తరగతి గది డ్రాపవుట్…. ఊళ్లకూళ్లు సాగునీటినిచ్చే వాటర్ మ్యాన్ గా అవతరించిన అద్భుతం ఇది.
అది 1961. జార్ఖండ్ రాజధాని రాంచీకి సుమారు 35 కిలోమీటర్ల దూరంలోని బేరో గ్రామం. వర్షాలు పడితే నీటికి కొదవ లేనట్టే కనిపిస్తుంది. వర్షాకాలం ముగిస్తే మాత్రం అదే ప్రాంతం ఆ తర్వాత ఎడారిని తలపిస్తుంది.
వాగులు ఎండిపోయేవి. నేలలో తేమ తగ్గిపోయేది. పంటలు పనికి రాకుండా పోయేవి. వ్యవసాయమే జీవానాధారణైన కుటుంబాలకు బతుకు భారంగా మారేది. అలాంటి సమయంలోనే కేవలం నాల్గో తరగతి వరకు మాత్రమే వచ్చీరానీ చదువు చదువుకున్న ఓ యువకుడిలో ఓ ఆలోచన తట్టింది. ఆ ఐడియా తన ఊరే కాకుండా… ఆ తర్వాత మరో 50 గ్రామాల బతుకుచిత్రాన్నే మార్చేసింది.
వర్షపు నీటిని జారవిడుచుకోకుండా ఒడిసి పట్టుకుంటే ఎలా ఉంటుందన్నదే ఆ ఆలోచన. ఆ ఆలోచన చేసిన వాడే… భారత ప్రభుత్వం 2016లో పద్మశ్రీతో సత్కరించిన సైమన్ ఒరాన్ మింజ్.
మట్టి డ్యామ్ తో పడ్డ మొట్టమొదటి అడుగు!
మట్టి చెక్ డ్యామ్స్ నిర్మించాలన్నా కొంత భూములు పోతాయి. నిర్మించాలంటే ఒక్కరి వల్ల అయ్యే పని కాదు. అప్పటివరకూ ప్రభుత్వానికి మొర పెట్టుకున్నా ఎలాంటి చలనం లేదు. దాంతో జనాన్ని జాగృతం చేశాడు సైమన్ ఒరాన్. మొత్తానికి మట్టి డ్యామ్ నిర్మాణానికి పట్టువదలని విక్రమార్కుడై ఒప్పించాడు. అలా మట్టి చెక్ డ్యాముల నిర్మాణాన్ని అనుకున్నట్టే ఆరంభించాడు.
దానివెనుక లక్ష్యమొక్కటే నీటిని ఒడిసి పట్టుకోవడం. వర్షపు నీటిని నిల్వ చేయడం, ఆ నీరు భూమిలోకి ఇంకేలా ప్రణాళిక చేయడం, బావుల్లో నీటి నిల్వలు పెంచడం, పొలాలకు నీరందించడం, తమ గ్రామంలో సుస్థిర వ్యవసాయానికి నీటి ఎద్దడి లేకుండా చూడటం. ఇవే సైమన్ ఒరాన్ లక్ష్యాలు.

బెడిసికొట్టిన ప్రయత్నాలు!
ఆలోచనలు సరే… కానీ, తాననుకున్న ఆలోచనలు ఆచరణకొచ్చేసరికి సరిగ్గా అమల్లోకి తేలేకపోయాడు సైమన్ ఒరాన్. కొన్ని కట్టిన చెక్ డ్యామ్ నిర్మాణాలు వర్షపు నీటి ధారకు కొట్టుకుపోయాయి. కానీ, ఆయన నిరాశ చెందలేదు. ఆయనకు డ్యామ్ నిర్మాణం ముఖ్యం కాదు.. ఎలాగైనా నీటిని ఒడిసిపట్టే శాశ్వత పరిష్కారం కావాలి. ఆ తపనే సైమన్ ఒరాన్ ను ముందుకు నడిపింది.
సర్కార్ కోసం నిరీక్షించలేదు!
తమ ప్రాంతంలో తాగు, సాగునీటికి ఎదురవుతున్న కష్టాలపై జార్ఖండ్ ప్రభుత్వంతో పలుమార్లు సంప్రదింపులు జరిపినా.. అనుమతులు రాకపోవడం, ఆలస్యంగా స్పందించడం.. ఒక్కోసారి స్పందించకుండా విసిగించడం.. ఇలా ఇరిగేషన్ ప్రక్రియలో సైమన్ ఒరాన్ ఎదుర్కొన్న కష్టాలన్నీ ఇన్నీ కావు.
