తన సామాజిక అస్తిత్వాన్ని బయటపెట్టకుండా నక్కి నక్కి దాచుకున్న కాలం నుంచి… అదే ఉనికిని ప్రపంచ వేదికపై చాటే స్థాయికెదిగిన ఓ గొప్ప దర్శకుడి కథ ఇది. అతనో హైదరాబాదీ. మాసాన్ సినిమా గురించి తెలిసినవారికి అతగాడెవ్వరో తెలిసే ఉంటుంది. పేరు నీరజ్ ఘయ్వాన్. అవునూ.. 2025లో కాన్స్ ఫిలిం ఫెస్టివల్ లో మళ్లీ ఆయన సినిమాకు తొమ్మిది నిమిషాల స్టాండింగ్ ఓవేషన్ దక్కినందుకు అతగాడి గురించి, అదీ మన హైదరాబాదీ గురించి. కచ్చితంగా తెలుసుకోవాల్సిన కథ ఇది.

1980లో జన్మించిన నీరజ్ ఘయ్వాన్ ది హైదరాబాద్. మహారాష్ట్ర నుంచి వచ్చి హైదరాబాద్ లో స్థిరపడ్డ కుటుంబం నీరజ్ ది. తండ్రి ఓ రీసెర్చ్ సైంటిస్ట్. తల్లి ఓ గార్మెంట్ స్టోర్ యజమాని. ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తి చేసి, ఆ తర్వాత ఎంబీఏ చేసి టెక్ మహీంద్రాలో చాలా మందిలాగే ఉద్యోగంలో చేరాడు. కానీ, అడుగడుగునా సామాజిక అస్తిత్వంపై సాగే చర్చలు ఆయన్ను ఒకింత ఆత్మరక్షణలో పడేశాయి. తన ఉనికినే చాటుకునేంత పెద్ద ఇన్సిడెంట్ ఏం జరిగిందో నీరజ్ ఇప్పటివరకూ ఎక్కడా రివీల్ చేయలేదుగానీ.. ఏవో కొన్ని ఘటనలు మాత్రం తనను ఇబ్బంది పెట్టాయి, గందరగోళపర్చాయి, ఆందోళనకు గురిచేసి ఉంటాయనేది మాత్రం తన జీవన ప్రయాణం చెబుతుంది. బాల్యంలో స్కూల్ చదువుల నుంచే కనిపించిన వివక్షతో తన సామాజిక అస్తిత్వాన్నే చాటుకోలేని దుస్థితిని ఈ సమాజంలో చూశాడు. దాంతో తన పేరుకు కుమార్ అని చేర్చుకుని ఎవ్వరికీ తన సామాజిక ఉనికేంటో తెలియకుండా బతికాడు. అయితే అదే సమయంలో నీరజ్ ఓ ఉన్నతోద్యగంలో ఉన్నప్పటికీ.. సినిమా అంటే ప్యాషన్. తను అనుభవించిన అంశాలతో పాటు, సామాజిక పరిస్థితులను కళ్లకు కట్టాలనే యోచన మదిలో ఎప్పుడూ మెసులుతుండేది. దాంతో ఎప్పుడూ ఏదో ఒకటి చదవడం.. చదివిన విషయాల నుంచి సంగ్రహించినవాటితో పాటు, జీవితానుభవాలను రంగరించి రాయడం అలవాటుగా మార్చుకున్నాడు. మొదట సినిమాల గురించి రివ్యూస్ రాసే చిత్ర విమర్శకుడిగా బాలీవుడ్ వైపు అడుగులేశాడు. చిత్ర నిర్మాణం గురించి కలలు గన్న నీరజ్… అది కలగానే మిగిలిపోవద్దని నిర్ణయించుకున్నాడు. అలా బాలీవుడ్ లో దర్శకులతో కుదిరిన సోపతి నీరజ్ ను ఏకంగా దర్శకుడిగా మార్చేసింది.
మొట్టమొదట గ్యాంగ్స్ ఆఫ్ వస్సీపూర్ లో అనురాగ్ కాశ్యప్ వద్ద సహాయకుడిగా ఛాన్స్ కొట్టేశాడు. అలా దర్శకత్వ శాఖతో పాటు, సినిమాకు సంబంధించిన వివిధ క్రాఫ్ట్ లపై పట్టు సంపాదించిన నీరజ్… కొన్నేళ్ల తర్వాత తానే డైరెక్టర్ గా కొత్త రూపు దాల్చాడు. సరిగ్గా 2015లో ఆయన దర్శకత్వం వహించిన మాసాన్ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్ద హిట్ కాకపోయినా.. కాన్స్ ఫిలిం ఫెస్టివల్ లో మాత్రం ప్రదర్శించబడి విమర్శకుల ప్రశంసలందుకుంది. కానీ, ఆ చప్పట్ల వెనుక తన అస్తిత్వాన్నే దాచుకుని పెరిగిన నేపథ్యముండటం విషాదం.
విచారం నుంచి విజయం వరకూ!
ఆ విషాదం నుంచి విజయం వరకూ చేరుకున్నాడు కాబట్టే ఇప్పుడు మనం నీరజ్ గురించి చెప్పుకుంటున్నాం.
