వెలుగులోకి రాని క్రికెట్ మాణిక్యం.. ఈ ఆటగాడు!

ఒక్క పరుగు దూరంలో ట్రిపుల్ సెంచరీ… అయినా భారత్ జెర్సీ దక్కలేదు!

క్రికెట్‌లో 299 పరుగులంటే గొప్ప ఇన్నింగ్సే. కానీ 299 వద్ద నాటౌట్‌గా మిగిలిపోవడం మాత్రం జీవితాంతం వెంటాడే జ్ఞాపకం.

1988–89 రంజీ ట్రోఫీ. మహారాష్ట్ర–మధ్యప్రదేశ్ మ్యాచ్.

మహారాష్ట్ర బ్యాటర్ శాంతాన్ సుగ్వేకర్ అప్పటికే 299 పరుగులు చేశాడు. ట్రిపుల్ సెంచరీకి కావాల్సింది ఒక్క పరుగు మాత్రమే. మరో ఎండ్‌లో నంబర్-11 బ్యాటర్ అనిల్ వాల్హేకర్ ఉన్నాడు. సుగ్వేకర్‌కు 300 కావాలి. కానీ వాల్హేకర్ ఔటయ్యాడు. అంతే… సుగ్వేకర్ 299 పరుగుల వద్దే నాటౌట్. వాల్హేకర్ తీవ్రంగా బాధపడ్డాడు. కానీ సుగ్వేకర్ అతడిని ఓదార్చాడు. నీ తప్పేమీ లేదని సముదాయించాడు.

ఆ రోజు సుగ్వేకర్ ట్రిపుల్ సెంచరీని కోల్పోయినందకు పడ్డ బాధ కన్నా… రికార్డుల మోత మోగించినా అతడికి భారత జాతీయ జట్టులో స్థానం దక్కకపోవడమే పెద్ద బాధ.

6 వేల 653 పరుగులు చేసినా.. ఒక్క టెస్టులో కూడా భారత్ నుంచి ప్రాతినిథ్యం దక్కించుకోలేకపోయాడు శాంతాన్ సుగ్వేకర్. పుణేవాసి అయిన సుగ్వేకర్ మహారాష్ట్ర తరఫున 85 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడాడు. 63.10 సగటుతో 19 సెంచరీలు, 26 హాఫ్ సెంచరీలు చేసిన శాంతాన్ కెరీర్ లో నాల్గు డబుల్ సెంచరీలున్నాయి.

211, 225, 210 నాటౌట్.. ఇలా భారీ స్కోర్స్ ఆయన బ్యాట్ నుంచి జాలువారాయి.

1993-94 సీజన్ సీజన్ లో నాల్గు సెంచరీలు చేశాడు . 1992లో వెస్ట్ జోన్ తరఫున దులీప్ ట్రోఫీలో 158 పరుగులు సాధించాడు. అయినా భారత జాతీయ జట్టులోకి మాత్రం అడుగు పెట్టలేకపోయాడు.

సచిన్‌తో 400 పరుగుల భాగస్వామ్యం!

భారత క్రికెట్ ఎందరో ప్రతిభావంతులను చూసింది. అలాగే, ప్రతిభ లేకపోయినా పైరవీలతో జట్టులో స్థానం సంపాదించుకున్నారు, కొనసాగారనే వారి గురించి విన్నది. అలాగే, ప్రతిభావంతులైన ఎందరికో సముచిత అవకాశాలు కల్పించలేకపోయిందనే అపవాదూ మూటగట్టుకుంది. అలాంటి ప్రతిభావంతుల్లో సచిన్ టెండూల్కర్ తో సరిసమానంగా.. సమకాలీనుడైన వాడు ఈ శాంతాన్. సుగ్వేకర్ కెరీర్‌లో ఆసక్తికరమైన అధ్యాయం సచిన్ టెండూల్కర్‌తో ముడిపడి ఉంది. సచిన్ అంతర్జాతీయ క్రికెట్‌లో తన స్థానాన్ని పూర్తిగా స్థిరపరుచుకునే ముందు.. వీళ్లిద్దరూ దేశవాళీ క్రికెట్‌లో కలిసి ఆడారు. 1994లో టైమ్స్ షీల్డ్‌లో సుగ్వేకర్–సచిన్ కలిసి 400 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఒకవైపు ప్రపంచ క్రికెట్‌లో తర్వాతి దశాబ్దాలను శాసించబోయే సచిన్… మరోవైపు దేశవాళీ క్రికెట్‌లో సత్తా చాటినా భారత జాతీయ జట్టులో అవకాశాలు రాని సుగ్వేకర్. ఇద్దరూ కలిసి రికార్డ్ భాగస్వామ్యం నెలకొల్పినా.. ఇద్దరి కెరీర్స్ లో ఎంతో కాంట్రాడిక్షన్ మనకు కనిపిస్తుంది.