దాంతో ఊరందరిని ఏకం చేసి ఐక్యతా రాగంతో మట్టి డ్యాముల నిర్మాణానికి శ్రీకారం చుట్టాడు. ఆ తర్వాత అవి కొట్టుకుపోవడంతో.. వాటి స్థానే కాంక్రీట్ డ్యామ్స్ నిర్మాణం మొదలైంది. డ్యామ్స్ తో పాటే.. పెద్ద పెద్ద వ్యవసాయ బావుల నిర్మాణం చేపట్టారు. కానీ, ఇంతటితో పని ముగియదు. నీరెక్కడి నుంచి వస్తుంది… ఏ దారిలో పయనిస్తుంది… భూమి ఎక్కడ దిగువకు వాలుతుంది… గ్రావిటీ ద్వారా నీళ్లెలా పారించొచ్చు.. ఈ విషయాలన్నీ ఊరు ఊరంతా, చుట్టుపక్కల అడవులు, పర్వతాల్లో తిరిగి పరిశీలించాడు ఒరాన్. వాగుల పుట్టుక ప్రాంతాలను గుర్తించాడు. భూమి వాలు ప్రాంతాలను మ్యాపింగ్ చేశాడు. ఆ తర్వాత గ్రామస్థుల చేతుల్లో పారలు, గడ్డపారలు ప్రత్యక్షమయ్యాయి. నీటిని నిల్వ చేయడమే కాదు.. నిల్వ చేసిన నీటిని తమ పొలాలకు ఎలా పారించాలన్నది మరో సవాల్. దానికి అనుగుణంగా కాల్వలు తవ్వారు. నీటిని పారించారు. అవసరాలకు తగ్గట్టుగా నీటి నిర్వహణ చేసుకునే ఒక పెద్ద విజయాన్నే నమోదు చేశారు.
నీటి పారుదల ఇంజనీర్లు లేరు. డీపీఆర్లు లేవు. సర్కారీ అనుమతులు, నిధుల కోసం చూడలేదు. కానీ, ఒక్కడి పట్టుదల.. బేరో గ్రామం మొత్తం సామాజిక స్ఫూర్తిగా మారిన విజయమిది.
ఒక్క ఊళ్లో మొదలై… 51 ఊళ్లకు పాకిన సాగునీటి పారుదల ఉద్యమం!
బేరోలో నమోదైన విజయం… పక్క గ్రామాల్లో ఆసక్తి రేపింది. వ్యవసాయ పొలాలకు నీరందక తామెదుర్కొంటున్ సమస్యలూ అప్పుడు ఆయా గ్రామాల ప్రజల్లో చర్చగా మారాయి. దాంతో చుట్టుపక్కల గ్రామాలవాళ్లూ సైమన్ ఒరాన్ నే సంప్రదించారు. ఒక విజయం ఇచ్చిన కిక్కుతో పాటే.. ఏ ఊరైనా తన ఊరులాంటిదే అనుకునే మనసుతో ఒరాన్ వారితోనూ జత కట్టాడు. అలా పాకిన ఉద్యమంతో 51 గ్రామాల్లో నీటి నిల్వ పద్ధతులకు చెక్ డ్యాముల నిర్మాణం జరిగింది. బావుల తవ్వకాలు కనిపించాయి. నీటి సంరక్షణే కాకుండా ఎక్కడా పర్యావరణానికి హాని కలక్కుండా… పర్యావరణ పరిరక్షణనూ తన ఉద్యమంలో భాగం చేశాడు సైమన్ ఒరాన్.
నీరు కావాలంటే అడవులుండాలన్న విషయం తెలిసినవాడు ఒరాన్!
అడవులే లేకుంటే వర్షాలే కరువైతాయి. నీళ్లే ఉండవు. అందుకే, అడవులనూ కాపాడుకోవాలనే నినాదాన్నీ భుజానికెత్తుకున్నాడు. ఎందుకంటే తన ఊరు బేరోతో పాటే.. చుట్టపక్కల అటవీప్రాంతాలపైనే అక్కడి జనం ఇంధనంగా మండే కలపను అమ్ముకుని బతుకుతారు. ఇంకోవైపు, అక్రమంగా కలప తరలించే కాంట్రాక్టర్ల వల్ల అడవులు దెబ్బ తింటున్నాయి. అడవులు తగ్గడం వల్ల వర్షాలూ ముఖం చాటేయడం, వాగులు ఎండిపోవడం, నీటి ఎద్దడి పెరిగిపోవడం ఇవన్నీ సైమన్ ఒరాన్ మస్కిష్కంలో రికార్డవుతూనే ఉన్నాయి. అందుకే సైమన్ తన నీటి ఉద్యమానికి.. అడవుల పరిరిక్షణనూ జోడించాడు.
