చాత్య ప్రపంచాన్ని ఓసారి పరిశీలిస్తే.. ఏ హాలీవుడ్ సినిమా పాటో హిట్టని ఎప్పుడూ, ఎక్కడా పెద్దగా చెప్పుకున్న దాఖలాలుండవు. అక్కడంతా ప్రైవేట్ ఆల్బమ్స్ వే హవా. ఆ కల్చర్ కొంతకాలం భారతదేశంలోనూ కనిపించింది. టీవీ స్క్రీన్స్ కొత్తగా వచ్చిన రోజుల్లో ప్రైవేట్ ఆల్బమ్స్ పాటలు వాటిల్లో బాగా కనిపించేవి. ఇప్పటికీ ఆ కల్చర్ కొనసాగుతూనే ఉంది. భక్తి పాటల నుంచి మొదలుకుంటే.. జానపదాలు, ఇతర ఇండీ పాప్ ఆల్బమ్స్, మెలోడీ సాంగ్స్ పాడుతూ లక్షలు, కోట్లల్లో వ్యూస్ సంపాదిస్తున్నవారూ ఉన్నారు. అలాంటి బాటలోనే ఇప్పుడు అర్జిత్ సింగ్ అడుగులు పడబోతున్నట్టుగా కనిపిస్తోంది.
38 ఏళ్ల అర్జిత్ సింగ్ మంచి స్వింగ్ లో ఉన్నప్పుడు సినీ ప్లే బ్యాక్ సింగింగ్ నుంచి వైదులుగుతున్నట్టు చేసిన ప్రకటన వైరలై సంచలనమైంది. ఇంత తక్కువ సమయంలో మంచి బూమ్ లో ఉన్న కాలంలో ఆ అవసరమెందుకొచ్చిందనే చర్చా పెద్ద ఎత్తున జరుగుతూనే ఉంది. ఇప్పటికే 700కు పైగా పాటలు పాడారు అర్జిత్. జస్ట్ ఓ రియాలిటీ షోలో సింగర్ గా కనిపిచినా.. ఆ షోలో గెలవకపోవడంతో అతడి సింగింగ్ కెరీర్ కే ఓ బ్రేక్ రావడానికి ఎనిమిదేళ్లు వెయిట్ చేయాల్సి వచ్చింది.

ఆషికీతో మారిన అర్జిత్ జీవితం!
తుమ్ హి హో అంటూ ఒక్కసారిగా తన లవ్ సాంగ్ తో మ్యాజిక్ చేసిన అర్జిత్ జీవితం ఆషికీ 2 సినిమాతో పూర్తిగా మారిపోయింది. అనతికాలంలోనే తన సహచర గాయకులు, ప్రతిభావంతులైన సోనూనిగమ్ వంటివారూ అసూయపడేలా తన మాడ్యులేటెడ్ గాత్రంతో యువతను ఉర్రూతలూగించాడు. ఆ తర్వాత గానంతో.. ఒక చరిత్రనే సృష్టించాడు. కానీ, ఆ చరిత్రను అలా ఉంచేసేందుకు.. ఎవ్వరూ ఊహించని విధంగా ఇక భవిష్యత్తులో పాడననే సంచలన ప్రకటనతో సినీ ప్లే బ్యాక్ సింగింగ్ కు ఫుల్ స్టాప్ పెట్టేశాడు.
అర్జిత్ ప్లే బ్యాక్ సింగింగ్ నుంచి వైదొలగటం పదవీ విరమణా… లేక, తన శక్తేంటో చాటేందుకు చేసిన పవర్ మూవా అనేటువంటి సందేహాలు సర్వసాధారణంగా రేకెత్తేవే. ప్లే బ్యాక్ సింగింగ్ లో తాను అలిసిపోయాడా… లేక, ఇండస్ట్రీలో జరుగుతున్న ఏవైనా పరిణామాలు తనను కదిలించాయా, మానసిక ఆవేదనకు గురిచేశాయా.. లేక, తనను తాను నిరూపించుకునేందుకు కొత్త ప్రయాణమా…? ఇలా పలు ప్రశ్నలు ఇప్పుడు సమాజముందుంచాడు అర్జిత్.