అయితే, మళ్లీ చెప్పుకోవడానికి ప్రధాన కారణం 2025లో కూడా మన హైదరాబాదీ నీరజ్ తీసిన హోంబౌండ్ సినిమా కాన్స్ ఫిలిం ఫెస్ట్ లో ప్రదర్శించబడి విమర్శకుల ప్రశంసలందుకోవడమే కాకుండా… 9 నిమిషాల పాటు ఆహూతులంతా లేచి నిలబడి స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు. అన్ సెర్టెయిన్ రిగార్డ్ విభాగంలో ఈ సినిమాకు ప్రశంసలు దక్కాయి. అయితే, 68వ కాన్స్ ఫిలిం ఫెస్ట్ లో ఏ అన్ సెర్టెయిన రిగార్డ్ విభాగంలో మాసాన్ కు ప్రశంసలు దక్కాయో.. అదే విభాగంలో ఇప్పుడు మళ్లీ హోంబౌండ్ కూ దక్కడం మరింత విశేషం.

తరగతి గదిలో పాఠాలు నేర్చుకునే బాల్యం నుంచీ, కార్పోరేట్ ఉద్యోగం చేసుకునే డెస్క్ లో ఐడెండిటీ క్రైసిస్ ను ఎదుర్కొంటున్న కాలం మీదుగా.. తన అస్తిత్వాన్ని దాచుకుంటూనే తన పేరు తర్వాత కుమార్ అని చేర్చుకుని అణగారినవర్గాలను చిన్నచూపు చూసే సమాజాన్నెదుర్కొంటూ నీరజ్ ప్రయాణం సాగింది.
కులరహిత సమాజం కావాలనే పిలుపులే తప్ప.. ఆచరణకు సాధ్యపడని నిచ్చెనమెట్ల వ్యవస్థను చూస్తూ పెరిగిన నీరజ్ ఇంటి పేరునే మార్చుకుని తన ఉనికి గురించి అడిగినవారి ప్రశ్నలకు సమాధానాలను దాటవేస్తూ, తప్పించుకుంటూ బతికాడు. తన సామాజిక అస్తిత్వాన్ని చెబితే ఏం జరుగుతుందో, తన భవిష్యత్తేంటోనన్న ఆందోళన, భయంలోనే తన బతుకు ప్రయాణం సాగింది.
చివరకు తనకు ఇంటిని అద్దెకిచ్చినవారికే కాదు.. మాసాన్ సహ రచయితైన వరుణ్ గ్రోవర్ కు కూడా నీరజ్ కులమేంటో తెలియదు. అలా ఏళ్ల పాటు సామాజిక అదృశ్యతనే రక్షణగా భావించాడు. మాసాన్ ప్రపంచవ్యాప్త ప్రశంసలు పొందిన తర్వాత మాత్రమే నీరజ్ తన సామాజిక గుర్తింపును బహిరంగపర్చాడు. అయితే, తన జీవితంలో సుదీర్ఘకాలం పాటు తన సామాజిక అస్తిత్వాన్ని పక్క మనిషికి కూడా తెలియకుండా పాటించిన నిశ్శబ్దం నుంచే నీరజ్ లో ఓ కసి పెరిగింది. అదే నీరజ్ ను ఏదైనా సాధించాలనే ఆలోచనలకు శ్రీకారం చుట్టేలా చేసింది.
నీరజ్ క్రియేటివ్ స్పేస్ తీసుకుని హైపోథెటిక్ కథల సృష్టి చేయలేదు. ఆ విషయం మాసాన్ తోనే అర్థమవుతుంది. తాను అనుభవించిన సామాజిక అస్తిత్వ బాధ మాసాన్ లోనూ కనిపిస్తుంది. తండ్రి వారసత్వాన్ని అందిపుచ్చుకుని ఓ కాటికాపరిగా ఉండే దీపక్ పాత్రధారి అనుభవించే బాధలో నీరజ్ జీవితమూ కనిపిస్తుంది. అయితే, ఈ సినిమా చిత్రీకరణలో సామాజిక వివక్షపై జాలి కల్గేలా కాకుండా… వారెలా అణగదొక్కబడుతున్నారో చూపిస్తూ నీరజ్ మాసాన్ తో కృతకృత్యుడయ్యాడు.
ఇప్పుడు హోంబౌండ్ తో అప్లాజ్!
2015లో మాసాన్ తో ప్రశంసలందుకున్న నీరజ్.. ఇప్పుడు మళ్లీ అదే 78వ కాన్స్ ఫిలిం ఫెస్ట్ లో హోంబౌండ్ తో స్టాండిగ్ ఒవేషన్ అందుకున్నాడు. ఈ ఫిలిం ఫెస్టివల్ కు ఎంపికైన ఏకైక చిత్రం హోంబౌండ్. రియలిజం, డీప్ క్యారెక్టర్ స్టోరీ టెల్లింగ్ డిజైన్ లో ప్రఖ్యాతిగాంచిన హాలీవుడ్ ప్రముఖ దర్శకుడు మార్టిన్ స్కోర్సెస్ స్ఫూర్తితో హోంబౌండ్ సినిమాను రూపొందించాడు నీరజ్.
తాను దళితుణ్నని కుండబద్ధలు కొట్టి బాలీవుడ్ లో చెప్పుకోగల్గే ఒకే ఒక్క దర్శకుణ్ని తానంటూ ఓసారి ఇంటర్వ్యూలోనూ నీరజ్ చెప్పుకొచ్చాడు.
ఐడెంటిటీని దాచుకున్న స్థితి నుంచి… తానే ఓ ఐకానిక్ ఫిగర్ అవతరించేవరకూ సాగిన నీరజ్ ఘయ్వాన్ జర్నీ కుల, వర్ణ వివక్షకు గురై న్యూనతతో బాధపడేవారెందరికో ఓ దారిదీపం.