అలా 1960ల కాలంలో విలేజ్ ఫారస్ట్ ప్రొటెక్షన్ కమిటీలు ఏర్పాటు చేసుకున్నారు. మొదట సుమారు 20 ఊళ్ల ప్రతినిధులు కలిసి సమావేశమయ్యారు. మొత్తం 179 ఎకరాల అటవీ ప్రాంతాన్ని సంరక్షించాలని తీర్మానించుకుని.. ఆ పరిధిలో మూడు స్థానిక కమిటీలను ఏర్పాటు చేశారు. అలా జామ్టోలీ, ఖక్సీటోలీ, బేరోటోలీ గ్రామాల్లో ఈ కమిటీలు పనిచేశాయి.
వేలాది మొక్కలు నాటడం, బీడు భూముల్లో సాగు ఆరంభించే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి.. స్థానికులతో చేయించేవి. అలాగే, అడవిని ఎవరు, ఎంత మేరకు ఉపయోగించాలి, ఏ మేరకు కలప తీసుకోవచ్చు, ఏం చేయకూడదు వంటి నిబంధనలనూ పొందుపర్చారు. నిబంధనలు ఉల్లంఘిస్తే ప్రశ్నించే వ్యవస్థ కూడా ఏర్పాటైంది.
నీటి నిల్వలు పెరిగాయి.. ఊళ్ల రూపు మారింది!
నీళ్లను నిల్వ చేయడం మొదలయ్యాక అసలు మార్పు కనిపించింది. బంజరు భూములు కాస్తా బంగారు పంటలయ్యాయి. ఊళ్లు స్వర్ణవర్ణంలో కళకళలాడాయి. భూగర్భజలాలు పెరిగాయి. కేవలం వరికి మాత్రమే పరిమితమైన రైతులు.. ఇతర రెండో పంటలు వేయడం మొదలెట్టారు. ఆ తర్వాత కూరగాయల సాగు విస్తరించింది. ఇప్పుడు బేరో ప్రాంతం ఏడాది పొడవునా కూరగాయల వంటి వాణిజ్య పంటలతో సుసంపన్నమైంది.
బేరో.. ఇప్పుడు కూరగాయల హబ్!
గాలి తర్వాత మనిషికి అత్యంతవసరమైన నీటిని ఒడిసిపట్టుకోవాలన్న సైమన్ ఒరాన్ తపనతో… వ్యవసాయం రూపురేఖలే మారిపోయింది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ముఖచిత్రమే ఆశ్చర్యపర్చేలా విజయాల్ని నమోదు చేసింది. ఒక్క బేరో నుంచే వేల మెట్రిక్ టన్నుల కూరగాయలను జార్ఖండ్ లోని వివిధ ప్రాంతాలతో పాటు.. బీహార్, ఒడిశా, పశ్చిమబెంగాల్ కు సరఫరా చేస్తున్నారంటే… ఒక్క సైమన్ ఒరాన్ ఐడియా జీవితాల్ని ఎలా మార్చిందో చెప్పడానికి ఇంతకంటే ఉదాహరణేం కావాలి..?
వానల కోసం ఎదురు చూసిన కాలం నుంచి.. తమ వాణిజ్య పంటలను ఇతర ప్రాంతాలకు పంపించే స్థాయికెదిగిన జార్ఖండ్ గ్రామాల విజయగాధ ఇది.
ఒక వ్యక్తి ఆలోచనకు.. సమాజం ఐక్యత తోడైతే.. ఏం సాధించగలరో జార్ఖండ్ గ్రామాలు నిరూపించాయి. అంటే సైమన్ ఒరాన్ కేవలం నీటిని నిల్వ చేసిన వాటర్ మ్యానే కాదు… కొన్ని గ్రామాలను ఆర్థికంగా సుభిక్షం చేసిన ఓ దార్శనికుడు.
కానీ, విషాదమేంటంటే… ఆయన సమాజానికి అంత చేస్తే ఆయన కుటుంబం ఇప్పటికీ ఆర్థికంగా అపసోపాలు పడుతూ ఉండటమే.. ఓ సామాజిక జీవికి దక్కుతున్న బహుమానం!