సినీ ఇండస్ట్రీనే ధిక్కరించిన స్వరం అర్జిత్!
ప్లే బ్యాక్ సింగింగ్ నుంచి వెనక్కి తగ్గడమంటే.. ప్రతిభ కంటే విధేయతనే కోరే పరిశ్రమను అర్జిత్ తిరస్కరించినట్టే కనిపిస్తోంది. తన విలువలకు సరిపోని వ్యవస్థతో తన ప్రయాణం కష్టమని భావించే తెగదెంపులు చేసుకున్నట్టుగా అనిపిస్తోంది. అర్జిత్ ను పాటలకతీతంగా పరిశీలిస్తే.. వ్యక్తిగతంగా కూడా తన శైలి మిగిలిన సింగర్స్ కు భిన్నం.
చాలా ప్రైవసీ కోరుకునే వ్యక్తి అర్జిత్. అతి ప్రచారాన్నీ ఇష్టపడని శైలి. ఆర్టిఫిషియల్ హడావిడీ కనిపించదు. అవసరం లేని ప్రాధాన్యత కోరుకుంటూ పరుగుల్లేని ఓ నిరాడంబరతా అతడి సొంతం. అర్జిత్ మాట్లాడడు. పాటే అతడి మాట. నేరుగా హృదయాలను తాకుతుంది. ఆ తర్వాత అర్జిత్ కనిపించడు. వినిపిస్తాడంతే.
ఇండస్ట్రీ మ్యానువల్ ను పక్కనబెట్టినవాడు!
అసలు సినీ సంగీత పరిశ్రమ మ్యానువల్ ను ఏనాడూ అర్జిత్ అనుసరించనేలేదంటారు ఆయన్నెరిగినవారు. పీఆర్ నిర్వహిస్తూ పైసలు దులుపుకోడు. తన కచేరీలతో నేరుగా అభిమానులతో మాట్లాడతాడు. అవార్డులు, రివార్డుల సీజనల్ రాజకీయాలకూ, గాసిప్స్ ఆధారిత వివాదాలకూ అర్జిత్ ఆది నుంచీ దూరమే. తాను పాడిన పాటను సుల్తాన్ సినిమాలో సల్మాన్ వాడకపోవడంపై బహిరంగంగా స్పందించినవాడు.
ఇవన్నీ చూస్తే ఆత్మవిశ్వాసం మెండుగా ఉన్న అర్జిత్ సింగ్ కనిపిస్తాడు. దాన్ని తాకట్టు పెట్టుకోలేని పాటగాడు కనిపిస్తాడు. గేట్ కీపింగ్, నిశ్శబ్గంగా అన్నీ భరించడాన్ని తిరస్కరించే నైజం కళ్లకు కడుతుంది. జనం కంటిన్యూయస్ గా తిరస్కరిస్తూనే ఉన్నా.. సినిమాల్లో తమ వారసత్వాన్ని రుద్దుతూ.. లెగసీ నిలబెట్టుకోవాలని చూసే సినీ ఇండస్ట్రీలో అర్జిత్ అందుకు పూర్తి భిన్నం. అందుకే, తాను మానసికంగా హాయిగా ఉండాలన్నా.. స్వేచ్ఛగా తన సృజనాత్మకతను ప్రదర్శించాలనుకున్నా సినీ ఇండస్ట్రీని వీడటమే సరి అనుకున్నాడు. వైఫల్యాలతో కనిపించకుండా పోయేవాళ్లు.. రాత్రికి రాత్రి వచ్చే ఒక్క సక్సెస్ తో విర్రవీగేవారు.. చిన్న అవకాశాలతో బలవంతంగానైనా స్టార్ డమ్ కోసం తపన పడుతూ పాట్లు పడేవాళ్లు కనిపించే ఇండస్ట్రీలో.. అర్జిత్ ఎలాంటి అపజయాలు లేని కాలంలో, సూపర్ సక్సెస్ కొనసాగిస్తున్న రోజుల్లో తీసుకున్న విప్లవాత్మక నిర్ణయం మాత్రం ఆయనలా ఉండాలనుకునేవారితో పాటు.. అందుకు భిన్నంగా నేడు వ్యవహరిస్తున్నవారినీ ఆలోచింపజేసేది.
