మనది కాని లోకమే అయినా ఓ హృదయ విదారకమైన మరణం … మానవత్వమున్న ఎవ్వర్నైనా చలింపజేస్తుంది. అలాంటి కొన్ని విషాదాలు కంట తడి పెట్టిస్తాయి. అందుకే అతడి మరణంతో ఫుట్ బాల్ కోర్ట్ కూడా బావురుమంది.
ఇది ఓ రోమేనియన్ కథ. 19 ఏళ్ల కుర్రాడు సాకర్ కోసం కలలు కని… యుక్తవయస్సు దాటకుండానే పుట్ బాల్ కోర్ట్ నుంచి నేరుగా ఆకాశానికేగిన హృదయవిదారక గాధ

లూకా మనోలాకే… సాకర్ కలలుగన్నాడు. రోమేనియన్ జట్టు మెటలోగ్లోబస్ బుకురెస్టీకి ఆశాజనకమైన మిడ్ ఫీల్డర్ గా ఎదుగుతున్నాడు. ఇతగాడి ఆట చూసి మరో యువకెరటం ఫుట్ బాల్ లో సంచలనం సృష్టించబోతోందని ఫుట్ బాల్ పండితులు అంచనా వేశారు. ముచ్చటపడ్డారు.
బాల్యం నుంచే ఫుట్ బాల్ పై పెంచుకున్న మక్కువతో మనోలాకే చేసిన నిరంతర ప్రాక్టీస్ యుక్తవయస్సు వచ్చే వరకు తననో ప్రామిసింగ్ ప్లేయర్ గా మార్చింది. తన ఆట చూసి ముచ్చటపడ్డ కోచెస్ రిఫరెన్స్ తో రోమేనియా లిగా IIలో పోటీ పడుతున్న మెటలోగ్లోబస్ బుకురెస్టీలో మనోలాకేకు అవకాశం లభించింది. ఫుట్ బాల్ ప్రపంచంలో మరో రోనాల్డో, మారడోనా, మెస్సీలా మెరిసిపోయే ఆటగాడు తయారవుతున్న తరుణంలో మనోలాకే మరణం రోమేనియా ఫుట్ బాల్ ప్రపంచాన్నే కలిచివేసింది.

అసలేమైంది మనోలాకేకి..?
ఏమైందో తెలిస్తే ఏదైనా చేసేందుకు ఆలోచించొచ్చు. అసలు వైద్యంలో పరిష్కారం లభిస్తుందా, లేదా అంచనా వేయొచ్చు. కానీ, లూకాకి కొద్దిరోజులుగా ఉన్నట్టుండి తల తిప్పడం, తీవ్రమైన అలసట, చలిజ్వరం, రక్తంతో కూడిన మలవిసర్జన వంటి సమస్యలన్నీ ముప్పేట దాడి చేశాయి. ఓరోజు ఫుట్ బాల్ మ్యాచ్ ఆసక్తికరంగా నడుస్తున్న తరుణంలో మనోలాకే ఉన్నట్టుండీ తీవ్ర అలసటకు గురయ్యాడు. సగం మ్యాచ్ అయ్యేసరికే అతను ఆడలేని స్థితికి చేరుకున్నాడు. ఆ సమయంలో అతడి తల్లిదండ్రులు, తోటి జట్టు సభ్యులు ఆ విషయాన్ని గమనించారు. స్టామినాతో కనిపించే మనోలాకే ఒక్కసారి బలహీనంగా, క్షీణించినట్టు కనిపించడంతో అందరిలోనూ ఏదో తెలియని ఆందోళన ఆవరించింది.
సవాళ్లతో కూడిన వైద్య ప్రయాణం చేశాడు మనోలాకే!
యువ అథ్లెట్ వైద్య ప్రయాణం ఆయన కుటుంబీకులతో పాటు, తోటి స్నేహితులను, ఫుట్ బాల్ ప్లేయర్స్ నూ అందరినీ ఆందోళనకు గురిచేసింది. ఎక్స్ రేలు, రక్తపరీక్షలు అన్నీ చేశారు. అన్నీ నార్మల్ గానే చూపించాయి. కానీ, మనోలాకే ఇబ్బంది మాత్రం సాటి మనుషులను కూడా కృంగదీస్తోంది.
వైద్యులు లోపల ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయేమోననీ అనుమానించారు. డాక్సీసైక్లిన్ వంటి యాంటీబయాటిక్స్, జ్వరానికి పారాసెటిమాల్, నొప్పులకు అల్గోకాల్మిన్ వంటి మందులిచ్చారు. కానీ, ఆ మందులకు మనోలాకే స్పందించలేదు సరికదా.. రోజురోజుకూ ఆరోగ్యం క్షీణిస్తూవచ్చింది. రానురాను ఏ మెడిసిన్ కు కూడా మనోలాకే శరీరం స్పందించకుండా పోయింది.
ప్రాణాంతకంగా మారిన గుర్తించలేని వ్యాధి!
గత నెల ఫిబ్రవరి 28వ తేదీన కుటుంబ సభ్యులతో కలిసి బయటకు వెళ్లినప్పుడు లూకా ఆరోగ్య లక్షణాలు మరింత తీవ్రంగా మారాయి. అత్యవసంరంగా ఆంబులెన్స్ కు ఫోన్ చేశారు. అప్పటికి అతడి తల్లి అనా మరియా బుకారెస్ట్ లో పనిచేస్తోంది. తల్లితో ఫోన్ లో మాట్లాడాడు లూకా. అమ్మా నామీంచి కావడం లేదు… నేను చనిపోతున్నానా అంటూ ఆ తల్లినడిగాడు. ఆ విషయాన్ని ఆమె అక్కడి లోకల్ ప్రెస్ తో కన్నీటిపర్యంతమవుతూ షేర్ చేసింది.
ఆంబులెన్స్ లోకెక్కే సరికే లూకా పరిస్థితి మరింత నాటకీయంగా మారిపోయింది. కళ్లు బైర్లు కమ్మాయి. ఏమీ కనిపించడం లేదు. ఈ లక్షణాలున్నప్పుడు మెదడుకు ఆక్సిజన్ అందకుండా పోయే పరిస్థితి నెలకొంది. బీపీ పూర్తిగా డౌన్ అయిపోయింది. రక్తవాంతులయ్యాయి. జీర్ణాశయంలో నెలకొన్న అసాధారణ పరిస్థితులతో సాధారణ పరీక్షల్లో అసలు మనోలాకే జబ్బునే సరిగ్గా నిర్ధారణే చేయలేకపోయారు వైద్యులు.