అవకాశం వచ్చినా… తెరుచుకోని జట్టు తలుపు!

1996-97 రంజీ సీజన్ సుగ్వేకర్ కు అత్యుత్తమ సీజన్స్ లో ఒకటి. ఆ సీజన్ లో 71.38 సగటుతో 928 పరుగులు చేశాడు. భారత్.. వెస్ట్ ఇండీస్ పర్యటనకు వెళ్లే సమయంలో తనకు జాతీయ జట్టులో అవకాశం అప్పడు తప్పకుండా రావొచ్చని ఆశించాడు సుగ్వేకర్. కానీ, అప్పటికే భారత్ బ్యాటింగ్ లో తీవ్రమైన పోటీ నెలకొంది. సచిన్ టెండూల్కర్, మహ్మద్ అజారుద్దీన్, సంజయ్ మంజ్రేకర్ వంటి ఆటగాళ్లు ఉన్నారు. అదే సమయంలో సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రవిడ్, వీవీఎస్ లక్ష్మణ్ వంటి కొత్త తరం బ్యాటర్లు ఎదుగుతున్నారు. సుగ్వేకర్ ఎన్ని పరుగులు చేసినా.. జాతీయ జట్టులో స్థానం దొరకడం మాత్రం కష్టమైంది.

సుగ్వేకర్ కథలో అసలు బాధ ఇదే!

ప్రతిభావంతులైతే అన్నీ సాధించేయొచ్చనేది నిర్వివాదాంశమే. కానీ, ఒక్కోసారి ప్రతిభను మించిన రాజకీయాలు చోటుచేసుకున్నా, పైగా పోటీలో తట్టుకునే ప్రతిభ ఆ సమయానికి కనబర్చకపోయినా… కెరీర్ మొత్తానికే దెబ్బ పడే అవకాశాలుంటాయి. అందుకే సుగ్వేకర్ కెరీర్ మనకో విషయం చెబుతుంది. ప్రతిభ ఉండటం ఒకెత్తైతే… సరైన సమయంలో సరైన అవకాశం రావడం మరో ఎత్తు.

299 పరుగుల రికార్డ్, 63కి పైగా సగటు, 6 వేల 653 ఫస్ట్ క్లాస్ క్రికెట్ పరుగులు, నాల్గు డబుల్ సెంచరీలు, సచిన్ తో కలిసి 400 పరుగుల భాగస్వామ్యం ఇన్ని ఉన్నా.. భారత జెర్సీ దక్కని జాతకుడు సుగ్వేకర్.

ప్రతిభ ఉన్నంతమాత్రాన అనుకున్నది సాధించొచ్చా అనే ప్రశ్నగా మిగిలిపోయిన జీవితం శాంతాన్ సుగ్వేకర్ ది.

కొంతమంది క్రికెటర్లు రికార్డులతో గుర్తుండిపోతారు. మరికొందరు దేశం తరఫున ఆడినందుకు గుర్తుండిపోతారు. సుగ్వేకర్ మాత్రం… ఆ రెండింటి మధ్యలో మిగిలిపోయిన ఓ ప్రతిభావంతుడిగా గుర్తుండిపోతాడు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe

Latest Articles