పరిశ్రమ తనకిచ్చేదానికంటే తీసుకునేదే ఎక్కువ అని గ్రహించినట్టున్నాడు అర్జిత్. వ్యవస్థను బాగుచేయాలన్న పెద్ద తలంపూ లేదు. గొప్ప సంస్కర్త కావాలన్న ఆడంబరానికీ పోలేదు. పోనీ త్యాగమా అంటే అదీ కాదు. హిట్ సింగర్ గా కొనసాగుతున్న సమయంలో హీరోయిజమూ ప్రదర్శించలేదు. కానీ, సినీ పరిశ్రమలో ఆ ఉద్యోగం తనకు సరిపడలేదని తిరస్కరించాడు. అది లేకుండా కూడా తాను బాగుండగలనని ప్రకటిస్తున్నాడు.
క్యాన్సర్ సోకిన వ్యవస్థను బాగుపర్చేకంటే కొత్తదారే మేలనుకున్నవాడు!
కుళ్లిపోయిన, భ్రష్ఠు పట్టిన వ్యవస్థలను బాగుపర్చుకుంటూ ఉండటం వల్ల వచ్చే లాభమేమీ లేకపోగా.. టైం వేస్ట్. ఇదే అర్జిత్ సింగ్ కొత్త ప్రయాణానికి నాంది పలికినట్టుంది. తన ఉనికిని తాను నిర్వచించుకోగల్గే శక్తి, యుక్తులూ ఉన్నప్పుడు.. అర్జిత్ వంటివారు వెళ్లిపోవడమే సరేమో! మరింత ప్రజాస్వామ్యయుతంగా, ఆలోచనాత్మకంగా, ఒర్జినాలిటీతో కొత్తగా ఏం చేయగలమన్న ఆలోచన నుంచి అర్జిత్ ప్రకటన వెలువడినట్టు కనిపిస్తోంది.
అర్జిత్ సింగ్ వంటివారు సినీ పరిశ్రమను వీడిపోతున్నానన్న ప్రకటన ఆయన అభిమానులనెందరినో మొదట కలవరపర్చింది. కానీ, ఆయనకు మాత్రమే అభిమానులైనవారంతా తర్వాత అర్థం చేసుకున్నట్టుగా కనిపిస్తోంది. నువ్వు సినీ ఇండస్ట్రీలో ప్లే బ్యాక్ సింగర్ గా రిటైర్డైనా.. ఎప్పటికీ నీ పాటల పూదోటలో మాత్రం మమ్మల్ని విహరించేందుకు అవకాశమివ్వాలంటూ సోషల్ మీడియాలో అభిమానులు కోరడం చూశాం. అంటే సినీ ఇండస్ట్రీ నుంచి తన అస్తిత్వాన్ని చాటుకున్న అర్జిత్ పాడిన పాటల కంటే కూడా.. అర్జిత్ వ్యక్తిగత ఇమేజ్ ఆయన్ను ఇండస్ట్రీని మించి ఎత్తున నిలబెట్టింది.
అందుకే అర్జిత్ అనే సృజనాత్మక స్వరం నుంచి.. ఆ మైక్ డ్రాపింగ్ మూమెంట్ అందరినీ భావోద్వేగానికి గురి చేసింది. కానీ, అంతే తక్కువ సమయంలో అర్జిత్ ఎందుకు ఆ మైక్ డ్రాప్ చేస్తున్నాడో కూడా అదే అభిమానులు అర్థం చేసుకునేందుకూ కారణమైంది.
సంగీతం సృష్టించబడాలే తప్ప.. ఆదేశాలకు ఒగ్గేది కాదని ప్రకటించిన గాయకుడు అర్జిత్ సింగ్. మొత్తంగా అర్జిత్ నిర్ణయం ఒక వ్యవస్థపై వ్యక్తి సాధించిన విజయం.