తల్లి మరోచోట ఉద్యోగం చేస్తుండటంతో కొడుకుతో ఎక్కువ సమయంలో గడపలేకపోయింది. మరోవైపు, మరణించే చివరి క్షణాల్లో తనతో కొడుకు మనోలాకే మాట్లాడిన మాటలు అనా మరియాను ఇంకా కృంగదీశాయి. అసలు వైద్యులను ఎంచుకునే విషయంలోనే ఏమైనా పొరపాట్లు చేశామా అనే మీమాంస కలిచివేసింది.
శోకంలో ఫుట్‌బాల్ సంఘం!
లూకా మరణం రోమేనియన్ ఫుట్‌బాల్ వర్గాలను దిగ్భ్రాంతికి గురిచేసింది. మెటలోగ్లోబస్ బుకురెస్టికి చెందిన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో లూకా మనోలాకేకు ఘన నివాళినర్పించారు. నివాళి అర్పించడంతో పాటు.. తమ ఫుట్ బాల్ క్రీడాసమాజంపైనే లూకా మరణం తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుందని పేర్కొన్నారు. ఫుట్ బాల్ పట్ల లూకా ప్రేమ, చిరునవ్వతో మైదానంలో ఓ లేడిపిల్లలా పరిగెత్తే ఆ యువకుడి తీరు జట్టులో ఆనందాన్ని రేకెత్తించేవంటూ లూకాను గుర్తుచేసుకుంది మెటలోగ్లోబస్ బుకరెస్టి ఫుట్ బాల్ క్లబ్. లూకా చివరిసారిగా ఆగస్టు 2024, ఆగస్ట్ 24వ తేదీన తన చివరి మ్యాచ్ ఆడాడు.
లూకా మరణం ఇప్పుడు యంగ్ ప్లేయర్లకు ఓ హెచ్చరిక!
అవునూ, ప్రొఫెషనల్ ప్లేయర్స్ గా ఎదిగే క్రమంలో నిత్యం కచ్చితంగా ఆరోగ్య సంరక్షణపై శ్రద్ధ పెట్టడం, ఎప్పటికప్పుడూ చెక్ అప్స్ చేయించుకోవడం, ఆరోగ్య పర్యవేక్షణను ఓ క్రమశిక్షణగా మార్చుకోవడం వంటి అప్రమత్తతలను క్రీడాలోకం ముందుంచేది.
రోమేనియన్ ఫుట్ బాల్ సమాజం మర్చిపోలేని ముద్ర!
లూకా మనోలాకే ఆడిన కాలం తక్కువే. వాస్తవానికి ఫుట్ బాల్ ప్రపంచంలో సాధించిదీ తక్కువే. పైగా తన సాకర్ లక్ష్యం నెరవేరకుండానే దివికేగాడు. కానీ, తన ప్రొఫెషనల్ ఆటతీరు, తన సానుకూల దృక్పథం, మొహాన చెరగని చిర్నవ్వుతో తనకంటూ ఫుట్ బాల్ ప్రపంచంలో ఓ గుర్తింపును పొంది వెళ్లిపోయాడు. అందుకే, లూకా మరణంతో ఫుట్ బాల్ కోర్ట్ సైతం బావురుమంది.
లూకా మనోలాకే మరణం రోమేనియన్ ఫుట్ బాల్ సమాజంలో ఓ పెను విషాదం. అయితే, ఆ మరణంలోనూ ఓ సందేశాన్ని వదిలి వెళ్లాడు లూకా. ఎంతకాలం బతికామన్నదానికన్నా.. తమదైన సానుకూల ప్రభావాన్ని సమాజంపైన ఎంత బలంగా వేయగల్గామన్నదే లూకా నేటి యువతకు ప్రేరణగా వదిలి వెళ్ళిన ఆ సందేశం.



